టోపీవాలా 

Funday crime story - Sakshi

క్రైమ్‌ స్టోరీ

రాత్రి ఎనిమిది గంటల సమయం. వర్షం కుండపోతగా పడుతోంది. కారు నెమ్మదిగా డ్రైవ్‌ చేస్తున్నాడు రమేష్‌. సిటీ నుండి దాదాపు అరవై కిలోమీటర్ల దూరం వచ్చాడు. వర్షం వెలిసే దాకా ఎక్కడైనా ఆగుదామంటే ఒక ఇల్లు కాదు గదా.. చివరికి ఒక చెట్టు సైతం కనబడ్డం లేదు. మరో పది కిలోమీటర్లు పోతే మూడవ మలుపు వస్తుంది. ఆ మలుపులో ఒక ఫాంహౌజ్‌ ఉంది. అందులో తన బాల్య మిత్రుడు పవన్‌ ఉన్నాడు. వ్యాపార నిమిత్తం పవన్‌ దగ్గర ఐదు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు రమేష్‌. పవన్‌ దగ్గర డబ్బు తీసుకొని ఐదు సంవత్సరాలయ్యింది. ఒక్క పైసా తిరిగి చెల్లించలేదు. అయినా అతను తన బాకీ తీర్చమని ఏనాడూ అడుగలేదు పవన్‌.  రమేష్‌కే నామోషీగా ఉంది. స్నేహాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు తిరిగి ఇవ్వడంలో అనివార్య జాప్యం. తనను మానసికంగా కృంగదీస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు సమకూర్చుకోలేకపోయాడు. కానీ అక్కడ పవన్‌కు వ్యాపారంలో నష్టాలొచ్చి కష్టాల్లో ఉన్నాడు. ఈ సమయంలో అప్పు తీర్చకపోతే అది పవన్‌కు ద్రోహం చేసినట్టే అవుతుంది.పూర్వీకుల ఇల్లు అమ్మక తప్పలేదు రమేష్‌కు. పాతిక లక్షలు వచ్చాయి. 

ఆ మరునాడు బ్యాంక్‌ నుండి ఐదు లక్షలు డ్రా చేశాడు. డబ్బు బ్రీఫ్‌ కేసులో సర్దుకొని  మరో స్నేహితుణ్ణి కారు అడిగి తీసుకొని బయలుదేరాడు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. కారు వేగం పెంచాడు రమేష్‌.ఇంతలో మూడవ మూలమలుపు మరో మూడు కిలోమీటర్లు ఉందనగా బైక్‌ మీద ఇద్దరు యువకులు కారుకు అడ్డుగా వచ్చారు. హారన్‌ కొట్టినా తప్పుకోలేదు. కారుకు ముందు బైకు ఆగడంతో సడెన్‌ బ్రేకు వేశాడు. అనుకోని పరిణామానికి వణికిపోయాడు రమేష్‌.ఇంతలో బైకు వెనక కూర్చున్న వాడు దిగి వేగంగా కారువైపు రాసాగాడు. వాని చేతిలో చిన్న గొడ్డలి. లిప్తకాలంలో కారు అద్దాన్ని పగుల కొట్టి బ్రీఫ్‌ కేసు ఇవ్వకుంటే అనవసరంగా చస్తావని బెదిరించాడు. కారు రివర్స్‌ తీసే ప్రయత్నంలో రమేష్‌ తలపై గొడ్డలి వేటు పడనే పడింది.తల రక్తసిక్తమయ్యింది. రమేష్‌ కళ్ళు మసక బారసాగాయి. బైకు ఆన్‌లోనే ఉంచి డ్రైవింగ్‌ చేసే వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తున్నవాడల్లా ఎవరో తమ వైపు రావడం గమనించి త్వరగా రమ్మంటూ అరిచాడు. రమేష్‌ సూచాయగా గమనించసాగాడు. తన వద్ద నుండి బ్రీఫ్‌ కేసు లాక్కున్న వాణ్ణి ఒక టోపీవాలా అడ్డుకున్నాడు. అతన్ని చూడగానే వారిద్దరు గజగజా వణకసాగారు. అతని టోపీ మాత్రమే కనబడుతోంది. టోపీ కింద వెయ్యి వాల్టుల వెలుతురు తప్ప తల ఉన్నట్లు గోచరించడం లేదు. పాదాలు కనబడుతున్నాయి. కాళ్ళు లేవు. అది చూసి రమేష్‌ పూర్తిగా స్పృహ కోల్పోయాడు. 

టోపీవాలా తెల్లని గ్లౌస్‌ తొడుక్కున్న చెయ్యి చాపాడు. అరచెయ్యి మాత్రమే కనబడుతోంది. మిగతా చెయ్యి భాగం కనబడకపోయే సరికి దెయ్యమనుకొని బ్రీఫ్‌ కేసునందించి వెనక్కి తిరిగి చూడకుండా బైకు మీద వాయువేగంతో పారిపోయారు యువకులు.టోపీవాలా కుదుపుతో రమేష్‌కు కొద్దిగా స్పృహ వచ్చింది. బ్రీఫ్‌కేసు అందించాడు  టోపీవాలా. ‘‘మీరెవరో దేవుడులాగా వచ్చారు. ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేను’’ అంటూ బ్రీఫ్‌కేసు తీసుకున్నాడు. రెండు చేతులెత్తి నమస్కరించాడు.  కారును స్టార్ట్‌ చేయబోయాడు. స్టార్ట్‌ కాలేదు. తలపై గాయంతో రక్తస్రావం కాసాగింది.  నిస్సత్తువ దేహాన్ని పూర్తిగా ఆవహించసాగింది. తిరిగి స్పృహ తప్పేలా అనిపించేసరికి తాను చెయ్యబోయే కార్యభారాన్ని నిజాయితీపరుడైన టోపీవాలాకు అప్పగించాలనుకున్నాడు.‘‘సార్‌! నా పేరు రమేష్‌. మీకు పుణ్యముంటుంది.ఇక్కడి నుండి మరికొద్ది దూరంలో మూడవ మలుపు వద్ద ఒక ఫాంహౌజ్‌ వుంది. అందులో నా మిత్రుడు పవన్‌ ఉన్నాడు. అతనికి ఈ బ్రీఫ్‌కేసు అందజేయండి’’ అంటూండగానే తల నెమ్మదిగా వాలిపోయింది.

ఐసీయూలో ఉన్న రమేష్‌ అప్పుడే కోలుకుంటున్నాడు. రమేష్‌ గురించి తెలుసుకున్న పవన్‌ పరిగెత్తుకుంటూ హాస్పిటల్‌కి వచ్చి అతను కోలుకుంటే వెళ్లి పలకరిద్దామని చూస్తున్నాడు. రమేష్‌ మెలమెల్లగా కోలుకుంటున్నాడు. రమేష్‌ను చూడగానే పవన్‌ కళ్ళు చెమర్చాయి. ‘‘డబ్బు ఆ టోపీవాలా తెచ్చిచ్చాడా... పవన్‌’’ అంటూ రమేష్‌ నిస్సత్తువగా అడిగాడు.‘‘డబ్బు గురించి బెంగ పెట్టుకోకు. ఇచ్చాడులే ఆ టోపీవాలా!’’ అన్నాడు పవన్‌. ‘‘అసలేం జరిగింది రమేష్‌.. కాస్త గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నించు’’ అంటూ  రవికుమార్‌  ప్రోత్సహించాడు.రమేష్‌ లిప్తకాలం కళ్ళు మూసుకొని తెరిచాడు.‘‘నా కారుకు ఇద్దరు యువకులు అడ్డు వచ్చి కారు అద్దం పగుల కొట్టారు. నా తల పైన గొడ్డలితో కొట్టి నా బ్రీఫ్‌ కేసును లాక్కున్నారు. అంతలో ఒక టోపీవాలా వచ్చాడు. టోపీ కింద వెలుగు తప్ప అతని ముఖం కనపడలేదు. అతను వారినుండి బ్రీఫ్‌కేసు తీసుకొని నాకిచ్చాడు. వెళ్దామని ప్రయత్నిస్తే కారు స్టార్ట్‌ కాలేదు. నాకు స్పృహ తప్పేలా అనిపించి బ్రీఫ్‌కేసును నా మిత్రుడు పవన్‌కిమ్మంటూ వివరాలిచ్చి వేడుకున్నాను. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. నాకు స్పృహ వచ్చేసరికి ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాను’’ అంటూ జరిగింది చెప్పాడు రమేష్‌.రమేష్‌ను హాస్పిటల్‌లో చేర్చిన ఎస్సై రవికుమార్‌ అతను చెప్పిందంతా వాస్తవమని నిర్ధారించుకున్నాడు. ఆ ప్రాంతంలో చిన్న గొడ్డలి దొరకడంతో మరింత విశ్వసించాడు. ‘‘ఇది కచ్చితంగా దెయ్యం పనే అయి ఉంటుంది సార్‌! లేకపోతే డబ్బును దొంగల బారి నుండి కాపాడి పవన్‌ గారికి అందజేయడం, మనకు ఫోన్‌ చెయ్యడం, అంబులెన్స్‌కు ఫోన్‌ చెయ్యడం, ఇదంతా దెయ్యం పనే’’ అన్నాడు ఏడుకొండలు.

‘‘దెయ్యాలు ఫోన్లు కూడా చేస్తాయా’’ అంటూ ప్రశ్నించాడు రవి. దెబ్బకు ఏడుకొండలు నోరు మూతపడింది. బుర్ర గోక్కుంటూ, ‘‘అదుగో దెయ్యం! ఇటువైపే వస్తోంది’’ అంటూ రవికుమార్‌ వెనకాలే దాక్కోబోయాడు. రవికుమార్‌  బెదిరించి ఆపాడు. ఆ టోపీవాలా కాస్త దగ్గరికి రాగానే అందరూ మ్రాన్పడిపోయారు.   ముఖమ్మీది మాస్క్‌ తొలగించి చిరునవ్వు నవ్వసాగాడు టోపీవాలా. అతన్ని చూడగానే ‘‘నువ్వా..!’’ అంటూ అమితానందంతో షేక్‌ హ్యాండిచ్చాడు  రవి.‘‘ఇతను నా స్నేహితుడు సూర్యం’’ అంటూ అందరికీ పరిచయం చేశాడు. మా డిపార్ట్‌మెంట్‌లోని భాగమైన నేర పరిశోధనలో ఈ మధ్యే చేరాడు. రాత్రుళ్ళు మాకు సహాయంగా తనూ పెట్రోలింగ్‌ చేస్తూ ఉంటాడు. కొత్త కొత్త ప్రయోగాలు ప్రయోగిస్తూ ఉంటాడు. మరి ఈ ప్రయోగం?’’ నవ్వుతూ అడిగాడు రవి.‘‘రాత్రి  జరిగిన సంఘటనకు ముఖ్యమైనవి ఈ నల్లని మాస్కులు. వీటిలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ ఉంది. వీటిని తలకు, మోకాళ్ళకు, మోచేతులకు తొడుక్కొని స్విచెస్‌ ఆన్‌ చేస్తాను. మాస్కుల్లో అంతర్గతంగా ఉన్న అతి సూక్ష్మ బల్బులన్నీ వెలుగుతాయి. దాంతో ఎదుటి వ్యక్తికి మన తల కనబడదు. అలాగే మోచేతులూ, మోకాళ్ళూ కనబడవు. ఇవి రాత్రి వేళల్లోనే బాగా పనిచేస్తాయి. పగలు సైతం పనిచేసే విధానం కోసం ఇంకా పరిశోధనలు చేస్తున్నాను’’ అంటూ గూగుల్‌ నుండి తాను స్ఫూర్తి పొందిన కొన్ని అంశాలను వివరించాడు. ఒకసారి ముఖానికి మాస్క్‌ తగిలించుకొని హాల్లో లైట్లన్నీ ఆర్పేసి చూపించాడు సూర్యం. అంతా ఆశ్చర్య పోయారు.‘‘అయినా మానవత్వాన్ని మట్టిలో కలుపుతున్న మనుషులకన్నా దయాగుణం కలిగిన దెయ్యాలే మిన్న’’ అంటూ ఏడుకొండలు అనేసరికి వాతావరణమంతా నవ్వులమయమయ్యింది.
- యు. విజయ శేఖరరెడ్డి 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top