పంచభూతాధికారి వాయువు

Saipatha Antarvedam 26 chapter - Sakshi

సాయిపథం – అంతర్వేదం 26

ఏ తాతగారింటికో వెళితే గ్రామీణప్రాంతంలో ఉన్న ఆ దిగుడు బావి పైకి మాత్రం ‘చక్కగా దిగెయ్యచ్చు’ అనిపించేలా కనిపిస్తుంది. అలాగే ఏ శ్రీశైలమో వెళ్తే అక్కడున్న పాతాళగంగని చూస్తే.. ‘ఇన్నేగా మెట్లు! దిగెయ్యచ్చు’ అనిపిస్తుంది. అక్కడ దిగుడుబావిలోకి దిగుతూ ఉంటేనూ, ఇక్కడి పాతాళగంగలో మెట్లని దిగుతూ ఉంటేనూ ఒక పక్క సంతోషం.. మరో పక్క ఎవరూ చేయలేని పనిని చేయగలుగుతున్నాననే అనిర్వచనీయ ఆనందం.. అనుభవపూర్వకంగా కలుగుతుంది. ఎందుకీ మాట చెప్పాల్సి వస్తోందంటే.. దిగుడుబావిలోకి దిగుతుంటే భలే సంతోషంగా ఉంటుంది. అలాగే పాతాళగంగ మెట్లను దిగుతూ గంగని సమీపించి స్నానం చేస్తే అద్భుతంగా ఉంటుందని కేవలం చెప్పడం వేరు. అదే మరి అనుభవంలో దానిని గమనిస్తే కలిగే అహ్లాదం వేరు అని చెప్పడానికే. సాయి గురించిన ఎన్నో కథలనీ.. లీలలనీ.. సంఘటనలనీ.. వినెయ్యడం, వినిపించడం, చదివేయడం, చదివించెయ్యడం కాదు చేయాల్సింది. దానిలోనికి వెళ్లి పరిశీలించగలగాలి సాయి అనుగ్రహ దృష్టిని. అప్పుడు సాయి చరిత్ర అర్థమవుతుంది మరింత హృదయ స్పర్శతో.లేని పక్షంలో ‘సాయి ఒకరికి ప్రాణాలు పోతుంటే బతికించాడు. మరొకరికి జ్వరాన్ని తగ్గించాడు. ఇంకొకరికి ప్రమాదం జరగకుండా రక్షించాడు, మరొకరికి జరిగిందాన్ని చెప్పాడు...’ అని ఈ తీరుగా అర్థమవుతూ సాయిచరిత్రలో సాయి, ఒక కథానాయకునిలాగానూ, ఆయన అన్నింటా విజయాలనే సాధించినవానిగానూ కనిపిస్తూ సాయి స్వరూపం సాయితత్త్వం తేలిపోతూ కనిపిస్తుంది. అది సరికాదు. ఈ నేపథ్యంలో సాయి.. పంచభూతాల మీదా ఆధిపత్యాన్ని కలిగిన సిద్ధునిగా అర్థం చేసుకుంటూ పృథ్వి–అప్‌–తేజస్సులని గురించి వివరించుకున్నాక వాయువు మీద ఎలా ఆధిపత్యాన్ని సాధించగలిగాడో, సాధించాడో ఇప్పటివరకూ ఎలా ఉదాహరణ పూర్వకమైన సంఘటనలతో తెలుసుకున్నామో అలాగే తెలుసుకుందాం!

బ్రహ్మాండ /పిండాండాలు
వాయువు అనగానే వీచే గాలే కదా! అనేసుకుంటారు. అది కాదు దానర్థం. వాయువు రెండు తీరుల్లో ఉంటుంది. పృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశాలనే పంచభూతాల్లోనూ కనిపించే వాయువూ, అలాగే శరీరంలో ఉండే పృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశాలనే పంచభూతాల్లో ఉండే వాయువూ అని రెండు తీర్లుగా ఉంటుంది. ప్రపంచంలో ఉండే వాయువు పేరు బ్రహ్మాండ వాయువు. శరీరం అంటే పిండాండం. ఈ శరీరంలో కనిపించే వాయువు పిండాండ వాయువు.పంచభూతాలనేవి బ్రహ్మాండంలోనూ పిండాండంలోనూ కూడా ఉన్నాయి. అందుకే బ్రహ్మాండాన్ని ప్ర–పంచ–ము అన్నారు. శరీరాన్ని ‘పాంచభౌతిక దేహము’ అన్నారు.బ్రహ్మాండంలో ఆ పిండాండంలో అంటే రెంటిలోనూ పంచభూతాలున్నాయి. వాటి ఉనికిని బట్టే ప్రపంచం పుట్టిందనే అర్థంలో ‘బ్రహ్మ+అండము’ అనీ శరీరం పుట్టిందనే అర్థంలో ‘పిండ+అండము’ అనీ పేరుని పెట్టారు ఋషులు.బ్రహ్మాండంలో కనిపించే పృథ్వి అంటే ఎక్కడెక్కడా ఉండే నేల. పిండాండంలో కనిపించే పృథ్వి మాంసమూ మజ్జా (ఎముకలోపల ఉండే మెత్తని పదార్థం– రక్తాన్ని ఉత్పత్తి చేసే పదార్థం) అనేవి. బ్రహ్మాండంలో కనిపించే అప్‌(జలం) అంటే నదులూ నదాలూ (పశ్చిమాన పుట్టి తూర్పు సముద్రంలో కలిసేవి) సముద్రాలూనూ. పిండాండంలో కనిపించే ‘అప్‌’(జలం) శరీరంలో ఉండే తడితనం. ఈ తడితనం ఉన్న కారణంగానే చర్మాన్ని కొద్దిగా పైకి లాగి విడవగానే మళ్లీ మామూలుగా అయిపోతోంది. అదే మరి తడితనం లేకపోతే ఆ లాగబడిన చర్మం అలాగే ఉండిపోతుంది. వేసవిలో కొందరికి వచ్చే వ్యాధి అదే. ఇక కంటిలో.. నోటిలో.. ఇలా అన్ని అవయవాల్లోనూ ఉండే తడితనమే పిండాండంలోని అప్‌(జలం). బ్రహ్మాండంలోని తేజస్సు– సూర్యుడు. పిండాండంలోని తేజస్సు– చల్లటి పదార్థాలని తిన్నాతాగినా, వేడిపదార్థాలని తిన్నాతాగినా కూడా ఒకే తీరుగా(98.4ౌ ఫారన్‌హీట్‌) ఉండే వేడిమితనం. బ్రహ్మాండంలోని వాయువు కనిపించకుండా వీస్తూ ఉండే గాలి. ఈ గాలిలో ఎన్నో భేదాలున్నాయి. అవి మనకి ప్రస్తుతానికి అప్రస్తుతమవుతుంది. ఇక పిండాండంలోని వాయువు ఒక్కటి కాదు. వాయువు 10గా విభజింపబడి కనిపిస్తుంది. ఆ పదింటిలోనూ అతి ముఖ్యమైనవి ఐదు. అవే ప్రాణ–అపాన–వ్యాన–ఉదాన–సమానమనే పేర్లతో ఉండేవి.అలాగే బ్రహ్మాండంలో కనిపించే ఆకాశమనేది ఎంత ఎత్తుకి ఎగిరినా ఉండనే ఉండదు గానీ ఉన్నట్లుగా భ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది. (ఆకాశో అవకాశ శ్శూన్యమ్‌) నిజంగా ఆకాశమనేది లేదు. సముద్రపు ప్రతిబింబం కారణంగా నీలి రంగుతో కనిపిస్తుంది. ఇక పిండాండంలో ఉండే ఆకాశమనేది అనుభవంలో ప్రతి వ్యక్తికీ కనిపిస్తూ నిజానికి ఉండని ‘మనసు’ అనేది.ఈ వివరణనంతా ఎందుకంటే.. సాయి భూతాల్లో ఉన్న వాయువుని తన అధీనంలోనికి తీసుకున్నాడంటే కేవలం బ్రహ్మాండంలోని వాయువునే కాక, ప్రతివ్యక్తి శరీరంలోనూ ఉండే పిండాండపు 5 వాయువులనీ కూడా స్వాధీనపరుచుకున్నాడని చెప్పడానికీ.. ఉదాహరణ పూర్వకంగా వివరించడానికేను. ఆ క్రమంలో ముందు బ్రహ్మాండ వాయువుని ఎలా అదుపు చేశాడో తన అధీనంలోకి తెచ్చుకున్నాడో చూద్దాం!

ఆపు నీ తీవ్రత
షిర్డీ చాలా చిన్న గ్రామం. దీన్నే నాటివాళ్లు కుగ్రామం అంటూ ఉండేవారు వారి సాధారణ పరిభాషలో. ఏ చిన్న అలజడి వచ్చినా.. ఆనందం వచ్చినా.. కొత్త సంఘటన జరిగినా.. ఊరంతా ఓ కుటుంబంలానే దాదాపుగా ఉండే కారణంగా అందరికీ తెలిసిపోతూ ఉండేది. షిర్డీనే కాదు. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో ఆ పద్ధతి ఉండనే ఉంది. సరే!ఓసారి షిర్డీలోని సాయి భక్తులంతా ఎప్పటిలాగానే చక్కని భజనలని చేయాలనే ఆలోచనతో సాయి మందిరానికి అంటే ద్వారకామాయికి బయలుదేరారు. కొందరు ద్వారకామాయికి చేరిపోయారు. కొందరు త్రోవలో ఉన్నారు. మరికొందరు మిగిలిన పూజాసామగ్రిని కొనేందుకు అంగడి దగ్గరా,ఇంకొందరు ఇళ్ల నుండి బయటికి వచ్చి బయలుదేరడానికి సిద్ధంగానూ ఉన్నారు.ఇంతలో మెల్లగా మేఘాలన్నీ ఎక్కడి నుండో తరుముకొచ్చినట్టు రాసాగాయి. చూస్తున్నంతలోనే మరింత నల్లగా మేఘాలన్నీ ఒకచోటికి చేరిపోయాయి. వాయువు వీచడంలో రెండు పద్ధతులుంటాయి. ఒక తీరు వాయువు ఎంతటి బలమైన మేఘాన్నైనా బలంగా వీచి చెదరగొట్టి మేఘాన్ని తునుకలు తునుకలుగా చేసి తరమికొట్టేస్తుంది. ఇంకొక తీరు వాయువు వచ్చిన మేఘాన్ని చెదిరిపోనీకుండా చేస్తూ తనలో ఉన్న చల్లనిదనాన్ని మేఘానికి తగిలేలా చేసి వర్షింపజేస్తుంది.ఇలా సాయి భక్తులంతా తలొకచోటా ఉన్న వేళ ఈ రెండు తీరుల వాయువులూ గట్టిగా వీస్తూ తన లక్షణాలతో మేఘాన్ని ఒకచోటికి చేరేలానూ మెల్లగా చినుకులు ప్రారంభమయ్యేలానూ చేశాయి. ‘పెద్దవర్షమేముండదులే!’ అని అనుకుంటూ భక్తులందరూ భజనమీది అభిలాషతో ద్వారకామాయి వైపే నడవడం మొదలెట్టారు. నిజానికి ద్వారకామాయి పెద్ద దూరంలో లేనే లేదు.ఇంతలో వాయువు మరింత వీచడం మొదలెట్టింది. చినుకులు మరింత వేగంగానూ మీద పడసాగాయి. శరీరాలకి దెబ్బ తగులుతోందా? అన్నంతబలంగా చినుకులు పడుతుంటే సాయి భక్తులంతా ఎవరికీ వీలైన ప్రదేశాల్లో అంటే... కొందరు శనీశ్వరాలయంలో, మరికొందరు శివపార్వతుల ఆలయంలో, ఇంకొందరు మారుతి మందిరంలో ఇంకా కొందరు గ్రామదేవత అయిన ఖండోబా దేవాలయంలో తాత్కాలికంగా తలదాచుకునేందుకు వెళ్లారు.ఇళ్ల నుంచి బయలుదేరి ఇవతలకి వచ్చి వెళ్లబోతున్నవారు ‘అయ్యో! వెళ్లలేమేమో!’ అనుకుంటూ మళ్లీ ఇళ్లలోకే వెళ్లిపోయి వాయువూ వర్షమూ తగ్గాక బయలుదేరవచ్చనుకుంటున్నారు. ఈ దశలో వాయువు, వర్షముతో పాటు కళ్లు బైర్లు కమ్మేంత స్థాయిలో మెరుపులు మెరవసాగాయి. మెరుపులొస్తే మేంమాత్రం రాలేమా అన్నట్లుగా ఉరుములు తీవ్రంగా చెవులు చిల్లులు పడేలా.. గుండెలు బద్దలవుతాయేమో.. అన్నంతగా ధ్వనింపసాగాయి. పిడుగులెక్కడా పడలేదు కానీ, వాయు తీవ్రత, వర్షఆధిక్యం, ఉరుములు, మెరుపులు క్రమక్రమంగా పెరగసాగాయి.

ద్వారకామాయిలో ఉన్న వారికి ఖండోబా ఆలయంలో ఎవరు ఉన్నారో.. ఈ ఆలయంలో ఉన్నవారికి ఎవరు ఏ త్రోవలో చిక్కుబడిపోయారో.. ఇళ్లలో ఉన్నవారికి తమ కుటుంబసభ్యులు ఎక్కడెక్కడున్నారో.. తెలియకనే పోయింది. అంత తీవ్రమైన గాలివానని దాదాపు ఆ దశాబ్దంలో ఎవరూ ఎరగమని నలుగురు కూడిన ప్రతిచోటా అనుకోనివారు లేరు. ఎప్పటికి తెరిపి ఇస్తుందో, త్రోవ ఎలా ఉండబోతోందో, ఇళ్లకి ఎలా చేరుకోవాలో అంతా అగమ్యగోచరం కాసాగింది.ఎవరికి వారు తామున్న ఆయా దేవాలయాల్లో వాయుతీవ్రత తగ్గాలనీ, వర్షం ఆగిపోవాలనీ భజనలని చేస్తూ ఉండిపోయారు. నేటికాలంలో లాగా నాడు వీధి దీపాల్లేని కారణంగా షిర్డీ మొత్తం చీకటితో నిండిపోయి అక్కడొక గ్రామం ఉందనే విషయం అర్థం కాకుండా పోయింది. ఏ అడవిలోనో ఉన్న భయం అందరికీ కలిగింది. ఈ దశలో కొందరు చొరవ తీసుకుని మనందరికీ రక్షకుడు,తోడునీడా ఆ సాయి మాత్రమే కదా! దృఢవిశ్వాసంతో అంతటి వర్షంలోనూ సాయి వద్దకి వెళ్లారు అందరి తరపునా ప్రార్థించడానికి.బట్టలు తడిసి వర్షంతో నీరు కారుతూ ఉన్న భక్తులందరూ ఒక్కొక్క మేఘంలా అనిపిస్తున్నారు. అందరూ సాయి పాదాల మీద ఒకరి వెంట ఒకరు చొప్పున పడుతూ.. ‘‘బాబా! పెళ్లాం బిడ్డలు.. గొడ్డు గోద.. పూరిపాకలు, వంటకట్టెలు, కొద్దిపాటి నగానట్రా.. అంతా ఏమైపోతుందోననే భయం ఆవరించేసింది మా అందరినీ. నువ్వే దిక్కు’’ అంటూ దీనాతిదీనంగా ప్రార్థించసాగారు.బాబా ఒక్కసారి అందరినీ అలా వ్యక్తివ్యక్తిని పరిశీలించి చూసి బయటి కొచ్చాడు. చేతిలోని సటకాని తీసుకుని... ‘వాయూ! ఆగు! ఆగు! ఆపు నీ తీవ్రతని! తగ్గించు! మందగించు! నెమ్మదించు!!’ అన్నాడు సార్ద్ర నయనాలతో ఆ భక్తులందరినీ ఓ పక్క చూస్తూ.ఏదో ఓ తండ్రి తన బిడ్డడితో ఓ మాటని అంటే ఆ బిడ్డ తన తండ్రి చెప్పిన మాటని వినినట్లుగా.. ‘వెంటనే వాయువు తన తీవ్రతని తగ్గించడం మొదలైంది. ఆ వెంటనే వర్షం ఆగుతున్నట్టుగా ఆ చూసేవారందరికీ తెలిసింది. దాదాపు 10 నిమిషాల సమయంలో మొత్తం వాయువూ వర్షమూ కూడా ఆగిపోయాయి.భక్తులందరికీ ఆశ్చర్యమయింది. సాయి గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూసి నట్టయింది వాళ్లకి. అందరూ కృతజ్ఞతాపూర్వకంగా సాయికి సాష్టాంగపడి ఆయనని చూసి మళ్లీ వాయువూ వర్షమూ ఉరుములూ మెరుపులూ రానే రావని చెప్పినట్లుగా కనిపిస్తున్న సాయి కళ్లని దర్శించి మెల్లగా ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే సాయి అలా ‘నెమ్మదించు!’ అనగానే ఆకాశం కొద్దిసేపట్లో నిర్మలమయింది. నక్షత్రాలూ చంద్రుడూ కూడా కొద్ది సమయంలోనే కనిపించారు. ఆకాశం ప్రశాంతంగా కనిపించసాగింది.

కృతజ్ఞత
అందరూ దాదాపుగా ద్వారకామాయిని విడిచి ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. అంతలా పెద్దగా భజన వినవచ్చింది. ‘ఏమిటా?’ అని ఆశ్చర్యపడుతూ చూస్తే సాయి అనుగ్రహం లభించి షిర్డీ వాసులందరికీ క్షేమం కలిగిందనీ, ఆందోళన తొలిగిందనీ హృదయపూర్వకంగా సాయి సమక్షంలో భజనని ప్రారంభించారు.ఎవరైనా గమనించాల్సిన అంశం ఇదే. సాధారణంగా కష్టం ఏదైనా వచ్చినప్పుడూ పరిస్థితి అగమ్యగోచరం అనిపించినప్పుడూ వెంటనే మొక్కుకోవడమనే పనిని చేస్తూ ఉంటాం. పని జరిగిన వెంటనే దర్శనానికి వస్తామనో లేక ఫలానిదాన్ని సమర్పించుకుంటామనో మొక్కేస్తాం. మొక్కుకునేప్పుడు ‘వెంటనే’ అనకుండా ఉండలేం. అనేస్తాం. తీరా పని పూర్తి అయ్యాక ‘ఫలాని పని ఉంది– ఫలానిది అడ్డొచ్చింది’ అంటూ మొక్కు తీర్చడాన్ని వాయిదా వేస్తూ వెడతాం. ప్రతి వాయిదాకీ ఓ గట్టి కారణాన్ని చెప్తాం. చూపిస్తాం. మరి అదే వాయిదాని దేవుడు కూడా వేయదలిచి – నీ పనిని ఫలాని రోజు వరకు తీర్చడం కుదరదంటున్నాడా? వెంటనే తీర్చేస్తున్నాడు కదా! ఆ కోరిన కోరికగాని సమంజసమైనదయ్యుంటే!మనకి సత్యనారాయణ వ్రతకథలో ఆ వైశ్యుని కథ మొక్కుని వాయిదా వేసే విధానంతో సాగలేదూ? ఎప్పుడైతే ఆ వైశ్యుడు మొక్కుకుని తీరా పని పూర్తయ్యాక తీర్చలేదో, తీర్చడం కాదు సరికదా అప్పుడు తీరుస్తా– ఇప్పుడు తీరుస్తానంటూ వాయిదా వేస్తూ ఉండేసరికి భగవంతుడు తనని శక్తిహీనునిగానూ అసమర్థునిగానూ లెక్కిస్తున్నాడనే నెపంతో ఓ పరీక్షని పెట్టి ఆ వైశ్యకుటుంబం వంకతో మన కందరికీ మొక్కుని ఎలా ఎప్పుడు తీర్చుకోవాలో తెలియజేసాడు.అదే పద్ధతిలో సాయిని శరణుకోరాక వాయుప్రకోపం వర్షం వీటి కారణంగా ఆందోళనా తగ్గేసరికి వెంటనే సాయి దగ్గరుండే భక్తులు దైవానికి కృతజ్ఞతలని ఘటిస్తూ భజన చేయసాగారు.అలాగని ఇళ్లకి వెళ్లిపోయినవారిని కృతఘ్నులుగా లెక్కించకూడదు. వాళ్లంతా గృహిణులైన కారణంగా బాధ్యతనీ కర్తవ్యాన్నీ విస్మరించరానివారు కాబట్టి వెళ్లారని భావించాలి తప్ప, సాయి విషయంలో శ్రద్ధాభక్తులు లేనివారూ లేదా మన పని మనకి ముఖ్యమనుకుంటూ ఇళ్లకి వెళ్లినవారు గానూ భావించకూడదు.

భక్తుల ప్రశ్న
ఇది సాయి చరిత్రలో కన్పడదు గానీ సాయి గురించి రాయబడిన ఓవీల్లో (మరాఠీ భాషలో ఓ ఛందస్సు శార్దూలం మత్తేభం వంటి పద్యాల్లో కనిపించే విధానం) మాత్రం కనిపిస్తోంది. ఏమని?సాయిభక్తులు కొందరు సాయిని ప్రశ్నిస్తూ... ‘దేవా! వాయువూ వర్షమూ అంత తీవ్ర స్థాయికి చేరేంతవరకూ నువ్వెందుకు ఊరుకున్నావు? పైగా పంచభూతాలనీ నీ అధీనంలో ఉంచుకున్నావు కాబట్టి ఆ వాయువూ వర్షమూ అనేవి ఎందుకని నీకు జడిసి అంతటి తీవ్రస్థితికి రాకుండా ఎందుకుండలేదు?’ అని.సాయి నిదానంగా సమాధానమిచ్చాడు. ప్రపంచమంటే మనం మాత్రమే కాదు. మనకి ధాన్యాన్నిచ్చే రైతూ, మనకి ధాన్యం లభించేందుకు కావల్సిన భూమి, మన పొలాన్ని దున్నే ఎద్దూ, ఆ ఎద్దుకి తల్లి అయిన ఆవూ, ఇంతేకాక ఏదో ఓ విధంగా మనకి సహాయపడే 84 లక్షల జీవరాసులు ఏం ఉన్నాయో వాటికి వర్షం అవసరమయ్యుండిఉంటుంది. అంత శాతం వర్షం వారి కానందం కాబట్టి వర్షించాడు దైవం. ఆయన సర్వసముడు. వాళ్లకి ఈ వర్షం ఎంతో ఆనందాన్ని కల్గించి ఉండి ఉంటుంది. మనకది అసౌకర్యం  అనిపించవచ్చు.ఎక్కువ మందికి ప్రయోజనకరమనిపించే దేన్నైనా దైవం చేస్తాడు. ఆ సందర్భంలో కొందరికి తాత్కాలిక బాధ తప్పదు మరి’ అని. ఎంతగొప్ప తాత్త్విక దృష్టి సాయిది!పంచభూతాల్లో వాయువు మీద అధికారాన్ని బ్రహ్మాండపరంగా చూపిన సాయి, పంచభూతాల్లో వాయువు మీద అధికారాన్ని పిండాండపరంగా ఎలా చూపించాడో తెలుసుకుందాం! అంటే వ్యక్తుల ప్రాణవాయువుల్ని ఎలా పోబోతుంటే ఆధిపత్యాన్ని చూపించి  ప్రాణాలు నిలిచేలా చేసాడో గమనిద్దాం!
 సశేషం! 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top