మా ఇంటికి రండర్రా

For your Arrival I Will be Waiting - Sakshi

వాకింగ్‌ రాగా  

రోజూ రండర్రా, నేను సాయంత్రాలు పార్కుకీ వస్తున్నానని మా ఇంటికి రాకుండా ఉండకండి. మీ ఇంటిల్లిపాదినీ తీసుకురండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా ఆంటీ పిలుస్తున్నారని మీ పిచ్చుక్‌ పిచ్చుక్‌ భాషలో చెప్పండి, కాసేపు కబుర్లాడుకుందాం.

ఱైఱైఱై మంటూ రెండు మినీ ట్రక్కులు నల్లటి పెట్రోలు బుసలొదులుకుంటూ పక్కన్నుంచి శరవేగంతో వెళ్లిపోయాయి. ఏంటో అంత రాచకార్యం వీళ్లకి? పవిటకొంగుని ముక్కుకడ్డెట్టుకుని, ప్రాణాలను అరచేతిలో  పెట్టుకుని నెమ్మదిగా ఫుట్పాత్‌ ఎక్కాను. పక్కనున్న పార్కులో కాసేపు తాజా గాలి పీల్చుకొద్దామని వెళ్లడమంటే రెండు మెయిన్‌రోడ్లు క్రాస్‌ చెయ్యాల్సిన పని. రెండుసార్లు పద్మవ్యూహంలో ఇరుక్కోవడమే! రోజుకో గంట నడిచి గూడు జాగ్రత్తగా చేరానంటే ఆ రోజు పల్నాటి యుద్ధం గెలిచినంత సంబరం!  రానున్న కాలంలో ఈ ఫుట్పాత్‌ కాన్సెప్ట్‌ కూడా ఉండదేమో అని భయం వేస్తుంది. పక్క సందులోకెళ్లాలన్నా, రోడ్డు దాటాలన్నా ఆటోలో వెళ్లే పరిస్థితి వస్తుందేమో!‘‘నడవండి ఆంటీ, మీరు డెయిలీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వాకింగు మానకండి. ఏభై ఐదు కిలోలు ఉండాల్సిన వాళ్లు ఎనభై ఐదు కిలోల పైన ఉన్నారు.

కనీసం ముప్ఫై కిలోలైనా తగ్గకపోతే కాళ్ల నొప్పులూ, కీళ్ల నొప్పులూ అని మున్ముందు చాలా బాధపడ్తారు. ‘ఒబేసిటీ ఈస్‌ ఏన్‌ ఓపెన్‌ ఇన్విటేషన్‌ ఫర్‌ మెనీ డిసీసెస్‌’ అని ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా!‘ అన్నాడు కిరీట్‌.‘‘ఓ ఆరు నెలలు డైట్‌ కంట్రోల్‌ చేసి, ఓ గంట బ్రిస్క్‌ వాక్‌ చేస్తే దీపికా పడుకోన్‌ లానో, రకుల్‌ ప్రీత్‌ లానో అయిపోతారని స్మైల్‌ చేస్తూ చెప్పాడు. కిరీట్‌ ఇప్పుడు ‘ఎంబీబిఎస్‌’ మూడో సం.లో ఉన్నాడు. చిన్నప్పుడు నన్ను ‘లావాంటీ, లావాంటీ‘ అని పిలిచేవాడు. వీడికి వేళాకోళం ఎక్కువైందని బాగా మందలించేదాన్ని. ఫాక్టే కదా అని అప్పుడప్పుడు ఊరుకునేదాన్ని! వాడి ప్రాణానికి నేనేనుగులా కనిపించేదాన్నో ఏమో! వాళ్ల అమ్మ స్మిత సన్నగా చిన్నగా వెల్లుల్లి పాయలా ఉండేదప్పుడు. నన్ను వదినా, వదినా అంటూ ఇప్పటికీ ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తుంది. ఎంతో కాలంనుంచీ ఇరుగుపొరుగిళ్లల్లో ఉంటున్నాం. అవసరానికి  చేదోడు వాదోడుగా ఉంటుంది స్మిత.కిరీట్‌ వాళ్ల నాన్న గారికి ఈ మధ్యనే నీ రీప్లేస్మైంట్‌ సర్జరీ అయ్యింది.

పాపం వాడు నేనిబ్బంది పడకూడదనే సదుద్దేశంతో జాగ్రత్త పడమని చెబుతున్నాడు. ఓవర్‌ వెయిటు ప్రాణాల మీదకొస్తోంది. ఎక్సర్‌సైజ్, వాకింగ్, డైటింగ్‌ తప్ప ఇంకో ఆప్షనేముందీ? ఎక్కడికెళ్లినా లావుగా ఉన్నవాళ్లు సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షనో లేక డిస్ట్రాక్షనో అవుతారు. పీత కష్టాలు పీతవన్నట్టు వాళ్ల బాధలు వీళ్లవి. నించుంటే ఆయాసం, కూర్చుంటే ఆయాసం. ఓ మంచి డ్రెస్‌ వేసుకుందామంటే సైజులు రావు.  విసుగొచ్చేస్తుంది. నాలో నేను మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉన్న పార్కులోని సిమెంటు బెంచీ మీద కాసేపు రెస్టు తీసుకుని, ఆ బూట్లవతల పెట్టి, ఓ పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేసి, ఆ ఆకుపచ్చని చల్లటి మఖ్మల్‌ లాంటి గడ్డి మీద ఓ అరగంట నడిచి ఏదో పరధ్యానంలోకి వెళ్లిపోతున్నప్పుడు ఓ చిట్టి పిట్ట చిట్టి ముక్కుతో నా పాదం పొడిచింది. ఏదో తీక్షణంగా గింజలు కామోసు వెత్తుక్కుంటోంది.

ఎంత నాజూకుగా ఉందో! దీనికి డైటింగు, వాకింగు, లివింగు అన్నీ ఇక్కడే! కాలుష్యంతో విషపూరితమైన మన పరిసరాల మధ్య ఈ చిన్నారి పిచ్చుకలు గూళ్లెక్కడ కట్టుకుంటున్నాయో? పసిగుడ్లనెలా వాటి పొదుగుల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నాయో? వాటి కన్న బిడ్డల ఆకలి ఎలా తీరుస్తున్నాయో? పిచ్చితల్లుల ప్రేమ ఏమని వర్ణించగలం? మనలా.. నరాల నొణికించే చలిని కాచుకోవడానికి హీటర్లా? వానల్లో పొడిగా ఉండేందుకు గొడుగులా? సూరీడు సెగలనడ్డుకుందుకు ఏసీలా? ఈ మాత్రం పార్కులింకా ఉన్నాయి కాబట్టి ఈ జీవరాశులకు నిలువనీడ ఉంటోంది. చెట్టుని, పుట్టని నమ్ముకున్న చిట్టి పొట్టి పిట్టలు, పావురాళ్లు, రామచిలుకలు, చిన్ని చీమలు, కాకమ్మలు,  మైనాలు ఎన్నెన్నో రకాల పక్షులు. పొట్టకోసం పుట్టెడు గింజల కోసం ఎన్నెన్ని పాట్లో, ఎన్నెన్ని అగచాట్లో! కొద్దిపాటి జీవితంలో ఎంత సుఖదుఖ్కాలెదుర్కుంటాయో? మనలానే అవీ వాటి  కష్టసుఖాలను ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకుంటాయా! ఈ మూగజీవులు శాంతంగా ఎంత ప్రసవ వేదన భరిస్తాయో.

ఈ చిన్ని ప్రపంచంలో మన నేస్తం కోసం మన ఇళ్ల లోగిళ్లలోకి వచ్చి వాలే ఈ బుజ్జి సందెళ్లకు ఆహ్వానం పలకాలని మా వాళ్లందరికీ చెబుతూనే ఉంటాను.పొట్టి ముక్కుతో, పొడుగు తోకతో, చిన్ని బొజ్జతో, హరివిల్లు రంగులు రంగరించుకొని వినువీధులలోని నీలిమేఘాలలో యవ్వనం, కారుమేఘాలలో ముసలితనం చవి చూచి నేలరాలిపోయే ఈ నేస్తాలు మనముందుకొచ్చిన క్షణం మనకెంత సంతోషాన్ని ఇస్తాయో! ఏదో నాలో నేను ఆ పిట్టలతో సంభాషించడం అలవాటైంది. కాసేపు వాటితో కబుర్లాడుతూ, హాయిగా ఊపిరితిత్తుల నిండా ఫ్రెష్‌గా గాలి పీల్చుకుంటూ, అవీ మనతోపాటు ఈ భూమ్మీద జీవనం సాగిస్తున్నందుకు ఎంతగానో సంతోషపడుతుంటాను.

 రోజూ మా ఇంటికొచ్చే పక్షులని చూసి  ‘‘ఎందుకర్రా, చిన్నారి పిచ్చుకలూ?  రోజూ నా బాల్కనీలో వాలతారు? మీకూ నాకూ ఏదో జన్మలో సంబంధమున్నట్టు పిచ్చాపాటీ పెడ్తారు? పర్లేదులే, మీకు నాలుగ్గింజలు నేను ప్రేమతో పెడతాను, రోజూ రండర్రా, నేను సాయంత్రాలు పార్కుకీ వస్తున్నానని మా ఇంటికి రాకుండా ఉండకండి. మీ ఇంటిల్లిపాదినీ తీసుకురండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా ఆంటీ పిలుస్తున్నారని మీ పిచ్చుక్‌ పిచ్చుక్‌ భాషలో చెప్పండి, కాసేపు కబుర్లాడుకుందాం. అఫ్కోర్స్‌ నా ఇంటికన్నా మీ ఇల్లే మేలు! కానీ మా ఇంటికి మీరొస్తే నాకెంతో ఉల్లాసంగా ఉంటుంది. మీకు రోడ్లు క్రాస్‌ చేసే పనీలేదు, ఫుట్‌పాత్‌ల గొడవ అసలే లేదు. చుట్టంచూపుగా అయినా రోజూరండి. మీరాక కోసం ఎదురుచూస్తూ వుంటాను. 
– సత్యశ్రీ నండూరి 

►‘‘ఓ ఆరు నెలలు డైట్‌ కంట్రోల్‌ చేసి, ఓ గంట బ్రిస్క్‌ వాక్‌ చేస్తే దీపికా పడుకోన్‌ లానో, రకుల్‌ ప్రీత్‌ లానో అయిపోతారని స్మైల్‌ చేస్తూ చెప్పాడు కిరీట్‌. ఇప్పుడు ‘ఎంబీబిఎస్‌’ మూడో సం.లో ఉన్నాడు. చిన్నప్పుడు నన్ను ‘లావాంటీ, లావాంటీ‘ అని పిలిచేవాడు.  

  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top