నిజాం స్పెషల్... పొగబండి | nizam special train | Sakshi
Sakshi News home page

నిజాం స్పెషల్... పొగబండి

Feb 25 2015 11:22 PM | Updated on Sep 2 2017 9:54 PM

నిజాం స్పెషల్... పొగబండి

నిజాం స్పెషల్... పొగబండి

874 అక్టోబరు 9... అక్కడో జాతర జరుగుతున్నంత హడావుడి ఉంది. నగరంలోనే ప్రముఖులుగా చెప్పుకొనేవారంతా అక్కడే ఉన్నారు. దూరంగా సాధారణ జనం గుమిగూడారు.

1874 అక్టోబరు 9... అక్కడో జాతర జరుగుతున్నంత హడావుడి ఉంది. నగరంలోనే ప్రముఖులుగా చెప్పుకొనేవారంతా అక్కడే ఉన్నారు. దూరంగా సాధారణ జనం గుమిగూడారు. దేనికోసమో ఎదురు చూస్తున్నారు.. వారిలో ఒకటే ఉత్సాహం. ఇంతలో దూరంగా గుప్పుమంటూ పొగ కనిపించింది. అంతే చప్పట్లు, ఈలల తో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. అతిథి రంగ ప్రవేశం. ఎంతో ఆశ్చర్యంగా అంతా అటువైపు ఎగాదిగా చూస్తూ సంభ్రమాశ్చర్యాలలో మునిపోయారు. ఆ వచ్చిన అతిథి రైలు! భాగ్యనగరం తొలిసారిగా రైలును చూసి మురిసిపోయిన రోజది.
 
సికింద్రాబాద్ - వాడీ మధ్య నడిచే ఆ రైలే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభమైన తొలి రైలు. అదే రోజు సికింద్రాబాద్ స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా బ్రిటిష్ ఇండియా రైల్వే సంస్థ రైల్వే వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటే దానికి భిన్నంగా సొంతంగా రైల్వేను ఏర్పాటు చేసిన ఘనత హైదరాబాద్‌కే దక్కింది. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించాలన్న ఉద్దేశంతో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ హయాంలో 1870లో ప్రస్తుత తెలంగాణలో రైలుమార్గం నిర్మించాలనే ఆలోచన మొగ్గ తొడిగింది.

వాడీ నుంచి తొలి లైన్‌ను సికింద్రాబాద్ వరకు నిర్మించి 1874న స్టేషన్ భవనాన్ని సిద్ధం చేశారు. హైదరాబాద్ స్టేట్ భారత్‌లో అంతర్భాగం కాదనే భావనను నరనరానా జీర్ణించుకున్న నిజాం... బ్రిటిష్ ఇండియా రైల్వే వ్యవస్థను దరి చేరనీయలేదు. 1870ల్లో నిజామ్స్ స్టేట్ రైల్వే ఆవిర్భవించింది. 1879లో ‘ది నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే’గా మారింది. ఇది 1950 వరకు కొనసాగింది. చివరకు 1951లో జాతీయమై భారత రైల్వేలో విలీనమైంది.
 
దీనికి అనుబంధ కంపెనీగా 1898లో హైదరాబాద్-గోదావరి వ్యాలీ రైల్వేను కూడా ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి 235 కిలోమీటర్ల మేర లైన్‌ను నిర్మించి 1881లో సింగరేణి కాలరీస్ కంపెనీతో అనుసంధానించారు. 1889లో ఆ లైన్‌ను విజయవాడ వరకు పొడిగించారు. ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టు (లైన్ నిర్మాణం) నిర్మాణానికి దశాబ్దాల సమయం పడుతుంటే... నిజాం మాత్రం 230 కి.మీ. మేర ట్రాక్, సికింద్రాబాద్ స్టేషన్ భవనాన్ని కేవలం నాలుగేళ్ల కాలంలో నిర్మించి రైలును ప్రారంభింపచేశారు.

సరుకు రవాణా కోసం నిజాం ప్రత్యేకంగా 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. ఇక్కడికి అప్పట్లో కేవలం గూడ్సు రైళ్లు మాత్రమే వచ్చేవి. 1921లో తొలి ప్యాసింజర్ రైలు ఆ స్టేషన్‌కు వచ్చి సాధారణ ప్రయాణికుల చేరవేత మొదలుపెట్టింది. దీనికి అదనంగా కాచిగూడ రైల్వేస్టేషన్‌ను 1916లో నిర్మించారు. 1904 నాటికి ఈ రైల్వే మూలధన వ్యయం రూ.4.3 కోట్లు. ఆ సంవత్సరంలో 28 లక్షల నికర ఆదాయాన్ని పొందటం విశేషం. హైదరాబాద్-గోదావరి వ్యాలీ రైల్వే రూ.7.8 లక్షల ఆదాయాన్ని పొందింది.
 
స్వరూపం ఇలా...
అత్రఫ్-ఇ-బల్దా జిల్లా (హైదరాబాద్) పరిధిలో 98 మైళ్ల లైన్ ఉండేది. దీని పరిధిలో ఏడు స్టేషన్లు నిర్మించారు. మెదక్ జిల్లా పరిధిలో 22 మైళ్లు, నిజామాబాద్ పరిధిలో 80 మైళ్లు, 10 స్టేషన్లు, నాందెడ్ జిల్లాలో 40 మైళ్లు, 6 స్టేషన్లు, పర్బణి పరిధిలో 63 మైళ్లు, 9 స్టేషన్లు, ఔరంగాబాద్ పరిధిలో 96 మైళ్లు, 11 స్టేషన్లు నిర్మించారు. నిజాం రైల్వే... భారత రైల్వేలో విలీనం అయ్యాక సికింద్రాబాద్ కేంద్రాన్ని బొంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న నాటి సెంట్రల్ రైల్వేలో భాగం చేశారు.

1966లో దాన్ని విభజించి సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటు చేశారు. హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ (ఏపీ ఎక్స్‌ప్రెస్) దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. దీన్ని 1976లో ప్రారంభించారు. 1677 కి.మీ. దూరాన్ని ప్రస్తుతం ఇది 26.30 గంటల వ్యవధిలో చేరుకుంటోంది. సగటు వేగం 64 కి.మీ. సికింద్రాబాద్ జంక్షన్ మీదుగా నిత్యం 210 రైళ్లు ప్రయాణిస్తున్నాయి.
 గౌరీభట్ల నరసింహమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement