వెల్‌డన్ ఉడాన్
ఓ తక్కెడ తీసుకుందాం. ఒకవైపు ‘స్పోకెన్ ఇంగ్లిష్’ని పెడతాం. రెండోవైపు ఏం పెడదాం?! గంప నిండా నెం.1 ర్యాంకులు? ఇంగ్లిష్ లేవదు! ఆరడుగుల అందమైన విగ్రహం?ఇంగ్లిష్ లేవదు!ై నెకీ షూ, న్యారో ప్యాంట్, యారో షర్ట్? ఇంగ్లిష్ లేవదు!ఆడీ, షికార్ విత్ సమ్‌బడీ?
ఓ తక్కెడ తీసుకుందాం. ఒకవైపు ‘స్పోకెన్ ఇంగ్లిష్’ని పెడతాం. రెండోవైపు ఏం పెడదాం?!
గంప నిండా నెం.1 ర్యాంకులు? ఇంగ్లిష్ లేవదు! ఆరడుగుల అందమైన విగ్రహం?ఇంగ్లిష్ లేవదు!ై నెకీ షూ, న్యారో ప్యాంట్, యారో షర్ట్? ఇంగ్లిష్ లేవదు!ఆడీ, షికార్ విత్ సమ్‌బడీ?
ఇంగ్లిష్ లేవదు! పవర్ అండ్ పలుకుబడి? ఇంగ్లిష్ లేవదు! మరెలా తక్కెడ ఈక్వల్ అవడం?
కుంగ్‌ఫూకి కుంగ్‌ఫూనే సమాధానం.‘స్పోకెన్’కి ‘స్పోకెనే’ సమతూకం. దటీజ్... ఇంగ్లిష్ వెయిట్! బస్తీ పిల్లలలో ఈ వెయిట్‌నిపుటప్ చేసేందుకు‘ఉడాన్’ వేసిన స్టెప్పే...ఈవారం మన ‘ప్రజాంశం’.
ఉడాన్ అనే పేరు వెనుక
ఉడాన్ అంటే ఎత్తుకి ఎగరడం, పైకి ఎదగడం అని అర్థం. ఎక్స్‌ప్లోర్ మాస్టర్‌మైండ్స్ అనే క్యాప్షన్‌తో ప్రారంభించాం. మా లోగో ఎగురుతున్న గ్రద్ద. ఈ చిహ్నాన్ని ఎందుకు తీసుకున్నామంటే... గ్రద్ద జీవితకాలం 35-40 ఏళ్లు. దీనికి ముప్పై ఏళ్లు నిండేసరికి ముక్కును రాతికి గీకి గీకి ఊడగొట్టుకుంటుంది. అలా చేస్తే దానికి తిరిగి కొత్త ముక్కు వస్తుంది, కొత్త ముక్కు వస్తే జీవితకాలం మరో 30 ఏళ్లు పెరుగుతుందని కథనం. అలా తన జీవితకాలాన్ని పెంచుకునే శక్తి ఉన్నది, ఎత్తుకి ఎగరగలిగినది, తీక్షణమైన చూపున్న పక్షి ఇదే.
చారు షా... హైదరాబాద్ బేగంపేటలోని గీతాంజలి స్కూల్‌లో టీచర్. అయితే అది ఒకప్పుడు. ఇప్పుడు అదే బేగంపేటలో పాటిగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్ పాఠాలు నేర్పిస్తున్నారు. ట్రాన్స్‌ఫర్‌లు ఇలా కూడా ఉంటాయా? మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఐసిఎస్‌ఇ సిలబస్ చెప్పిన టీచర్లను కూడా నియమిస్తున్నారా! అదేమీ కాదు. చారు షా తనకు తానుగా స్వచ్ఛందంగా ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్నారు. ఇది తానొక్కరే చేస్తున్న సేవ కాదు, 70 మంది మహిళల టీమ్‌వర్క్ వీళ్లది.
గుజరాతీ కుటుంబానికి చెందిన చారు షా పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఉస్మానియా యూనివర్శిటీలో ఎం.ఎ ఇంగ్లిష్ లిటరేచర్ చదివారు. షేర్‌మార్కెట్ వ్యాపారంలో భర్త, ఉన్నతవిద్య కోసం యుఎస్ వెళ్లిన కొడుకు, ఫైన్ ఆర్ట్స్ చదువుతూ పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్లిన కూతురు... ఇదీ ఆమె కుటుంబం. తనకంటూ ఒక కొత్తబాధ్యతల కోసం చేరిన గీతాంజలి స్కూలు ఉద్యోగమే ఆమెను సేవామార్గంలో నడిపించింది. ‘‘గీతాంజలి స్కూల్‌లో పని చేస్తున్నప్పుడు మా క్లాస్ విద్యార్థుల తల్లులు స్కూలుకు వచ్చినప్పుడు వాళ్లను ‘మీ పిల్లలు ఆడుకుని పాతవైపోయిన బొమ్మలు ఇంట్లో వృథాగా ఉన్నాయనిపించిన వాటిని ఇస్తే, బస్తీలలో నివసించే పిల్లలకిస్తా’నని చెప్పేదాన్ని. చాలామంది పేరెంట్స్ వాళ్ల ఇళ్లలో వృథాగా మూలన పడి ఉన్న బొమ్మలిచ్చేవాళ్లు. వాటిని బస్తీలలో ఉన్న స్కూళ్లకెళ్లి ఇచ్చేదాన్ని. ఒకసారి అలా బొమ్మలిచ్చిన తర్వాత ‘ఇంకా ఏమైనా కావాలా’ అని అడిగాను. క్లాస్ రూమ్‌లో ఫ్యాన్ వంటివి అడుగుతారనుకున్నాను. అప్పుడు ఆ స్కూల్ హెడ్‌మిస్ట్రెస్ ‘మా స్కూల్లో చాలా తెలివైన పిల్లలున్నారు కానీ అందుకు తగిన శిక్షణ ఇచ్చే సౌకర్యాలు లేకపోవడంతో అలాగే ఉండిపోతున్నారు. క్లాసుపుస్తకాలలో ఉన్న పాఠాలు వల్లెవేయడానికే పరిమితమవుతున్నారు, ఈ స్కూళ్లలో చదివే పిల్లలకు స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో పై చదువులు చదివినా కూడా ఉద్యోగాల్లో వెనుకబడుతున్నారు. వారికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పి, ఆంగ్లపరిజ్ఞానాన్ని పెంచేందుకు సాయపడగలిగితే బావుంటుంది’ అని సూచించారు. నిజమే కదా అనిపించి... మొదట మా ఎయిర్‌లైన్స్ కాలనీ పక్కనే ఉన్న పాటిగడ్డ బస్తీ పిల్లలను సమీకరించి మా ఇంట్లోనే కొద్దిరోజులు ఇంగ్లిష్ పాఠాలు నేర్పించాను.
బస్తీ పిల్లల్లో చాలామంది ఖాళీ సమయాల్లో రెండు- మూడు ఇళ్లలో పాత్రలు కడగడం వంటి పనులు చేస్తుంటారు. ఆ సమయాన్ని నేను తీసుకోవడంతో నా ప్రయత్నం సక్సెస్ కాలేదు. ఒకరోజు వచ్చిన వాళ్లు మరోరోజు వచ్చే వాళ్లు కాదు. ఇది కాదు పద్ధతి, వేరే మార్గం ఏదో ఆలోచించాలనుకుంటున్నప్పుడు మా అన్నయ్య ఓ సలహా ఇచ్చాడు. ఆ ప్రకారం వెంటనే ‘ఉడాన్’ ఫౌండేషన్ స్థాపించి, స్కూళ్లకు వెళ్లి పాఠాలు చెప్పడం మొదలు పెట్టాను. పాఠశాల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి వారి అనుమతితో వారంలో ఒకరోజు పదకొండు నుంచి పన్నెండున్నర వరకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పేటట్లు ఏర్పాటు చేసుకున్నాం. మేము చెప్పే పాఠాలకు సిలబస్‌గా ఒక గ్రామర్ బుక్, ఒక స్పోకెన్ ఇంగ్లిష్ బుక్ తయారు చేసుకున్నాను. వాటిని మా అన్నయ్య మా అమ్మ పేరుతో ముద్రించి ఇచ్చాడు. ఈ ప్రోగ్రామ్‌ని మొదలు పెట్టింది కూడా రెండేళ్ల క్రితం ఆగస్టు 2న మా అమ్మ పుట్టినరోజు నాడే.
తొలి అడుగులో ఆసరా...
ఉడాన్ ఫౌండేషన్ మొదలుపెట్టేనాటికి నాకు సహాయంగా ఉన్నది మొనాలి షా, మనీష్ కుశల్‌దసాని ఇద్దరే. ఇప్పుడు మా నెట్‌వర్క్‌లో డెబ్బయ్ మందికి పైగా మహిళలు ఉన్నారు. హైదరాబాద్‌లో ఏడు పాఠశాలలను దత్తత తీసుకున్నాం. ఒక్కో స్కూల్‌కి పదేసిమందితో టీమ్‌గా ఏర్పడి క్లాసులు తీసుకుంటున్నాం. వాళ్ల పెర్‌ఫార్మెన్స్ పరీక్షించడానికి నెలకోసారి టెస్ట్‌లు పెడతాం. రోజూ పదినిమిషాలు ఇంగ్లిష్‌వార్తలు, కనీసం అరగంటసేపు ఇంగ్లిష్ సినిమా చూడమని చెప్తాం. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు చెప్పుకునే కబుర్లు కూడా ఇంగ్లిష్‌లోనే ఉంటేనే భాష త్వరగా వస్తుందని చెప్తుంటాం. పిల్లలు అలాగే నేర్చుకుంటున్నారు కూడ. ముఖ్యంగా అమ్మాయిలైతే ‘మా అన్న ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు, నేనిప్పుడు మా అన్నతో సమానంగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నాను’ అని ఆనందంగా చెప్తుంటారు. మేము క్లాసులు తీసుకుంటున్న బస్తీల్లో ఎక్కువమంది మగపిల్లల్ని ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చేరుస్తూ ఆడపిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు.మా ఉడాన్ సేవలు ఇలాంటి అమ్మాయిలకు బాగా ఉపయోగపడుతున్నాయి.
ఫేస్‌బుక్‌తో విస్తరించాం!
ఉడాన్ స్థాపించిన మొదట్లో నేను ఏ ఫంక్షన్‌కి వెళ్లినా, గెట్ టు గెదర్‌కెళ్లినా అక్కడి మహిళలకు ఈ విషయాన్ని చెప్పి ఆసక్తి ఉంటే సర్వీస్ చేయమని కోరేదాన్ని. అలాగే ఫేస్‌బుక్‌లో కూడా రిక్వెస్ట్ పెట్టాను. అలా భావసారూప్యం కలిగిన వాళ్లంతా ఒకచోట చేరారు. ఇదో మానవహారంగా విస్తరించింది. ఇప్పుడు ముంబయి, పుణే నగరాల నుంచి కొంతమంది తాము కూడా వాళ్ల నగరాల్లో ఇలాంటి సర్వీస్ చేయాలని ఉందని తెలియచేశారు. వాళ్లకు మేము అనుసరించిన విధానాలు చెప్పాను. అవసరమైతే అక్కడికి వెళ్లి గైడ్ చేసి వస్తాను. మనరాష్ట్రంలో కూడా ఎవరైనా ఇలాంటి సర్వీస్ చేయడానికి ముందుకు వస్తే వారికి నా సిలబస్ ఇచ్చి, నెట్‌వర్క్ ఎస్టాబ్లిష్ అయ్యేవరకు సహకరిస్తాను. ఇక కంప్యూటర్ లేని స్కూళ్లలో పిల్లలకు దగ్గరలోని కంప్యూటర్ సెంటర్‌లో శిక్షణనిప్పిస్తున్నాం. ఇప్పటి వరకు 200 మందికి కంప్యూటర్ శిక్షణనిప్పించాం. ఇంగ్లిష్ పాఠాలు దాదాపుగా రెండువేల మంది నేర్చుకుని మాట్లాడుతున్నారు.
పాఠశాలల వెతుకులాట...!
మాకు పాఠాలు చెప్పడంలో ఇబ్బందులు రాలేదు, కానీ మా సర్వీస్ అవసరమైన స్కూళ్ల వెతుకులాట పెద్ద సమస్య అయింది. గూగుల్‌లో వెతికి 20 పాఠశాలలతో జాబితా తయారు చేసుకుని వాటి కోసం వీధుల్లో వెతుకులాట మొదలుపెట్టాను. ఫైనల్‌గా ఐదు పాఠశాలలను షార్ట్‌లిస్ట్ చేసుకున్నాను. కొన్ని స్కూళ్లలో హెడ్‌మాస్టర్లు పాఠాలు చెప్పడానికి మమ్మల్ని అనుమతించడానికి భయపడ్డారు. ఆ పై అధికారులను సంప్రదించి వారిని సమాధానపరచడం వంటి మైలురాళ్లను అధిగమించిన తర్వాత ఇప్పుడు సాఫీగా సాగుతోంది.
మా స్కూళ్లలో పిల్లలు ఇంటి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వాతావరణం దృష్ట్యా కొంత రెస్ట్‌లెస్‌గా కనిపించేవారు. మా టీమ్ మెంబర్స్ కొందరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసులు ఇస్తే బావుంటుందని సూచించారు. నిపుణులతో ఆ క్లాసులు కూడా నిర్వహించాం. ఈ పిల్లలందరికీ మాతృభాష వచ్చినంత అనర్గళంగా ఇంగ్లిష్ కూడా నేర్పించాలనేదే మా ప్రయత్నం’’.‘తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదు, అందరికీ ఉంటాయి. అట్టడుగు స్థాయిలో జీవించే కుటుంబాల్లో పిల్లలు అవకాశాలు లేక మరుగున పడకూడదు’ అనే ఆశయంతో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఆశించిన ప్రభుత్వ ప్రణాళిలను చూశాం. ఆ పనిని అక్షరాలా చేసి చూపిస్తున్న మహిళాశక్తిని ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి నగరంలో ఒక సేవాసంస్థ ఇలాంటి సేవకు అంకితమైతే... తెలివితేటలు ఉండి, తమకు ఇంగ్లిష్ రాకపోవడంవల్ల తమ భావాలను సరిగా వ్యక్తం చేయలేక పోతున్నామే అని ఏ ఒక్క విద్యార్థీ ఆత్మన్యూనతతో బాధపడవలసిన అవసరం ఉండదు.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి; ఫొటోలు: శివ మల్లాల


