మా చావుకు ఎవరూ బాధ్యులు కారు!

మా చావుకు ఎవరూ బాధ్యులు కారు! - Sakshi


 నిప్పులు చిమ్ముకుంటూ  నింగికి నేనెగిరిపోతే,

 నిబిడాశ్చర్యంతో వీరు - నెత్తురు కక్కుకుంటూ

 నేలకు నే రాలిపోతే  నిర్దాక్షిణ్యంగా వీరే...

 మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ కవిత పూరి జగన్నాథ్‌కు చాలాసార్లు గుర్తుకొస్తోంది.‘బాచి’కి ముందు... ‘బాచి’కి తర్వాత... తన లైఫ్‌లో ఎన్ని మార్పులు వచ్చేశాయ్! సినిమా జీవితం అంటే ఇంతేనా? మనిషిని మనిషిగా కాకుండా సక్సెస్‌తోనే ఇక్కడ కొలుస్తారన్నమాట!  పవన్‌కల్యాణ్‌తో ‘బద్రి’ చేసెయ్యగానే పొలోమంటూ ఒకటే జనం. సినిమా చేయమనే నిర్మాతలు, ఒక్క చాన్స్ అని అడిగే ఆర్టిస్టులూ టెక్నీషియన్లతో ఊపిరాడనంత బిజీ. అసలే మొహమాటం. అందరినీ సంతృప్తిపరిచి పంపాలి. స్క్రిప్టు చేసుకోవడానికి కూడా ఖాళీ లేనంత బిజీ.  ఇదే మనుషులు ‘బాచి’ రిలీజ్ తర్వాత ఏమైపోయారు? అంతా నిర్మానుష్యం. ఈ ఫ్లాప్ చాలా ప్రశాంతంగానే ఉంది. కొంచెం మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా పని చేసుకోవచ్చు. అంతవరకూ ఓకే.

 

తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోగలగాలి. తనను తాను మళ్లీ మార్కెట్ చేసుకోగలగాలి. పవన్‌కల్యాణ్‌తో ‘బద్రి’ చేయడం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో, ఈసారి అంతకన్నా ఎక్కువ కష్టాలు పడాలి. ఎందుకంటే ఇప్పుడు తాను ‘జీరో’ స్టేజ్‌లో లేడు. ‘మైనస్’ స్టేజ్‌లో ఉన్నాడు. ఈ చీకటిని తొలిగించే రవితేజం కావాలి. పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడు.

      

కె.బాలచందర్ తీసిన ‘మరోచరిత్ర’... పూరీకి ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. పెద్దలు ఒప్పుకోలేదని ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం దానికి క్లైమాక్స్.  దీనికి కొనసాగింపుగా బాలచందర్ ‘డాన్స్‌మాస్టర్’ తీశారు. ఆత్మహత్య చేసుకున్న జంటలో ఒకరు బతికి, ఇంకొకరు చచ్చిపోతే ఏంటి పరిస్థితి?  ఈ పాయింటాఫ్ వ్యూలో ‘డాన్స్‌మాస్టర్’ తయారైంది. అదే కొండ చరియ మీదకు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన ఓ అమ్మాయి, అబ్బాయికి మధ్య పరిచయమేర్పడి ప్రేమలో పడితే? భలే ఆలోచన కదూ! పూరి చకచకా స్క్రిప్టు రాసేశాడు. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ పేరుతో దూరదర్శన్‌కి అప్లయ్ చేశాడు. రిజెక్ట్ అయ్యింది. అరె... ఇంత బాగున్న కథను ఎలా వెనక్కు పంపిస్తారు! ఇంకో ట్రయల్ వేద్దాం. సేమ్ స్టోరీ. కానీ టైటిల్ మారింది...‘కొండ చరియ’. మళ్లీ రిజెక్ట్ అయ్యింది.

 

దాంతో దాన్ని సూట్‌కేస్ అడుక్కి తోసేశాడు పూరి. ఇప్పుడు మళ్లీ దాని అవసరం పడింది. బురదలో ఉన్నా వజ్రం వజ్రమే. పెట్టె అడుగున ఉన్నా ఈ కథ విలువే వేరు. పవన్‌కల్యాణ్‌ను కలవడం కోసం చేసిన నానా ప్రయత్నాల్లో భాగంగా ఛోటా కె.నాయుడిని మీట్ అయ్యాడు. ముందు ఇతనికి కథ చెప్పి ఒప్పిస్తే, పవన్‌కల్యాణ్‌ని మీట్ కావచ్చు.  ఆ క్షణంలో పూరీకి ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ గుర్తొచ్చింది. ఇలాంటి ఫీల్ ఉన్న కథతో ఛోటాను చిటికెలో పడేయొచ్చు. అదే జరిగింది కూడా. ‘బద్రి’ చాన్స్ రావడానికి ఇన్‌డెరైక్ట్‌గా ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ పనికొచ్చింది.

 

ఆ కథ బావుంటుంది. కానీ ఎక్కడో లోపం ఉంది. సినిమా థియరీకి అనుగుణంగా మార్చి చూస్తే? పూరీకి అప్పుడు సిడ్ ఫీల్డ్ గుర్తుకొచ్చాడు. ప్రపంచంలోనే టాప్ మోస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ ఆయన. స్క్రీన్‌ప్లే గురించి ఆయన చెప్పిన థియరీనే చాలామందికి పెద బాలశిక్ష.

 పూరి ఆ థియరీని ఫాలో అయ్యి కథను మార్చాడు. పక్కాగా వచ్చింది. ఇప్పుడు తనకిదే బ్రహ్మాస్త్రం. దీంతో తన కెరీర్‌ని పటిష్టం చేసుకోవాలి.

       

నాగార్జున మేనల్లుడు సుమంత్... హీరోగా అప్పుడే లాంచ్ అయ్యాడు. కుర్రాడు బాగున్నాడు. ఈ కథకు అతనైతే బాగుంటుంది.

 సుమంత్‌ని కలిశాడు పూరి. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ కథ చెప్పాడు. సుమంత్‌కి నచ్చినట్టు లేదు. ఇంకో కథ చెప్పాడు. అదీ నచ్చలేదు.

 

దేవుడా... ఏంటి పరిస్థితి? డైలమాలో పడిపోయాడు పూరి.

 తరుణ్ కూడా అప్పుడు మంచి స్వింగ్‌లో ఉన్నాడు. అతనితో ఈ సినిమా చేద్దామన్నాడు నిర్మాత గవర పార్థసారథి. ఎవరికైనా ఈ కథ సెట్ అవుతుంది. అదే పూరి ధీమా. కానీ తరుణ్ దాకా బాల్ వెళ్లలేదు. వాళ్ల అమ్మగారు రోజారమణి దగ్గరే ఆగిపోయింది. ‘బద్రి’ తీసిన డెరైక్టర్‌కి ఎన్ని కష్టాలొచ్చిపడ్డాయి!

      

పెరట్లో నిధి పెట్టుకుని ఊరంతా వెదకడమంటే ఇదే. పూరి తనను తాను తిట్టుకున్నాడు. అరె... ఎంత తప్పు పని చేశాడు! రవితేజ ఉండగా ఇంకెవరితోనో ఈ సినిమా ఎందుకు ప్లాన్ చేయాలి! రవితేజ అంటే పూరికి చాలా ఇష్టం. ఎప్పుడో గుణశేఖర్ ‘లాఠీ’ సినిమా షూటింగ్‌లో మొదటిసారి చూశాడు తనని. అందులో రవితేజది చాలా చిన్న వేషం. కానీ అతని స్పీడ్ వాకింగ్ స్టయిల్, బాడీ లాంగ్వేజ్, వాయిస్, యాక్టింగ్ స్టయిల్ చూసి ఇంప్రెస్ అయిపోయాడు.

 

ఆ తర్వాత ‘నిన్నేపెళ్లాడతా’ షూటింగ్ స్పాట్‌లో కలిశాడు. ఓ సీన్‌లో నాగార్జున జుట్టు ఎగిరేలా చేయడం కోసం రవితేజ ఫ్యాన్ పట్టుకున్నాడు. ఆ సినిమాకతను అసిస్టెంట్ డెరైక్టర్. పూరి ఆ సినిమాకు ప్రోమోస్ చేస్తుండేవాడు. ‘‘అదిగో... అక్కడ ఫ్యాన్ పట్టుకున్నాడే... నేను సినిమా అంటూ చేస్తే... అందులో అతనే నా హీరో’’ అని చెప్పాడు పూరి, తన పక్కనున్న వాళ్లతో. ఎందుకు నవ్వారో గానీ, వాళ్లు నవ్వారు.

 

‘సింధూరం’ టైమ్‌కి ఇద్దరికీ ఫ్రెండ్‌షిప్ కుదిరింది. ‘‘నీతో సినిమా చేస్తా రవీ’’ అని కలిసినప్పుడల్లా చెబుతుండే వాడు పూరి. ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే అనుకునేవాడు రవితేజ.  కానీ, పూరి అందరిలాంటివాడు కాదు. మాటిస్తే అంతే. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ కోసం రవితేజను పిలిచాడు. ఎగురుకుంటూ వచ్చాడు రవితేజ. కానీ రవితో పూరి సినిమా అంటే నిర్మాతలంతా ఎగిరిపోయారు.  హీరో రెడీ. డెరైక్టర్ రెడీ. స్టోరీ రెడీ. కానీ, ప్రొడ్యూసర్లే లేరు.

     

ఇద్దరు అడ్వకేట్స్... కె.వేణుగోపాల్ రెడ్డి, సి.శేషురెడ్డి. రవితేజకు ఫ్రెండ్స్. సినిమా అంటే ఇద్దరికీ పిచ్చి ప్రేమ. వాళ్లిద్దరూ ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చారు. పాపం... చాలామంది భయపెట్టారు. అయినా మొండిగానే దిగారు.  రవితేజ పక్కన ఇద్దరు హీరోయిన్లు. ఒక హీరోయిన్‌గా ప్రత్యూష ఓకే. తెలుగమ్మాయే. మంచి ఫామ్‌లో ఉంది. రవితేజ, ప్రత్యూషలతో ఫొటో సెషన్ చేశారు. ప్రత్యూష ఓ తమిళ సినిమాలో లాక్ అయ్యింది. డేట్స్ క్లాష్ అయ్యాయి. బాధపడుతూనే వీళ్లకు బైబై చెప్పింది.

 

సరే... ఏం చేస్తారు! మోడల్ కో-ఆర్డినేటర్స్‌ను పిలిచి రకరకాల ఫొటోలు చూశారు. ఓ బెంగాలీ అమ్మాయి నచ్చేసింది పూరీకి. వెంటనే ఫోన్ చేశాడు. ‘‘మీరు హీరోయిన్‌గా చేస్తారా?’’ అని అడగ్గానే, ఆ అమ్మాయి ఒకటే ఏడుపు. ముంబయ్‌లో రెండేళ్లు అవకాశాల కోసం ట్రై చేసి చేసి, ఫలితం లేక అప్పుడే బెంగాల్ రైలు ఎక్కుతోంది. ఆ టైమ్‌లో ఈ ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయే తనూరాయ్.

 

సహారా ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్‌లో వెళ్తున్నప్పుడు ఓ ఎయిర్ హోస్టెస్ బాగా నచ్చేసింది పూరీకి. ఆమెను డెరైక్ట్‌గా అడిగేశాడు నా సినిమాలో నటిస్తావా అని. ఆమెక్కూడా యాక్టింగ్ అంటే ఆసక్తే. వెంటనే ఓకే చెప్పేసింది. ఆమె పేరు సమ్రీన్.  ‘బాచి’తో తను పరిచయం చేసిన మ్యూజిక్ డెరైక్టర్ చక్రీకే రెండో చాన్‌‌స. చిరంజీవి సినిమాలకు పనిచేసిన దత్తు కెమెరామ్యాన్. ఇలా కాస్ట్ అండ్ క్రూ అంతా సిద్ధం.

       

2001 ఫిబ్రవరి 24. ‘నేడే షూటింగ్ ప్రారంభం’ అంటూ పేపర్లలో యాడ్స్ ఇచ్చారు. ‘మా చావుకు ఎవరూ బాధ్యులు కారు. మాకు 34 కష్టాలున్నాయి’ అనే క్యాప్షన్‌కి అందరూ ఫ్లాట్ అయిపోయారు. షూటింగ్ మొదలవక ముందే సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది.

 

సాధారణంగా ముందు ఎవరూ క్లైమాక్స్ తీయరు. పూరి మొండిఘటం కదా! అందుకే మొదట క్లైమాక్స్ షూట్ చేసేశారు. బీచ్ ఒడ్డున సాంగ్ మాంటేజెస్ తీస్తున్నారు. తనూరాయ్‌కి ఒకడు సైట్ కొడుతున్న షాట్. ఆ ఆర్టిస్ట్ కంగారు పడిపోతున్నాడు. నాలుగైదు టేక్స్ తీసుకున్నాడు. ‘‘నువ్వే చేసెయ్ జగన్’’ అన్నాడు రవితేజ. దాంతో పూరీనే ఆ షాట్‌లో నటించాల్సి వచ్చింది.హైదరాబాద్, వైజాగ్... కేవలం రెండే లొకేషన్లు. విదేశాల్లేవు. వేరే అవుట్‌డోర్లు లేవు. షూటింగ్ కూడా సూపర్ స్పీడ్‌తో పూర్తి అయిపోయింది. 45 రోజులు... 45,000 నెగటివ్ ఎక్స్‌పోజర్. పూరి మార్క్ స్పీడ్, క్లారిటీ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. తనను నమ్మిన వాళ్లతో సినిమా చేస్తే ఎంతటి సుఖముంటుందో పూరీకి కూడా బాగా తెలిసొచ్చింది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ‘బాచి’ లాంటి ఫ్లాప్ ఇచ్చిన పూరి జగన్నాథ్ - ఏమాత్రం క్రేజ్ లేని రవితేజ కాంబినేషన్ అంటే ఎవరికి మాత్రం కిక్కుంటుంది? ఏం క్రేజుంటుంది?  ఫిల్మ్ చాంబర్ థియేటర్‌లో షోల మీద షోలు వేస్తున్నారు. ఏదో మొక్కుబడిగా బిజినెస్ జరిగిందంతే. అసలు అద్భుతం 2001 సెప్టెంబర్ 14న జరిగింది.

 

ఇది ‘హిట్లు శ్రావణి సుబ్రమణ్యం’ అని ప్రేక్షకులు మార్నింగ్ షోతోనే కన్‌ఫామ్ చేసేశారు. పూరి ప్రతిభ ఏపాటిదో ఇండస్ట్రీ అర్థం చేసుకుంది. టైటిల్ దగ్గర్నుంచి కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే, టేకింగ్, సాంగ్స్... ఇలా అన్ని చోట్లా పూరీ మార్క్ కనిపించింది. రవితేజపై కూడా నమ్మకం పెరిగింది. ఈ సినిమా పుణ్యమా అని చిన్నా చితకా అందరిపై ఫోకస్ పడింది. ఒక్కడి విజయం ఎంతమందికి కలిసొచ్చిందో కదా!

       

పూరి ఆఫీస్ కళకళలాడిపోతోంది. వచ్చేపోయే జనంతో సందడి సందడిగా ఉంది. పూరి ఇప్పుడు వాస్తవంలో ఉన్నాడు. విజయం కంటే పరాజయం రుచి బాగా తెలిసొచ్చింది. అందుకే తర్వాతి సినిమా కోసం మరిన్ని కసరత్తులు చేసుకుంటూ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రశంస పన్నీరు లాంటిది. దాంతో దాహం తీరదనే సంగతి పూరి జగన్నాథ్‌కు ప్రత్యేకంగా చెప్పాలా?!

 

వెరీ ఇంట్రస్టింగ్...

* బెస్ట్ స్టోరీ రైటర్‌గా పూరి జగన్నాథ్‌కు నంది అవార్డు వచ్చింది.

* హీరో అర్జున్ తమిళంలో ‘తవమ్’ పేరుతో రీమేక్ చేశారు. అరుణ్ విజయ్, అర్పిత వందన కాంబినేషన్‌లో శక్తి పరమేశ్ డెరైక్ట్ చేశారు.

- పులగం చిన్నారాయణ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top