సంఘటన
లాంగ్‌హార్న్ ఐలాండ్‌కి రెండు మైళ్ల దూరంలో నాకు ఓ గోతిలో మెలకువ వచ్చింది.
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 6
లాంగ్‌హార్న్ ఐలాండ్‌కి రెండు మైళ్ల దూరంలో నాకు ఓ గోతిలో మెలకువ వచ్చింది. నా బెల్ట్, ఆరు గుళ్ల రివాల్వర్ గోతి అడుగు భాగంలో కనిపించాయి. బాగా నిద్రమత్తుగా ఉంది. తల పగిలిపోతోంది. అప్పుడు నాకు చటుక్కున జ్ఞాపకం వచ్చింది. తక్షణం నాలో ఒణుకుతో పాటు భయం మొదలయింది.
అది నా అంకుల్ డబ్బు. దాన్ని నేను గ్రోసరీ స్టోర్ యజమాని నెడ్ గార్డెన్‌కి ఇవ్వాల్సి ఉంది.
డబ్బు సంచీ కోసం గోతిలో, చుట్టుపక్కలా వెదికాను. ఎక్కడా లేదది. చుట్టుపక్కల పొదల మాటున వెదికినా కనపడలేదు. నాకు ఆ ఇద్దరు కొత్త వ్యక్తులు గుర్తుకు వచ్చారు. నేను లకీ హార్స్ సెలూన్‌లో వాళ్లిద్దరితో కలసి గత రాత్రి తాగడం కూడా గుర్తుకు వచ్చింది. వాళ్లిద్దరూ తడబడుతూ నడిచే నన్ను చేతులు పట్టుకుని నడిపించారు. నేను వాళ్లిద్దరితో కలసి గుర్రాలమీద లాంగ్‌హార్న్ సిటీ నుంచి ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ వెళ్లడం గుర్తుకు వచ్చింది.
నేను నా రివాల్వర్‌ని, బెల్ట్‌ని తీసుకుని వాటిని ధరించి జీనులోకి ఎక్కి లాంగ్‌హార్న్ వైపు గుర్రాన్ని పోనిచ్చాను. నేను గత రాత్రి తాగిన సెలూన్‌లోకి వెళ్లేసరికి మాకు డ్రింక్‌ని సర్వ్ చేసిన బట్టతల వ్యక్తి కనిపించాడు.
‘‘నిన్న రాత్రి నేను ఇక్కడ ఇద్దరితో తాగడం నీకు గుర్తుందా?’’ అతన్ని అడిగాను.
‘‘గుర్తుంది. వాళ్లు నీనుంచి కూడా ఏదైనా దొంగతనం చేశారా?’’ అతను ప్రశ్నించాడు.
‘‘కూడా? అంటే?’’ అడిగాను.
‘‘ఈ తెల్లవారుఝామున నాలుగుకి వాళ్లు ఈ బార్ పక్కనే ఉన్న బ్యాంకులోకి చొరబడి కొంత నగదు తీసుకుని పారిపోయారు. ఎక్కడికో ఎవరికీ తెలీదు. షెరీఫ్ కొందరితో కలసి వాళ్లని వెదకడానికి వెళ్లాడు.’’
నేను నా తల పట్టుకుని గట్టిగా మూలిగాను. ఆ వెయిటర్ నాకో పెగ్‌ని వంచి ఇచ్చి చెప్పాడు.
‘‘ఉచితం. నీనుంచి వాళ్లు ఎంత దొంగిలించారు?’’
‘‘పదిహేను వందల డాలర్లు. ఆ సొమ్ము నా అంకుల్‌ది. దాన్ని నెడ్ గార్డెన్‌కి ఇవ్వాలని తెచ్చాను. కాని దారిలో నా గుర్రం పడిపోయింది. నేను పదకొండు మైళ్లు నడిచి వచ్చి సర్కిల్-టిలో ఇంకో గుర్రాన్ని కొన్నాను. దాంతో నేను ఊళ్లోకి వచ్చేసరికి దాదాపు అర్ధరాత్రి అయింది. అంత రాత్రి నెడ్‌ని నిద్రలేపడం బావుండదు. తెల్లారాక ఇవ్వచ్చు అనుకున్నాను.’’
‘‘తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి కొత్తవాళ్లతో కలసి తాగావన్నమాట.’’
‘‘అవును. అది పొరపాటే. నా అంకుల్ నన్ను నమ్మి ఆ డబ్బు ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకి జరిగింది చెప్తే అసలు నన్ను నమ్ముతాడో లేక నేనే ఆ డబ్బు కొట్టేని కథలు చెప్తున్నానని అనుకుంటాడో?’’
అతను నా వంక జాలిగా చూశాడు. నేను ఆ పెగ్ తాగాక వెళ్లి సెలూన్ మెట్లమీద తలపట్టుకుని కూర్చున్నాను. అకస్మాత్తుగా నా బుర్రలో మెరుపు మెరిసినట్టయింది. నాకు పూర్తిగా మత్తెక్కక మునుపు ఆ ఇద్దరిలో ఒకతను మరొకరితో అన్న మాటలు విన్నాను.
‘‘క్లియర్‌వ్యూకి ఇక్కడ నుంచి అరవైమైళ్ల మించి ఉండకపోవచ్చు.’’
నేను వాళ్ల చుట్టూ నా చేతులు వేయగానే వాళ్లు మాట్లాడడం మానేశారు.
నిమిషం తర్వాత నేను లాంగ్‌హార్న్ నుంచి గుర్రంమీద క్లియర్‌వ్యూ ఊరి దారి పట్టాను. ఉదయం అంతా నేను మూత్రానికి కూడా ఆగకుండా గుర్రాన్ని స్వారీ చేస్తూనే ఉన్నాను. మధ్యాహ్నానికి నా గుర్రం ఇక కదలలేని స్థితికి చేరుకుంది.
అదృష్టవశాత్తూ నాకు మా ఊరికి చెందిన మైక్ స్టఫోర్డ్ రెండు గుర్రాల బండిని తోలుతూ అక్కడ తారసపడ్డాడు. అతన్ని ఆపి జరిగింది వివరించి చెప్పాను.
‘‘దయచేని నీ గుర్రం ఒకటి ఇవ్వు. నేను బ్యాంక్ దొంగలని తరుముతున్నాను.’’
అతను తక్షణం నా గుర్రం తీసుకుని అతని బండి గుర్రాలలో ఒకదాన్ని ఇచ్చాడు. తాడు కూడా ఉంచమని ఇచ్చాడు. మళ్లీ నా ప్రయాణం కొనసాగింది.
రెండు గంటల తర్వాత గత రాత్రి నాతో తాగిన ఆ ఇద్దరు కొత్తవాళ్లు దూరంగా గుర్రాలమీద నాకు కనిపించారు. వారి గుర్రాలు అలసి పోవడంతో చాలా నెమ్మదిగా వెళ్తున్నారు. నా గుర్రపు డెక్కల చప్పుడు విని వాళ్లు తలలు తిప్పి చూశారు. నన్ను గుర్తుపట్టడంతో భయపడ్డారు. వాళ్లు నన్ను తిట్టడం నాకు వినిపించింది. వాళ్లు గుర్రాలు దిగి తమ రివాల్వర్లని బయటికి తీశారు.
టమోటా కేన్‌లని గురి చూని కాల్చినందుకు నాకు శామ్ మరెసెలో చాలా బహుమతులు లభించాయి. వాళ్లని ఏభై గజాల దూరం నించి గురి తప్పకుండా నేను కాల్చగలనని నాకు తెలుసు. నేను కూడా ఆపి గుర్రాన్ని దిగి నా రివాల్వర్‌ని తీని వారివైపు గురిపెట్టి అరిచాను.
‘‘మీరు లొంగిపోతారా? లేక నన్నే వచ్చి పట్టుకోమంటారా?’’
‘‘నువ్వు మా దగ్గరికి వస్తే మా గుళ్ళు తింటావు. జాగ్రత్త.’’ ఒకడు అరిచాడు.
హెచ్చరికగా వాడు పేల్చిన గుండు నాకు చాలా ముందు నేలలో దిగి దుమ్ము రేగింది. నేను ముందుకి కదిలి నా రివాల్వర్‌ని ఎత్తి వాళ్లకి గురిపెట్టి కాల్చాను. ఇద్దరూ భుజాలు పట్టుకుని నేలకూలారు. నేను వాళ్ల దగ్గరకి వెళ్లి మైక్ స్టఫోర్డ్ నాకు ఇచ్చిన తాడుతో వాళ్లని కట్టేశాను. వెదికితే వారి దగ్గర దొంగిలించిన డబ్బు దొరికింది.
మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల డాలర్లు. అందులో నా డబ్బుని జేబులో ఉంచుకుని, మిగిలిన బ్యాంకు సొమ్ముని నా షర్ట్ లోపలి జేబులో దాచాను. ఆ ఇద్దర్ని వారి గుర్రాలమీద కూర్చోపెట్టి వెనక్కి తిరిగాను. వారి గుర్రాలు నా గుర్రాన్ని అనుసరించాయి.
లాంగ్‌హార్న్ సిటీలోకి నేను తిరిగి అడుగుపెట్టేసరికి గత రాత్రిలా అర్థరాత్రి దాటింది. ఆ ఇద్దరు దొంగలని షెరీఫ్‌కి అప్పచెప్పాను. షెరీఫ్‌కి బ్యాంకు సొమ్ముని ఇచ్చేశాను. వాళ్లని పట్టుకున్నందుకు ప్రకటించిన బహుమతి మొత్తాన్ని అతను నాకు ఇచ్చాడు. లకీ హార్స్‌లోని అంతా నాకు డ్రింక్‌ని కొనివ్వడానికి ఉత్సాహపడ్డారు.
‘‘ఇప్పుడే కాదు. నేను మళ్లీ ఆ తప్పు చేయను. ముందు నెడ్ గార్డెన్‌ని కలసి రావాలి’’ నిరాకరించాను.
నేను వెళ్లేసరికి నెడ్ ఇంకా నిద్రపోలేదు. అతను నా మాసిన దుస్తులని, నా మొహంలోని అలసటని, నా షర్ట్‌ని అంటిన వారి రక్తాన్ని చూని ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘ఈ వేళప్పుడు వచ్చావేమిటి?’’
‘‘ఇదిగోండి. మా అంకుల్ మీకివ్వమని పంపిన సొమ్మిది.’’
నెడ్ ఆ నోట్లని చూని, మళ్లీ నా వంక ఆశ్చర్యంగా చూసాడు.
‘‘నువ్వు నిన్న రాత్రి జరిగింది గుర్తులేనంతగా తాగావా?’’ అడిగాడు.
‘‘ఏమిటి గుర్తులేనంతగా?’’ ప్రశ్నించాను.
‘‘నిన్న రాత్రి నువ్వు మరో ఇద్దరితో వచ్చి నన్ను లేపి నాకివ్వాల్సిన పదిహేను వందల డాలర్లని నా చేతుల్లో పెట్టి వెళ్లావు. నువ్వు ఎంత తాగి ఉన్నావంటే, రసీదు కోసం కూడా ఆగకుండా పాడుతూ వెళ్లిపోయావు. వాళ్లు నేనిచ్చిన టీ తాగి వెళ్ళారు’’ నెడ్ గార్డెన్ వివరించాడు.
మూలం: ఆస్కార్ షిన్‌గాల్


