మనసు మాట

funday new story special - Sakshi

కొత్త కథలోళ్లు

జాగింగ్‌ చేసి అలా పార్క్‌లో బెంచ్‌పై కూర్చున్నాను. ‘‘ఏమండీ రామంగారూ జాగింగ్‌ అయిపోయిందా?’’ పలకరించాడు పక్కింటి జగన్నాథం. అవునన్నట్లు నవ్వాను. నా ధ్యాసంతా బెంచ్‌ కింద చుట్టిపడేసిన ఓ పింక్‌ పేపర్‌ మీదే ఉంది. మెల్లగా దాన్ని అందుకొని చూస్తే ముత్యాల్లాంటి అక్షరాలు. నిస్సహాయతను తెలుపుతున్నట్లున్న ఓ కవిత. ఆ కవిత రాసిన అమ్మాయి పేరు కూడా కవితే. కింద సంతకం చూస్తే అర్థమైంది.నేను వెన్నెలనై నిన్ను సేదతీర్చాలనుకుంటాను కానీ, ఆ సమయంలో నువ్వు నులువెచ్చని కిరణాలనే కోరుకుంటావ్‌..సరేనని సర్దిచెప్పుకుని.. నువ్వు కోరుకునే వెచ్చని కిరణమై నిన్ను తాకేలోపే.. సంధ్యకాలపు చల్లదనాన్ని ఆస్వాదిస్తుంటావ్‌..నాదొక ఊహ.. నీదొక స్వప్నం. నాదొక శ్వాస.. నీదొక ఊపిరి. నాదొక పరుగు.. నీదొక తీరం. నన్ను నీలో వెతికి వెతికి అలసిపోతున్నా. ప్రతీసారి ఓడిపోతున్నా. గెలవాలనిపిస్తోంది. నిదానంగా నీ హృదయపు సవ్వడి వినాలనిపిస్తోంది. వినిపించగలవా!?

‘ఎంత పెయిన్‌ ఉందీ కవితలో? తన గుండెతడి నా మనసును తాకింది. పాపం బ్రేకప్‌ అనుకుంటా. రాస్కెల్‌ మోసం చేసి పోయాడేమో. చిట్టితల్లి ఎంత బాధపడుతోందో!?’ అనుకుంటూ ఎదురుగా ఉన్న పెద్ద పార్క్‌ వైపు చూశా. వేగంగా కదులుతున్న నా చూపు.. చేతిలో పుస్తకంతో నిలబడున్న ఓ అమ్మాయి మీద పడింది. చెట్టుకు ఆనుకున్న ఓ అబ్బాయితో ఏదో గొడవ పడుతోంది. నిజానికి నా చూపు ఆగింది ఆమె చేతిలోని పుస్తకంపైనే! అందులోని పేపర్స్‌ అచ్చు నా చేతిలోని నలిగిన పేపర్‌లానే ఉన్నాయి. ‘తనే కాబోలు కవిత’ అనుకుంటూ కళ్లజోడు సర్దుకుని కాస్త వంగి చూశాను. అమాయకమైన ఆమె కళ్లు అతగాడిని గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి. వాణ్ని చూడ్డానికి ప్రయత్నించా కానీ, ఏపుగా పెరిగిన గుబురైన పొదల్లోంచి సరిగా కనిపించడం లేదు. ఆ అమ్మాయెందుకో బాగా ఏడుస్తోంది. అబ్బాయి విసుగ్గా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తను మాత్రం తన్నుకొచ్చే కన్నీళ్లను ఆపే ప్రయత్నం చేస్తో్తంది. సరిగ్గా ఐదు నిమిషాలకు ఆ అబ్బాయి తిరిగొచ్చాడు. ఈసారి కూడా సరిగా కనిపించలేదు రాస్కెల్‌. తనను ఓదార్చి సారీ చెప్పాడనుకుంటా. కోటి కాంతులను నింపుకుని కళ్లతోనే నవ్వుతోంది. ‘ఒక బంధం నిలబడాలంటే రెండు మనసులు నిస్వార్థంగా కలవాలిగానీ, ఆ క్షణం సంతోషం కోసం కాదని’ ఈ తరానికి ఎప్పుడు అర్థమవుతుందో అనుకుంటూ పైకి లేచా, చేతిలోని పింక్‌ లెటర్‌ను డస్ట్‌బిన్‌ వైపు విసిరేస్తూ. చేతికర్రనందుకుంటూ అప్రయత్నంగానే మళ్లీ కవితవైపు చూశా. కవితకు ఎదురుగా నిలబడిన ఆ కుర్రాడిని చూసి.. తిరిగి ఆ పింక్‌ లెటర్‌ అందుకుని, మడతపెట్టి జేబులో పెట్టుకుని, ముందుకు నడిచా. ఆ రాస్కెల్‌ కూడా నన్ను చూశాడు.

‘‘తాతయ్యా.. తాతయ్యా..’’ వెనకే పరుగున వచ్చాడు సమీర్‌. నేను కోపంగా నడుస్తున్నానని వాడికి అర్థమైంది. జేబులోని పింక్‌ లెటర్‌ తీసి వాడి చేతిలో పెట్టాను.అది చూడగానే.. ‘‘ఐ నో తాతయ్యా! నువ్వు నన్నూ కవితని చూడ్డం నేను చూశా’’ అన్నాడు. వాడు చెప్పేదంతా వింటూ నడుస్తున్నాను. ‘‘సారీ తాతయ్యా! నీ దగ్గర ఏ విషయం దాచనుగానీ, ఇదంత ఇంపార్టెంట్‌ అనిపించలేదు. తనో నసలే తాతయ్యా, తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టం’’ అన్నాడు చాలా సింపుల్‌గా. వీడేనా ఇలా మాట్లాడుతోంది? కోపం తన్నుకొచ్చింది. తప్పు ఈ తరానిదేనేమో! ‘ఒక బంధాన్ని ఇంత తేలిగ్గా, ఇంత అవహేళనగా చూస్తుంటే మనుషుల మధ్య బంధం ఎలా నిలబడుతుంది?’ ఆలోచనలతో పోటీపడుతూ నడిచే వయసు ఏనాడో దాటిపోయిందన్న విషయం కూడా మరిచిపోయి, నడకలో వేగం పెంచాను. మనసుపడే ఆందోళనకు గుండె వేగం తోడైంది. నేను మరిచిపోయినా నా శరీరం గుర్తు చేస్తుందిగా, అందుకే ఆయాసం ఊపేసింది. నిలబడే ఓపిక లేక కాస్త వరిగానంతే. సమీర్‌ తీసుకెళ్తున్న విషయం తెలుస్తూనే ఉంది.సమీర్‌ నా కొడుకు కొడుకు. కొడుకూకోడలు ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారు కానీ, సమీర్‌ పుట్టిన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. కోర్టు నిబంధనలు పక్కన పెడితే.. వాడు ఇద్దరికీ భారమయ్యాడు.బంధాన్ని భారమనుకునేంత స్వార్థం వాళ్ల నాన్నదైతే, భారాన్ని బంధంగా పులుముకోరాదనేంత స్వార్థం వాళ్ల అమ్మది. అదిగో ఆరోజే సమీర్‌ శాశ్వతంగా మా దగ్గరకు వచ్చేశాడు. లేదు మేమే తెచ్చేసుకున్నాం. ఎంతైనా రక్తం కదా.

‘‘ఇప్పుడెలా ఉంది తాతయ్యా!’’ సమీర్‌ నా పక్కకొచ్చి కూర్చున్నాడు. బాగానే ఉందన్నట్లు తలూపాను, తలదిండు గోడకు ఆన్చి కూర్చుంటూ. నా రూమ్‌లో అలికిడిని గమనించిన జానకి  పరుగున వచ్చి నా తలపై చెయ్యివేసి ‘‘మీరు బాగానే ఉన్నారుగా?’’ అంది పెద్ద డాక్టర్‌ అయినట్లు. నాకు నవ్వొచ్చింది. తనకేమైనా తక్కువా? షుగర్, బీపీ, మోకాళ్లనొప్పులు.. చాలానే ఉన్నాయి. కానీ నాకు చిన్న జ్వరమొచ్చినా సేవ చెయ్యడానికి ఎక్కడలేని ఓపిక తెచ్చేసుకుంటుంది.‘‘నానమ్మా! నువ్వెళ్లి రెస్ట్‌ తీస్కో.. తాతయ్య దగ్గర నేనుంటాలే’’‘‘కాసేపు ఉండి వెళ్తాలేరా! మీ తాతయ్యకి ఏమైనా కావలిస్తే..’’‘‘అరే నానమ్మా! నేను చూసుకుంటాలే. నీకసలే బాగోలేదుగా, అత్తొస్తే నన్ను తిడుతుంది. వెళ్లి పడుకో’’ అని నచ్చజెప్పి జానకిని పక్కరూమ్‌కి పంపి మళ్లీ వచ్చి కూర్చున్నాడు. చాలాసేపు మౌనం రాజ్యమేలింది. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. తన చేతిపై నా చెయ్యేశా, కాస్త ధైర్యమిద్దామని.‘‘తాతయ్యా! నాకోడౌట్‌.. ఏ రక్త సంబంధం లేకుండా ఒక మనిషి తన సంతోషాన్ని, తన ఆనందాన్ని, తన కోరికలనీ మరిచిపోయేంతలా మరో మనిషిని ప్రేమించడం ఎలా సాధ్యం?’’ అడిగాడు చాలా ఆశ్చర్యంగా. వాడి ప్రశ్న అర్థంకాలేదు కాసేపు. మళ్లీ మాట్లాడం మొదలుపెట్టాడు.. ‘‘నాకసలు ఏం అర్థం కావడం లేదు తాతయ్యా! ఇప్పటిదాకా కవితలానే నా జీవితంలోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు, అభిప్రాయాలు కలవక చాలా కొద్ది నెలల్లోనే బ్రేకప్‌ అనుకునేవాళ్లం. కానీ, కవిత నాకు పరిచయం అయ్యి మూడేళ్లు కావస్తోంది.

తను డెఫ్‌ అండ్‌ డంబ్‌ ట్రైనింగ్‌ క్లాసుల్లో పరిచయమైంది. కొద్దిరోజులకే మంచి ఫ్రెండ్స్‌ అయ్యాం. ప్రపోజ్‌ చేస్తే ఓకే అంది. తనెప్పుడూ నన్ను ఇంప్రెస్‌ చెయ్యడానికి ప్రయత్నించలేదు. నా ప్రతి అవసరం తనకు బాగా తెలుసు. నా ప్రతి ఆశను తను ప్రేమిస్తుంది. తను కూడా నానుంచి అదే కోరుకుంటుంది కానీ, నేను ఏరోజూ తన ఊహలని నిజం చేసే ప్రయత్నం చెయ్యలేదు. అదే కారణంతో మా ఇద్దరి మధ్య చాలా గొడవలు అయ్యాయి. ‘నీతో నావల్ల కాదు’ అని చాలాసార్లు తెగేసి చెప్పా. ఆ వెంటనే బాధ పడుతుందేమో, ఏడుస్తుందేమో అని దగ్గరైపోతా. మళ్లీ సేమ్‌ సీన్‌. నన్ను ఎంతగా ప్రేమిస్తుందంటే.. కోపగించి వెళ్లిపోయినా తనకోసం కచ్చితంగా తిరిగి వస్తానని తన నమ్మకం. అదే జరుగుతుంది కూడా! ‘నువ్వు వస్తావని నాకు తెలుసు’ అంటోంది చాలా సింపుల్‌గా. నా ఆలోచన లేకుండా కవిత ఒక పూట కూడా ఉండటం కష్టం తాతయ్యా! ఒక మనిషిని అంతలా ఎలా ప్రేమించాలి తాతయ్యా? నాకు బంధాల విలువ తెలీకకాదు. మన కుటుంబంలో ఎవరికైనా చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేను. బ్లడ్‌ రిలేషన్‌ ఉంది కాబట్టి అది సహజమే కానీ...’’‘‘ఏంట్రా! తాతయ్యని రెస్ట్‌ తీసుకోనివ్వకుండా బుర్ర తింటున్నావ్‌’’ అంది వాళ్లత్త. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సమీర్‌.. ‘ఏంలేదత్తా’ అంటూ పైకి లేచాడు అసహనంగా. వాడి నిరుత్సాహం నాకు అర్థమైంది. ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. కానీ నాకు తెలుసు వాడికి ఏం కావాలో..!?

సొరుగులోని ఒక తెల్లని కాగితం తీసుకుని రాయడం మొదలుపెట్టా. ‘‘రేయ్‌ చిన్నూ! నువ్వు కవితని ప్రేమిస్తున్నావ్‌. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటావ్‌. తనని మరిచిపోవడం అసాధ్యం. ఇంత కచ్చితంగా ఎందుకు చెబుతున్నానంటే.. ఒక మనిషి ఎలా ఉందో, ఎలా ఉంటుందో, అని ఆలోచించడం తల్లిప్రేమ లాంటిది. ఊపిరి ఆగేంతవరకూ ఆ ప్రేమ స్వచ్ఛంగానే ఉంటుంది.జీవితంలో మనం కొన్ని బంధాలను మార్చలేం. మార్చుకోవడానికి ఇష్టపడం. అవి అలానే ఉండాలని, అలా ఉంటేనే బాగుంటాయని నమ్మి అలానే ప్రేమిస్తాం. వాటి స్థానాలను మార్చడానికి కూడా ప్రయత్నించం. ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్లని శాశ్వతంగా కోల్పోయినా.. ఓ అందమైన జ్ఞాపకంగా మార్చుకుని గుండెల్లో నింపుకుంటాం. అలాంటి బంధానికి అసలైన ఉదాహరణ పేగుబంధం. తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పటికీ వెగటు కారు. నీ జీవితంలో ఆ స్థానంలో నేను, నానమ్మా ఉన్నాం కదా. అలానే వారివారి జీవితాల్లో ఎవరో ఒకరు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. లైఫ్‌ పార్ట్‌నర్‌నీ అలానే ప్రేమిస్తుంటారు కొందరు. మనసుకి, మనిషికి విలువిచ్చే ప్రతి మనిషికీ కలిగే భావాలివి. మీ నానమ్మ మీ నాన్నని గారాం చేసి కష్టం తెలీకుండా పెంచింది. కానీ వాడికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే మేము గుర్తొచ్చేవాళ్లం. మీ నాన్న పెంపకంలో జరిగిన తప్పులు నీ పెంపకంలో జరగకూడదనే.. కుండ చూసి అన్నం తినడం నేర్పించా. వెనక ఉన్న వాళ్లకి ఉందో లేదో చూసి తినడంలోనే బంధం ముడిపడుతుందని నేను నమ్ముతా. అదే నమ్మకాన్ని నీకు పంచా. అందుకే మా పట్ల అంత అనురాగాన్ని చూపించగలుగుతున్నావు. ఏ బంధమైనా అనుకరణతోనే బలపడుతుంది. కవితని నువ్వు ఎందుకు వదులుకోలేకపోతున్నావో తెలుసా? తను నీకు పంచింది అమ్మ ప్రేమని. ఒక తల్లి తన బిడ్డ విషయంలో ఎలా ఆలోచిస్తుందో తను నీ విషయంలో అలా ఆలోచించింది. 

పాతికేళ్ల క్రితం మీ అత్త.. ‘నేనో అనాథని ప్రేమించా. తననే పెళ్లి చేసుకుంటా’ అని మాతో వాదించినప్పుడు మీ అమ్మానాన్నల్లాంటి ప్రేమేలే అనుకున్నాం. నచ్చకపోయినా వాళ్లకి పెళ్లిచేశాం. ఏడేళ్లకి మాకో నిజం తెలిసింది. మీ అత్తకి ఎప్పటికీ పిల్లలు పుట్టరని. ఇది తెలిస్తే మీ మావయ్య మీ అత్తని వదిలేస్తాడేమోనని మేం చాలా భయపడ్డాం. మా ఇబ్బందిని గుర్తించిన మీ మావయ్య మా దగ్గరికొచ్చి.. ‘మీ అమ్మాయికి పిల్లలు పుట్టరన్న విషయం మా పెళ్లికి ముందే తెలుసు’ అన్నాడు. ఆశ్చర్యమేసింది. కాలేజ్‌లో ఉన్నప్పుడు మీ అత్తకు కడుపునొప్పి వచ్చి కళ్లు తిరిగిపడిపోయిందట. అప్పుడే తనకీ విషయం తెలిసిందని చెప్పాడు. అది తెలిస్తే మీ అత్త తట్టుకోలేదని చెప్పలేదట. పెళ్లయ్యాక లోపం తనలో ఉందని మీ అత్తను నమ్మించాడట. దాంతో మీ అత్త మమ్మల్ని మభ్యపెట్టేందుకు గుళ్లూ గోపురాలని తిరిగేది.  దురదృష్టవశాత్తు మీ అత్త స్నేహితురాలు అమెరికా నుంచి రావడం, ఆమే తనకు పరీక్షలు చెయ్యడంతో విషయం తెలిసిపోయింది.
 
‘మా అనుకి పిల్లలు పుట్టరని తెలిసీ..?’ అని మీ నాన్నమ్మ అడగబోతే.. ‘కారణాలతో బంధాలు విడిపోతే విలువేముంది? ఈ విషయం ముందే తెలిసినా, తరువాత తెలిసినా ఒక్కటే. నేను అనూని ప్రాణంగా ప్రేమించాను. రోజులు.. సంవత్సరాలు.. కాదు. జీవితం చివరిఅంకం వరకూ ఊహిస్తూ ప్రేమించా’ అన్నాడు. చిన్నవాడైనా చేతులెత్తి మొక్కాలనిపించింది. ‘అయినా పిల్లలు లేరని బాధపడ్డం దేనికి? మన సమీర్‌ ఉన్నాడుగా!’ అన్నాడు ఎంతో నిస్వార్థంగా. బంధాన్ని కలుపుకోవడమంటే అదే. ముందు కవిత నీకోసం పుట్టిందని నమ్ము. సాధారణంగా భార్యాభర్తలు ‘ఈ కష్టం నీ వల్లే వచ్చిందనో, ఈ నష్టం నీ వల్లే జరిగిందనో’ నిందించుకుంటూ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. నువ్వు కాకుండా నీ స్థానంలో వేరే వాళ్లైతే నా జీవితం ఇంకా గొప్పగా ఉండేదని అంచనా వేస్తూ, ప్రస్తుతాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అంతకు మించిన పొరబాటు మరోటుండదు. నీకు అన్ని భాషలు, భావాలు తెలుసు. ఇదంతా నిన్ను నా పక్కన కూర్చోబెట్టుకుని నా తీరులో చెప్పొచ్చు. కానీ, రాతలోని భావం మనసుకు చేరుతుంది. ఒక్కసారి చెప్పిన మాటకంటే ఒక్కసారి రాసిన రాత శాశ్వతంగా నిలుస్తుంది. అందుకే ఇది రాస్తున్నా. నీ కవిత నీకోసం రాసిన కవితలతో పాటు ఈ లేఖనూ జీవితాంతం నీ వెంటే ఉంచుకో. ఎప్పుడైనా మనసు చెదిరినప్పుడు ఒక్కసారి తీసి చదువుకో. గాడ్‌ బ్లెస్‌ యు రా చిన్నూ!’’.
∙∙ 
నెల దాటింది. హాల్లో ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి పక్కున నవ్వులు.  రూమ్‌లోంచి తొంగి చూశా. ఎవరినో చుట్టు ముట్టారంతా. దగ్గరకెళ్లి చూస్తే కవిత. ‘తాతయ్య!’ అని కవితకు పరిచయం చేశాడు సమీర్‌. కవిత పలకరించింది. నేను నవ్వా. మళ్లీ మాటల సంగ్రామం. కవిత కళ్లనే గమనించా. స్వచ్ఛంగా నవ్వుతున్నాయి. అదే మెరుపు సమీర్‌లోనూ చూశా. మనసుకి సంతృప్తిగా అనిపించింది. ఇంట్లో వాళ్లంతా ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే నవ్వుతూ చూస్తున్నా.కవిత నా దగ్గరకు వచ్చి ‘‘ఏం తాతయ్యా! మీరేం మాట్లాడరూ?’’ అని అడిగింది.‘‘తను మాట్లాడలేడు. హీ ఈజ్‌ డంబ్‌!’’ అన్నాడు సమీర్‌. నేను మరోసారి చిన్నగా నవ్వాను.
-  సంహిత నిమ్మన 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top