అక్షర నిక్షేపాలు

అక్షర నిక్షేపాలు - Sakshi


వివరం

 

నది ప్రకృతి ఇచ్చిన ప్రసాదం. మానవాళి తనకు తాను బహూకరించుకున్న కానుక గ్రంథాలయం. ఒకటి జీవధార. రెండోది జ్ఞానధార. నదిని సృష్టించుకుని ప్రకృతీ, ప్రకృతిని కాపాడుకుంటూ నదీ మనుగడ సాగిస్తున్నాయి. గ్రంథాలయం కూడా అంతే. వాటితో మనిషి బంధమూ అలాంటిదే. నిన్న ఎలాంటిదో అధ్యయనం చేయడానికీ, రేపు ఎలా ఉండాలో స్వప్నించడానికీ గ్రంథాలయాలను ప్రతిష్టించుకుంది మానవాళి. ఉప నదులన్నీ కలసి మహోత్తుంగ తరంగమైనట్టు మన పూర్వులు వేసిన సాధించిన జ్ఞానాన్ని కాపాడుకుంటూ, ఆ సంపదను పెంచుకుంటూ  కొత్తతరం చైతన్యవంతమవుతూ ఉంటుంది. ఆ రెండు ధారలు లేని ప్రపంచాన్ని ఊహించడానికి కూడా సాహసించవద్దు. భూమీ, బుద్ధీ ఎండి ఎడారులవుతాయి. ఈ వైనంపై గ్రంథాలయ వారోత్సవం (నవంబర్ 14-20) సందర్భంగా... ప్రత్యేక కథనం.

(ముఖచిత్రం: జె. వాకర్స్ ప్రైవేట్ లైబ్రరీ, అమెరికా)

 

నాటి నలందా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని మూడు గ్రంథాలయ భవనాలలో ఒకటైన ‘రత్నసాగర’ను క్రీస్తుశకం 1197-1203 మధ్యలో భక్త్యారుద్దీన్ ఖిల్జీ దగ్ధం చేస్తే కొన్ని రోజుల పాటు పొగలు ఎగజిమ్మాయట. ఆ ఘటనతో పొగచూరిన చరిత్ర వాక్యాలు ఇప్పటికీ అలాగే ఉండిపోయాయి. జ్ఞాన ద్వేషులను చరిత్ర ఆ రీతిలోనే గుర్తుంచుకుంటుంది. తొమ్మిది అంతస్తుల ఆ జ్ఞాన భాండారం ఎలా బూడిదైపోయిందో పర్షియా యాత్రికుడు మిన్హాజ్-ఇ-సిరాజ్ తన తబాకత్- ఇ-నసీరిలో వర్ణించాడు. ఘటన జరిగిన మూడేళ్ల తరువాత ఇక్కడికి వచ్చిన ఆ విదేశీ యాత్రికుడు మన రాజవంశాల వివరాలకీ, సంస్కృతికీ, జీవన విధానానికీ రచనలో ఎంత విలువ ఇచ్చాడో, భస్మరాశిగా మిగిలిన జ్ఞానం గురించి నమోదు చేయడానికి కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చాడు. అదీ గ్రంథాలయాన్ని గతం గౌరవించిన తీరు. ప్రపంచ ప్రఖ్యాత అలెగ్జాండ్రియా గ్రంథాలయం జూలియస్ సీజర్ ‘తప్పిదం’ వల్ల బూడిదకుప్పగా మిగిలిపోయింది. ఈజిప్ట్ మీద దండయాత్రకు వెళ్లినపుడు తన నౌకాదళం మీద దాడి చేస్తున్న శత్రువులను చెదరగొట్టేందుకు సీజర్ చేసిన ప్రయత్నంలో మొదట నౌకాకేంద్రం దగ్ధమై, ఆ మంటలలోనే అలెగ్జాండ్రియా గ్రంథాలయం కూడా తగులబడిందని ప్లుటార్క్ అనే చరిత్రకారుడు రాస్తాడు. ప్లేటో, ఆరిస్టాటిల్ వంటివారి కొన్ని రచనలు సహా విలువైన ఏడు లక్షల  పత్రాలు అప్పుడు దగ్ధమైనాయి. ఇది క్రీ.పూ. 48లో జరిగిందని చెబుతారు. ఇక రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో, కమ్యూనిస్టు పాలనలలో, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో, అంతర్యుద్ధాలలో కాలిపోయిన గ్రంథాలయాలు ఎన్నో ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభంలో జరిగిన బెల్జియం లోవెన్ విశ్వవిద్యాలయం గ్రంథాలయ దగ్ధం ఉదంతం, జర్మనీలో నాజీలు తగలబెట్టిన పుస్తకాల గుట్టలు చరిత్ర మరచిపోయేవి కాదు. సాహిత్య నోబెల్ గ్రహీత, మహాకవి పాబ్లో నెరూడా దేశదేశాలు తిరిగి సేకరించిన  అపురూపమైన పుస్తకాలను చిలీ ప్రభుత్వం నడి రోడ్డు మీద కుప్ప పోసి, సైన్యం చేత తగులబెట్టించిన తీరు కన్నీరు పెట్టిస్తుంది. ఇలా వ్యక్తుల సొంత గ్రంథాలయాలను సైతం ధ్వంసం చేసిన ఘటనలు అసంఖ్యాకంగా కనిపిస్తాయి. శ్రీలంకలోని జాఫ్నా పబ్లిక్ లైబ్రరీ విధ్వంసం ఒక విషాదం. 97,000 పుస్తకాలు ఉన్న ఈ గ్రంథాలయాన్ని 1933లో స్థాపించారు. దక్షిణాసియాలో రెండో అతిపెద్దదిగా విలసిల్లిన ఈ గ్రంథాలయాన్ని కొందరు సింహళీయులు మే 31 రాత్రి నుంచి జూన్ 1వ తేదీ వరకు దగ్ధం చేశారు. దీనికి మించిన విషాదం సరాయేవోలోని నేషనల్ అండ్ యూనివర్సిటీ లైబ్రరీ ఆఫ్ బోస్నియా హెర్జిగోవినా దహనం. 1945లో స్థాపించిన ఈ మహా గ్రంథాలయం  సెర్బు జాతీయవాదులు ప్రయోగించిన షెల్ వల్ల ఆగస్టు 25, 1992న దగ్ధమైంది. అరుదైన ఏడు వందల వ్రాతప్రతులు, 1,55,000 పుస్తకాలు సహా మొత్తం పదిహేను లక్షల రచనలు పర శురామప్రీతి అయిపోయాయి.

 

కాలగమనంలో పుస్తకాల మీద ద్వేషం ఒక వాస్తవం. అందుకే పుస్తకాల విధ్వంసాన్ని తెలియచేసే బిబ్లియోక్లాజ్మ్, లైబ్రిసైడ్ వంటి మాటలు వాడుకలోకి వచ్చాయి. కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా పుస్తకం అజరామరమని నిరూపించే చరిత్రాత్మక ఘట్టాలు తరువాత కోకొల్లలుగా జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. ఒకవైపు పుస్తక విధ్వంసం, జ్ఞానం మీద ద్వేషం పెరిగిపోతున్నా ప్రపంచం నలుమూలలా ఎన్నో కొత్త కొత్త, గొప్ప గొప్ప గ్రంథాలయాలు ఆవిర్భవించాయి. కొన్ని దేశాల వారు ధ్వంసమైన తమ గ్రంథాలయాలకు మళ్లీ కళ తెచ్చారు. ప్రపంచంలో ఎన్ని మార్పులు వస్తున్నా కూడా ఇంకొన్ని దేశాలు అత్యంత ఆధునిక పద్ధతులతో జ్ఞాన భాండాగారాలను తీర్చిదిద్దుతున్నాయి. పురాతన గ్రంథాలయాలను కాపాడుకుంటున్న దేశాలు మరికొన్ని. జాఫ్నా గ్రంథాలయాన్ని 1983లోనే పునరుద్ధరించారు. బోస్నియా గ్రంథాలయాన్ని మే 9, 2014న మళ్లీ పాఠకుల కోసం తెరిచారు. ఇదీ స్ఫూర్తి.

 

వైభవం



గ్రంథాలయాలకు కూడా స్వర్ణయుగం ఉంది. పదిహేడు, పద్దెనిమిది శతాబ్దాలను గ్రంథాలయాల స్వర్ణయుగంగా చెబుతారు. ఆ కాలంలో, లేదా కొంచెం అటు ఇటుగా ప్రారంభమైన గ్రంథాలయాలే ఇప్పటికీ ప్రపంచం నలుమూల లా వెలుగొందుతున్నాయి. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా సంస్థలను గుర్తించినట్టే గ్రంథాలయాలను కూడా గుర్తించారు. అందులో మొదటిస్థానం వాషింగ్టన్‌లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌కు దక్కింది. 1800 సంవత్సరంలో జాన్ ఆడమ్స్ దీనిని స్థాపించాడు. ఇప్పటికి ప్రపంచంలో మొదటి స్థానం దక్కించుకుంది. ఇందులోని జ్ఞాన సంపద వివరాలు చూస్తే ఎవరైనా నోరెళ్లబెడతారు. ఇందులోని పుస్తకాల సంఖ్యే మూడు కోట్ల 20 లక్షలు. ఆరు కోట్లకు పైగా వ్రాతప్రతులు ఉన్నాయి. ఇంకా అపురూపం- గడచిన మూడు శతాబ్దాల నాటి పది లక్షల వార్తాపత్రికలు ఇందులో భద్రంగా ఉన్నాయి. ఇంకా మ్యాప్‌లు, ఫోటోలు ... అన్నీ లక్షల సంఖ్యలోనే. రెండో స్థానం బోడ్లెయాన్ లైబ్రరీకి దక్కింది. ఇది ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వారిది. ఇందులో 11 మిలియన్ రచనలు ఉన్నాయి. కానీ అత్యధికంగా చారిత్రక ప్రాధాన్యం ఉన్నవే. మాగ్నాకార్టా, గూటెన్‌బర్గ్ బైబిల్, షేక్‌స్పియర్ నాటకాల తొలి సంకలనం(1623) ఇక్కడ కనిపిస్తాయి. రీడింగ్ రూంగా పిలిచే బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీ మూడో స్థానంలో ఉంది. కారల్ మార్క్స్, ఆస్కార్‌వైల్డ్, గాంధీజీ, మార్క్‌టై్వన్, వీఐ లెనిన్ వంటి చరిత్రను మలుపు తిప్పిన వారు ఎందరికో జ్ఞానభిక్ష పెట్టిన సంస్థ ఇది.

 

న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ



5 కోట్ల మూడు లక్షల రచనలు ఉన్న ఒక గ్రంథాలయం రూపుదిద్దుకోవాలంటే ఎంతకాలం పడుతుంది? చేసిన ప్రయత్నం, కృషి మాత్రమే ఇందుకు సమాధానం చెప్పగలవు. న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ ఇందుకు సాక్ష్యం. 1895లో దీనిని స్థాపించారు. ఇది అమెరికాలో రెండవ అతి పెద్ద గ్రంథాలయం. ప్రపంచంలో తొమ్మిదో అతిపెద్ద గ్రంథాలయం. 87 శాఖలు ఉన్న ఈ గ్రంథాలయంలో మూడువేలకు పైగా సిబ్బంది ఉన్నారు. ఏల్ యూనివర్సిటీ లైబ్రరీ, వాటికన్ లైబ్రరీ (వాటికన్ సిటీ),  సెయింట్ మార్క్ నేషనల్ లైబ్రరీ (వెనీస్, ఇటలీ),  బోస్టన్ పబ్లిక్ లైబ్రరీ, లైబ్రరీ ఆఫ్ పార్లమెంట్ (కెనడా), ట్రినిటీ కాలేజ్ లైబ్రరీ (ఇంగ్లండ్), విక్టోరియా లైబ్రరీ (ఆస్ట్రేలియా), జార్జి పీబాడీ లైబ్రరీ(బాల్టిమోర్, మేరీల్యాండ్), నేషనల్ లైబ్రరీ (మిన్‌స్క్, బేలారస్) మిగతా స్థానాల్లో ఉన్నాయి. ప్రాచీనత, భవన నిర్మాణం, పుస్తక సంపదలను బట్టి 35 గ్రంథాలయాలను పరిగణనలోకి తీసుకుని వాటికి శ్రేణులు కల్పించారు. నిజానికి వేర్వేరు సంస్థలు ఉత్తమ గ్రంథాలయాలు అంటూ ఒక్కొక్క జాబితాను విడుదల చేయడం కనిపిస్తుంది.  బిబ్లియోటెకా మార్సియానా గ్రంథాలయం (ఇటలీ), చాప్టర్ ఆఫ్ నొయోన్ కెథడ్రల్ లైబ్రరీ (ఫ్రాన్స్), అట్రెక్ట్ యూనివర్సిటీ లైబ్రరీ (నెదర్లాండ్స్), ఎడ్మాంట్ లైబ్రరీ (ఆస్ట్రియా), మాఫ్రా (పోర్చుగల్), ద ట్రిపిటికా కొరియానా, హీన్సా టెంపుల్ గ్రంథాలయాలు (దక్షిణ కొరియా), నకానోషిమా లైబ్రరీ (జపాన్), నేషనల్ లైబ్రరీ (చైనా), నేషనల్ లైబ్రరీ (భూటాన్) ఆ జాబితాలలో తరుచు కనిపిస్తుంటాయి. ఇక ప్రపంచ స్థాయి లైబ్రరీలలో ఎక్కువగా అమెరికాకు చెందినవే. టీవీ, ఇంటర్నెట్, సమయం చాలని మనుషుల  వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చూసుకుంటే ఆ దేశం  బహుశా లైబ్రరీలలో అగ్రస్థానంలో నిలుస్తుంది. కాబట్టి చాలా దేశాలలో పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిపోవడానికి కారణం టీవీలు ఇంటర్‌నెట్‌లు మాత్రమే కాదు. వారసత్వంగా వస్తున్న అభిరుచిని కాపాడుకునే శక్తి లేకపోవడమే. కొత్త తరంలో పాఠకులను తయారు చేయాలన్న నిర్మాణాత్మకమైన ఆలోచన లోపించడమే.

 

మనం ఎక్కడ?



‘మాంద్యం రాజ్యమేలుతున్నదని గ్రంథాలయాలను మూసుకోవడమంటే, ప్లేగు వచ్చినపుడు ఆస్పత్రుల సంఖ్యను తగ్గించడం లాంటిదే’నంటారు కెనడాకు చెందిన గ్రంథాలయోద్యమ కార్యకర్త ఎలియనార్ క్రంబెల్‌హ్యూమ్. విశిష్టమైన గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకున్న దేశాలతో పోల్చి చూసినపుడు భారత్ మీద గడచిన వేయేళ్లలో అనేక రెట్లు ఒత్తిళ్లు పనిచేశాయి. వాటిలో ప్రధానమైనది పేదరికం. ఇక్కడ గ్రంథాలయ వ్యవస్థ పటిష్ట కాకపోవడానికి అదొక కారణ ం మాత్రమే. కానీ చిత్తశుద్ధి లేకపోవడం మొదటి కారణం. పైన ఉదాహరించిన గ్రంథాలయాలలో భారత్‌కు చెందినదేదీ లేకపోవడం కొంచెం బాధ కలిగించే మాట నిజం. కానీ మనకు ఒకప్పుడు గ్రంథాలయాలను పోషించిన ఘనత ఉంది.

 


మహారాజా సెర్ఫోజీ సరస్వతీ మహల్ (తంజావూరు) ఆసియాలోని పురాతన గ్రంథాలయాల లో ఒకటి. ఇందులో 60,000 వాల్యూములు ఉన్నాయి. తంజావూరు నాయకరాజుల (1535-1675) కాలంలోనూ, తరువాత తంజావూరును ఆక్రమించుకున్న మరాఠాల (1675-1855) హయాంలోనూ ఈ గొప్ప గ్రంథాలయం విస్తరించింది. సరస్వతీ భాండార్ పేరుతో ఉన్న ఈ గ్రంథాలయాన్ని మరాఠాలు అధికారంలోకి వచ్చిన తరువాత రెండో సెర్ఫోజీ సరస్వతీ మహల్‌గా మార్చి పోషించాడు. ఇందులో ప్రధానంగా తాళపత్ర గ్రంథాలు లభ్యమవుతాయి. సంస్కృత తాళపత్ర గ్రంథాలు 39,300, తమిళ భాషకు చెందిన తాళపత్ర గ్రంథాలు, వ్రాతప్రతులు కలిపి 3,50,000 ఉన్నాయి. సంగీతం, సాహిత్యం, వైద్య శాస్త్రానికి చెందినవే ఇందులో ఎక్కువ. 1919లో సాధారణ పాఠకులకు ప్రవేశం కల్పించారు. ఇప్పటికీ దీని ప్రాభవం కనిపిస్తుంది.

 

డేవిడ్ ససూన్ గ్రంథాలయాన్ని (ముంబై) భారత ప్రభుత్వం చారిత్రక సంపదగా గుర్తించి కాపాడుతున్నది. 1870 నుంచి ఇది పనిచేస్తోంది. రాంపూర్ (ఉత్తర ప్రదేశ్) రజా గ్రంథాలయం మరొకటి. రాంపూర్ నవాబులు 1904లో స్థాపించిన ఈ గ్రంథాలయం ప్రధానంగా ఇస్లామిక్ జ్ఞాన సంపదను కలిగి ఉంది. ఇందులో 30,000 పుస్తకాలు ఉన్నాయి.

 

ఇంకా దేశంలో పని చేస్తున్న ఉత్తమ గ్రంథాలయాలుగా ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (కోల్‌కత్తా), సెంట్రల్ రిఫరెన్స్ లైబ్రరీ (కేరళ), లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఆఫీస్ (ఢిల్లీ) ల గురించి చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌లో వేటపాలెం సారస్వత నికేతన్, రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం పేర్కొనదగినవి. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌కాలేజీలోని గ్రంథాలయం విశేషమైనది. ఇందులో 87,000 పుస్తకాలు ఉన్నాయి.

 

మనం కొన్ని దశాబ్దాలుగా గ్రంథాలయ వారోత్సవాలను జరుపుకుంటున్నాం. కానీ గ్రంథాలయాల పురోగతిలో పరిమితమైన విజయం కూడా సాధించలేకపోయాం. ఇదొక చేదు నిజం. గ్రంథాలయం అంటే మనుషులు నోళ్లు మూసుకుని మెదళ్ల వాకిళ్లు తెరిచే చోటని విశ్వసిస్తారు. కానీ గ్రంథాలయాలనేసరికి మన నేతలకీ, ఎక్కువ మంది పౌరులకీ కూడా నోళ్లూ, మెదళ్లూ రెండూ పనిచేయడం లేదు. అదే విషాదం.

 

- డా॥గోపరాజు నారాయణరావు

 

ఆహుతైన వైద్యశాస్త్ర గ్రంథాలయం



జర్మనీ రాజధాని బెర్లిన్‌లో 1919లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్సువల్ విస్సెన్‌షాట్‌ను స్థాపించారు. అంటే లైంగిక శాస్త్ర పరిశోధన సంస్థ. ఇది ప్రధానంగా వైద్య శాస్త్ర పరిశోధనల కోసం, గ్రంథాల కోసం ఏర్పాటుచేశారు. మాగ్నస్ హిర్ష్‌ఫెల్డ్ అనే యూదు వైద్యుడు (ఇతడు స్వయంగా గే) దీనిని ప్రారంభించాడు. మనస్తత్వశాస్త్రం వంటి ఇతర అంశాలు ఉన్నా లైంగిక శాస్త్రం మీద ఎక్కువ పరిశోధనలు జరిగేవి. వీటితో పాటు స్వలింగ సంపర్కులకు, హిజ్డాలకు, స్త్రీల సమస్యలకుకౌన్సెలింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు హిజ్డాలు ముందుకు తెస్తున్న  చాలా డిమాండ్లకు, స్త్రీల హక్కుల నినాదాలకు ఇక్కడ నుంచే తాత్విక భూమిక అందింది. కానీ 1930లో నాజీల ప్రాభవం శిఖరాగ్రానికి చేరిన తరువాత దీనికి కష్టాలు మొదలయ్యాయి.  మే 6,1933న మొదట నాజీ విద్యార్థి విభాగం ఈ సంస్థ మీద దాడి చేసింది. మొదటి దాడి గ్రంథాలయం మీదే. ఇందులో 20,000 పుస్తకాలు ఉండేవి. మరో 5000 ఫోటోలు, చిత్రాలు కూడా సేకరించి పెట్టుకున్నారు. వీటిలో చాలా వాటిని దోచుకున్నారు. మే 10న బెర్లిన్ ఒపేరా కూడలిలో మిగిలిన పుస్తకాలను పోసి దగ్ధం చేశారు. నిజానికి ఇది హిర్ష్‌ఫెల్డ్ వ్యక్తిగత గ్రంథాలయం. అలాగే  యూదు జాతీయులైన థామస్ మాన్, మార్సెల్ ప్రౌస్ట్, కారల్‌మార్క్స్, అల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి పుస్తకాలను కూడా నాజీలు నడిరోడ్డు మీదే దగ్ధం చేశారు.

 

తక్షశిల, నలంద, విక్రమశిల...అమరావతి

 

‘విశ్వవిద్యాలయం అంటే- ఒక గ్రంథాలయం చుట్టూ నిర్మించుకున్న భవన సముదాయమే’ అంటారు అమెరికా చరిత్రకారుడు షెల్బీ ఫూటే. మన పురాతన విశ్వవిద్యాలయాల చరిత్రను పరిశీలిస్తే ఇదే అనిపిస్తుంది. ముఖ్యంగా తక్షశిల, నలంద, విక్రమశిల, వల్లభి, కంచి విశ్వవిద్యాలయాలు చరిత్రలో పొందిన స్థానం వాటి గ్రంథాలయాలతో ముడిపడి ఉంది. తక్షశిల (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) క్రీస్తుపూర్వం ఐదు, ఆరు శతాబ్దాలకు చెందినది. ఇది ఆర్ష వాఙ్మయానికీ, బౌద్ధానికీ నిలయం. చాణక్యుని అర్థశాస్త్రం ఇక్కడే జన్మించింది. పాణిని అష్టాధ్యాయి కూడా ఇక్కడే అక్షర రూపం దాల్చింది. ఆయుర్వేదానికి పితామహుని వంటి చరకుడు కూడా ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నవాడే. బింబిసారుని కొలువులో పని చేసిన వైద్యుడు జీవకుడు ఇక్కడే చదివాడు. ఇక విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎందరో!  దీనిని 8వ శతాబ్దంలో శ్వేతహూణులు ధ్వంసం చేశారు. దాంతో ఒక మహా గ్రంథాలయం కాలగర్భంలో కలిసిపోయింది.

 

పురాతన భారతంలో మరో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నలంద. ఇది క్రీ.శ. 400 నాటిది. హుయాన్‌త్సాంగ్ యాత్రాకథనం, క్రీ.శ. ఆరు, ఏడు శతాబ్దాలకు చెందిన టిబెట్ గాథలు దీని గురించి ప్రస్తావించాయి. పాట్నాకు సమీపంలోని నలందలో ఆనాడు గ్రంథాలయ అవసరాల కోసం మూడు పెద్ద భవనాలు నిర్మించారు. అవే రత్నసాగర, రత్నదధి, రత్నరంజక. ఇందులో రత్నసాగర తొమ్మిది అంతస్తుల భవనం. ధర్మగంజ్ అనే ప్రాంతంలో వాటిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే తొలి గురుకుల విశ్వవిద్యాలయం. విక్రమశిల, వల్లభి, కంచి విశ్వవిద్యాలయాలు క్రీ.శ. ఐదు-ఎనిమిది శతాబ్దాల మధ్య వెలిశాయి. వీటి గ్రంథాలయాలన్నీ ముస్లిం దండయాత్రలలో లేదా బౌద్ధ వ్యతిరేక అలజడులలోను నాశనమైనాయి.

 

తెలుగు ప్రాంతంలో, కృష్ణాతీరంలో ఉన్న అమరావతిలో ఏడో శతాబ్దంలో నాగార్జున విద్యాపీఠ్ పనిచేసింది. ఐదు అంతస్తుల ఒక భవనంలోని పై అంతస్తులో మహా గ్రంథాలయం ఉండేది. మహాయాన సాహిత్యానికి ఇది ప్రసిద్ధి. పశ్చిమ బెంగాల్‌లోని నవద్వీపలో లక్ష్మణ్‌సేన్ అనే పాలకుడు ఒక విశ్వవిద్యాలయాన్నీ, అనుబంధంగా గ్రంథాలయాన్నీ నిర్మించాడు. దీనిని కూడా భక్త్యార్ ఖిల్జీయే ధ్వంసం చేశాడు.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top