ఇంద్రధనుస్సు | South Asia's largest film festival vibgyor | Sakshi
Sakshi News home page

ఇంద్రధనుస్సు

Jan 11 2015 11:40 PM | Updated on Sep 2 2017 7:34 PM

ఇంద్రధనుస్సు

ఇంద్రధనుస్సు

మణిపూర్ చట్టాలకు వ్యతిరేకంగా 11 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ షర్మిల గురించిన చిత్రం ‘మై బాడీ మై వెపన్’ను కవితా జోషి రూపొందించారు.

దక్షిణాసియాలోనే అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్ విబ్జీఆర్. ప్రతి ఏడాది కేరళలో జరిగే ఈ పండుగ ఈసారి బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో రెండురోజులపాటు జరిగింది. మానవత్వం, లైవ్‌లీహుడ్, పర్యావరణం, అభివృద్ధి, ప్రజాస్వామ్యం, ఆరోగ్యం, సెక్యులరిజం, లింగవివక్ష, మానవహక్కులు, సంప్రదాయాలు... ఇలా సమాజం చర్చించడానికి వెనుకాడుతున్న అనేక కీలక అంశాలపై తీసిన ఫిల్మ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేశాయి.
 - ఓ మధు
 
మణిపూర్ చట్టాలకు వ్యతిరేకంగా 11 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ షర్మిల గురించిన చిత్రం ‘మై బాడీ మై వెపన్’ను కవితా జోషి రూపొందించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న యురేనియం మైనింగ్ మానవ జాతికి, పర్యావరణానికి ఎంతటి హానికారిగా మారనుందో అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైన్.. చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు.

కాకినాడ, కోనసీమ జాలర్లు, రైతులు భూదోపిడీకి గురవుతున్న తీరు గురించిన చిత్రం ‘ ఏ స్ట్రగుల్ ఫర్ సర్వైవల్’. అరుణాచల్‌ప్రదేశ్, డమ్రూలో ఆదివాసీలు నిర్మించిన బ్రిడ్జ్ ఇంజనీర్లను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తోంది. వారి నైపుణ్యం తెలిపే చిత్రం ఇన్ ది ఫారెస్ట్ హ్యాంగ్స్. ఇలా సామాజికాంశాలపై తీసిన చిత్రాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
 
3డీ స్టీరియో క్యాస్ట్
సంగీతానికి భాష, జాతి, లింగ విబేధాలు లేవంటారు. కానీ కుల వివక్ష వుందనిపిస్తుంది ఈ చిత్రం చూస్తే. మలయాళ సంగీత, నృత్య కళాకారులతో రూపొందిన ఈ చిత్రానికి దర్శకత్వం అజిత్ కుమార్ ఏఏస్. కులం వల్ల కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యల కళ్లకు కట్టారాయన. కుల వ్యవస్థకు సంబంధించిన మరో సమస్యాత్మక కోణాన్ని జాడు కట్ట చిత్రం ఆవిష్కరిస్తుంది.
 
టామ్ గాళ్
కొడుకులు లేకపోతే విలువ ఉండదని భావించిన ఓ తండ్రి కూతురిని అబ్బాయిలా పెంచుతాడు. ఆమె, ఆయనగా 70 ఏళ్ల జీవితాన్ని గడుపుతుంది. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇన్నేళ్ల తర్వాత తాను ఆడైనా, మగైనా ఒరిగేదేమీ లేదని చెప్పే టామ్ కళ్లలోకి చూస్తే... ఆ జీవితంలో వేదన కనిపిస్తుంది. స్త్రీత్వానికి దూరంగా గడిపిన టామ్ కథ చూసిన ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది.
 
లెట్ ద బటర్‌ఫ్లైస్ ఫ్లై
స్త్రీగా జీవితం గడపాలనుకుని జెండర్ మార్చుకుంది శిల్ప. అది బలవంతపు ప్రక్రియగా భావించిన పోలీసులు అందుకు సహకరించినవారిని అరెస్టు చేశారు. శిల్పను మళ్లీ పురుషుడిగా మార్చేందుకు సర్జరీ చేశారు. ఈ క్రమంలో శిల్ప తల్లిదండ్రులు, సన్నిహితులు ఎదుర్కొన్న పరిస్థితులు, వారు దగా పడ్డ తీరును డాక్యుమెంటరీలో చిత్రీకరించారు దర్శకులు గోపాల్ మీనన్.
 
సేవింగ్ ఫేస్
భర్త, ప్రేమించిన వ్యక్తుల చేతుల్లో అలాంటి దాడులకు గురైన పాకిస్తానీ స్త్రీల గాథ ఈ చిత్రం. ఈ దాడులను చూసి చలించిన లండన్‌లోని ప్రముఖ డాక్టర్ మహమ్మద్ జావేద్ ఈ స్త్రీలకు అందిస్తున్న సేవలు, వారి నిజ జీవిత గాథలను కళ్లకు కట్టారు డేనియల్ జంగ్, షర్మీన్ ఒబైద్ షెనాయ్.
 
మంచి ప్రయత్నం...
పారలల్ సినిమాలతో సమాజాన్ని సెన్సిటైజ్ చేసే ప్రక్రియకు ఆద్యుడు చార్లీచాప్లిన్. ప్రస్తుత సెమీ ఫాసిస్ట్ సొసైటీని సెన్సిటైజ్ చేసే సినిమాలు చాలా అవసరం. ఫాసిజానికి వ్యతిరేకంగా చిత్రాలు తీసినప్పుడు దాడులు జరుగుతున్నాయి. పీకే సినిమాపై దాడి ఇందుకు నిదర్శనం. సామాజిక సమస్యలపై చిత్రాలు తియ్యటం, చర్చించటం మంచి ప్రయత్నం.
 - ప్రొఫెసర్ హరగోపాల్
 
ఆనందంగా ఉంది...
డైవర్సిటీని, మానవ హక్కులను గౌరవించటం చాలా ముఖ్యం. అందుకు ఉపకరించే ఇలాంటి చిత్రాలు ప్రదర్శించటం ఆనందంగా వుంది.  
 - వసంత కన్నభిరన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement