మన బాల్యం ఏమైపోతోంది?

మన బాల్యం ఏమైపోతోంది?


బాల్యం.. ఓ మధుర జ్ఞాపకం. అలాంటి బాల్యం కాస్తా ఇప్పుడు మసకబారిపోతోంది. కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు.. ఇలా అనేక అవలక్షణాలు బాల్యానికి కూడా అంటుకుంటున్నాయి. ఫ్యాక్షన్ గొడవలలో కూడా చిన్న పిల్లలను చూపించడం, వాళ్లతో తొడలు కొట్టించడం లాంటివి సినిమాల్లో ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిల్లలతో కూడా ప్రేమకథలు నడిపించడం, పిల్లల పాత్రలతో వాళ్ల వయసుకు మించిన డైలాగులు చెప్పించడం లాంటివి సమాజంపై తమ వంతు ప్రభావం చూపిస్తున్నాయి.



'రెచ్చగొట్టడం ఎలా ఉండాలంటే, ఇలాంటి దానికి కూడా రెచ్చిపోతారా అని చిన్న పిల్లలం మాకు కూడా అర్థం కానంతగా ఉండాలి' అని ఓ చిన్న పిల్లాడి పాత్రతో హీరోయిన్కు చెప్పించిన సీన్లు కొన్నిసినిమాల్లో ఇటీవలి కాలంలోనే కనిపించాయి. ఇలాంటివి పిల్లల మీద దుష్ప్రభావాలు చూపించకుండా ఎలా ఉంటాయో ఆ రచయితలు, దర్శకులే ఆలోచించాలి.



వరంగల్ జిల్లా నెక్కొండ ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడిన ఘటనకు ఇలాంటి సంఘటనలే నేపథ్యం అని చెప్పుకోక తప్పదు. రెండు కుటుంబాల మధ్య తగాదాలు ఉండటంతో ఒక కుటుంబానికి చెందిన పిల్లలు, మరో కుటుంబం వారి పరువు తీయాలని పథకం వేశారు. ఆ కుటుంబంలోని అమ్మాయితో స్నేహం నటించి, ఆమెను మభ్యపెట్టి, స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాదు.. ఆ అత్యాచారం దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీసి, దాన్ని ఎంఎంఎస్ రూపంలో స్నేహితులకు కూడా పంపారు!! ఇంకా మైనారిటీ కూడా తీరని పిల్లలకు ఇంత ఘోరమైన ఆలోచనలు ఎక్కడినుంచి వస్తున్నాయి?



పిల్లల మనసు చాలా లేతగా ఉంటుందని, మనం వాళ్లకు చూపించే దృశ్యాల ప్రభావం వాటిమీద చాలా వెంటనే పడుతుందని పిల్లల మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. భోజనం పెట్టడానికి టీవీలు చూపించడం, పదే పదే సినిమాలకు తీసుకెళ్లడం లేదా ఇళ్లలోనే సినిమాలు చూపించడం వల్ల వాళ్లలో హింసాత్మక ప్రవృత్తి పెరుగుతోందని అజయ్ కూచిభట్ల అనే ప్రవాస భారతీయ మానసిక వైద్య నిపుణుడు వివరించారు. ''గతంలో అయితే నాయనమ్మలు, అమ్మమ్మలు నీతి కథలు చెబుతూ ఎంతోకొంత మేర పిల్లలకు సానుకూల దృక్పథం ఏర్పడేందుకు తోడ్పడేవారు గానీ, ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దూరమైపోయి చిన్న కుటుంబాలు ఉంటుండటంతో అలాంటి నీతిబోధలు అందట్లేదు. ఇది పిల్లల ప్రవర్తనా తీరుమీద కూడా తీవ్ర దుష్ప్రభావం చూపిస్తోంది'' అని ఆయన చెప్పారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top