వారిద్దరూ గుడ్బై చెబుతారా? | Questions spread over political future of Lagadapati Rajagopal and Undavilli Arunkumar | Sakshi
Sakshi News home page

వారిద్దరూ గుడ్బై చెబుతారా?

Published Fri, Dec 13 2013 1:02 PM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM

వారిద్దరూ గుడ్బై చెబుతారా? - Sakshi

వారిద్దరూ గుడ్బై చెబుతారా?

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కలత చెందిన సీమాంధ్ర ఎంపీలు ఇద్దరు ఏకంగా రాజకీయాలకు గుడ్బై చెబుతారనే వార్తలు ఊపందుకున్నాయి.

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కలత చెందిన  సీమాంధ్ర ఎంపీలు ఇద్దరు ఏకంగా రాజకీయాలకు గుడ్బై చెబుతారనే వార్తలు ఊపందుకున్నాయి. ఆంధ్రా ఆక్టోపస్గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్... రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని ఇప్పటికే బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే బాటలో ఉన్నట్లు సమాచారం.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా  సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత  ప్రజాభీష్టం మేరకు లోక్‌సభ సభ్యత్వానికి ఉండవల్లి రాజీనామా చేశారు. అంతేకాకుండా తెలంగాణ నోట్‌పై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినపుడు తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంగతి విదితమే. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, ఢిల్లీలోనే మకాం చేసి, రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలతో కలిసి సమాలోచనలు సాగిస్తున్న ఉండవల్లి, అనూహ్యంగా సహచరులతో కలిసి సొంత పార్టీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు ఇచ్చారు.

ఎన్నడూ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని ఉండవల్లి... అనూహ్యంగా అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. ఇంత కాలం నోరు మెదపకుండా ఉన్న ఆయన, నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన సమయంలో అదును చూసుకుని మిగిలిన ఎంపీలతో కలిసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి రాజకీయ భవిష్యత్తో పాటు ఆయన వ్యూహమేమిటన్న అంశంపైనే సర్వత్రా చర్చ నెలకొంది. అన్నిటికి సిద్ధపడ్డ ఆయన భవిష్యత్తులో ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెబుతారని తెలుస్తోంది.

ఇక లగడపాటి రాజగోపాల్ ... ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా పిల్లనిచ్చిన మామ ఉపేంద్ర కార్డును ఉపయోగించి ఏకంగా ఒకేసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తనవద్ద ఉన్న ‘పాశుపతం’తో అడ్డం పడతానని  ప్రకటించారు కూడా. అయితే తెలంగాణ ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపడం, అక్కడనుంచి రాష్ట్ర అసెంబ్లీకి రావటం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించినట్టు లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకోవాలి. మరి వీరిద్దరూ రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా అనేది తేలాలంటే మరికొద్ది రోజులుగా ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement