అపురూప కట్టడం

అపురూప కట్టడం


 చూసొద్దాం రండి



ఎందరో విద్యావేత్తలను, మేధావులను తీర్చిదిద్దిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటు చేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం. ఈ విద్యాలయ ఏర్పాటు ప్రతిపాదన నిజాం ప్రభువుల కాలంలో 1873వ సంవత్సరంలో జరింగింది. ఆనాటి ఇద్దరు ప్రముఖ మేధావులు జనాబ్ రఫత్ యార్ జంగ్, జనాబ్ జమాలుద్దీన్ అఫ్‌ఘనీ ఈ విషయమై చొరవ తీసుకున్నారు.



తరువాత జనాబ్ అఫ్‌ఘనీ పారిస్ నగరంలో స్థిరపడ్డారు. అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన బ్లంట్‌ని 1882లో జనాబ్ అఫ్‌ఘనీ కలిసినప్పుడు హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ ఏర్పాటు గురించి ముచ్చటించారని, అలా అంకురార్పణ జరిగింది. బ్లంట్ ఆనాటి నిజాం ఆస్థానంలోని ప్రధానమంత్రి దివాన్ సాలార్‌జంగ్-2ను కలసి విశ్వవిద్యాలయ ఏర్పాటుపై చర్చించి, ఆరవ నిజాం ప్రభువు నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్‌కు 1883 జనవరి 24న లిఖిత పూర్వక ప్రతిపాదన అందజేశారు.



అయితే 1913లో దార్-ఉల్-ఉలూం పేరిట ఆనాటి విద్యార్థులంతా ఒక సంఘంగా ఏర్పడి నగరంలో విశ్వవిద్యాలయం తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సింహాసనం అధిష్టించాడు. 1914లో విద్యార్థి సంఘం నాయకులు పబ్లిక్ గార్డెన్స్‌లోని టౌన్ హాలులో ఏడవ నిజాం ప్రభువును కల్సి తమ ప్రతిపాదన ఆయన ముందుంచారని, వెనువెంటనే నిజాం ప్రభువు తన అంగీకారం తెలిపాడని చరిత్రకారులు పేర్కొంటున్నారు.



1917 ప్రాంతంలో నిజాం లాంఛనంగా ‘ఫర్మానా’ విడుదల చేశారు. అలా 1919 ఆగస్టు 7 నాటికి ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరిట ఒక విశ్వవిద్యాలయ స్థాపనకు కచ్చితమైన ప్రతిపాదనలు ఖరారయ్యాయి. ప్రస్తుత అబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు కూడా ప్రారంభించారు. అనంతరం ప్రొ. సర్ పాట్రిక్ గెడ్డెస్ నేతృత్వంలో అడిక్‌మెట్ ప్రాంతంలో 1400 ఎకరాల స్థలం విశ్వవిద్యాలయం కోసం కేటాయించారు.

 

విశ్వవిద్యాలయ భవన నిర్మాణానికై నమూనాల ఎంపిక కోసం హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు నవాబ్ జైన్ యాయంగ్, సయ్యద్ అలీ రజాలు ఇంగ్లండ్, ఫ్రాన్స్, జపాన్, టర్కీ, అమెరికా దేశాలు పర్యటించారు. తిరుగు ప్రయాణంలో ఈజిప్టునకు చెందిన బెల్జియం ఆర్కెటెక్ట్ జాస్పర్‌ను కలిశారు. జాస్పర్ తన దేశంలో ఓ విశ్వవిద్యాలయానికి నిర్మాణానికి రూపకల్పన చేస్తున్న సమయమది. అయితే నవాబ్ జైన్, ఆయన మిత్రులు 1931లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, ఉస్మానియా విశ్వవిద్యాలయ భవన రూపకల్పన కోసం ఈజిప్టు ఆర్కిటెక్ట్ జాస్పర్ పేరును ప్రతిపాదించారు.



1933లో జాస్పర్ పదవీ బాధ్యతలు చేపట్టి బీదర్, గోల్కొండ, చార్మినార్, ఎల్లోరా, అజంతా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. భారతీయ శిల్పకళా సంపద, సంస్కృతీ విధానాలను ఆకళింపు చేసుకుని, హైదరాబాద్ సంస్కృతితో మేళవించి.. ప్రస్తుతం ఉన్న ఓయూ ఆర్ట్స్ కళాశాల భవన నమూనాను రూపొందించాడు. ఏడో నిజాం 1934 జూలై 5న వర్సిటీ భవన నిర్మాణ పనులకు పునాది రాయి వేశారు. ఈ భవన నిర్మాణంలో సుమారు 35 వేల మంది కార్మికులు పనిచేశారు. 1934లో ప్రారంభించిన పనులు సుమారు ఐదున్నరేళ్ల నిరంతర

 

శ్రమ అనంతరం, అంటే 1939 డిసెంబర్ 5 నాటికి పూర్తయ్యాయి. ఏడో నిజాం దీన్ని ప్రారంభించారు. అబిడ్స్‌లోని తరగతి గదులను అద్దె భవనం నుంచి సొంత భవనాలకు తరలించారు. హ్యూమ్ పైప్ కంపెనీ, హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు ఓయూ నిర్మాణం పనులు చేశాయి. ఆర్ట్స్ కాలేజీ కోసమే ఆ రోజుల్లో దాదాపు 36 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కళాశాల నిర్మాణ శైలిలో సర్వమత సమ్మేళనం కనిపిస్తుంది. ఇది ఆనాటి ప్రభువుల విశాల దృక్పథానికి ప్రతీక.



ఆర్ట్స్ కాలేజీలోని విశాలమైన తరగతి గదులు, పెద్ద హాలు ఆనాటి రాచరికపు ఠీవీకి గుర్తులు. ఫిలిగ్రీ పనితనం నేటికీ చెక్కుచెదరలేదు. కళాశాల ప్రధాన భవనం 110 మీటర్ల వెడల్పు, 119 మీటర్ల ఎత్తున రెండంతస్తుల్లో ఉంది. సుమారు 164 విశాలమైన తరగతి గదులున్నాయి. ఈ కళాశాల 1919లో ఇంటర్ తరగతులతో ప్రారంభించారు.



1921 నాటికి బీఏ, 1923 నుంచి పీజీ తరగతులు షురూ అయ్యాయి. కాలేజీ ప్రారంభంలో ఉర్దూ మాధ్యమంలో తరగతులు నిర్వహించినా, 1948 నుంచి ఇంగ్లిష్ ప్రారంభించారు. పలు విదేశీ భాషల్లోనూ బోధన జరుగుతోంది. విశ్వవిద్యాలయం నేడు వేలాదిమంది విద్యార్థులతో చదువుల తల్లిగా వర్ధిల్లుతోంది.  విశిష్ట చరిత్ర గల పురాతన వారసత్వ సంపదగా ఓయూ భవనం నేటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

 

 మల్లాది కృష్ణానంద్

 malladisukku@gmail.com

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top