
కో అంటే కోహ్లి..
వరల్డ్‌కప్‌లో వండర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో బంతిని బౌండరీలు దాటిస్తున్న విరాట్ కోహ్లి.. వెస్ట్రన్ హెయిర్‌స్టైల్‌కూ హద్దులు చెరిపేస్తున్నాడు.
వరల్డ్‌కప్‌లో వండర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో బంతిని బౌండరీలు దాటిస్తున్న విరాట్ కోహ్లి.. వెస్ట్రన్ హెయిర్‌స్టైల్‌కూ హద్దులు చెరిపేస్తున్నాడు. ప్రపంచకప్‌లో ఆటగాడిగా సాధించిన ఘనతతో సమానమైన కీర్తిని తన సరికొత్త లుక్‌తోనూ సంపాదించుకుంటున్నాడు. గూగుల్‌లో అత్యధిక సెర్చ్‌లు సాధించిన కోహ్లీ హెయిర్‌స్టైల్.. ఫేస్‌బుక్‌లో అతని ఫాలోవర్స్ సంఖ్యను కూడా రికార్డ్ స్థాయికి పెంచింది. అదే కోవలో కొత్త ఫ్యాషన్లంటే ముందుండే సిటీయూత్‌నూ ఆకట్టుకుంది. ఈ ‘హాట్’హెయిర్‌స్టైల్‌కి సిటీలో సమ్మర్ సీజన్ ఆజ్యం పోసింది. కూల్ కూల్ కోహ్లి స్టైల్ అని సిటీ కోడై కూస్తోంది.
ఎస్.సత్యబాబు
ధనాధన్ ధోని క్రికెట్‌లోకి ఎంటరవుతూనే జులపాల జుత్తును సిటీలో రీ ఎంట్రీ చేయించాడు. క్రికెటర్‌గా ఉన్నప్పుడు సచిన్ సడన్‌గా తన హెయిర్‌స్టైల్ మార్చి స్ట్రయిట్ కట్‌తో కనిపించి సిటీవాసులకు దాన్ని క్రేజీగా మార్చాడు. ఇక ఇప్పుడు కోహ్లి వంతు వచ్చింది. ‘కోహ్లి హెయిర్‌స్టైల్ గురించి నెట్‌లో సెర్చ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకొచ్చి మరీ తమకు అదే రకమైన స్టైల్ కావాలని అడుగుతున్నారు’ అని చెప్పారు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఎన్‌ఆర్‌బీ సెలూన్ యజమాని నందు. బ్యాట్‌తోనే కాదు లవర్ బాయ్‌గానూ నిత్యం వార్తల్లో ఉండే కోహ్లిని అభిమానించే యువతకు నగరంలో కొదవలేదు. అలాగే కొత్త హెయిర్‌స్టైల్స్‌తో ప్రయోగాలు చేసే వారికీ కొరత లేదు. ఈ నేపథ్యంలో పార్లర్స్ కోహ్లి హెయిర్‌కట్‌ను ప్రత్యేకంగా ఆఫర్ చేస్తున్నాయి.
సమ్మర్ స్పెషల్...
‘ఎలాగూ సమ్మర్ వచ్చింది. లాంగ్ హెయిర్‌తో ఈ సీజన్ కష్టం కదా. అందుకే స్టైల్ మార్చాలనుకుంటుంటే.. కోహ్లి ఓ దారి చూపించాడు’ అని చెప్పాడు విరాట్ ‘కట్’ని తలకి సెట్ చేయించుకున్న సిటీ కుర్రాడు శైలేంద్ర. సిటీలో ఈ స్టైల్ సెట్ చేయడానికి పార్లర్స్‌లో రూ.450 నుంచి డిమాండ్ చేస్తున్నారు. రెండు చెంపల వైపు దాదాపు అడుగున చర్మం కనిపించే స్థాయిలో హెయిర్ తీసేసి మధ్యలో మాత్రం తగినంత ఉంచుతారు. పాపిట తరహాలో కుడి వైపు గైడ్‌లైన్ గీయడం కోసం బ్లేడ్ వినియోగిస్తారు. లేయర్స్‌గా ఉండే జుట్టు నుదుటి మీద పడకుండా పైకి ఉండేలా సెట్ చేస్తారు. ‘దీన్ని క్రూక్డ్ కట్, నారో కట్, షార్ట్ మెహక్ అని కూడా అంటారు’ అని చెప్పారు హెయిర్‌స్టైలిస్ట్‌లు రాజు, బబ్లూ. జుట్టు సరళిని బట్టి కోహ్లి స్టైల్ సెట్ చేయడం కోసం కనీసం 30 నిమిషాలు ఆ పైన సమయం తీసుకుంటుందని చెప్పారు. సిటీలో యూత్ దీనిపై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొందరు ఈ స్టైల్‌ని మక్కీకి మక్కీ కావాలని కోరుతుంటే.. మరికొందరు చిన్న చిన్న మార్పులతో అనుసరిస్తున్నారు. కుడివైపు గైడ్‌లైన్ గీస్తే ఇంట్లోవాళ్లు తిడతారనే భయంతో కొందరు వద్దంటున్నారు. అలాగే రెండు చెంపల వైపు మరీ నున్నగా ఉండకుండా చిన్న చిన్నగా వెంట్రుకలు ఉంచడం లాంటి అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటున్నారు.
వెస్ట్రన్ వెరైటీ..
కోహ్లి ఇంట్రడ్యూస్ చేసిన హెయిర్‌స్టైల్ పేరు మెహక్. ఇండియాకి కొత్తే అయినా.. పాశ్చాత్య దేశాలకు పాతదే. ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్ 2012లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో దీన్ని బాగా పాపులర్ చేశాడు. తర్వాత పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కూడా దాన్ని ఫాలో అయ్యాడు. ఇదే స్టైల్‌తో బెస్ట్ లుకింగ్ మ్యాన్ అవార్డ్‌ను రొనాల్డో దక్కించుకున్నాడు. ఇది మొహికన్ హెయిర్‌స్టైల్ నుంచి పుట్టిందని చెబుతున్నారు. రొనాల్డోకి తాను పెద్ద ఫ్యాన్ అని ఓ సందర్భంలో చెప్పిన విరాట్ తనకు ఈ ఫుట్‌బాల్ ప్లేయర్ స్ఫూర్తి అని కూడా అన్నాడు. దీనికి ప్రతిగా రొనాల్డో సోషల్ మీడియా ద్వారా విరాట్‌కు థ్యాంక్స్ చెప్పాడు కూడా.
ఫాలోవండర్స్...
తన లుక్‌తో ప్రయోగాలు చేస్తానని గతంలోనే చెప్పిన కోహ్లి మాట మీద నిలబడి.. తనకు నచ్చిన, నప్పిన లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో టాక్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిన తన లుక్ ద్వారా విరాట్.. ఫేస్‌బుక్ మీద అత్యధిక సంఖ్యలో నెటిజన్లు ఫాలో అయిన సెకండ్ ఇండియన్ స్పోర్ట్స్ స్టార్‌గా స్థానం దక్కించుకున్నాడు (ఫిబ్రవరి 20, 2015 నాటికి 20,017,258 అభిమానులు. 24,789,418 లైక్స్‌తో సచిన్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు) ఈ హెయిర్‌స్టైల్ కోసం విరాట్ మెల్‌బోర్న్‌లోని టోనీ గై సెలూన్‌కు నడుచుకుంటూ వెళ్లాడట. ఏమైతేనేం.. క్రిస్టియానో రొనాల్డోను తలపిస్తూ బయటకు వచ్చాడు. అతని స్టైల్‌ను అనుసరిస్తూ యువత సిటీలో నయా ట్రెండ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతోంది.