వైద్యుడు కోరుకున్న సంపద

The wealth the doctor wanted - Sakshi

చెట్టు నీడ

ఇది చాలా పురాతన సంఘటన. ఒకసారి బుఖారా చక్రవర్తి బాగా జబ్బు పడ్డాడు. రాజవైద్యులు ఎంత వైద్యం చేసినా, ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించలేదు. ఎంతో మంచివాడు, దయార్ద్ర హృదయుడైన చక్రవర్తి జబ్బు పడ్డాడని తెలిసి ప్రజలంతా ఆందోళన చెందసాగారు. గొప్ప గొప్ప వైద్య నిపుణుల చికిత్సకు కూడా జబ్బు ఏ మాత్రం తగ్గలేదు. దీంతో, చక్రవర్తికి సరైన వైద్యం చేసిన వారికి కోరిన బహుమతి ఇవ్వబడుతుందని బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. ఒక యువకుడు రాజదర్బారుకు వచ్చి, రాజుగారికి వైద్యం చేస్తానని ముందుకొచ్చాడు.  ఆ యువ వైద్యుణ్ణి చూసి, తమ వల్ల కానిది ఈ కుర్ర వైద్యుడివల్ల ఏమవుతుందని పెద్దవాళ్లంతా గుసగుసలాడుకున్నారు.  చక్రవర్తికి కూడా నమ్మకం కుదరలేదు. అయినా ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా సరేనన్నారు. వైద్యం మొదలైంది. కొద్దిరోజుల్లోనే చక్రవర్తి ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చింది. మరికొద్ది రోజుల్లో లేచి తిరగడం ప్రారంభించాడు. చివరికి పూర్తిగా స్వస్థత పొందాడు. అందరూ సంతోషించారు. ఒకరోజు చక్రవర్తి సభ ఏర్పాటు చేసి యువ వైద్యుణ్ణి ఘనంగా సత్కరించాడు.

‘అపారమైన సంపద, వజ్ర వైఢూర్యాలు సిద్ధంగా ఉన్నాయి. కోరుకున్నది దక్కుతుంది. నీకేం కావాలో కోరుకో’ అన్నాడు. సభికులు, మంత్రులు అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఎంత సంపద కోరుకుంటాడో, ఎంతడిగినా చక్రవర్తి కాదనే ప్రసక్తేలేదు అనుకున్నారు. కొద్ది క్షణాలు యువకుడు కూడా మౌనం వహించాడు. ఆ యువ వైద్యుడు మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ‘‘మహారాజా..! నాకు మీ గ్రంథాలయంలో అధ్యయనం చేసుకోడానికి కొన్నిరోజులు అనుమతించండి.’అన్నాడు. ఈ కోరిక విని సభికులు, మంత్రులే కాదు, స్వయంగా చక్రవర్తి కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. చదువు, అధ్యయనం పట్ల అతనికున్న శ్రద్ధను చూసి ఎంతో అబ్బురపడ్డాడు. కోరినంత సంపద కళ్ల ముందు సిద్ధంగా ఉన్నా, దాన్ని కాదని గ్రంథాలయంలో అధ్యయనం చేసుకోడానికి అనుమతి కోరిన ఆ యువ వైద్యుని సంస్కారానికి సలాం చేశాడు. ఆ యువ వైద్యుడే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్య పితామహుడు ఇబ్నెసీనా అలియాస్‌ అవెసీనా.
– మదీహా 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top