దిక్కులేని సిపాయి

Rambabu who was studying in the course told the laborers - Sakshi

కూలీలను వెంటేసుకొని ఆవేశంగా వస్తున్న రాంబాబును చూస్తూ లెక్క ప్రకారం అయితే భూస్వామి భూషయ్య  ఒక మోస్తరుగానైనా కంగారుపడిపోవాలి. అదేమి లేకుండా చాలా తేలిగ్గా...‘‘ఏంట్రా అబ్బాయి’’ అన్నాడు.‘‘కూలీలు’’ అని పిడికిళ్లు బిగించినంత పనిచేశాడు రాంబాబు.‘కూలీలు’ అనే చిన్న మాటలోనే చెప్పకనే ఎన్నో విషయాలు చెప్పాడు రాంబాబు. కూలిపోతున్న కూలీల జీవితాల గురించి కావచ్చు, వాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి కావచ్చు.పట్నంలో చదువుకొని వచ్చిన రాంబాబుకు కూలీలతో పనేమిటి? ఈ రాంబాబు అందరిలాంటోడైతే కూలీలతో పనేమిటి? అనే అనుకోవచ్చు. కానీ రాంబాబు చదువుతో పాటు సమాజాన్ని చదువుకున్నవాడు.

అందుకే కూలీల సమస్యలను తన ఇంటి సమస్యగా చేసుకొని భూషయ్య ఇంటికొచ్చాడు.భూషయ్య మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు.‘‘కూలీల సంగతి కూలోడు, రైతుల సంగతి రైతోడు పడతాడు. కుర్రోడివి నీకెందుకు ఈ ఎవ్వారం’’  విసుక్కున్నాడు  భూషయ్య.‘‘చదువుకున్నాడని యవ్వారానికి వచ్చాడు’’ వెక్కిరింపుగా అన్నాడు భూషయ్య భజనుడు.‘‘వచ్చి మాత్రం ఏంచేస్తాడు! వరిముక్క చేతికి ఇచ్చి ఏంట్రా ఇది అని అడిగితే వడ్లుగాసే చెట్టు అనేవాడివి నీకెందుకురా...ఎళ్లు’’ రాంబాబును ఊకలా తేలికగా తీసేశాడు భూషయ్య.మరి భజనుడు ఊరుకుంటాడా..‘‘ఇదిగో గాడిద పని గాడిద కుక్క పని కుక్క చేయాలి. తెల్సిందా!’’ అని అరిచాడు.‘‘నువ్వు ఇక్కడ ఉన్నావంటే మర్యాద దక్కదు’’ అని హెచ్చరించాడు కూడా.‘‘వెళ్లిపోకపోతే?’’ కోపంగా అన్నాడు రాంబాబు.‘‘తలగొరుకుడు, సున్నంబొట్లు, గాడిద మీద ఊరేగింపు...చాలా’’ తన మాటలతో రాంబాబును మరింత రెచ్చగొట్టాడు భజనుడు.అంతే...‘‘ఏంట్రా కుశావు’’ అని ఆ భజనుడి వైపు పిడుగులా దూసుకువచ్చాడు రాంబాబు.∙∙  ఏటి ఒడ్డున పాక హోటల్‌.ఆలివ్‌గ్రీన్‌ దుస్తుల్లో ఉన్న ఒకాయన టీ తాగుతున్నాడు.

ఊరికి కొత్తోడిలా ఉన్నాడు. అప్పుడే అక్కడి వచ్చాడు కామయ్య.‘‘పేరు?’’ అని కొత్తవ్యక్తిని అడిగాడు.‘‘చంద్రశేఖరం’’‘‘చంద్రశేఖరం అని తెల్సండీ. ఊరు?’’‘‘తోలేరు’’‘‘చంద్రశేఖరం... తోలేరు అనే సంగతి తెల్సండి. పని?’’‘‘ప్రభుత్వం వారు నాకు ఈ ఊళ్లో పొలం ఇచ్చారు. దాని కోసం వచ్చాను’’‘‘కరణంగారితో పనన్నమాట. మనం ఉండాలన్నమాట’’‘‘కరణంగారు మీకు తెలుసా?’’‘‘కాకిని, కరణంగారిని తెలియని వారు ఈ ఊళ్లో ఉంటారా! ఎటొచ్చి కొంచెం కమిషన్‌ అవ్వుద్ది’’‘‘కమిషనా! ఎందుకు?’’‘‘ఎందుకేమిటండీ, కరణంగారితో పని కావాలంటే కామయ్యగోరు కదలాలి. కామయ్యగోరు కదలాలంటే కమిషన్‌ ఉండాలి. ముందు ఆ కాగితాలు మన చేతిలో పెట్టండి. రేపు రండి. మీ భూమి తీసుకువచ్చి మీ చేతిలో పెడతాను’’అమాయకంగా కామయ్య సాలెగూడులో చిక్కుకుపోయాడు పాపం ఆ మిలిటరీ ఆయన. సూటిగా చెప్పాలంటే మిలిటరీ చంద్రశేఖరం మోసపోయాడు.∙∙ ‘‘కరణంగారు ఈ చేను ఎక్కడుందండీ?’’ చంద్రశేఖరం పొలం గురించి వివరం అడిగాడు రాంబాబు.‘‘ఎక్కడిదంటే...’’ నసిగాడు కరణం.చంద్రశేఖరం పొలాన్ని భూషయ్య నొక్కేశాడని రాంబాబుకు అర్థమెంది.‘‘దీన్నంతా ముత్యాలమ్మ చేను అంటారు.

ఇది ఎప్పటి నుంచో భూషయ్య చేతిలో ఉంది’’ అని తనతో పాటు వచ్చిన చంద్రశేఖరానికి చెప్పాడు రాంబాబు.తన చేను గురించి భూషయ్యను అడగడానికి వెళ్లాడు చంద్రశేఖరం.‘‘భూషయ్య గారు ఆ చేను నాది. నాకు పట్టా వచ్చింది. దాన్ని మీరు అట్టి పెట్టుకున్నారు’’భూషయ్య తనదైన శైలిలో ఇలా అన్నాడు...‘‘కిట్టమూర్తి మనం అట్టిపెట్టుకోవడమేమిటయ్యా. అది ముత్యాలమ్మ తల్లిది. కాదంటే ఆ తల్లికే కోపం వస్తది. మనకేం!’’‘‘ఒకనాడు ఏం జరిగిందో తెలుసా? ఆ గట్టు మీద తాడిచెట్టు కల్లు దొంగతనం చేయడానికి ఓ అర్ధాయుష్షు వెధవ చెట్టెక్కాడు’’ అని భజనుడు అన్నాడో లేదో పూజారి టక్కున అందుకున్నాడు...‘‘రక్తం కక్కుకొని టపీమని చావబోయి ఆగాడు. అంటే ఒకటి....అమ్మతల్లి మహత్యం నీకింకా  తెలియదు. ఆమె తలుచుకుంటే భూమి దద్దరిల్లుతుంది. ప్రళయం వచ్చేస్తుంది’’‘‘భయంకర శత్రుమూకలను నేలమట్టం చేయడంలో నా కాలు పోయినా ఆ గుండె బలం అలాగే ఉంది. నేను అవిటివాన్ని అయినా ఆ సాహసం అలాగే ఉంది. ప్రభుత్వం నాకు పట్టా ఇచ్చింది. ఆ భూమి నాది’’ అని గట్టిగా అరిచాడు చంద్రశేఖరం.తాటిముంజలు తింటూ తాటికాయలను నరుకుతున్న పనివాడిని చూస్తూ తనదైన శైలిలో స్పందించాడు భూషయ్య...‘‘రేయ్‌ పోతూ! పట్టా కత్తి చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్లు నరుక్కెళుతుంటే, వొకనాడు అమ్మతల్లి కన్ను విప్పుతుంది.

కుండెడు రక్తం భళ్లునా కక్కాలి’’∙∙ ‘‘రాంబాబు... ఆరునూరైనా సరే రేపే మనం చేలో దిగుతున్నాం. పొద్దుటే వచ్చేయ్‌. చేనులో కలుద్దాం’’ ఆవేశంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు చంద్రశేఖరం.మరుసటి రోజు...చేనులో చంద్రశేఖరం కనిపించలేదు.ఆయన శవం కనిపించింది.కళ్లనీళ్లతో శవాన్ని భుజానికెత్తుకున్నాడు రాంబాబు.దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరిచాడు...‘‘మీరంతా ఇటు చూడండి. తలలు పక్కకు తిప్పుకోకండి. నా దేశం అని నా జనం అని వెర్రిప్రేమలు పెంచుకొని ఆవేశంతో శత్రువుల మీదికి దూకి కాలు పోగొట్టుకున్న పిచ్చిసిపాయి. అయినా భ్రమలు తీరక ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో వచ్చి ఒంటరిగా చచ్చిన దిక్కులేని సిపాయి. ఇతడ్ని తగిలేయడానికి నాతో రాగలిగిన వారు ఎవరు? మీరా? మీరా?’’
  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top