నానమ్మ.. బతుకమ్మ

నానమ్మ.. బతుకమ్మ


బిలోల శరణ్య ఉరఫ్ ‘తీన్మార్’ లచ్చవ్వ.. తెలంగాణ యాసను పోతపోసుకున్న అచ్చ తెలంగాణ పిల్ల! గా పిల్లకు బతుకమ్మ అంటే నానమ్మ.. నానమ్మ అంటే బతుకమ్మ! గా యాది గీమె మాటల్లనే ఇందాం..

 

 మా సొంతూరు నిజామాబాద్. వన్ ఇయర్ నుంచి ఇక్కడుంటున్నాను.  నాకు బతుకమ్మ పండుగ అనగానే మా నానమ్మే గుర్తొస్తది. ఆమె నాకు మంచి ఫ్రెండే కాదు గైడ్ కూడా!  బతుకమ్మ పండుగొచ్చిందంటే చాలు నానమ్మ వెనకాలే తిరిగేదాన్ని. బతుకమ్మ పండుగకి అందరం కలుస్తాం. పొద్దున్నే నాన్న, బాబాయ్‌లతో కలిసి నేనూ పూలు తేవడానికి వెళ్లేదాన్ని. ఒక్కో పువ్వుకి ఒక్కో కథ ఉంటది.. అవి మా నానమ్మ చెప్తేనే వినాలి. ఇక ప్రసాదాలైతే.. చెప్తుంటేనే నీళ్లూరుతున్నాయి. అటుకులు, పుట్నాలు, చక్కెరతో మొదలు సత్తుపిండి, పులిహోర దాకా అన్ని ప్రసాదాలు.. యుమ్మీ!

 

 షాపింగ్

 ఏవి ఎట్లున్నా ఇదైతే మస్ట్. కొత్త బట్టలు.. వాటికి మ్యాచింగ్ గాజులు.. వగైరా ఉంటేనే బతుకమ్మ పండుగ కలర్‌ఫుల్‌గా జరిగినట్టు. నేను రెడీ అవడం ఒకెత్తయితే మా చెల్లెలిని రెడీ చేయడం ఇంకొకెత్తు. నానమ్మ, పెద్దమ్మ, అమ్మ, పిన్ని, అత్త వాళ్లంతా బతుకమ్మను పేర్చడంలో బిజీగా ఉంటే మేమేమో మమ్మల్ని మేం సవరించుకోవడంలో బిజీగా ఉంటాం.

 

 బతుకమ్మ పాట..

 ఇందులో కూడా నానమ్మే బెస్ట్ అండ్ ఫస్ట్. ఎన్ని పాటలు పాడుతుందో!.. మంచి గొంతు. తను ఒక్కో లైను చెప్తుంటే మేమంతా ఉయ్యాల అని కోరస్ ఇస్తూ తను చెప్పిన లైన్‌నే మళ్లీ రిపీట్ చేస్తాం. సద్దుల బతుకమ్మ రోజు మా ఇంట్లోనే నిమజ్జనం చేస్తాం. మా వాకిట్లో బావి ఉంటుంది. సాయంత్రం వాకిలి ఊడ్చి, చాన్పిచల్లి పెద్ద ముగ్గేస్తాం. అంతకుముందే పేర్చిన బతుకమ్మను, పసుపు గౌరమ్మనూ దేవుడి ముందు పెట్టి పూజచేసి తర్వాత ఆ బతుకమ్మలో గౌరమ్మనుంచి వాకిట్లోకి తెస్తాం. ముగ్గుమీద పీటపెట్టి ఆ పీటమీద బతుకమ్మను పెడతాం. ఆ బావికీ పూజచేసి బతుకమ్మ ఆడతాం. ఆ తర్వాత బావి చుట్టు కూడా అయిదు చుట్లు తిరిగి బతుకమ్మను అందులో నిమజ్జనం చేస్తాం.

 

 హైదరాబాద్‌లో..

 ఇక్కడ బతుకమ్మను చూడ్డం ఇదే ఫస్ట్ టైమ్. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. తెలంగాణ రాష్ట్రం.. బతుకమ్మను గవర్నమెంట్ సెలబ్రేట్ చేయడం భలే అనిపిస్తోంది. సెంటర్స్‌లో బతుకమ్మలను పెట్టి డెకరేట్ చేయడం.. నెక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్‌ను డెకరేట్ చేయడం.. మామూలు టైమ్‌లో హైదరాబాద్‌కి.. ఇప్పటి హైదరాబాద్ లుక్‌కి ఎంతో డిఫరెన్స్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ కలిసి ఏ ట్యాంక్‌బండ్ మీదో.. నెక్లెస్‌రోడ్ దగ్గరో బతుకమ్మ ఆడ్డం.. ఎంత అద్భుతమైన అనుభూతి. కాంక్రీట్ జంగిల్‌లాంటి ఈ హైదరాబాద్‌లో చీకటి పడిందంటే చాలు ఏ మూల చూసినా.. కలర్‌ఫుల్ బతుకమ్మలు.. పూల రథాలు కదులుతున్నట్లు! ఈ బంగారు బతుకమ్మ ఇట్లనే ప్రతియేడూ రావాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్న!

 -  సరస్వతి రమ

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top