సాధారణ మనిషి
‘‘ఆరువారాల క్రితం మన పక్కింట్లోకి వచ్చిన గండర్‌సన్ దంపతులు బయటికి కనిపించినంత మంచివాళ్లు కారు’’ లొరేన్ భర్తతో చెప్పింది.
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 5
‘‘ఆరువారాల క్రితం మన పక్కింట్లోకి వచ్చిన గండర్‌సన్ దంపతులు బయటికి కనిపించినంత మంచివాళ్లు కారు’’ లొరేన్ భర్తతో చెప్పింది.
‘‘కాని వాళ్లు నాకు మర్యాదస్తుల్లా కనిపిస్తున్నారు’’ హేరీ చెప్పాడు.
‘‘మీరు నమ్మరు కాని వాళ్ల ఇల్లు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. పార్టీలు లేవు. రౌడీల్లా కనిపించేవాళ్లు తరచూ వాళ్లింటికి వచ్చి వెళ్తూంటారు.
ఇంటి కిటికీ తెరలు ఎప్పుడూ మూేన ఉంటాయి. ఎందుకో వాళ్లు రహస్యంగా జీవిస్తున్నారని అనిపిస్తోంది.’’
‘‘నాలా రిజర్వ్‌డ్ టైపేమో?’’ హేరీ సూచించాడు.
‘‘కాదు. మీతో గండర్‌సన్‌ని పోల్చ కండి. మన పెళ్లయి ముప్ఫై ఏళ్లయింది. మీరెలాంటివారో నాకు తెలీదా? అతను ఆర్కిటెక్ట్‌ట. కాని ఎప్పుడూ ఇల్లు వదిలి వెళ్లిన సూచనలు లేవు. బహుశ అది అబద్ధం అయి ఉండచ్చు. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడేమో?’’
‘‘ఆర్కిటెక్ట్‌లు ఇంటి నించే కంప్యూటర్లో పని చేయచ్చనుకుంటా?’’
‘‘అర్ధరాత్రుళ్లు ఆర్కిటెక్ట్‌లు ఎందుకు బయటకి వెళ్లాలి?’’
‘‘నీకెలా తెలుసది?’’
‘‘హేరీ! కొన్ని రాత్రులుగా నేను అతన్ని గమనిస్తున్నాను. తెల్లవారు ఝామున మూడుకి అనేక వయసులవాళ్లు దాదాపు అరడజను మంది వారింటికి వచ్చి వెళ్తూంటారు.’’
‘‘బంధువులై ఉండచ్చు. లేదా మిత్రుడి కుటుంబం అయి ఉండచ్చుగా?’’
‘‘ఇంతకు ముందు ఆ ఇంట్లో ఉన్న మెక్సికన్ కుటుంబం మంచిదని మనం అనుకోలేదా? కాని ఆమె అక్రమ వలసదారులకి ఇంగ్లిష్‌ని బోధిస్తూండగా ఇమిగ్రేషన్‌వాళ్లు వచ్చి అందర్నీ పట్టుకోలా? స్పానిష్ మాత్రమే వచ్చినవాళ్లు అమెరికాలో జీవించడం కష్టం అని, వాళ్లు అక్రమ వలసదారులనీ ఆమెకి తెలీదా?’’
‘‘మనం ఆవిడ విషయంలో పొరపడ్డామని ఒప్పుకున్నాగా?’’
‘‘అలాగే గండర్‌సన్ విషయంలో కూడా పొరబడుతున్నాం అనుకోరేం? వాళ్లు సాధారణ మనుషులు కాదు. నేరస్థులు. టైస్ట్‌లేమో? ఇస్లాం మతస్థులైన టైస్టులకి వీళ్లు సహాయం చేస్తున్నారేమో? ఏవైనా పేల్చేయడానికి పన్నాగం పన్నుతున్నారేమో?’’
‘‘మన ఎఫ్‌బీఐ, సీఐఏలని తక్కువ అంచనా వేయకు. అమెరికాలో అలాంటివి ఇక కుదరవు.’’
‘‘లేదా గూఢచారి అయి ఉండచ్చు. ఇరాక్, సిరియా లేదా అఫ్ఘానిస్థాన్ గూఢచారులేమో హేరీ?’’
‘‘గండర్‌సన్ అమెరికన్.’’
‘‘ఐతే ఏమిటి? మీరు బొత్తిగా అమాయకులు. నల్లనివన్నీ పాలు, తెల్లనివన్నీ నీళ్లు అనుకుంటారు. వాళ్లింటికి వచ్చి వెళ్లేవాళ్లంతా బేంకు దొంగతనానికి పథకం వేేన దొంగలేమో? లేదా చట్టం నించి దాక్కునే నేరస్థులేమో?’’
‘‘నువ్వు అనవసరంగా ఏవేవో ఊహిస్తున్నావు లొరేన్.’’
‘‘మీరు ప్రతివారినీ మంచివాళ్లుగా, నిజాయితీపరులుగా చూస్తూంటారు. అమెరికాలోని జైళ్లలో ప్రపంచంలోని జైళ్లన్నింటిలోని ఖైదీల కన్నా ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారని చదివాను. పట్టుబడనివారు ఇంకా ఎంతోమంది బయటే ఉన్నారు. వాళ్లల్లో గండర్‌సన్ ఒకడని నా గట్టి నమ్మకం.’’
హేరీ మాట్లాడలేదు. కాసేపాగి లొరేన్ తన భర్తతో చెప్పింది.
‘‘ఎల్లుండి సోమవారం మీరు కేంప్‌కి వెళ్తున్నారా?’’
‘‘అవును.’’
‘‘ఎన్ని రోజులు వెళ్తున్నారు?’’
‘‘సేల్స్ పని ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలీదు. బహుశా శనివారానికల్లా వచ్చేస్తాను.’’
‘‘మీరు ఈ ఊళ్లోనే సేల్స్‌మేన్‌గా పని చేస్తూ కేంప్‌లను మానేయచ్చుగా? వచ్చే ఏడు రిటైరయ్యేవారికి ఆ సౌకర్యం ఇవ్వరా?’’
‘‘దురదృష్టవశాత్తు ఇవ్వరు. నాకూ కేంప్‌లకి వెళ్లాలని లేదు. కాని తప్పదు. నీకు భయంగా ఉంటే నీ చెల్లెల్ని రమ్మని పిలు.’’
‘‘ఉహు. దానికి నా భయం గురించి తెలియడం నాకు ఇష్టం లేదు.’’
‘‘సరే. గండర్‌సన్ ఇంటిని అదే పనిగా రహస్యంగా గమనించక. నువ్వా పనిచేయడం అతను గమనిస్తే, నిజంగా అతను దుర్మార్గుడే అయితే, అప్పుడు ఎవరికి నష్టం?’’
‘‘నిజమే హేరీ. నాకు తట్టలేదు.’’
‘‘కాని నువ్వు వాళ్లని గమనించకుండా ఉండలేవని పందెం.’’
బదులుగా లొరేన్ నవ్వింది.
సోమవారం ఉదయం షెడ్యూల్ ప్రకారం హేరీ లాస్ ఏంజెల్స్‌కి విమానంలో వెళ్లాడు. ఆరురోజుల్లో రెండుసార్లే లొరేన్‌కి హేరీ ఫోన్ చేశాడు. అతను తిరిగి వచ్చాక లొరేన్ గబగబ చెప్పింది.
‘‘హేరీ! మొన్న అర్ధరాత్రి దాటాక ఇద్దరు పోలీసులు గండర్‌సన్ ఇంటికి వచ్చారు.’’
‘‘దేనికి? ఏం జరిగింది?’’ కోటు విప్పుతూ హేరీ అడిగాడు.
‘‘నేను నిన్న పొద్దున్న గండర్‌సన్ భార్యకి ఫోన్‌చేని పోలీసులు ఎందుకు వచ్చారని అడిగితే చెప్పింది. ఇంటి బయట ఎవరో తచ్చాడుతున్నారని అతను పోలీసులకి ఫిర్యాదు చేశాడట. తచ్చాడే వాళ్లు మన కాలనీలోనా? అది అబద్ధం. నిజం ఏమిటో ఇంకా నాకు తెలీలేదు. బహుశా పోలీసులు వారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి ప్రశ్నించడానికి వచ్చి ఉంటారు.’’
హేరీ టీవీ ముందు కూర్చుని భార్య ఇచ్చిన కాఫీని తాగుతూ రిలాక్స్ అయ్యాడు.
ఎల్ ఏలో తన పని నిర్విఘ్నంగా జరిగినందుకు అతనికి సంతోషంగా ఉంది. సాక్షులు లేరు. హాలీవుడ్‌లో కెమెరామన్‌గా పనిచేన ఓ నలభై రెండేళ్ల వ్యక్తిని అర్ధరాత్రి కార్లో ఇంటికి తిరిగి వచ్చాక, కారు దిగి లోపలికి వెళ్లే లోగానే ‘నైట్ విజన్’ సెలైన్సర్ రివాల్వర్‌తో కాల్చి చంపాడు. తను రిటైరయ్యేలోగా ఇంకో మూడుసార్లు కేంప్‌కి వెళ్లాల్సి ఉంటుంది. లేదా నాలుగుసార్లు. ఆ తర్వాత రిటైర్‌మెంట్ జీవితాన్ని హాయిగా గడపచ్చు.
‘‘...హేరీ! ఏమిటి? నేను చెప్పేది వినరే?’’ లొరేన్ ప్రశ్నించింది.
‘‘సారీ. నా ఉద్యోగం గురించే ఆలోచిస్తున్నాను.’’
‘‘గండర్‌సన్ మనలాంటి సాధారణ మనిషి కాదని అర్థమైందా? అతనింటికి పోలీసులు వచ్చి వెళ్లాక ఇప్పటికైనా మీరు నమ్ముతారా?’’
‘‘అవును. నమ్ముతాను. అతను మనలా సాధారణ మనిషి కాడు’’ హేరీ ఒప్పుకున్నాడు.
(బిల్ ప్రోజినీ కథకి స్వేచ్ఛానువాదం)


