
న్యూయార్క్‌కు మన ఫ్యాషన్
నగరానికి చెందిన డిజైనర్ శిల్పారెడ్డి న్యూయార్క్‌లోని హడ్సన్ రివర్ వేదికగా తన అత్యాధునిక ఫ్యాషన్లకు మనదైన సంప్రదాయ పోచంపల్లి చేనేత వైభవాన్ని మేళవించి ప్రదర్శించనున్నారు.
నగరానికి చెందిన డిజైనర్ శిల్పారెడ్డి న్యూయార్క్‌లోని హడ్సన్ రివర్ వేదికగా తన అత్యాధునిక ఫ్యాషన్లకు మనదైన సంప్రదాయ పోచంపల్లి చేనేత వైభవాన్ని మేళవించి ప్రదర్శించనున్నారు. ఈ నెల 19న ఈ షో జరుగనుంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఎన్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గీతారెడ్డి, నటి రెజీనా కసాండ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ... ‘దేశంలో ఉన్నన్ని చేనేతలు మరెక్కడా లేవు.
ముఖ్యంగా తెలంగాణలోని గద్వాల శారీస్, సిద్ధిపేటలో గొల్లభామ శారీస్... ఇలా ఎన్నో ఉన్నాయి. మన చేనేతలకు మరింత చేయూత, మరింత ప్రచారం అవసరం. ఆధునిక యువతకు పోచంపల్లి, ఇకత్ వంటి సంప్రదాయ చేనేతలను చేరువ చేసేందుకు శిల్పారెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం’ అన్నారు. ‘పోచంపల్లి గొప్పతనం ఏమిటో ఈ డ్రెస్ (తాను ధరించిన డ్రెస్ చూపిస్తూ) ధరించాకే తెలిసింది. నాలా దీని గురించి తెలియని యూత్ ఇంకా ఉండే ఉంటారు. ఇది నిజంగా విచారించాల్సిన విషయం. ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్స్‌ని ఉపయోగించి వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌ను తలపించే అట్రాక్టివ్ డ్రెస్‌లు రూపొందించవచ్చునని ఇప్పుడే తెలిసింది. ఇకపై రెగ్యులర్‌గా నా వార్డ్‌రోబ్‌లో ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్స్‌కు చోటు ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది రెజీనా.
ఆర్గానిక్... నేచురల్...
అత్యంత సహజమైన పద్ధతిలో రూపొందించిన ఫ్యాబ్రిక్ పోచంపల్లి. ఇవి పూర్తిగా ఆర్గానిక్. ఇలాంటి చేనేతలను వినియోగించడం ఒక డిజైనర్ కనీస బాధ్యత అని నేను భావిస్తున్నాను. పారిస్‌లో నా డిజైన్లను ప్రదర్శించినప్పుడు మల్కా ఫ్యాబ్రిక్ వినియోగించా. ఆ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ ఫ్యాబ్రిక్స్‌కి ఇంటర్నేషనల్ వేదికల్లో ప్రాచుర్యం కల్పించేందుకు న్యూయార్క్‌లో నేను ఇచ్చే ప్రదర్శన హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నా... అన్నారు శిల్పారెడ్డి.
- సాక్షి, సిటీ ప్లస్