వచ్చిన వాడు ఫల్గుణుడే...

Nartanasala Movie Story On Funday - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

సముద్రాల రచన చేసిన సినిమా, ‘నరవరా ఓ కురువరా’లాంటి ఆణిముత్యం పాటలు ఉన్న సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...
విరాట మహారాజు కుమారుడు ఉత్తరుడితో ఉల్లాసంగా ఉన్నవేళ...
‘‘శరణు మహారాజా! శరణు!!’’ అంటూ పిడుగుపాటులాంటి వార్తను మోసుకొని వచ్చారు చారులు.
సుశర్మగారి సైనికులట... దక్షిణ అలమందను దారిమళ్లించారు...
‘‘కీచకుడు మరణించాడన్న వార్త విని ఆ కిరాతకుడు ఈ నీచానికి తలపెట్టాడు..’’ ఆవేశంతో  ఊగిపోతున్నాడు విరాటమహారాజు.
‘‘సెలవియ్యండి మహారాజా! ఆ సుశర్మను వారి సేనల్ని పిండిపిండి చేసి మన మందల్ని మళ్లించుకొస్తా’’ అని తనదైన శైలిలో వీరకోత కోశాడు ఉత్తరుడు.
‘‘గతాన్ని మరచి కర్తవ్యాన్ని ఆలోచించండి మహారాజా!’’ కర్తవ్యబోధ చేశాడు మంత్రి.
‘‘సేనలను యుద్ధానికి సంసిద్ధం చేయించండి’’ అని అరిచాడు విరాటుడు.

అదిగో అర్జునుడి శంఖారావం!
‘‘ఆపండి ఆచార్యా! శిష్యవాత్సల్యంతో పాండవ పక్షపాతంతో పార్థుణ్ణి ప్రశంసించి మమ్ము అవమానిస్తున్నారు’’  ఆవేశపడ్డాడు కర్ణుడు.
‘‘కర్ణా, ఆచార్యులవారినే అధిక్షేపిస్తావా! శౌర్యవంతుడైన శత్రువును శ్లాఘించడం వీరధర్మం. ప్రియ శిష్యుడిని ప్రశంసించడం గురువుకి అధర్మం కాదు’’ అన్నాడు అశ్వత్థామ.
‘‘శాంతించు గురుపుత్రా! ఇది అంతఃకలహాలు, ఆవేశాలకు అదను కాదు. వచ్చినవాడు ఫల్గుణుడే అయితే ఇక మన పంతం నెవరేరినట్లే. అజ్ఞాతవాస నియమభంగంతో పాండవులు తిరిగి పన్నేండేళ్ల అరణ్యవాసం చేయాలి’’ ఏదో కనిపెట్టినట్లుగా అన్నాడు దుర్యోధనుడు.
‘‘ఇది పొరపాటు రారాజా! పాండవులు అంత అవివేకంగా ప్రవర్తించరు. అధిక మాసాలతో కలిసి నిన్నటితో గడువు తీరిపోయింది. అది తెలిసే అర్జునుడు సమరాభిలాషిౖయె సమీపిస్తున్నాడు’’ ఉన్న  విషయం చెప్పాడు భీష్ముడు.
‘‘తాతగారు! ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడలేవు. ఖడ్గమే కార్యసాధనమని మా నిర్ణయం’’ గంభీరంగా అన్నాడు దుర్యోధనుడు.
‘‘దైవేచ్ఛ! జరగనీ’’ శాంతస్వరంతో అన్నాడు భీష్ముడు.

‘‘ఉత్తరకుమరా! అదిగో రారాజు కర్ణ సహాయుడై మందలతో ముందుకు సాగుతున్నాడు. మన రథం వారి ముందుకు మళ్లించు. త్రోవలో గురుదేవులకు నమస్కరించి వెళదాం’’ రథసారథి అయిన ఉత్తరకుమారుడితో అన్నాడు అర్జునుడు.
కాళ్ల దగ్గర బాణాలు వేసి గురుదేవులకు నమస్కరించాడు అర్జునుడు.
బాణాలతోనే నమస్కరించి కుశలం అడిగిన పార్థుడి భక్తిప్రపత్తులకు సంతోషించారు గురుదేవులు.
యుద్ధం మొదలైంది...
‘‘నిలువు దుర్యోధనా! నిలువు! నీ దుర్నీతి నిష్ప్రయోజనం అయిపోతుంది. నీతికే జయమని నిరూపిస్తాను. వీరుడవైతే విల్లు పట్టు’’ అని దుర్యోధనుడిని కవ్వించాడు అర్జునుడు.
‘‘నిలువు ఫల్గుణా! ఈ  రాధేయుణ్ణి జయించిగాని రారాజును సమీపించలేవు’’ అని దుర్యోధనుడికి వెన్నుదన్నుగా నిలిచాడు కర్ణుడు.
‘‘నీ ప్రగల్భాలు కొత్తవి కాదు కర్ణా’’ అని కర్ణుడిని అపహాస్యం చేస్తూ తన బాణంతో రారాజు గదను ఛిద్రం చేశాడు అర్జునుడు.
అంతేకాదు...
‘‘మా అన్న భీమసేనుని ప్రతిజ్ఞాభంగం కారాదని నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను’’ అని దుర్యోధనుడిని వదిలేశాడు అర్జునుడు.
‘‘అర్జునుడి ధాటి తట్టుకోలేక రారాజు పడిపోయాడు. కురురాజును రక్షించండి’’ అంటూ అరుపులు వినిపించాయి.
ఇదంతా చూసి ఉత్తరకుమారుడిలో సన్నగా వణుకు మొదలైంది.
‘‘ఈ భయంకర యుద్ధం చూసి నా గుండెలు కొట్టుకుంటున్నాయి. ఇక నేను ఈ సారథ్యం చేయలేను’’ అని పారిపోవుటకు పలు మార్గాలు ఆలోచిస్తున్నాడు ఉత్తర కుమారుడు.
‘‘ఉత్తర కుమారా! ఒక క్షణకాలం పాటు ఓపిక పట్టు. ఈ సమ్మోనహానస్త్రంతో ఈ యుద్ధం పరిసమాప్తి చేస్తాను’’ అని ఉత్తరకుమారుడి భుజాల మీద చేయివేశాడు అర్జునుడు.
ఆ తరువాత అర్జునుడి సమ్మోహానాస్త్రానికి శత్రుశిబిరంలో అందరూ మూర్ఛపోయారు.
‘‘ఉత్తరకుమరా! మహారాజులవారు నీ విజయవార్త కోసం ఎదురుచూస్తున్నారు. గెలుపు నీదేనని పలుకు’’ అన్నాడు అర్జునుడు.
ఆశ్చర్యంగా చూశాడు ఉత్తరకుమారుడు.
‘నువ్వు విన్నది నిజమే’ అన్నట్లుగా చూసిన అర్జునుడు...
‘‘అవును. అవసరం వచ్చినప్పుడు మనమే రహస్యం బయటపెట్టవచ్చు’’ అని చెప్పాడు.
‘‘ఎప్పుడైనా నీ మాట కాదన్నానా. ఇప్పుడూ అంతే’’ వినయంగా అన్నాడు ఉత్తరకుమారుడు.
కొద్దిసేపటి తరువాత నిద్రలోంచి లేచినట్లుగా లేచారు అర్జునుడి శత్రుశిబిరం వారు.
‘‘ఏడీ? ఎక్కడ అర్జునుడు! చీల్చి చెండాడుతా’’ అని అరిచాడు కర్ణుడు.
‘‘శాంతించు కుమారా! జరిగిన అవమానం చాలు. పార్థుడు దయతలచి వదిలిపెట్టాడు. మర్యాదగా మన రాజ్యానికి మళ్లడం మంచిది’’ అని విలువైన సలహా ఇచ్చాడు భీష్ముడు.

‘‘ఆడండి మహారాజా!’’ అన్నారు చదరంగం ముందు కూర్చున్న  భట్టుగారు.
కాని మహారాజు మనసు మనసులో లేదు. కళ్లలో స్పష్టంగా కనిపిస్తున్న భీతి!
ఇక ఆగలేక మనసులో భయాన్ని భట్టుగారి ముందు వెళ్లగక్కారు విరాట మహారాజు...
‘‘భట్టుగారు... సుశర్మను గెలిచి వచ్చిన సంతోషం కంటే ఉత్తరకుమారుని రాక జాగు అయినకొద్దీ ఆరాటం హెచ్చిపోతున్నది’’ అన్నాడు.
‘‘భయపడకు మహారాజా! బృహన్నల వెంట ఉన్నంత వరకు రాకుమారునికి ఏ భయం లేదు’’ అని ధైర్యం చెప్పారు భట్టుగారు.
‘‘ఏం బృహన్నలో ఏమో’’ అని నిట్టూర్చాడు విరాటుడు.
ఈలోపు ఒకడు దూసుకువచ్చి–
‘‘జయం మహారాజా జయం! యువరాజుల వారు కౌరవులను ఓడించి మందలను మళ్లించి వస్తున్నారు’’ అన్నాడు.
అంతే... విరాటుడి మోములో వేయి సూర్యప్రభలు!
‘భళా భళా’ అంటూ శుభవార్త మోసుకువచ్చిన వాడికి తన మెడలోని హారాన్ని బహుమానంగా ఇచ్చాడు.
‘‘ఉత్తరకుమారుడికి ఘనమైన స్వాగత ఏర్పాట్లు చేయండి’’ అని ఆనందంగా ఆదేశాలు జారీ చేశాడు విరాటమహారాజు.

సమాధానం: నర్తనశాల

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top