సందట్లో జానపదం | Sandatlo folk | Sakshi
Sakshi News home page

సందట్లో జానపదం

Dec 22 2014 1:00 AM | Updated on Sep 2 2017 6:32 PM

వేడుకలు ఆడంబరాల వేదికలే తప్ప,సంప్రదాయానికి ఆనవాళ్లుగా లేవు అని పెదవి విరిచే వారిని పన్నీటి జల్లులా పలకరిస్తోంది జానపదం.

వేడుకలు ఆడంబరాల వేదికలే తప్ప,సంప్రదాయానికి ఆనవాళ్లుగా లేవు అని పెదవి విరిచే వారిని పన్నీటి జల్లులా పలకరిస్తోంది జానపదం. అడుగడుగునా పాశ్చాత్య పోకడలు తొంగి చూస్తున్న సంబురాల్లో పల్లె గాలి అల్లరి లేదని నీరసపడే పట్నవాసులను తెలుగుదనంలో పరవశింపజేస్తున్నాయి పల్లెపదాలు. వివాహం, సీమంతం, బారసాల, పుట్టిన రోజు వేడుక, చీరలు కట్టించడం.. ఇలా సందడి ఏదైనా సిటీలో జానపద పాటలు వీనుల విందు చేస్తూ ఫంక్షన్‌కు లోకల్ టచ్ ఇస్తున్నాయి.
 ..:: నిర్మలా రెడ్డి
 
పెద్ద పెద్ద వేదికలు, హుందాగా ఆహూతులు, వారి మధ్య వెలిగిపోతూ వధూవరులు, బాజాభజంత్రీల మోతలు.. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో వెలితి నేటి పెళ్లిళ్లలో అనుకునే వారి మదిని సంబురంలో ముంచెత్తుతూ.. ‘సువ్వి సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరు ఓలాల...’ అంటూ ఓ బృందం సుతిమెత్తగా మదిని తట్టిలేపుతుంది. నిన్నటి తరం పెళ్లి ముచ్చటను ఈ తరానికి పరిచయం చేస్తుంది. అందుకే ‘వనితలు మనసులు కుందెన చేసెటు వలపులు దంచెదరు ఓలాల.. కనుచూపులనెడు రోకండ్లతో కన్నెల దంచెదరు ఓలాల..’ అంటూ వేడుకకు సంప్రదాయపు అలంకారాలను అద్దుతున్నాయి జానపద బాణీలు.
 
ఏ తీరుకు ఆ పాట..

డీజే హోరులో తడిసిముద్దవుతున్న నేటి వేడుకలను ఆ పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి జానపద బృందాలు. రోలు, రోకటి అచ్చట్లు, వధూవరుల ముచ్చట్లు, అత్తాకోడళ్ల సవాళ్లు, వదినామరదళ్ల ఆటపట్టింపులు.. పెళ్లి వేడుక మొదలైన క్షణం నుంచి అప్పగింతలయ్యే వరకూ ప్రతి తంతునీ విడమరచి చె ప్పే పాటలు జానపదంలో వేలాదిగా ఉన్నాయి. మరుగున పడిపోతున్న
 ‘లాలి’త్యాన్ని వెలికి తీసి పల్లె బాణీల్లో బారసాల బుజ్జాయికి జోలపుచ్చుతున్నారు కళాకారులు.
 
కట్టు.. బొట్టు..

సిటీలో జరిగే పలు వేడుకల్లో ఇప్పుడు జానపదాలు పల్లవిస్తున్నాయి. ఇక్కడ పాటలు పాడేవారు పది మందికి తగ్గకుండా బృందంగా ఏర్పడతారు. వీరంతా వివిధ ఉద్యోగాల్లో ఉన్నవారూ, పాటలపై ఆసక్తి ఉన్నవారూ అయి ఉంటారు. అలాగే వారికి నాటి సంప్రదాయపు సొగసు కూడా తెలిసి ఉంటుంది. ఆ వేడుకకు తగ్గట్టు తమ ఆహార్యంతోనూ ఆకట్టుకుంటారు. పెద్దంచు పట్టుచీర , నుదుటన పెద్ద బొట్టు, తల నిండుగా పువ్వులు, చేతుల నిండుగా గాజులతో మహిళలు పెళ్లిలో హాస్యమాడే పాటలతో ఆకట్టుకుంటే.. మగవారు సంప్రదాయ పంచెకట్టుతో ఆనందాన్ని పంచుతారు.
 
తరం మారినా..

పెళ్లి సందడిలో వయసుతో నిమిత్తం లేదు. ఇక్కడ మూడు తరాల వారూ కోరుకునేది ఆనందమే. అందుకే అందరూ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని సౌండ్ పార్టీలు డీజేలతో సెలబ్రేట్ చేసుకుంటే, ఇంకొందరు ఆర్కెస్ట్రాలతో ఆహ్వానితులను ఎంగేజ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో వీటి స్థానంలో పాతదే అయినా ఈ తరానికి కొత్తదైన జానపద పాటలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా జానపదాలతో వేడుకలలో ఆకట్టుకుంటున్న కళాకారిణి స్నేహలతా మురళి మాట్లాడుతూ ‘నేను మొదట జానపద పాటలను పెళ్లిలో పాడటం మొదలుపెట్టినప్పుడు యువత అనాసక్తి చూపుతారేమో అని భయపడ్డాను.

కానీ, వారు పెళ్లికి డీజే పెట్టించుకుని, తర్వాత ఆ విషయమే మర్చిపోయి జానపద పాటల్లో లీనమవడంతో ధైర్యం వచ్చింది. నాతో నా స్నేహితులూ, ఆసక్తి గలవారు చేరడంతో మేమంతా బృందంలా ఏర్పడ్డాం. చిన్నాపెద్ద ఏ ఫంక్షన్‌కి ఆహ్వానించినా మా పాటలతో వారి వేడుకను ఆద్యంతం సంబురంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటాం. పెళ్లిలో వియ్యాలవారి మధ్య అరమరికలు తొలగడానికి ఈ పాటలు దోహదం చేస్తుంటాయి.

కొన్నిసార్లు పిల్లలు, పెద్దలు మాతో శృతి కలుపుతుంటారు. ఈ పాటలతో అప్పటి వరకూ ఉన్న స్తబ్ధత పోయిందని వేడుకకు వచ్చిన వారు చెబుతుంటే ఆనందం కలుగుతుంది. పదేళ్లుగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నటుడు మోహన్‌బాబు ఇంట పెళ్లికి, సీమంతానికి పాడాం. ఇంకా నగరంలో జరిగిన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వివాహ వేడుకల్లోనూ జానపద పెళ్లి పాటలు పాడాం’ అని తెలిపారు స్నేహలత.
 
అర్థం చెప్పే ‘పాట’వం..

పెళ్లి పాటలు పదిగురిలోకి చేరాలి. అవి కలకాలం ప్రజల నాలుకలపై ఆడాలి. సంప్రదాయపు సొబగులతో, అవి అందించే ఆశీస్సులతో వేడుకలు మరింత వేడుకగా మారాలి. ఇందుకు నగరంలోని జానపద బృందాలు ‘పాట’పడుతున్నాయి. ముహూర్తం పెట్టి పసుపు దంచింది మొదలు నలుగు పాట, విడి పాట, వియ్యపురాలి పాట, భోజనం బంతి పాట, పూల చెండ్ల పాట, అప్పగింతల పాట.. ప్రతి సందర్భానికీ పాటలే పాటలు. వీరు ఆ పాటలను పాడేసి ఊరుకోవడం లేదు. పాటల సమయ సందర్భాలను, వాటిలోని సాహిత్యాన్నీ అందాన్నీ పరిచయం చేస్తూ జనరంజకం చేస్తున్నారు.

పాటకు అనుగుణంగా అప్పటికప్పుడు యువతతోనూ చిందేయిస్తూ తామూ పాదం కలిపి పదం పాడుతుంటారు. మామూలుగా ఈ కార్యక్రమం కొత్తాపాత తేడా లేకుండా కలిసిపోవడానికే! యువతరంలో జోష్‌నందించడానికే అయినా దానికి మంచి గొప్ప ప్రయోజం కూడా కల్పిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు పెళ్లి పాటలు పాడతాం అని బృందాలుగా తయారవుతున్నారు. అన్నింటికీ ఉన్నట్టే పెళ్లిపాటలు పాడే బృందాలకూ ప్యాకేజీలు ఉన్నాయి. హృద్యంగా పాటలు పాడి, కార్యక్రమాన్ని ఆద్యంతం రంజింపజేసే వారినే అవకాశాలు అధికంగా పలకరిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement