పతనం

Sadran stole charcoal here and sells it outside - Sakshi

కథా ప్రపంచం

అది ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఒక మూలగా ఉన్న గూడ్స్‌షెడ్‌ల ఆవరణ. ఆ డిసెంబర్‌ చలిలో ఒకామె వొణుకుతూ నడుస్తున్నది. ఒకప్పుడు ఆమె పేరు సద్రాన్‌. ఇప్పుడామె ముసలి సద్రాన్‌. ఆమె కళ్లు కూడా తడిగా ఉన్నాయి. ముక్కు కారుతున్నది. మిగిలి ఉన్న కొద్ది పళ్లూ చలికి కొట్టుకుంటున్నాయి. కాళ్లూ చేతులూ స్పర్శ పోగొట్టుకున్నాయి. దారి కనపడటం కోసం కళ్ల మీది చెమ్మను అప్పుడప్పుడూ తుడుచుకుంటున్నది. ఆమె కాళ్లనూ చలి తొలిచేస్తున్నది. అరిగిపోయిన చెప్పులు మట్టితోనూ గోనెసంచుల పీచుతోనూ నిండిపోయి ఉన్నాయి. ఆ స్థితిలోనే కాళ్లీడ్చుకుంటూ పరుగులాంటి నడకతో ముందుకెళుతున్నది. చేతిలో చిన్న సంచీ చిన్న పార ఉన్నాయి.ఆ రైల్వే ప్రాంతంలో శ్మశాన ప్రశాంతత నెలకొని ఉంది. చలిగాలి హోరు ఎక్కువగా ఉంది. ఆవరణ అసాధారణంగా ఖాళీగానూ భీతిగొలుపుతూనూ ఉంది. వినియోగంలో లేని వ్యాగన్ల నీడలో ఆమె నడుస్తున్నది. ‘కాసేపట్లో సూర్యోదయం అవుతుంది. యార్డులో ఒక్క పిట్ట కూడా లేదు. సాధారణంగా జరిగే ఇంజన్ల షంటింగు కూడా లేదు. చలి మనుషులందర్నీ ఇళ్లలోనికి నెట్టేసినట్టుంది. ఎవరూ చలిని ఎదిరించే సాహసం చెయ్యలేరు. కాని డ్యూటీల్లో ఉన్నవారు ఎలాగో నెట్టుకొస్తారు. వారికి తప్పదు. కాపలాదార్లు మందమైన చలికోట్లు వేసుకొని వ్యాగన్లలో కునికిపాట్లు పడుతూ ఉంటారు. నిజానికి వారు మేల్కొని ఉండి రైల్వే ఆస్తులను కాపాడటానికే ప్రభుత్వం జీతాలు ఇస్తున్నది. అయితే ఇంత చలిలో ఎవరు మాత్రం బయట తిరిగి అపాయం కొని తెచ్చుకుంటారు? ఎవరి సుఖం వారిది. ఒక్క నాకే సుఖసంతోషాలు లేవు. శాంతి లేదు. పూట గడవటానికి కొట్లాడవలసి వస్తున్నది. ఈ జీవితం మీద ఆశా లేదు, ఆసక్తీ లేదు. ఈ రైల్వే ఆవరణలోని బొగ్గుని ఊడ్చి సేకరిస్తూ నా యవ్వనమంతా వ్యర్థమైంది. ఇప్పుడు ముసిలినై జీవిత చరమాంకంలో ఉన్నాను. అయినా తిండి కోసం పాట్లు తప్పడం లేదు. ఇన్నేళ్ల బతుకులో రేపనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే.’’ఇలా తన ఆలోచనల్లో మునిగి ముసలి సద్రాన్‌ రైల్వే లైన్లని దాటుకుంటూ తడబడుతూ నడుస్తున్నది. కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపాల కాంతిలో రైల్వే లైన్లు మెలికలు తిరిగిన పాముల్లా కనపడుతున్నాయి. ఆ పాములు నోర్లు తెరిచి ఆమెనే మింగడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాయి.

సద్రాన్‌ ఇక్కడ బొగ్గును దొంగిలించి బయట అమ్ముతూ జీవిక సాగిస్తుంది. బొగ్గుని సేకరించడం కోసం అనేక సంవత్సరాలుగా ఈ రైల్వే ఆవరణని ఊడుస్తున్నది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ప్రతి అంగుళం ఆమెకు చిరపరిచితమే. పద్మవ్యూహంలా ఉండే ఈ లైన్లు ఎక్కడ కలుసుకుంటాయో, ఎక్కడ విడిపోతాయో, ఎక్కడ వొంపు తిరుగుతాయో ఆమెకు తెలుసు. స్విచ్చులు, కూపాలు, వ్యర్థాలు చేరే గోతులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆమెకు తెలుసు. బొగ్గుని పోగు చేస్తుండగా కాపలాదారు కంటపడితే దాక్కోవడం, తనతో పాటు బొగ్గుని దాచడం ఆమెకు తెలుసు. ఒకవేళ పట్టుబడిపోతే అతన్ని ఎలా మెప్పించి ఒప్పించాలో కూడా ఆమెకు తెలుసు. పై అధికారితో కూడా కబుర్లు చెప్పి మాయ చేయడం ఆమెకు తెలుసు. క్లీనర్లనీ, ఫిట్టర్లనీ ఎలా ప్రలోభపెట్టి తప్పించుకోవాలో ఆమెకు తెలుసు. బొగ్గు కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టిన రోజులు ఉన్నాయి. షంటింగ్‌ ఇంజన్‌ ముందు నుంచి మెలకువగా జారుకునేటప్పుడు ఇంజన్‌ కదిలిపోతే అంతే సంగతి. అయినా ఆమె ఆ వృత్తినే చేసింది. చేస్తున్నది. మరోపని చెయ్యడం ఆమెకు చేతకాదు.ముసలి సాద్రాన్‌ ఇలా తలపోస్తున్నది. ‘‘డబ్బుకు లొంగే జనంతో ఇబ్బంది లేదు. కాకపోగా వారికి సంతోషమే. ఒకటి రెండు అణాలు ముట్టజెప్పి బుట్ట నిండా బొగ్గుని మోసుకుపోవచ్చు. కొంతమందైతే ఆ బొగ్గు తామే మోసుకొచ్చి తనకు కావలసిన చోట వేసి వెళతారు. అలా డబ్బు తీసుకున్న వారే ఉత్తములు. వాళ్లెవరూ నన్ను ఇబ్బంది పెట్టరు. కాని నిజాయతీపరులతోనే చిక్కంతా. వారు నేను పోగు చేసిన బొగ్గంతా తీసుకుంటారు. లేకపోతే వారితో ఖాళీ కోచ్‌లోనికి రమ్మంటారు. కుక్కలు! తుచ్ఛులు! వారు తల్లుల్నీ, అక్కచెల్లెళ్లనీ, కూతుళ్లనీ వొదిలిపెట్టరేమో! నీచులు! వారికి వయసుతో పనిలేదు. అందంతో పనిలేదు. ఆడది అయితే చాలు. వారికి కావలసిందల్లా... ముసలి ఎముకలు పగిలిపోయినా వారికి పట్టదు. ముసలి స్త్రీలకు నరకం కనిపించినా వారికి సంబంధం లేదు. కేవలం నగదు తీసుకోకుండా శీలాన్ని హరించినవాడు నిజాయతీపరుడు! వీళ్లనే రైల్వే మెచ్చుకుని మెడల్స్‌ వేస్తుంది. ఏమైనా ఈ స్థితిలో నన్నెవరూ కన్నెత్తి చూడరు. కాకపోతే మోటాగానూ, అసభ్యంగానూ మాట్లాడతారు. బయటికి గెంటివేస్తారు..’’ముసలి సాద్రాన్‌ తన ఆలోచనల్లో మునిగిపోయి కళ్లను తుడుచుకున్నది. ముఖం మీది ముడుతలు మంచుతో గడ్డకట్టుకుపోయినట్టు అనిపించింది. ఆమె మళ్లీ పరధ్యానంలో పడిపోయింది. ‘ఒకప్పుడు నా యవ్వనాన్ని దాచుకునేదాన్ని. అప్పుడు ముసలితనం తొందరగా రావాలని కోరుకునేదాన్ని. యవ్వనం సుఖశాంతుల్ని ఇవ్వలేదు. కాని వృద్ధాప్యం ఇంకా బాధాకరమైనది. ఇప్పుడు అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు. ముసలితనం ఒక శాపం. ధనం, యవ్వనం రెండూ సిగ్గుపడవలసినవి కావు. కాని ఇప్పుడు ఆ రెండూ నా వద్ద లేవు..’

సాద్రాన్‌ తన సంపాదనంతా తన కొడుకు బరాదాన్‌ అనారోగ్యం కోసం ఖర్చుపెట్టింది. భర్త చనిపోయిన తర్వాత వాడిని పెంచడానికి ఎన్నో ఇబ్బందులు పడింది. వాడికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించడానికి తన శరీరాన్ని అమ్ముకున్నది. చివరికి వాడి పెళ్లి చేసింది. వాడికొక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడే ఇప్పుడు తన సర్వస్వం. కాని బరాదాన్‌ పెళ్లి అనర్థదాయకమే అయింది. తెలియని వ్యాధితో మంచం పట్టాడు. ముసలి సాద్రాన్‌కు తన పెళ్లినాటి జ్ఞాపకాలు వెంటాడాయి. బరాదాన్‌ తండ్రి ఈమెని తన ఇంటికి తీసుకెళ్లాడు. ‘‘సాద్రాన్‌ సాద్రాన్‌’’ అన్న పిలుపు అతడి పెదవుల మీద ఉండేది. అదేపనిగా ఆమె వెంట తిరిగేవాడు. ఆమెని ఇంటి వద్ద వొదిలి డ్యూటీకి వెళ్లడానికీ ఇష్టపడేవాడు కాదు. ఏదో వంక పెట్టి ఇంటి వద్దనే ఉండిపోయేవాడు. ‘‘సాద్రాన్‌! మనిద్దరికీ నా జీతం సరిపోతుంది. మనం పోషించవలసిన వారెవరూ లేరు’’ అనేవాడు.‘‘మన ఇరుగుపొరుగు నవ్వుతున్నారు. అత్తమామలు లేరట. నేనే ఇంటికి రాణినట. నిన్ను ఇంట్లో కట్టి పడేస్తున్నానట’’ అనేది తను. ‘‘సాద్రాన్‌! ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు. నీ సంతోషమే నాక్కావాలి.ఎవరైనా సంతృప్తిగా జీవిస్తే వారు చూడలేరు’’ అనేవాడు. అలాంటి భర్త.. కొడుకు బరాదాన్‌ని ఇచ్చి చనిపోయాడు. అప్పటి నుంచీ తనకు కష్టాలు మొదలయ్యాయి.సాద్రాన్‌ నిట్టూర్చింది. ఒక్కసారిగా ఒక గాలి కెరటం రైల్వేయార్డులో ప్రవేశించింది. ఆమె ఆలోచనలకు భంగం కలిగించింది. విద్యుద్దీపాల కాంతి తీవ్రతలో ఆమె కళ్లు తెరిచి ఉంచలేకపోతున్నది. లైన్‌ స్విచ్చులకుఅడ్డంగా యాంత్రికంగా నడవసాగింది. చేతిని నుదుటిపై ఉంచి కళ్లకు చాటు పెట్టుకున్నది. ఒక దొంగలా చుట్టూ జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు అడుగులేస్తున్నది. ఒక్కోసారి ఒక వ్యాగన్‌ నీడలోకి చేరిపోయి ఎవరూ తనను గమనించడం లేదని నిర్ధారించుకుంటున్నది. ఇప్పుడు ముసలి సాద్రాన్‌ బొగ్గు ముక్కల పోగుల్ని చేరుకున్నది. అవి ఆమెకు బంగారు బిస్కట్ల దొంతర్లలా కనపడుతున్నాయి. రెండు పోగుల బొగ్గు ముక్కలు తీసుకెళ్తే సరి. బరాదాన్‌ కోసం మందులు కొనగలదు. మనవడి కోసం బియ్యం కొనగలదు. తనకీ కోడలికీ చాలినంత జొన్నపిండి కొనగలదు.చలి కొరికేస్తున్నప్పటికీ ఒకటి మాత్రమే కాదు, రెండు బొగ్గు పోగుల్ని తీసుకెళ్లడానికి ఇదే అదనుగా భావించింది. రెండు పోగుల్ని కొట్టేస్తే చాలు చలికాలం గడిచిపోతుంది. ఆ తర్వాత పగటిపూట చిన్న బొగ్గుముక్కలు ఎప్పుడైనా ఏరుకోవచ్చు. బూడిద కుప్పల నుంచి బొగ్గు ముక్కల్ని ఏరుకుంటే ఎవరూ ఏమీ అనరు. అభ్యంతరపెట్టరు. ఆ బూడిద పోగుల నుంచి ముందుగా కొడుకు బరాదాన్, ఆపైన మనవడూ పైకి లేస్తున్నట్టు ఆమె ఊహించుకుంది.ఇల్లు గడవటం కష్టంగా ఉంది. బరాదాన్‌కు మందులు కావాలి. కొడలూ మనవడూ తనూ తినాలి. తనొక్కతే సంపాదించాలి. కోడల్ని ఇదే వ్యాపారం, ఇదే రొంపిలోకి దింపడం ఆమెకు ఇష్టం లేదు. ఈ నికృష్టమైన వృత్తి తనతోనే అంతం కావాలనుకున్నది.రెండు విడతల బొగ్గు తీసుకెళ్లడానికి రెండుసార్లు తిరగాలి. ఇదే సరైన సమయం. ఇటువంటి చలిలో చీకటిలో ఏ ఉద్యోగీ బయటకు రాడు. కాబట్టి రెండుసార్లు సులువుగా తిరగ్గలదు. ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నవి.

‘‘హిందుస్తాన్, పాకిస్తాన్, దేశం ఏదైతేనేం? పేదలకు బాధలు తప్పవు. ఒకప్పుడు హిందువులూ ముస్లిములూ ఎంతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చుకొనేవారు. ఇప్పుడు దేశం ముక్కలైన తర్వాత ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు. కుర్బాన్‌ అలీషా విద్వేషాలకి బలి అయిపోయాడు. అతడే ఈరోజు బతికి ఉన్నట్లయితే నాకీ కష్టాలు ఉండేవి కావు. నాకోసం తన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు. అతడు ఉన్నంత కాలమూ నాకు డబ్బుకొరత ఉండేది కాదు. డ్రైవర్‌ నాథ్‌సింగ్‌ కూడా ఉండేవాడు. కానీ అతడు కుర్బాన్‌ అలీ ఉండగా తనని తాకడానికి సాహసించేవాడు కాదు. నాథ్‌సింగ్‌ ఇలా అనేవాడు. ‘‘కోడలా! నా మాట విను. అలీని పెళ్లి చేసుకో. ఇదే మంచి సమయం. నీ యవ్వనం, నీ అందం ఎల్లకాలమూ ఉండవు. మతం గురించి పట్టించుకోకుండా అతన్ని పెళ్లి చేసుకో.’’అందుకు నేనిలా అనేదాన్ని. ‘‘నాథ్‌సింగ్‌! ముస్లిముని పెళ్లి చేసుకొని నన్ను నేను మోసం చేసుకోవాలా?’’ అతడిలా అనేవాడు ‘‘మరి ఇది బాగుందా? అతడు ప్రతిరోజూ నిన్ను కోచ్‌లోకి తీసుకెళుతున్నాడు. ఈ సంగతి అందరికీ తెలుసు. ఇలా చాటుగా తిరగడానికి అడ్డురాని మతం పెళ్లికెందుకు అడ్డం? కొద్ది రోజుల తర్వాత అలీ కూడా నిన్ను పట్టించుకోడు. అప్పుడు పశ్చాత్తాపపడతావు.’’ఈ సంభాషణ తర్వాత దేశం విడిపోయింది. అలీని హిందువులే పొట్టన పెట్టుకున్నారు. నిజంగా తన పొట్టనూ కొట్టినట్టయింది.సాద్రాన్‌ గట్టిగా నిట్టూర్చింది. ఒక వాషింగ్‌లైను దాటుతుండగా ఆమె కాలు ఒక గోతిలో పడింది. అసహాయంగా ముందుకి తూలిపోయింది.మోకాలికి గట్టి దెబ్బ తగిలింది. పాదం కింది భాగంలో ఏదో లోహపు ముక్క గీసుకొనిపోయింది. చెప్పుల మీద నుంచే రక్తం కారడం కనపడింది. కదల్లేకపోతున్నది. బాధతో మూలుగుతున్నది.అలాగే పడి ఉన్న చోటే చనిపోతే నయమనిపించింది. కానీ ఏదో అదృశ్య శక్తి జీవితం మీద వ్యామోహం కలిగించింది. నెమ్మదిగా పాకుతూ రైల్వే ట్రాక్‌ రెండో వైపు చేరింది. అంతలోనే అతి వేగంగా ఆ ట్రాక్‌ పైనుంచే రైలు పరుగెత్తింది. అది తన మీదుగా వెళుతున్నట్లు అనిపించింది.ముసలి సాద్రాన్‌ నెమ్మదిగా లేచింది. పాదం తీవ్రంగా సలుపుతున్నది. కాస్త దూరంలో ఎవరో చలిమంట కాగుతున్నారు. అక్కడ దగ్గుతూ కూర్చున్న ముసలివాడిని గుర్తించింది. అతడు ఆమెకు తెలుసు. వెళితే వాడు తన పాత కథలన్నీ ఏకరువు పెడతాడు. చావుకు దగ్గరగా ఉన్నాడు కానీ సరసాలు మానడు. కాబట్టి ఆమె అటు వెళ్లడానికి ఇష్టపడలేదు.కనీసం ఒక విడత బొగ్గునైనా మోసుకెళ్లాలని భావించింది. ఆ పోగుల వద్దకు వెళ్లేసరికి ఏదో టార్చి కాంతి పడుతున్నట్టు గ్రహించింది. కొందరు కాపలాదార్లు టోపీలు సర్దుకుంటూ వినియోగంలో లేని కోచ్‌ నుంచి అటువైపే వస్తున్నారు. వారిని చూసి ఆమె వెనుతిరగక తప్పలేదు. గాయమైనా సరే వచ్చిన పని పూర్తి కానందుకు చింతించింది. 

ముసలి సాద్రాన్‌ ఖాళీ చేతులతో గుడిసె చేరింది. ఆమెను చూసి కోడలు జోమన్‌ రెచ్చిపోయింది. ‘‘ఈ ముసిల్ది చావనైనా చావదు. తను సంపాదించలేదు. నన్ను బయటికి వెళ్లనివ్వదు. చీకటిపడ్డాక వెళ్లి ఇప్పుడు తిరిగొచ్చింది. అదీ ఖాళీ చేతుల్తో ఏడుస్తూ వచ్చింది. రాత్రంతా మంచి చలిమంట దగ్గర ఉండి హాయిగా తిరిగి వచ్చేసింది. నువ్వేమీ పని చెయ్యలేవని, ఇంటి వద్దనే ఉండమని చెప్పాను. నేను వెళ్తానని బొగ్గు తెస్తానని చెప్పాను. అయినా వినదు. చేతకాని గొప్పలకు పోతుంది. నన్ను ఇల్లు కదలనివ్వదు. నేనేదో ఐస్‌క్రీమునైతే నన్నెవరో తినేస్తారన్నట్టు భావిస్తుంది. ఈరోజు కుటుంబమంతా పస్తులుండాలి.’’సాద్రాన్‌ కోడలు జోమన్‌ అరుపులు విన్నది. ఏడ్చింది. కాని పైకి ఏమీ అనలేకపోయింది. ఒకవేళ ఏమైనా అన్నా కోడలు మరింత బిగ్గరగా అరిచి తిరగబడుతుందని ఆమెకి తెలుసు.‘‘రేపు నేనే వెళ్లి బొగ్గు తెస్తాను’’అన్నది జోమన్‌.సాద్రాన్‌ గట్టిగా వొద్దనలేదు. అంటే కారణాల్ని వివరించాలి. అది ఆమె చెయ్యలేదు. ‘‘రైల్వే యార్డు నుంచి బొగ్గు సేకరించడంలో కష్టాలు కోడలికి తెలియవు’’ అని తనలోనే అనుకున్నది. సాద్రాన్‌కు దెబ్బ తగిలిన కాలు నొప్పెడుతున్నది. ఒక గోనెసంచి ముక్క కట్టుకున్నది. ‘‘నా జీవితం ఎలాగూ నాశనమైంది. నా దుర్గతి కోడలికి రాకూడదు’’ అని పదే పదే అనుకున్నది.మరునాడు సాద్రాన్‌ నిద్రలేచింది. జోమన్‌ గుడిసెలో లేనట్టు కనుగొన్నది. ఖాళీ సంచి, పార కూడా లేవు. ఆమె హృదయం బాధగా మూలగడం మొదలుపెట్టింది. గుడిసె ద్వారం వద్దకు పరుగెత్తింది. ఒక తుపానువల్ల గుడిసె పెళ్లగించబడినట్టు వెయ్యి ముక్కలు చెక్కలైనట్టు అనిపించింది. ముసలామె గాఢాంధకారంలోనికి చూస్తూ ద్వారం వద్దనే కూలబడింది.తెలతెల్లవారుతుండగా జోమన్‌ తిరిగి వచ్చింది. గుడిసె ముందర సంచి నిండా బొగ్గు పెట్టింది. ఆ ఇద్దరూ స్త్రీలూ ఒకరి కళ్లలోనికి ఒకరు చూసుకున్నారు. ముసలి సాద్రాన్‌ చూపు కోడలి చెదిరిన జుత్తుపైనా, చినిగిన చొక్కాపైనా పడింది. అత్త తన పరిస్థితిని చదివేసిందని కోడలికి తెలిసిపోయింది. జోమన్‌ అపరాధభావంతో చూపును కిందకు దించుకుంది. కేవలం ఒక సంచిడు బొగ్గు కోసం తన కోడలు అమూల్యమైనదేదో కోల్పోయిందని ముసలామె గ్రహించింది. ఒక విధమైన వేదనతో కుప్పకూలిపోయింది.
పంజాబీ మూలం : బూటా సింగ్‌
అనువాదం: టి.షణ్ముఖరావు
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top