చిరునవ్వుతో...

Funday new story special - Sakshi

కొత్త కథలోళ్లు

కాలిఫోర్నియా. ఉదయం ఎనిమిది. హాలిడే కావడంతో తీరిగ్గా మ్యాగజైన్‌ తిరగేస్తున్నాను. ఫోన్‌ రింగైయింది. అన్నయ్య నుంచి కాల్‌. ‘‘హలో అన్నయ్యా.. ఎలా వున్నావ్‌? అమ్మా నాన్న..?’’ ‘‘బావున్నార్రా. అమ్మకే కొంచెం ఆరోగ్యం బాగుండటం లేదు. నువ్విక్కడికి వస్తే బావుంటుంది’’. ‘‘ఏమైందన్నయ్యా?’’‘‘ఏం కాలేదు. కంగారు పడకు. అమ్మ కండీషన్‌ స్టేబుల్‌. కానీ కొంచెం సీరియస్‌ అంటున్నారు డాక్టర్‌. వెంటనే వచ్చేయ్‌’’కాల్‌ కట్‌ చేసి ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోయాను.నన్నలా చూసి కిచెన్‌ నుండి పరిగెత్తుకు వచ్చిన అంజలి ‘‘ఏమైందండి? ఏం జరిగింది?’’ అంది కంగారుగా. ‘‘అమ్మకు సీరియస్‌గా వుందట. వెళ్ళాలి..’’‘‘అవునా.. పిల్లలకు పరీక్షలు. ఎలా ఇప్పుడు?’’‘‘మీరంతా వద్దులే. నేనే వెళ్తా’’.అన్నీ సర్దుకొని ఎలాగోలా సాయంత్రానికి ఫ్లయిట్‌ ఎక్కాను. చాలా నెర్వస్‌గా వుంది. అమ్మ ఆరోగ్యం కొన్నాళ్లుగా బావుండటం లేదు. కిడ్నీ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు సీరియస్‌ అంటున్నారు.అమ్మకు ఏమైనా అవుతుందా? అనే బెంగ ఎక్కువైపోతోంది. ఎప్పుడు అమ్మను చూస్తానా? అనే ఆరాటం పెరిగిపోతోంది. కొంచెం ధైర్యం తెచ్చుకోవడం కోసం అమ్మ ఆల్బమ్‌ తీశా. నిండు జాబిల్లి లాంటి అమ్మను చూడగానే అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చేశాయి.                    
             
ఎంత చేసిందమ్మ..! నా ప్రతి అడుగులోనూ నీడలా వుండి నన్ను ఒడ్డున చేర్చింది. నా బాధ నాకంటే ముందు అమ్మకే తెలిసిపోతుంది. కొండంత ధైర్యాన్ని ఇచ్చి నా కష్టాల్ని తన కనుచూపుతో మాయం చేసేయగల గొప్ప హీరో అమ్మ. నేనెప్పుడూ దేవుణ్ణి ఏమీ కోరుకోలేదు. ఎందుకంటే దేవతలా నా పక్కన నిలబడిపోయిందమ్మ. కొందరు దేవుడు లేడని ఎందుకు వాదిస్తారో అర్థం కాదు. బహుశా అమ్మ కంటికి కనిపించేస్తుందనేమో..?! ఆల్బమ్‌లోని ఒకొక్క ఫొటో చూస్తుంటే ఒకొక్క జ్ఞాపకం కళ్ళముందు కదిలింది.‘‘మన పెద్దోడు ఏదోలా బతికేస్తాడండీ.. చిన్నోడి మీదే నాకు బెంగ. వీడు మరీ సున్నితం. ఎలా బతుకుతాడో పిచ్చి తండ్రి!’’ అని నాన్నతో అమ్మ ప్రతిసారీ చెప్పే మాట గుర్తొచ్చింది.నిజమే. నేను ఓవర్‌ సెన్సిటివ్‌. అప్పుడు నేను ఎయిత్‌ క్లాస్‌. తాతయ్య కాలం చేస్తే ఇంట్లో అందరూ ఏడ్చారు. అది చూసి పది రోజులు ఏం తినలేకపోయాను. జ్వరం కూడా వచ్చేసింది. అమ్మ చాలా బెంగపెట్టుకుంది. ‘‘ఇకపై వీడిని ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంచుదాం’’ అని నాన్నతో చెప్పి ఆ రోజు నుండి అలాంటి కార్యాలకు నన్ను దూరం పెట్టేసింది. అమ్మమ్మ పోయినపుడు కూడా అంతా వెళ్లారు. కానీ నన్ను మాత్రం అమ్మ ఇంట్లోనే వుంచేసింది. నేను మళ్ళీ బెంగ పెట్టుకుంటాననే భయంతో.                                                                                
అమ్మ పెద్ద చదువులు చదవలేదు. కానీ మమ్మల్ని చదవగలదు. నిజంగా అమ్మ లేకపోతే నా జీవితం మరోలా వుండేది. లైఫ్‌లోని కీలక మలుపుల్లో అమ్మ నా వెనుక గోడలా నిలబడిపోయింది.నాన్నకు నేను మెడిసిన్‌ చేయాలని కోరిక. నాకు ఇంజినీరింగ్‌ ఇష్టం. కానీ నాన్న మాట కాదనలేక మెడిసిన్‌ సీట్‌ సంపాదించి జాయిన్‌ అయిపోయాను కూడా. కానీ ఆ చదువు ఎందుకో నచ్చడం లేదు.ఎవరికీ తెలియకుండా రోజూ ఏడ్చేవాడిని. కానీ అమ్మ నుండి తప్పించుకోలేక పోయాను.’’రేయ్‌.. ఆ చదువు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే మానెయ్‌. అలా బాధపడకు.’’ ‘‘... ఏవండీ... వాడికి అది ఇష్టం లేదు. పోతే ఓ ఏడాది పోయింది. వాడికి నచ్చిందే చదవనీయండి. డాక్టర్‌ ఉద్యోగమే కడుపు నింపుతుందా? మీకు అంత ఇష్టంగా వుంటే మీరే చదువుకోండి. వాడికి ఇష్టంలేని కోరికలు కోరకండి. అంతే. ఇంకేం మాట్లాడకండి’’అని అమ్మ ఆర్డర్‌ వేయడం నాకు ఇంకా గుర్తుంది. తర్వాత ఏడాదే నాకు ఇష్టమైన ఇంజినీరింగ్‌లో జాయినయ్యా. నిజంగా అమ్మ లేకపొతే నాకు ఇష్టం లేని ఆ చదువు చదవలేక, నాన్నకు భయపడి చెప్పలేక ఏమైపోయేవాడినో..! తలచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది.

అమ్మ నన్ను ఒడ్డుకు చేర్చిన మరో సుడిగుండం నా లవ్‌స్టోరీ. ఇంజినీరింగ్‌ మూడో ఏడాదిలో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాను. తనూ ప్రేమించింది. కానీ ఏమైందో తెలీదు. సడన్‌గా వేరేవాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. కుర్రాడికి ఆర్బీఐలో ఉద్యోగమట. మంచి సంబంధం అని వాళ్ళ నాన్న వెంటనే పెళ్లి చేయించేశాడు. తనూ మరో మాట లేకుండా వెళ్ళిపోయింది. నేను డిప్రెషన్‌లోకి వెళ్ళాను. ఇంకచదువు లేదు. తిండి లేదు. పిచ్చోడిలా తిరిగాను. తాగాను కూడా. అమ్మకు తెలిసింది. వెంటనే హాస్టల్‌కి వచ్చి నన్ను వున్నఫళంగా ఇంటికి తీసుకువెళ్ళిపోయింది.నా పిచ్చి వేషాలు చూసి నాన్న బెల్ట్‌ తీశారు. కానీ కొట్టలేకపోయారు. ఎందుకంటే అక్కడ వున్నది అమ్మ. తను పక్కన వుండగా నాన్న కాదు కదా, ఆ దేవుడు కూడా మమ్మల్ని టచ్‌ చేయలేడు. ‘‘ఆ బెల్ట్‌ ఇటివ్వండి. పేద్ద హీరోలాబయలుదేరారు.. పిల్లాడ్ని కొట్టేయడానికి’’ అని గడుసుగా నాన్న ఆవేశంపై నీళ్ళు చల్లేసింది అమ్మ. అయితే నాపై కోప్పడుతుందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ’’రేయ్‌ నాన్నా, నేనో టూర్‌ప్లాన్‌ చేశా. నువ్వూరా. ఇంకేం మాట్లాడకు’’ అని నన్ను తీసుకొని దేశమంతా తిప్పేసింది.నాకు తెలియకుండానే ఆ ప్రేమ జ్ఞాపకాలు నా నుండి వెళ్ళిపోయాయి. మళ్ళీ కొత్త జీవితం. అసలు నన్ను ఆ డిప్రెషన్‌ నుండి ఎలా బయటికి తీసుకువచ్చేసిందో అర్థం కాలేదు. ఇదే విషయం ఒకసారి అడిగాను. దానికి అమ్మ ఇచ్చిన సమాధానం –‘‘నేను అమ్మని. నా ముందు నువ్వు పడే బాధ ఎంతరా! నీ మనసును సరిచేయడం నాకో లెక్కా?! పిచ్చోడా’’.

డబ్బు, హోదా, పలుకుబడి, అధికారం.. ఇవేవీ కూడా అమ్మకు పట్టవు. నాకు బాగా గుర్తు. కాలిఫోర్నియాలో జాబ్‌ వచ్చిన రోజది. నేను కలలుగన్న సంస్థలో ఉద్యోగం. పెద్ద జీతం. ఎంతోసంబరపడిపోయాను. ఎగిరి గంతేశాను. అదే హుషారులో అమ్మకు చెప్పాను. అప్పుడు అమ్మ మొదటిమాట ఇంకా గుర్తుంది. ‘‘కాలిఫోర్నియా అంటున్నావు. అక్కడ భోజనం అదీ బావుంటుందా?! వుండేచోట అన్ని సౌకర్యాలూ వుంటాయా?’’ అని గాబరా పడిపోయింది.కాలంతో పాటు ఎన్నో మార్పులు. అంజలి, పిల్లలు.. వాళ్ళ చదువులు. ఇలా జీవితం ఎంత మారిపోయినా ఒకటి మాత్రం మారలేదు. అమ్మ. ఇప్పటికీ నేను అమ్మకి పిచ్చి తండ్రినే. ఇప్పటివరకూ ‘‘నువ్వు ఏం చేస్తున్నావ్‌ ? ఎంత సంపాదిస్తున్నావ్‌? అని ఏనాడూ అడిగింది లేదు. తనది ఒకటే మాట – ‘‘బావున్నార్రా? తిన్నావా?’’.ఇలా ఆల్బం చూస్తుండగా.. ఓ నాలుగు జ్ఞాపకాలతోనే నా ప్రయాణం పూర్తయింది.
                 
ఎయిర్‌పోర్ట్‌ నుండి ఇంటికి క్యాబ్‌లో కూర్చున్నాను. గంటలో క్యాబ్‌ ఇంటిముందు ఆగింది. ఇంటి లోపల నలుగురు చుట్టాలు కనిపించారు. బహుశా అమ్మ హాస్పిటల్‌ నుండి వచ్చేసిందేమో, పరామర్శ కోసం వచ్చుంటారనుకొని ఎంతో ఆత్రుతగా లోపలకి వెళ్ళాను. నాన్న చైర్‌లో కూర్చుని వున్నారు. అన్నయ్య వదినను ఓదారుస్తున్నాడు. అమ్మ ఫొటో పక్కన దీపం వెలుగుతోంది. నా కళ్ళు తిరిగేశాయి. నన్ను చూసిన అన్నయ్య పరిగెత్తుకు వచ్చి పట్టుకున్నాడు. నాకు అర్థమైపోయింది. అమ్మ ఇక లేదని. కానీ ఎక్కడా కనిపించడం లేదు.‘‘ఎలా జరిగిందన్నయ్యా? అమ్మ ఎక్కడన్నయ్యా?’’ అని ఏడుస్తూ గట్టిగా అరిచాను. నా ఏడుపు విని నాన్న గబగబా వచ్చారు. నా భుజం మీద చేయి వేసుకొని నన్ను పెరట్లోకి తీసుకువెళ్లారు. వీపు తడుతూ..‘‘ఏరా ప్రయాణం ఎలా జరిగిందీ? కోడలు, హారిక, నిహాల్‌ ఎలా వున్నారు?’’ అని కుషలం అడిగారు.నాకు దుఃఖం, కోపం రెండూ ఒకేసారి వచ్చేశాయి.‘‘ఏంటి నాన్నా మీరు..? అమ్మ ఎక్కడో చెప్పండి...’’ అని గట్టిగా అరిచాను.నన్ను దగ్గరకి తీసుకున్న నాన్న ‘‘సారీ రా... అమ్మ వెళ్ళిపోయింది. మీ అమ్మ చాలా చిత్రమైన కోరిక కోరిందిరా.. ‘చిన్నోడు చాలా సున్నితమండి. వాడు నన్ను ప్రాణం లేకుండా చూడలేడు. చాలా డిస్టర్బ్‌ అయిపోతాడు. వాడిని ఓదార్చడం మీ వల్ల కాదు. ఇలాంటివి అంత సులువుగా జీర్ణం చేసుకోలేడు. నాకు ఏదైనా జరిగితే మీరు, పెద్దోడు చూసుకోండి. చివరిసారి వాడితో హాలీవుడ్‌ అంతా చక్కర్లు కొట్టాను. వాడి కొత్త కారులో నేను కూర్చుంటే ఎంత మురిసిపోయాడో. వాడికి నేను చివరిగా అలా చిరునవ్వుతోనే గుర్తుండిపోవాలి. నన్ను ప్రాణం లేకుండా చూస్తే మళ్ళీ మామూలు మనిషి కాలేడు. చివరి చూపు అని వాడు బాధపడితే.. నేను చెప్పానని చెప్పండి’ అని నా దగ్గర మాట తీసుకుందిరా. అందుకే నీకు ఫోన్‌ చేసి విషయం చెప్పకుండా సీరియస్‌ అని చెప్పాం. నీ మనసు నాకూ తెలుసు. అమ్మ వెళ్ళిపోయిందని తెలిస్తే నువ్వు ఇంత దూరం ప్రయాణం చేయలేవుకదరా!’’ అన్నారు నా భుజాన్ని తడుతూ సంజాయిషీ ఇస్తున్నట్టుగా.ఇంక నా మాట పడిపోయింది. వెల్లువలా పొంగుతున్న దుఃఖాన్ని అణుచుకుంటూ అమ్మ లేని ఇంట్లోకి వెళ్ళాను. అమ్మ గదిలో పెద్ద ఫొటో. ‘‘ఎంత స్వార్థమమ్మా నీది. నీ కొడుకు భయపడతాడని, బెంగ పెట్టుకుంటాడని చూసుకున్నావే కానీ, కొడుక్కి చివరిచూపు వద్దా? ఇంత స్వార్థం న్యాయమా?’’ అని నిలదీశాను. 
అమ్మ మాత్రం చిరునవ్వుతో నన్ను దీవిస్తోంది దేవతలా.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top