నుదురును ముద్దాడే పాపిట బిళ్ల.. ముక్కును మెరిపించే ముక్కెర..
నుదురును ముద్దాడే పాపిట బిళ్ల.. ముక్కును మెరిపించే ముక్కెర.. వీనులకు పొందికైన దుద్దులు.. కంఠంలో మిరుమిట్లు గొలిపే ఆభరణాలు.. పాదాల అడుగులకు మడుగులొత్తుతూ ఘల్లుమనే గజ్జెలు.. ఇవన్నీ ఇంతులకు ఎంతో ఇష్టమైనవే. బోషాణంలో ఏడు వారాల నగలున్నా.. బీరువాలో పట్టు చీరల షోరూమ్ ఉన్నా.. కొత్తగా ఏది కనిపించినా.. ఇట్టే వలవేసి ఒడిసిపట్టడంలో మగువల ను మించిన వారుండరు. అందుకే ఫ్యాషన్ డిజైనర్లు రకరకాల ఫార్ములాలతో మార్కెట్‌లోకి వచ్చి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. కొత్తగా మేనిని హత్తుకునే వస్త్రాలను మరింత ముస్తాబు చేసేందుకు స్పెషల్ జ్యువెలరీని రూపొందిస్తున్నారు. దీంతో ఒంటిపై నగనిగలకు దీటుగా.. కట్టుకునే వస్త్రాలూ ధగధగలాడేలా
ముస్తాబవుతున్నారు ఫ్యాషన్ ప్రియులు.
ఒకప్పుడు చీరలకు అదనపు సొబగులు అంటే.. మ్యాచింగ్ బ్లౌజ్.. గోల్డ్ ఆర్ రోల్‌గోల్డ్‌లో మ్యాచింగ్ జ్యువెలరీ ఉంటే చాలనుకునేవారు. కొంత కాలానికి శారీస్‌కు లైస్ జతపరచో.. మగ్గం వర్క్స్‌తోనో అందాన్ని అద్దేవారు. ప్రస్తుతం చీరలకు కూడా నగలొచ్చేశాయి. శారీ బ్రూచెస్‌గా మార్కెట్‌లోకి వచ్చిన ఈ క్లాత్ జ్యువెలరీని ఈ తరం నారీలోకం తెగ ప్రేమించేస్తోంది. కొంగు బంగారంగా బాసిల్లుతున్న గంటలను తలదన్నే రేంజ్‌లో శారీ బ్రూచెస్ కనిపించే సరికి నయా ఫ్యాషన్‌ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు మహిళలు.
ముత్యాల సరాలు..
కొంగును మోస్తున్న భుజం నుంచి కుచ్చిళ్లను పట్టుకున్న నడుం వరకూ వేలాడే నాలుగు వరుసల ముత్యాల హారంపై క్రేజ్ ఎక్కువగా చూపిస్తున్నారు సిటీ స్త్రీలు. రెండు చివరల పెద్ద పెద్ద లాకెట్లు ఉండటం ఈ హారానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేనా, పూల ఆకారంలో మురిపించే లాకెట్లు ఒకవైపు.. మయూరాన్ని మరిపించేవి మరోవైపు.. మగువల మనసును దోచేస్తున్నాయి. కొంగు పిన్నులుగా, కుచ్చిళ్లకు పట్టుకొమ్మలుగా ఇమిడిపోతూనే.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.
గోల్డెన్ చాయిస్..
ఈ బ్రోచెస్ కేవలం శారీస్ మీదికే కాదు.. ఫ్యాషన్ వేరింగ్‌కు కూడా సూటవుతున్నాయి. చీరలకు, డ్రెస్‌లకు.. బోర్డర్లు, చమ్కీలు, కుందన్‌లు ఇవ్వలేని అందాన్ని ఈ బుల్లి లాకెట్లు ఇచ్చేస్తున్నాయి. వెస్ట్రన్ వేర్‌కు కూడా ఈ బ్రూచెస్ ఎలిగెంట్ లుక్ ఇస్తున్నాయి. అంతేకాదు వీటిని మల్టీ పర్పస్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. జడ బిళ్లలుగా, మెడలో హారంగా, చేతికి బ్రేస్‌లెట్‌గా, వంకీగా.. రకరకాలుగా ఇమిడిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ బ్రూచెస్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో.. జ్యువెలరీ స్టోర్స్ సైతం ప్యూర్‌గోల్డ్‌తో వీటిని రూపొందిస్తున్నారు. వజ్రాలు, రత్నాలతో ఫినిషింగ్ ఇస్తున్నారు. సిరిమంతుల స్త్రీలు ఒకడుగు ముందుకేసి.. ఈ కాస్ట్యూమ్స్ జ్యువెలరీని ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంటున్నారు.
సిరి