అమ్మ తోడు... రికార్డుల్ని అడ్డంగా నరికేశాడు!

అమ్మ తోడు... రికార్డుల్ని అడ్డంగా నరికేశాడు!


సినిమా వెనుక స్టోరీ - 5

స్విట్జర్లాండ్‌లోని ఓ హోటల్. పార్కింగ్ ఏరియాలో ‘స్టూడెంట్ నెం.1’ సినిమా యూనిట్ అంతా ఎయిర్‌పోర్టుకెళ్లడానికి బస్సు కోసం వెయిటింగ్. పది రోజులుగా ఆ చుట్టుపక్కల పాటలు చిత్రీకరించారు. పాటలు బాగా రావడంతో ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అక్కడున్న రాడ్ పట్టుకుని ఊగుతూ పాటలు హమ్ చేసుకుంటున్నాడు. తననెవరో పిలుస్తున్నట్టు అనిపించి వెనక్కు తిరిగి చూశాడు. ఇద్దరు వ్యక్తులు. తెలిసినట్టే ఉన్నారు. తెలియనట్టూ ఉన్నారు.

 

‘‘నన్ను గుర్తుపట్టారా? నేను బుజ్జిని. ‘నిన్ను చూడాలని’ మార్నింగ్‌షో గుంటూరులో చూసి ఫోన్ చేశాను కదా’’ అని గుర్తుచేశాడు బుజ్జి. ఎన్టీఆర్‌కి గుర్తొచ్చినట్టే అనిపించింది. బుజ్జి తన పక్కన ఉన్నతన్ని పరిచయం చేస్తూ ‘‘ఇతను వీవీ వినాయక్. సాగర్ గారి దగ్గర అసోసియేట్‌గా చాలా కాలం పనిచేశాడు. ఇప్పుడు ‘చెప్పాలనివుంది’ సినిమాకి చంద్రమహేశ్ దగ్గర కో-డెరైక్టర్‌గా చేస్తున్నాడు. పాటల షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాం. మీకు సరిపడే కథ ఒకటి ఉంది. వింటారా?’’ అని టకటకా చెప్పుకొచ్చేశాడు బుజ్జి.

 

ఇలా కథలు చెబుతానన్న వాళ్లను ఈ రెండు సినిమాల టైమ్‌లోనే చాలామందిని చూశాడు ఎన్టీఆర్. పైగా, కొత్త డెరైక్టర్! ఎంతవరకూ నమ్మగలడు? వినాయక్‌ను చూస్తేనేమో రౌడీలా ఉన్నాడు. సినిమా తీసే రకమేనా? అనుకున్నాడు. అందుకే ఎవాయిడ్ చేయాలనుకున్నాడు. ‘‘హైదరాబాద్ వచ్చాక కలవండి’’ అని వెళ్లి పోయాడు. అక్కడితో మ్యాటర్ ఎండ్.

   

‘‘ఎవరో బుజ్జి అట. ఫోన్ చేసి చంపేస్తున్నాడు. కాస్త మాట్లాడరా బాబూ’’ అంది అమ్మ ఎన్టీఆర్‌తో. కథ విని నచ్చలేదని చెప్పి పంపిచేద్దామని డిసైడయ్యాడు ఎన్టీఆర్. నెక్ట్స్ డే... వినాయక్, బుజ్జి - ఇద్దరూ వచ్చారు. ‘‘నాకు కథ మొత్తం చెప్పొద్దు. జస్ట్ ఇంట్రడక్షన్... ఇంటర్వెల్... క్లైమాక్స్ చెప్పండి చాలు’’ అన్నాడు ఎన్టీఆర్. వినాయక్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ‘‘మీకు ఇంట్రో ఒక్కటే చెప్తాను. నచ్చితేనే కూర్చోండి. మీ టైమ్ వేస్ట్ చేయను’’ అంటూ ఇంట్రో చెప్పడం మొదలెట్టాడు. మొదట చాలా లైట్ తీసుకున్న ఎన్టీఆర్ ఇమ్మిడియెట్‌గా కనెక్ట్ అయిపోయి ఇంట్రో ఎపిసోడ్‌ని ఫుల్ ఎంజాయ్ చేసేశాడు.

 

అరగంట... గంట... గంటన్నర... రెండు గంటలు... వినాయక్ నాన్‌స్టాప్‌గా కథ చెబుతూనే ఉన్నాడు. ఎన్టీఆర్ ఫుల్‌గా ఇన్‌వాల్వ్ అయిపోయి మరీ విన్నాడు. అదిరిపోయే లవ్‌స్టోరీ. వెంటనే లేచి ‘‘అన్నా... మనమీ సినిమా చేస్తున్నాం’’ అని హగ్ చేసుకున్నాడు. వినాయక్ కల నెరవేరింది. అతను గాల్లో తేలి పోతున్నాడు. బుజ్జి కూడా సేమ్ టూ సేమ్. ఎన్టీఆర్‌తో వినాయక్ సినిమా చేస్తున్నాడనే వార్త ఇండస్ట్రీ అంతా స్ప్రెడ్ అయింది. కానీ నాలుగు రోజుల తర్వాత

   

ఎన్టీఆర్ నుంచి పిలుపొచ్చింది. వినాయక్ ఎగురుకుంటూ వెళ్లాడు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ కనిపించే ఎన్టీఆర్ మొహంలో సీరియస్‌నెస్. వినాయక్ పసిగట్టేశాడు. ఈ సినిమా క్యాన్సిల్ అని చెప్పేస్తాడని అర్థమై పోయింది. ‘‘మీరు కూర్చోండి. జిమ్‌కెళ్లొస్తాను’’ అంటూ గంటసేపు ఎన్టీఆర్ జంప్. ఆ గంట... నరకం చూశాడు వినాయక్. ఎన్టీఆర్ వచ్చీ రావడంతోనే విషయంలోకి వచ్చేశాడు. ‘‘ఏమనుకో వద్దన్నా! కొడాలి నానీ అన్న ఇప్పుడు లవ్ స్టోరీ వద్దు. ఏదైనా మాస్ సినిమా చేయమని సలహా ఇచ్చాడు. మాస్ కథ ఉంటే చెప్పన్నా’’ అన్నాడు ఎన్టీఆర్.

 

వినాయక్ కుప్పకూలిపోయినట్టు అయిపోయాడు. రేపో మాపో సినిమా స్టార్ట్ అవుతుందని ఎన్నెన్నో కలలు కంటున్నాడు. అంతలోనే అవాంతరం. ఇప్పటికిప్పుడు మాస్ కథ ఎక్కడ దొరుకుతుంది? కానీ, చీకట్లో చిరుదీపంలా ఎప్పుడో రెడీ చేసుకున్న రెండు సీన్లు గుర్తొచ్చాయి. వెంటనే మైండ్‌లోంచి వాటిని బయటకు తీశాడు.

 

‘‘నా దగ్గర రెండు యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఒకటి చిన్న పిల్లాడు బాంబు వేసేది. రెండోది బ్లాస్ట్‌లో సుమోలు లేచేది. మీకు నచ్చితే వాటి చుట్టూ కథ అల్లుతా’’ అని కొంచెం డీటైల్స్ చెప్పాడు వినాయక్. ‘‘ఫ్యాక్షన్ కథ నాకు హెవీ అయి పోతుందన్నా’’ అన్నాడు ఎన్టీఆర్. ఎలాగైనా తనను వదిలించుకునే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఆ మాట అంటున్నాడని వినాయక్‌కి అర్థమైంది. ‘‘వారం రోజులు టైమివ్వండి. ఆ కథ నచ్చకపోతే డేట్స్ ఎవరికైనా ఇచ్చేయండి’’ అని లేచాడు.

   

హైదరాబాద్ - జర్నలిస్టు కాలనీలో వినాయక్ రూమ్. ఎన్టీఆర్ దగ్గర్నుంచీ రూమ్‌కొచ్చేసరికి రాత్రి తొమ్మిదయ్యింది. బుజ్జి కూడా ఉన్నాడు. అతనేమో వెంటనే నిద్రపోయాడు. అర్ధరాత్రి మూడు గంటలకు వినాయక్ గట్టిగా లేపితే తప్ప మెలకువ రానంత మొద్దు నిద్ర. ‘‘చూడు బుజ్జీ! కథ ఓ కొలిక్కి వచ్చేసింది’’ అని చదివి వినిపించాడు వినాయక్. బుజ్జి షాకైపోయాడు. థ్రిల్లయిపోయాడు. వండరైపోయాడు.

 

వినాయక్‌లోని స్పెషాల్టీనే అది. ఏదైనా పంతం పట్టాడంటే, దాని అంతం చూస్తాడు. ఆ రెండ్రోజులూ వినాయక్ నిద్రపోలేదు. బ్రష్ చేసుకోలేదు. స్నానం కూడా లేదు. తిండి కూడా తినడం లేదు. ఆలోచిస్తూనే ఉన్నాడు. రాస్తూనే ఉన్నాడు. ఫైనల్‌గా 58 సీన్లతో ‘ఆది’ కథ రెడీ. కథ విని ఎన్టీఆర్ ఎగిరి గంతేశాడు.ప్రాజెక్ట్ స్టార్ట్. బెల్లంకొండ సురేశ్ సమర్పకుడు. నాగలక్ష్మి నిర్మాత. బుజ్జి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

   

ఎన్టీఆర్ నుంచి వినాయక్‌కి మళ్లీ పిలుపు. ఈసారేం ట్విస్టో?  

‘‘అన్నా..! చిన్న ఛేంజ్! కథలో కాదు, ప్రొడ్యూసర్ విషయంలో! బూరుగుపల్లి శివరామకృష్ణగారు రెడీగా ఉన్నారు’’ చెప్పాడు ఎన్టీఆర్. వినాయక్ ఖంగు తిన్నాడు. ‘‘లేదండీ..! నన్ను డెరైక్టర్‌ను చేయాలని బుజ్జి ఎంతో తపించాడు. ఇప్పుడు హ్యాండ్ ఇవ్వలేను’’ అని చెప్పేశాడు. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న వినాయక్ గుణం ఎన్టీఆర్‌ని ముగ్ధుణ్ణి చేసేసింది. అందుకే ఇంకేం మాట్లాడలేకపోయాడు. షూటింగ్ స్టార్ట్.

   

హీరోకి, డెరైక్టర్‌కి ట్యూనింగ్ కుదిరితే షూటింగ్ యమస్పీడ్‌గా వెళ్తుందనడానికి ‘ఆది’ నిదర్శనం. ఎన్టీఆర్... వినాయక్ ఇద్దరూ కథను ఆవాహన చేసేసుకున్నారు. అందుకే సెట్‌లో నో సీన్ పేపర్. ‘‘ఇది సీన్... అది డైలాగ్’’ అని వినాయక్ చెప్పడం ఆలస్యం... ఎన్టీఆర్ చెలరేగిపోయేవాడు.

   

హైదరాబాద్, విజయనగరం, వైజాగుల్లో షూటింగ్. 65 రోజుల్లో ఫినిష్. 2002 మార్చి 28న  రిలీజ్. రిజల్ట్ బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్‌కి స్టార్‌డమ్ షురూ. 19 ఏళ్ల వయసు... మూడో సినిమా... ఒక్కసారిగా ఎన్టీఆర్ కెరీర్ సూపర్‌స్పీడ్. వినాయక్ అయితే ఓవర్‌నైట్ స్టార్ డెరైక్టర్. ఈ సినిమాకి అయిన ఖర్చు రెండు కోట్ల ముప్ఫై ఐదు లక్షలు. వసూళ్లు పాతిక కోట్లు. అమ్మ తోడు... బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని అడ్డంగా నరికేశాడు ‘ఆది’.

- పులగం చిన్నారాయణ

 

వెరీ ఇంట్రస్టింగ్

లైఫ్‌లో కొన్ని మలుపులు భలే ఉంటాయి. దర్శక, నిర్మాత కె. క్రాంతికుమార్ దగ్గర ‘9నెలలు’ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశాక వినాయక్ సొంతంగా డెరైక్షన్ కోసం ట్రై చేస్తున్నాడు. అదే టైమ్‌లో కూచిపూడి వెంకట్ డెరైక్షన్‌లో బెల్లంకొండ సురేశ్ ‘రాజుగారు-బేవార్సుగాడు’ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కూచిపూడి వెంకట్‌కేమో వినాయక్‌ను కో-డెరైక్టర్‌గా పెట్టుకోవాలని కోరిక. బెల్లంకొండ పిలిపించాడు.వినాయక్ చాలా నిజాయతీగా ‘‘నేను డెరైక్షన్ ట్రయల్స్‌లో ఉన్నా. ఇప్పుడు కో-డెరైక్టర్‌గా చేయలేను’’ అని చెప్పేశాడు. బెల్లంకొండకు అతని నిజాయతీ నచ్చేసి పర్సులో నుంచి పది వేలు తీసి, ‘‘నీకు డెరైక్షన్ ఛాన్స్ నేనే ఇస్తాను. ఇది అడ్వాన్స్. నీ కథ తయారయ్యేలోగా ఈ సినిమాకు పనిచేయ్’’ అన్నాడు. వినాయక్ ఓకే అన్నాడు. తీరా చూస్తే కూచిపూడి వెంకట్ సినిమా అటకెక్కేసింది. ఆ తర్వాత బెల్లంకొండ ‘చెప్పాలని వుంది’ మొదలెట్టాడు. అలా దానికి కో-డెరైక్టర్‌గా వెళ్లాడు వినాయక్. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.

     

‘చెప్పాలని వుంది’ (వడ్డే నవీన్ హీరో) షూటింగ్ టైమ్‌లోనే వినాయక్-బుజ్జి బాగా క్లోజ్ అయ్యారు. ఓ రోజు అన్నపూర్ణ స్టూడియోలో శివుడి బొమ్మ దగ్గర కూర్చుని బుజ్జికి ఓ లవ్‌స్టోరీ చెప్పాడు వినాయక్. టైటిల్ ‘శ్రీ’. బుజ్జికి బాగా నచ్చేసి, ఆకాశ్ హీరోగా చేద్దామని అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశాడు. ఆ కథనే తర్వాత స్విట్జర్లాండ్‌లో ఎన్టీఆర్‌కి చెప్పింది. ఇప్పటికీ ఆ కథ వినాయక్ దగ్గరే ఉంది.

     

బుజ్జి అసలు పేరు నల్లమలుపు శ్రీనివాస్. బెల్లంకొండ సురేశ్‌కి స్వయానా మేనల్లుడు. అతనికి నాగలక్ష్మి పిన్ని అవుతుంది. గుంటూరులో పత్తి గింజల ఆయిల్ వ్యాపారం చేస్తుండేవాడు. సినిమాలంటే ఆసక్తే కానీ నిర్మాత అయిపోవాలనీ, పరిశ్రమలో స్థిరపడిపోవాలనీ మాత్రం అనుకోలేదు. కానీ, ‘ఆది’ అతణ్ని ఇండస్ట్రీలో నిర్మాతగా సెటిలయ్యేలా చేసింది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top