శార్వరి నామ సంవత్సర (కర్కాటక రాశి ) రాశిఫలాలు

2020 To 2021 Cancer Zodiac Sign Horoscope In Sakshi Funday

(ఆదాయం  11, వ్యయం  8,  రాజపూజ్యం 5, అవమానం  4)

ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. సాంకేతిక, వ్యాపార రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లభిస్తుంది. కొందరికి ఇతరుల మీద ఉన్న ద్వేషం మీ మీద అభిమానంగా మారి సహాయపడతారు. ప్రత్యర్థివర్గాన్ని కారణం చూపి ఇబ్బందిపాలు చేయగలుగుతారు. మీరు కలలు కన్న గమ్యాన్ని చేరుకుంటారు. సాహిత్య, కళా, విద్య, పరిశోధన రంగాలలో చేసిన కృషికి తగిన గుర్తింపు, గౌరవం, కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. ఆపదలు తప్పుకుంటే మిగిలేది అదృష్టమేనని గ్రహించండి.

స్థిరాస్తుల వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. సర్పదోషనివారణా చూర్ణములో సర్వరక్షాచూర్ణము కలిపి స్నానం చేయడం వలన సర్పదోషాలు మరియు గ్రహాల వలన కలుగు బాధలు తొలగిపోతాయి. వ్యాపారంలో రొటేషన్, లాభాలు బాగుంటాయి. కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులు, లైసెన్సులు, లీజులు పొడిగించే వంటి విషయాలు మీకు లాభిస్తాయి. ప్రతి చిన్నవిషయానికి పలుకుబడి ఉపయోగించవలసి వస్తుంది. రాజకీయ నాయకుల జోక్యం కూడా అనివార్యం అవుతుంది. జీవితభాగస్వామితో సఖ్యత చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది.

ఇది కీలక అంశం అని గుర్తించండి. విదేశాలలో ఉన్న మీ బంధువులు అక్కడ చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందిపడతారు. మీ శక్తిసామర్థ్యాలతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటారు. అనేక సమస్యలు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు దొరుకుతుంటాయి. ఈ గ్రహ శకలం భూమిని తాకవు. తాకుతాయేమోనని మేధావులు, శాస్త్రవేత్తలు ఆందోళన అన్నింటికీ అతీతంగా భగవంతుడు తీసుకున్న నిర్ణయం వల్ల శకలాలు భూమిని తాకవు. అదేవిధంగా సమస్యలు మీ వరకు వస్తాయి. కానీ మిమ్మల్ని పడగొట్టవు. మీ వ్యక్తిగత, వృత్తి, ఉద్యోగాలపరంగా రహస్య సమాచారం ఇతరులకు చేరుతుంది. ఇది మీ నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది. మీ వైరివర్గానికి కొమ్ముకాస్తున్న వారు బలహీనులవడం మీకు ఆయాచితవరంగా మారుతుంది.

ఆర్థికస్థిరత్వం సాధించి సంతృప్తి పొందుతారు. ఖర్చులు వృథాకావు. పెట్టుబడిగా భావించండి. టీ, కాఫీ, హోటల్‌ వ్యాపారులకు, చిల్లర సరుకులు అమ్మేవారికి, కమీషన్‌ ఏజంట్లకు, ట్రావెలు ఏజెన్సీలకు, బ్యూటీపార్లర్లకు, చెప్పుల షాపువారికి, ఫ్యాన్సీ షాపుల వారికి, గాజుల ఉత్పత్తిదారులకు, గిల్టు నగలు అమ్మేవారికి, ముద్రణ, ప్రచురణరంగాల వారికి, మిల్లులు, పిండిమరలు నడిపేవారికి, ఎలక్టాన్రిక్‌ వస్తువులు అమ్మేవారికి, ఫర్నీచర్‌ వ్యాపారులకు, బేకరీ నడిపే వారికి, గృహనిర్మాణ సామాగ్రి అమ్మేవారికి, సుగంధద్రవ్య వ్యాపారులకు, ఫంక్షన్‌హాల్స్‌ నిర్వాహకులకు కాలం అనుకూలంగా ఉంది. నూటికి తొంబైశాతం లాభాల బాటలో నడుస్తాయి. అఘోరపాశుపత హోమం చేయడం వలన శనైశ్చరుని అనుగ్రహం లభిస్తుంది. వివాహాది, శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. అనారోగ్య కారణాల వల్లన ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూలో మీ ప్రతిభాపాటవాలు ప్రదర్శించలేరు. జ్వరంతో ఉండి పోటీపరీక్షలు వ్రాస్తారు. కీలకమైన ఘట్టాల్లో ఈ విధమైన అనారోగ్యం ఇబ్బందిపెడుతుంది. అయినా ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి.

సాహిత్య, సాంస్కతిక సభలు, కళా సంబంధమైన పోటీలు మొదలైనవి ఘనంగా నిర్వహిస్తారు. ఎక్కడైతే సామర్థ్యం, నిపుణత ఉంటాయో వాటిని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంటారు. మీకు ఎదురైన అనుభవాలు ఇతరులకు ఎదురు కారాదని భావిస్తారు. పిల్లల విషయంలో ఒక దిగులు, ఆలోచన ఉంటుంది. సంతానంపై వచ్చిన దుష్ప్రచారం నిజం కాదని తెలుస్తుంది. సరిదిద్దవలసిన వివాదాలు మితిమీరుతాయి. పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా మేలు జరుగుతుంది. విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలను కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. కొంతమందికి పిల్లనిచ్చిన చోట అల్లుడితో సమస్యలు కొడుకుకి పెళ్ళి చేసి పిల్లను ఇంటికి తెచ్చుకుంటే కోడలితో సమస్యలు గోడపెట్టుగా, చెంపపెట్టుగా తయారవుతాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి పరిపరివిధాలా శ్రమించవలసి వస్తుంది. చాలా విషయాలలో మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజాలు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదు.

ఏ దేవుడికైనా, దేవతకైనా పూజచేసేటప్పుడు మహాతీర్థం పొడిని ఉపయోగించండి. కొన్ని సందర్భాలలో అత్యంత సన్నిహితమైనవి వివాహ జీవితాలు, అత్యంత బలహీనమైనవి వివాహ బంధాలు అని సరిపెట్టుకుంటారు. రెండవ వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ సంవత్సరం బాగుంది. మంచి సంబంధం కుదురుతుంది. మీ దగ్గర లంచాలు తీసుకున్న వాళ్ళు అవినీతి గురించి మాట్లాడడం మీకు చెప్పరాని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అవినీతి గురించి మాట్లాడడానికి అవినీతిపరులకే ఎక్కువ హక్కు ఉందని మీరు భావిస్తారు. అనుకోకుండా పిల్లల విషయంలో ఖర్చులు వచ్చిపడతాయి. మీ బాధ్యతలు విస్మరించకుండా పిల్లల విషయంలో తగిన విధంగా ప్రవర్తిస్తారు, ఖర్చుచేస్తారు. నైతిక ధర్మానికి ప్రాతిపదికగా నిలుస్తారు. కీళ్ళనొప్పులు, ఇ.ఎన్‌.టి సమస్యలు ఇబ్బంది పెడతాయి.

ప్రకృతివైద్యాల పట్ల, వనమూలికల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు. అందుకు సంబంధించిన గ్రంథాలను ఆసక్తిగా పరిశీలిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాల పంపకాల విషయంలో మీకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఉన్నతస్థానాలలో ఉన్నవారు, పెద్దలు గౌరవనీయులు సమసమాజ నిర్మాణానికే కంకణం కట్టుకున్నామని చెబుతున్న పెద్దలు మీ పట్ల అన్యాయమైన తీర్పునిస్తారు. ఎవరో చేసిన పనికి మీరు బాధపడాల్సి వస్తుంది. మనఃక్లేశానికి గురౌతారు. న్యాయం, ధర్మం గాడి తప్పి సామాజిక స్పృహ కోల్పోయి మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ ఖండించరు. ప్రేక్షకపాత్ర వహిస్తారు. కాలం అనంతమైనది. చాలా గొప్పది. ఈశ్వరేచ్ఛననుసరించి కాలమే అన్యాయానికి సమాధానం చెబుతుంది. మీ ద్వారా పనులు చేయించుకుని, మీ శ్రమను శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకుని కొంతమంది వ్యక్తులు ఇవ్వవలసిన ప్రతిఫలం కన్నా తక్కువ ఇచ్చి ఎంతో చేశామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ధనాన్ని మీరు తిరస్కరిస్తారు.

మీరు అనుకున్నది సాధించడానికి ఏటికి ఎదురీదుతారు. కొంతవరకు అనుకూల ఫలితాలు సాధిస్తారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని, మహిమ కలిగిన మనుషులు మనకు బాగా సన్నిహితులని కొద్దిపాటి పెట్టుబడితో నిధులు, నిక్షేపాలు తవ్వమని, బాగుపడదామని మోసకారి మాటలు చెప్పేవారిని మీరు దగ్గరకు చేర్చుకొని నష్టపోతారు. దేవాలయాల సొమ్ము తిన్నవారెవరూ బాగుపడరని ఆచరణలో మీ కళ్ళముందు ఋజువవుతుంది. ఎందుకంటే ఆలయాల పరిరక్షణ గురించి, ఆస్తుల గురించి, రాబడి గురించి, ధూపదీప నైవేద్యాల గురించి అన్నింటినీ సక్రమంగా ఒకమార్గంలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలకు ఒక బలమైన వర్గం అడ్డుపడుతుంది. అందినంత దోచుకుంటారు. చివరికి బొక్కబోర్లాపడతారు. మీ కృషి వ్యర్థం కాలేదు అని తెలియజేయడానికే ఈ ప్రస్తావన. టీచింగ్‌ ప్రొఫెషన్‌లో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ట్యూషన్లు చెప్పేవారికి డిమాండ్‌ పెరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు అర్హతలకు తగిన ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది.

ధనం సంపాదించడం కోసం అహర్నిశలూ కష్టపడతారు. చేతికి వచ్చిన ధనం సద్వినియోగం అవుతుంది. మెల్లమెల్లగా బాధ్యతలు, రుణాలు తీర్చుకుంటారు. కఠినమైన కాలాన్ని అధిరోహించడంలో ఒక వింత అనుభూతి పొందుతారు. ఆస్తుల కోసం, ధనం కోసం తల్లిదండ్రులతో కూడా వివాదం కల్పించే ప్రయత్నాలు కొందరు చేస్తారు. మీకు లేని ఉద్దేశ్యాలను మీపై ఆపాదించి రక్తసంబంధీకులకు దూరం చేయాలని బంధువులలో ఒక కూటమి విశేష ప్రయత్నాలు చేస్తుంది. అయితే వీటన్నింటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటారు.

కార్యాలయంలో సమర్థవంతంగా పనిచేస్తున్న మీరు మంచి కోసం కొన్ని సంస్కరణలు, మార్పులు చేస్తారు. సోమరిపోతులకు మీ ఉత్తర్వులు నచ్చవు. చట్టంలో ఉండే లొసుగులను ఉపయోగించుకొని మిమ్ములను ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తారు. చివరికి మీ నిజాయతీయే గెలుస్తుంది. సమాజాన్ని ఆవరించడం మీకు భరించలేని విషయంగా మారుతుంది. కృషికి, సామర్థ్యానికి కానికాలం దాపురించిందని సమర్థించుకుంటారు. మనస్సులో భావాలు ఏ విధంగా ఉన్నా నలుగురు నడిచిన దారిలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top