అగడ్త  

funday story to in this week - Sakshi

ఈ వారం కథ

‘‘డాడ్‌! వాట్‌ ఇస్‌ దిస్‌? రమేష్‌ అంకుల్‌ కొడుకు యూరోప్‌ టూర్‌ మన కంపనీ స్పాన్సర్‌ చెయ్యడమేంటి?’’ తలుపు తోసుకొచ్చిన అనిరుధ్, చేతిలోని ఫైలును టేబుల్‌ మీద విసిరాడు. ఆ ఫైలును తీసి, అందులోని కాగితాలను ఒక్కోటీ తిరిగి పేరుస్తూ, ‘‘ఆ అబ్బాయి పేరు తెలుసా?’’ అడిగాడు పెద్దాయన. సమాధానం లేదు.  ‘‘ఏం  చదివాడో తెలుసా ?’’ – ‘‘మాస్టర్స్‌ కంప్లీట్‌ అయ్యిందట’’.  ‘‘ఎక్కడ చదివాడో తెలుసా?’’ – ‘‘ఏదో లోకల్‌ కాలేజీలో’’. ‘‘అతను చేసిన ప్రాజెక్టు ఏంటో తెలుసా?’’ ఇక తప్పదన్నట్టుగా ఫైలు తెరిచి చూసి పైకి  చదివాడు, ‘‘ఆటోమేషన్‌ ఇన్‌ ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ’’. ‘‘అంటే తెలుసా? ఈ రోజు నీ కంపనీలో నలుగురు ఉద్యోగులు చేస్తున్న పనిని మన ఖాతాదారుడు ఒక్క కంప్యూటర్తో నడిచే ఆటోమేటెడ్‌ మెషిన్‌ కొనుక్కొని తనంతట తాను తనకి కావాల్సిన విధంగా చేసుకో వచ్చన్నమాట. రేపు ఆ నలుగురికీ పని ఉండదు – ఎళ్లుండి నీ కంపనీ అవసరం ఉండదు.’’ గట్టిగా చెప్పాడు పెద్దాయన. స్థానువయ్యి వింటున్నాడు కొడుకు. ‘‘ఆ కుర్రాడు ఈ ప్రాజెక్టు ఎక్కడ చేసాడో తెలుసా నీకు?’’ 
తల అడ్డంగా ఊపాడు అనిరుధ్‌. వెంటనే తండ్రి ఒక పుస్తకం బయటకు తీసి ముందుకు విసిరాడు. గబగబా పేజీలు  తిప్పిన కొడుకు ఖంగు తిన్నాడు. ‘‘అదీ.... నాన్నా.... రోజూ ఎన్నో సంతకాలు తీసుకొంటూ ఉంటుంది... అన్నీ చూసుకోవడం కష్టం కదా!’’ 

‘‘ఆ నిర్లక్ష్యమే ఎన్నో వ్యాపార సామ్రాజ్యాల్ని ముంచింది నాన్నా. నీ చేతులతో నువ్వే కూర్చున్న కొమ్మను నరుక్కునే పని చేసావు. ఆ కళాశాల ఏఈ నాకు స్నేహితుడు కాబట్టి ఫోన్‌ చేసి మీరే ఈ రిపోర్టు కొనుక్కోండి అని సలహా ఇచ్చాడు. అప్పుడు తెలిసింది నీ నిర్వాకం. ప్రాజెక్టు వర్కుకు వచ్చే వాళ్ళకి ఏదో ఒక డిపార్టుమెంటులోని ఒక అంశం మీద అవగాహన కల్పించాలి అంతేగానీ మన వ్యాపారానికి అన్ని విషయాలూ వాళ్ళ ముందు తెరిచి పెట్టకూడదు. అప్పుడు ఇలాంటి అనర్థాలే జరుగుతాయి’’ పెద్దాయన స్వరం హెచ్చింది. ‘‘ఏ మాత్రం చూసుకోకుండా నీ కంపనీ మూతపడే ప్రమాదం కలిగి ఉన్న ప్రాజెక్టును ఇక్కడే చేసుకోనిచ్చి, దానికి నువ్వే ప్రశంసలు కురిపిస్తూ ముందుమాట రాసి మరీ సంతకం పెట్టావు’’ తల వంచుకున్నాడు అనిరు«ద్‌. ‘‘ఆ రిపోర్టు సరయిన వాడి చేతిలో పడితే ఏమవుతుందో నీకు అర్థమయిందా ఇప్పటికైనా?’’ గద్దించాడు పెద్దాయన. తల నిలువుగా ఆడించాడు కుర్రాడు. 

మెల్లగా లేచి తానింతవరకూ కూర్చున్న కుర్చీ మీద చేతులేసి నిల్చొని సావధానంగా మళ్లీ చెప్పుకుపోయాడు పెద్దాయన – ‘‘జీవితంలో పైకి రావడం ఏముందిరా, మహా అయితే కాస్త కష్టపడితే కాలం ఖర్మం కలిసొచ్చి అందలం ఎక్కేస్తాము. కానీ ఒక్కసారి ఈ స్థాయికి చేరాక, దీనిని నిలుపుకోడానికి మాత్రం నానా గడ్డీ కరవాల్సి ఉంటుంది. ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందో అని నిరంతరం చుట్టూ పరికిస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడపాల్సి ఉంటుంది. మన ప్రస్తుత స్థానాన్ని నిలుపుకోడానికి ఎందరినో అణగదొక్కాల్సి ఉంటుంది’’ చేతితో కుర్చీని గిర్రున తిప్పాడు. తన మనసులో కూడా రకరకాల ఆలోచనలు ఆ కుర్చీలాగా సుడులు తిరుగుతుండగా తండ్రిలో ఇదివరకెప్పుడూ చూడని వికృత పార్శా్వన్ని ఆసక్తిగా చూస్తున్నాడు ఆ తనయుడు. ‘‘క్యాంపస్‌ ఇంటర్వ్యూ లో అతనికి ఉద్యోగం రాకుండా ఆ కళాశాల ప్రిన్సిపల్‌ చూస్తాడు. కానీ వాడు ఆ ఫైలు పట్టుకొని బయటకు వస్తే ఎవరో ఒకరు అతనికి మార్గం చూపి అతన్ని ఒక వ్యాపారవేత్తగా మారుస్తారు. అది జరగకూడదు అంటే మనం అతని దృష్టిని  మరల్చాలి. అందుకే ఈ టూరు. ముందు వాడ్ని ఓ మూడు నెలలు బయటకు పంపు. అక్కడ ఏ లోటూ రాకుండా ప్రతీ క్షణం మందు విందు వంటి సకల సౌకర్యాలన్నీ ఏర్పాటు చెయ్యి. వాడి తెలివి తేటల్ని మనం తగ్గించలేము కానీ మన పట్ల వాడి మనసులో కృతజ్ఞతను మాత్రం పెంపొందించుకోవచ్చు. వెంటనే ఆ ఏర్పాట్లు చూడు. అటు తరవాత ఆ ప్రాజెక్టు రిపోర్టును జాగ్రత్తగా అధ్యయనం చేసి వాడు తిరిగి వచ్చేటప్పటికి వాడ్ని కట్టడి చెయ్యడానికి అవసరమైన ప్లాన్‌తో నా దగ్గరకు రా’’ సరేనని లేచాడు కొడుకు.     
               ∙∙ 
‘అమర్‌ ఆటోమొబైల్స్‌’ దక్షిణాదిలో పేరెన్నికగన్న స్పేర్‌ పార్ట్స్‌ తయారీ సంస్థ. దాన్ని స్థాపించి ముప్ఫై ఏళ్ళు నడిపించిన అమర్‌నాథ్‌ ఇప్పుడు తన ఒక్కగానొక్క కొడుకు అనిరుధ్‌ని వ్యాపారంలోకి దింపి మెళకువలన్నీ నేర్పుతున్నాడు. తనయుడి జీవితానికి సరైన పాఠం నేర్పే అవకాశం ఈ ప్రాజెక్టు రూపంలో దొరికింది ఆ తండ్రికి. తరువాత వారం రోజులకి  అనిరుధ్‌ నాన్నని కలవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ౖచైర్మన్‌ ఎప్పుడూ బిజీగా ఉండటంతో 15 రోజుల వరకూ వీలు పడలేదు. ఒకరోజు ఇంటికి వెళ్లిపోయే సమయంలో తనే స్వయంగా కాల్‌ చేసి కొడుకుని రమ్మన్నాడు. రోజంతటి పని భారం కనపడకుండా ఉత్సాహంగా వచ్చిన అనిరుధ్, తను ఆ ప్రాజెక్టు రిపోర్టు తండ్రికి ఇచ్చాడు. 

‘‘ఒకటి సార్, ఈ ప్రాజెక్టు రిపోర్టు పేపర్‌ మీద కనపడినంత తేలికగా అమలు సాధ్యమ య్యింది కాదు. ఎంతో సమయం, పెట్టుబడులతో కూడిన ఎన్నో విషయం. ఈ రిపోర్టును అధ్యయనం చేసి మీకు రెండు నిర్ధారణలు మరో మూడు తీసుకోవాల్సిన చర్యలతో కూడిన ఈ నివేదిక ఇస్తున్నాను’’ చెప్పుకుపోతున్నాడు కుర్రాడు. ఆసక్తిగా వింటున్నాడు పెద్దాయన. ‘‘రమేష్‌ అంకుల్‌ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఒక సంస్థను ప్రారంభించే అంతలేదు. కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా వాళ్ళకు తోడయ్యి వెనుకవుండి నడిపిస్తే మాత్రం మనకు ముప్పే. రెండోది ఉన్నపళంగా మనకు వచ్చే నష్టమేమీ లేదు. అంటే వెంటనే మన కంపనీకి తాళాలు వేసుకోవాల్సిన అవసరం రాదు. మనకూ వాళ్ళు మార్కెట్లోకి వచ్చి నిలదొక్కుకొనే వరకూ టైం ఉంటుంది.

ఇక నేను ప్రపోస్‌ చేస్తున్న చర్యలు : 
1. ఈ రిపోర్టును మనం కొనుక్కొని, మన సంస్థలో అమలు చెయ్యడం. తద్వారా కాలంతో పాటు నడిస్తున్నామనే ఇమేజ్‌ చేంజ్‌ ఓవర్తో కూడిన సానుకూలత మార్కెట్లో మనకు వస్తుంది. 
2. ఆ అబ్బాయిని మన కంపెనీలోకి తీసుకొని – దీని అమలు భాధ్యతను అతనికే అప్పచెప్పడం.
3. ఇక చివరిది, ఎలాగూ ఈ రిపోర్టు మన చేతిలో ఉంది కనుక కామ్‌గా మనకు నమ్మక స్తులయిన వాళ్ళ ద్వారా దీనిని అమలు పరచడం, మన ప్రస్తుత సంస్థలో కానీ మరో కంపనీ పెట్టి అయినా కానీ..’’ ముగించి పెద్దాయన వైపు చూసాడు అనిరుధ్‌. 

‘‘బాగానే ఉంది. దేశ విదేశాల్లో ఎన్నో ఏళ్ళ చదువు నీకు నేర్పలేని పాఠాన్ని ఇప్పుడు భవిష్యత్తు మీది భయం నేర్పింది’’ కుర్చీలో వెనక్కువాలి సాలోచనగా చెప్పాడు పెద్దాయన. ‘‘నేను కంపనీ పెట్టిన కొత్తలో కార్మికోద్యమం జోరుగా సాగుతూ ఉండేది. అప్పట్లో నాకో అప్లికేషను వచ్చింది. తాను స్థానిక కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్నట్టు, పక్షవాతానికి గురయిన తండ్రి సంపాదన లేక ఇబ్బందులు పడుతున్నట్లు, ఇంగ్లీషు, టైపు లోయర్‌ పాస్‌ అయిన తనకు సరైన అవకాశం కల్పిస్తే సాయంత్రం వచ్చి 3 – 4 గంటలు పని చేస్తానని అందులో చెప్పాడు. మన ఆఫీసు అప్పుడు ఆటో నగర్లో ఒక చివర ఉండేది. సాయంత్రం 5.45కి సిటీ బస్సు సెంటర్లో బయలుదేరేది. ఉద్యోగులందరూ 5.30కే ఎక్కడి పనులక్కడ వదిలి బయలుదేరి వెళ్లిపోయే వాళ్ళు. అప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఇతన్ని పిలిచి ముందుగా ఉద్యోగులు అటూ ఇటూ పారేసిన ఫైల్స్, వాటిలోని కాగితాలు ఏరించి ఎవరి టేబుల్‌ మీద వారికి సర్ది పెట్టించే వాడిని. అలా రెండో రోజు వాళ్ళకి వెదుక్కోకుండా పని సులువయ్యేది. ఇంకా అప్పట్లో వచ్చే టెలిగ్రామ్లు తీసుకొని, చదివి అందులోని విషయాన్ని రిజిస్టర్లో నమోదు చెయ్యడం వంటి చిన్న చిన్న పనులు అప్పజెప్పాను. టైపు వచ్చు కాబట్టి కొన్ని అవసరమైన లెటర్స్‌ డిక్టేటు చేస్తే డ్రాఫ్ట్‌ చేసి పెట్టేవాడు. నెలకు యాభై ఇచ్చిన గుర్తు. కానీ నాతో బాటు రాత్రి 8 – 9 గంటల వరకూ ఉండేవాడు. కొన్నాళ్ళకి అతని తండ్రి చనిపోయాడు. వాడు నాల్రోజులు పనిలోకి రాలేదు. అప్పుడు ఆఫీసులో వాడు లేని లోటు తెలిసింది. వాడి పనితనం చూసిన నేను రెండొందల రూపాయలు ఖర్చులకని వాళ్ళింటికి పంపాను. ఆనాడు నేను చేసిన సహాయానికి కృతజ్ఞతగా, వాడు చదువు పూర్తి చేసిన దగ్గరనుంచీ ఈ నాటివరకు నా దగ్గరే పని చేస్తున్నాడు. వాడే రమేష్‌! ఇక్కడి చిత్తు కాగితాల నుంచి నా వ్యాపార రహస్యాలన్నీ తెలుసు వాడికి.

అయితే ఆనాడు నేను చూపించిన దయకి కృతజ్ఞతాబద్దుడయి ఇక్కడే ఉండిపోయాడు. అందుకే వాడికి కొడుకు పుట్టాడని తెలియగానే బంగారపు గొలుసొకటి పంపాను. వాడు పది పాసయ్యాడంటే పదివేలు ఇచ్చాను. ఇంజనీరింగ్‌ చదువుతున్నాడంటే కంప్యూటర్‌ కొనిచ్చాను. మొన్న పీజీ అయ్యిందంటే ఫారిన్‌ పంపాము కదా. ఇల్లు కట్టుకుంటున్నాడంటే అప్పు ఇచ్చాను. ఇదంతా వాడిమీద అభిమానం అనుకోకు. వాడి సామర్థ్యానికి నేను ఇచ్చే విలువ’’ అయ్య చెప్పేదంతా అబ్బాయి జాగ్రత్తగా వింటున్నాడు. ‘‘ఇప్పుడు వాడి కొడుకు కూడా తయారయ్యాడు. వసంత్‌..! నువ్విందాక అన్నావు చూడూ రమేష్‌ వాళ్ళకి ఒక సంస్థను ప్రారంభించే స్థోమత లేదని. నిజమే!  కానీ ఇద్దరూ కలసి పెట్టుబడిని సముపార్జించే సామర్థ్యం ఉన్న వాళ్ళు’’ ఊహ తెలిసినప్పటి నుంచీ రమేష్‌ అంకుల్‌గా తెలిసిన వ్యక్తిని వాడు అనడం మొదలు, తండ్రి కళ్ళలో కసిని ఆసక్తిగా గమనిస్తున్నాడు అనిరుధ్‌.         ‘‘నువ్వు చెప్పిన మార్గాలలో మొదటిది – చివరిది పనికిమాలినవి. కానీ మధ్యనున్నది భేషయినది. అదే వాడి కొడుకుని మన కంపనీలోకి తీసుకొని ఈ రిపోర్టు అమలు భాద్యతను  అప్పచెప్పడం. వాడు అక్కడ ఉండగానే మాట్లాడు. కొత్త పం«థాలో సంస్థను నడిపించడానికి నీ సహకారం కావాలని అడుగు. వాడి అంతట వాడు ఈ రిపోర్టు గురించి ప్రస్తావించే వరకూ అసలు ఆ ఊసు ఎత్తకు. తను చెప్పినప్పుడు ఇందులో కొత్త  విషయాలేమీ లేవు, అవన్నీ నీకెప్పుడో తెలుస న్నట్టుగా చెప్పు. వాడి తండ్రి నెల జీతంకన్నా కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఆఫర్‌ చెయ్యి. కావాలంటే ఒక ఫోను, కారూ కూడా పడెయ్యి’’ దిశానిర్దేశం గావించాడు చైర్మన్‌. చెప్పినవన్నీ రాసుకున్న తనయుడు లేచాడు. 

యేడాది తరువాత.
‘‘వసంత్గాడిని ఈమధ్య బెంగళూరు పంపావా?’’ వైస్‌ చైర్మన్‌ ఛాంబర్‌ తలుపును వేగంగా తోసుకొని వచ్చి ఆవేశంగా అడిగాడు పెద్దాయన. లేచి నిల్చున్న కుమారుడు కంగారుగా ‘‘అవున్సార్‌! ఏదో కాన్ఫరన్స్‌ ఉంటే....’’ అని నీళ్లు నమిలాడు. ‘‘భారత వాణిజ్య మండలీ, ఇఐఐ సంయుక్తంగా ఏడాదికి ఒక్కసారి నిర్వహించే కాన్ఫరెన్సురా అది. ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. నీకు కుదరక పోతే నాకు చెప్తే నేను వెళ్ళేవాడిని కదా. అనవసరంగా వాడిని పంపి తప్పు చేశావు’’ వెంటనే ఆలోచనలో పడ్డాడు అనిరుధ్‌. ‘‘రైల్లోనో, ఎకానమీలోనో కాక బిజినెస్‌ క్లాసులో పంపావు. తిరుగు ప్రయాణంలో వాడికి అమిత్‌ మిశ్రాతో పరిచయం అయ్యింది. తెలుసు కదా ఇంతకు ముందు ఉత్తరాన ఉండేవాడు, ఇప్పుడు దక్షిణాదిన మనకు పోటీగా విస్తరిస్తున్నాడు. కాసేపటి పరిచయంలోనే వీడి సామర్థ్యం గ్రహించి వెంటనే ఉద్యోగం ఆఫర్‌ చేశాడు. రేపు వీడు వాడిని కలవడానికి ఢిల్లీ వెళ్తున్నాడు’’ అమితాశ్చర్యంతో కళ్ళు విప్పార్చి చూస్తుండిపోయాడు అనిరుధ్‌. ఇంతలో తలుపు తట్టిన చప్పుడయి ఇద్దరూ ఆ వైపు చూసారు. ‘‘మే ఐ కమిన్‌ సార్‌’’ టై సరి చేసుకుంటూ తల లోపలికి పెట్టాడు వసంత్‌. ‘‘అదేంటయ్యా, నువ్వు లోనికి రావడానికి అనుమతడగాలా? ఇంకెప్పుడూ అలా చెయ్యకు, ఎప్పుడైనా సరే తలుపు తోసుకొని రా అంతే. ఏరా అనిరుధ్‌ నువ్వు చెప్పలా?’’ అని కొడుకు వైపు చూసాడు. ఏమి చెప్పాలో తెలీక తలాడించాడు బిడ్డ. ఆ అభిమానానికి ఉబ్బితబ్బిబ్బయిన వసంత్‌ మొహమాటంగా  ‘‘అదీ..రేపు కొంచెం సెలవు కావాల్సార్‌’’ అన్నాడు. 

‘‘కొంచెం చాలా, ఏం ఎక్కడికి వెళ్ళుతున్నా?’’ చనువుగా అడిగాడు పెద్ద బాసు. ‘‘ఫ్రెండ్‌ పెళ్లుంది సార్‌’’ ‘‘మరి నీ పెళ్లెప్పుడోయ్‌?’’ ‘‘అప్పుడే కాద్సార్‌. ఇంకా సెటిల్‌ అవ్వాలి’’ ‘‘గుడ్‌. అలా ఉండాలి కుర్రాళ్ళు. రేపు ఇంపార్టెంట్‌ పనులేమీ లేకపొతే సరే. ఏరా!’’‘ఆ! అంత అర్జెంటు పనులేమీ లేవు సార్‌. ఓకే వసంత్‌ – యూ కాన్‌ గో!’’ అన్నాడు చిన్న బాసు. ఇరువురికీ ధన్యవాదములు చెప్పి వెళ్ళిపోయాడు వసంత్‌. ‘‘చూసావా ఎంత నేర్పుగా వ్యవహరిస్తున్నాడో’’ ‘‘అసలు ఇవన్నీ మీకెలా తెలిసాయి డాడ్‌... సారీ.. సార్‌!’’‘‘మనం మార్కెట్లో కొనసాగాలంటే మన పోటీదారులకన్నా వేగంగా ఆలోచించాలిరా! లేక పోతే కనీసం వాళ్ళ ఎత్తులు తెలుసుకొనే ప్రయత్న మన్నా చెయ్యాలి. అందుకే అక్కడ పని చేసేవాడి నొకడిని మన కోసం కొనేసా. వాడే ఇలాంటి విషయాలన్నీ మనకోసం మోస్తుంటాడు. వీడు రెస్యూమే పంపించాడట, ఇంటర్వ్యూకి పిలవమని అమిత్‌ హెచ్‌ఆర్‌ వాళ్ళకిచ్చాడట – అలా తెల్సింది. చూద్దాంలే ఏం జరుగుద్దో’’ అన్నాడు. 
 
తర్వాతి రోజు సాయంత్రం ఆలస్యంగా వచ్చిన కొడుకు భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో అక్కడికొచ్చిన తండ్రి అతనికి వినపడేలా ఫోనులో ‘‘ఆ చెప్పు ఏమి ఇచ్చారు – సీదా జనరల్‌ మేనేజరా లేక వైస్‌ ప్రెసిడెంటా?’’ అని అడిగి అటు నుంచొచ్చిన సమాధానానికి ‘‘వాట్‌?’’ అని ఆశ్చర్యపోయాడు. కొడుకు కూడా ఆసక్తిగా తలెత్తి చూసాడు. ఫోను పక్కన పడేసి, ‘‘అమిత్‌ వాడి గురించి తెలుసుకోమని ఒక ప్రయివేట్‌ డిటెక్టివ్ని పురమాయించాడట’’‘‘అంతే కదా, మనమూ సీనియర్‌ పొజిషన్లో తీసుకునేటప్పుడు వెరిఫై చేయిస్తాంగా’’ తేలికగా చెప్పాడు కొడుకు. పెద్దాయన శూన్యంలోకి చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు. ‘‘వీడికి బయట తిరుగుళ్ళు బాగా ఎక్కువయ్యాయి. మీ చెల్లెలు కూడా గోల చేస్తుంది, త్వరగా ఆ మూడు ముళ్ళు వేయించేస్తే నా మేనకోడలు ఖృషిత నాకు తోడుగా ఇంట్లో ఉంటది. మీ బాబూ కొడుకులిద్దరూ వ్యాపారం అని ఊళ్ళు తిరగొచ్చు’’ కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ చెప్పింది తల్లి. ‘‘పెళ్ళేగా.. చేయించేద్దాం’’ అని మళ్ళీ ఫోనందుకొన్నాడు వ్యాపారి. 

దేశ రాజధానిలోని ఖరీదైన హోటల్లో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఉత్తర దక్షిణ సాంప్రదాయాల కలబోత కొట్టొచ్చినట్టుగా అగుపిస్తోంది. పీటల మీద అనిరుధ్‌ కూర్చొని ఉన్నాడు. తండ్రి హడావుడిగా అటూ ఇటూ తిరిగేస్తూ అందరినీ పలకరిస్తున్నాడు. ఇరు రాష్ట్ర ప్రముఖులతో పాటు ఉత్తర దేశ గొప్పోళ్ళు కూడా విచ్చేస్తున్నారు. చక్కగా అలంకరించుకొచ్చిన ఖృషిత మెల్లగా వేదికనెక్కి, పెళ్ళికొడుకు వద్దకెళ్లి నవ్వుతూ మాట్లాడుతోంది. ఇది గమనించిన వరుని తల్లితండ్రులిరువురూ వెంటనే అక్కడికి చేరుకొన్నారు. మేన కోడలు పెద్ద వాళ్ళ కాళ్ళకు మొక్కింది. తనను పైకి లేపి మోటికాలిరుస్తూ, ‘‘నా ఇంటికి కోడలిగా వస్తావనుకొన్నానే. అబ్బాయి ఏడీ?’’ అని అడిగింది మేనత్త. ‘‘ఇప్పుడు మాత్రం ఏమే. వాడూ పరాయి వాడా ఏంటి, మన రమేష్‌ కొడుకే కదా. ఇద్దరూ మన కళ్ళ ముందే ఉంటారు. మన సంస్థను ముందుకు తీసుకెళ్ళతారు. ఏమ్మా?’’ తల నిమురుతూ చెప్పాడు మేనమామ. ఇంతలో పైకి వచ్చిన వసంత్‌  అనిరుద్తో చేయి కలిపి, ముందుకొచ్చాడు. ‘‘రావయ్యా... ఖృషీ మా ఇంటి కోడలు కాలేదని వాళ్ళ అత్త బాధ పడుతోంది. నేనేమో అబ్బాయి మాత్రం మనకు పరాయివాడా అంటున్నా. అసలు నువ్వు  ఉన్నావనే  ధైర్యంతోనేనయ్యా నేను ఈ విలీనానికి ఒప్పుకున్నది. నా నమ్మకాన్ని వమ్ము కానియ్యవు కదూ?’’ అన్నాడు పెద్దాయన. ‘‘ఎంత మాట అంకుల్, మీరేమీ వర్రీ కాకండి. అన్నీ నేను చూస్కుంటా’’ భరోసా ఇచ్చాడు వసంత్‌. ‘‘ఆ మాటన్నావ్‌ చాలు బాబూ. వాళ్ళ కంపెనీ పెద్దదని, వాటా ఎక్కువని మన వాడిని చిన్న చూపు చూస్తారేమో. మీ నాన్న ఎలా వెనకుండి నన్ను ఇన్నాళ్లూ నడిపించాడో ఇకపై నువ్వూ అలాగే మన చైర్మన్కి తోడుండి ముందుకు తీసుకెళ్లాలి,’’ ‘‘తప్పకుండా సార్‌. చైర్మన్‌ గారికి ఏ లోటూ రాకుండా చూస్కుంటా’’ కృతజ్ఞత నిండిన గొంతుతో కాస్త ముందుకు వంగి మరీ చెప్పాడు వసంత్‌. ఒద్దికగా చీర సర్దుకుంటూ భర్త వసంత్‌తో కలసి వేదిక దిగుతున్న అమ్మాయిని చూస్తుంటే, ఆరునెళ్ళ క్రితం నాటి రాత్రి జరిగిన సంగతి కళ్ళముందుకొచ్చింది ఆ ఇల్లాలికి. 

‘‘పెళ్ళేగా – చేయించేద్దాం’’ అని మళ్ళీ ఫోనందుకొన్నాడు వ్యాపారి. ‘‘హలో రమేష్‌ గారూ. మీతో కొంచెం మాట్లాడాలి. అరే ఇప్పుడు నేను నీ యజమానిగా ఫోన్‌ చేయలేదయ్యా, ఆడ పెళ్ళివాళ్ళ తరపున చేసాను. చెప్పండి మాట్లాడొచ్చా?.. అదీ నా చెల్లెలు నాదగ్గరకొచ్చి ‘అన్నా నా కూతురుకొక మంచి సంబంధం చూసి పెట్టమం’దయ్యా. నాకు వెంటనే మీ తనయుడు గుర్తుకొచ్చాడయ్యా. అదే నా చెల్లి ‘అన్నా నీ కొడుక్కి నా కూతుర్ని చేసుకో’ అనుంటే మా వాడితోనే ఈ పెళ్లి జరిపించేవాడిని – కానీ అది మంచి వాడిని వెదికి తన కూతురికి పెళ్లి చెయ్య మందయ్యా. మా సుపుత్రుడి సంగతి నీకూ తెల్సుగా, బొత్తిగా నిలకడలేదు వెధవకి. అందుకే నిన్ను అడుగుతున్నా, నువైతే నా మాట నిలబెడతా వని నమ్మకం. నేనేదో నిన్ను అడిగానని మొహ మాటానికి ఒప్పేసుకోకు. మీ ఇంట్లో అందరూ ఆలోచించుకోండి, నా నమ్మకాన్ని వమ్ము కానివ్వ కుండా తీపి కబురుతో తిరిగి ఫోను చెయ్యి.’’అవతలి వాళ్ళకి మాటాడే అవకాశం ఇవ్వకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పేసి ఫోను పెట్టేసాడు పెద్దాయన. ‘‘నేనన్నది మన మేనకోడలు ఖృషితతో మనవాడి పెళ్లి గురించి. మధ్యలో రమేష్‌ కొడుకెందుకొచ్చాడు?’’ కొంచెం షాక్కు గురైన అనిరుధ్‌ తల్లి మెల్లగా మాటలు కూడదీసుకుని అడిగింది. 

అర్ధాంగికి బదులు చెప్పక, కొడుకుని చూస్తూ, ‘‘ఇందాక సీనియర్‌ పొజిషన్కి బ్యాక్‌ ఎండ్‌ వెరిఫై చేయిస్తారన్నావు కదూ, కానీ ఇండస్ట్రీలో రమేష్‌ని ఎరగని వారు లేరు, అదీ కాక వసంత్‌ ఇప్పటికే మన దగ్గర పని చేస్తున్నాడు కదా, ఇంకా ఎందుకు వివరాలు కనుక్కోమని డిటెక్టీవ్‌ని పురమాయించి ఉంటాడు అని ఆలోచిస్తుంటే మీ అమ్మ అప్పుడే పెళ్లి అన్నది. వెంటనే నాకు తట్టింది, అమిత్కో కూతురుందని. ఇప్పటికే అప్పుడప్పుడు కంపెనీ వ్యవహారాల్లో తననూ నిమగ్నం చేస్తున్నాడు, ఇప్పుడు సరైన జోడీని వెదికి ఆమెకి తోడుగా తనకు అండగా తెచ్చుకోవాలని తండ్రిగా అనుకొని ఉంటాడు. వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే మనం వ్యూహాలు పన్నడమే కాదు – ఎదుటివారి బలాలు, బలహీనతలు తెలుసుకొని, వాళ్ళ ఎత్తులు కూడా ముందే ఊహించి వాటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం చాలా కాలం మనగల్గుతాం. అందుకే వెంటనే ఈ మంత్రం వేసాను. లేకపోతే రేపు ఆ వసంత్‌ గాడు నీ ముందే నీకన్నా పెద్ద సంస్థకి యజమాని అవ్వుతాడు.’’ తండ్రిలోని లోపలి మనిషిని విస్మయంతో చూస్తున్నాడు తనయుడు. ‘‘రేయ్‌ నాన్నా! తెలివితేటలు భగవంతుడు అందరికీ సమానంగానే ఇస్తాడురా – కొందరే వాటిని పూర్తిగా వినియోగించుకుంటారు. మిగతా వాళ్లందరూ చిన్న చిన్న ప్రలోభాలకి లొంగిపోయి తమ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని గుర్తెరగక మనబోటి వాళ్ళ తెలివికి దాసోహమవుతారు. వాళ్ళ కష్టాన్నే సోపానంగా చేసుకొని మనం పైకెదగాలి. పెట్టుబడి కోసం ఏమైనా తనఖా పెట్టు, పనితనం చూసి ఎవరికైనా మొక్కు – ఈ నేర్పే నీ భవిష్యత్తుకి పునాది’’ సూటిగా తన సుతుని కళ్ళలోకి చూస్తూ ఉపదేశం గావించాడు జనకుడు.

‘‘నా చెల్లిని నేను ఒప్పిస్తాను. ఆ అమ్మాయి బాధ్యత నీదే’’ అంటూ ఫోను అందుకొని, ‘హా సీఎఫ్‌ఓ గారూ, మీ పరిచయస్తులతో మనం మన సంస్థని అమ్మకానికి పెడుతున్నామని మార్కెట్లో ప్రచారం చేయించు. చైర్మన్గారి కొడుకు కొత్తగా వ్యాపారం మొదలుపెడతానికి పెట్టుబడి కోసం ఈ కంపెనీ అమ్మెయ్యాలని చూస్తున్నట్టు చెప్పు. ఇదంతా నా కొడుకు తెలివనీ – వాడికి భవిష్యత్తులో చాలా మంచి, పెద్ద ప్రణాళికలు ఉన్నాయని ఊదరగొట్టు. అలాగే అమిత్‌ మిశ్రా ఏమైనా ఆసక్తి చూపిస్తే – పనిలో పనిగా తన కూతురుని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే బావుంటదని చూచాయిగా హింట్‌ ఇవ్వు. అర్థమయ్యిందా? నేననుకొన్నది అనుకొన్నట్టు జరిగితే నిన్ను మా జాయింట్‌ కంపెనీకి సీఈఓని చేస్తాను. కానీ గుర్తుంచుకో ఇదంతా త్వరగా జరిగిపోవాలి’’ దిమ్మ తిరిగి దిక్కులు చూస్తూ ఉండిపోయారు తల్లీ కొడుకులిద్దరూ. 

రెండు సాంప్రదాయాల మేళవింపుతో పెళ్లి వైభవంగా జరిగింది. పెద్దలు ఒక్కొక్కరే వచ్చి ఆశీర్వదించి వెళ్ళుతున్నారు. ఇంతలో వేదిక మీదినుంచి అమర్‌నాథ్‌ చెయ్యెత్తి వసంత్‌ని పిలిచాడు. పరిగెత్తుకుంటూ వెళ్లిన వాడితో, ‘‘మన ఎంపీగారు. తీసికెళ్ళి భోజనం పెట్టించు. మొత్తం దగ్గరుండి చూసుకో ఆయన తిని వెళ్లే వరకూ అక్కడే ఉండు’’ అని పురమాయించాడు. తనకే ఆ పని చెప్పడం గౌరవంగా భావించి అతిథిని తోడ్కొని వేదిక దిగి ముందుకు కదిలాడు వసంత్‌. నిరంతరమైన, అగమ్యగోచరమైన, అంతులేని ఆర్థిక ఆవృతాంలోకి దిగి కొట్టుకుపోతున్న తన తరవాతి తరాన్ని ఎందుకో తెలీని నవ్వును మొహానికి పులుముకొని కోడలితో సహా చూస్తుండిపోయాడు హాళ్ళో వెనుక వరసలోనున్న రమేష్‌.   
- అనిల్‌ ప్రసాద్‌ లింగం 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top