గ్రామీణ మహిళలు మాస్కులు.. శానిటైజర్ల తయారీ

Village Women Manufacturing Masks And Sanitizers - Sakshi

వైరస్‌ నుంచి రక్షణ

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలోని గ్రామాల్లో ఎనిమిది మహిళా సంఘాల సభ్యులు మొత్తం 46 మంది మహిళలు ఇళ్లలో ఉండే కాటన్‌ మాస్క్‌లు, శానిటైజర్లు తయారుచేస్తున్నారు. వీరి నుంచి మాస్క్‌లు, శానిటైజర్లు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మరికొన్ని మహిళా సంఘాలూ ఈ పనుల్లో పాల్గొనున్నాయి.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో మాస్క్‌లు, శానిటైజర్లు ప్రధాన అవసరాలుగా మారాయి. దీంతో మార్కెట్లో 10 రూపాయల మాస్క్‌ రెట్టింపు ధరతో అమ్ముతున్నట్టు, శానిటైజర్ల కొరత అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆందోళన కలిగించే ఇలాంటి సమయంలో వైరస్‌ల నుండి రక్షించడానికి అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్ల కొరతను పరిష్కరించడానికి గ్యాలియర్‌ జిల్లాలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్యాలియర్‌ జిల్లా గ్రామాల్లోని మహిళల చొరవతో మాస్క్‌ల తయారీ మొదలైంది. జిల్లాలోని ఎనిమిది మహిళా సంఘాల సభ్యులు ముందస్తుగా మాస్క్‌లు తయారుచేయడం ప్రారంభించారు. ఈ మాస్క్‌లు ఒక్కోటి రూ.10 చొప్పున అమ్మాలనే నిర్ణయంతో çపూల్‌ బాగ్‌లోని హాత్‌ బజార్‌లో మాస్క్‌లను అందుబాటులో ఉంచారు.

ఇప్పటి వరకు 46 మంది మహిళలు 900 మాస్క్‌లు తయారుచేశారు. వీటిని ప్రత్యేక పద్ధతుల్లో శుభ్రపరిచి సిఎంహెచ్‌ఓ కార్యాలయం, ఇతర ఆరోగ్య సంస్థలకు సరఫరా చేశారు. దీంతో ఇప్పుడు దాదాపు రెండు లక్షల మాస్క్‌ల తయారు చేయడానికి ప్రభుత్వం నుంచి, ఇతర ఆరోగ్య సంస్థల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఫలితంగా మరికొంతమంది మహిళలు ఈ పనిలో చేరారు. ఎం.పి రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద జిల్లాలో 2,375 మహిళా సంఘాల గ్రూపులు ఉన్నాయి. వీరిలో 862 మంది కుట్టుపనిలో భాగస్వాములు అవుతున్నారు. మిగతా వారంతా శానిటైజర్‌ తయారు చేసే పనిలో నిమగ్నం కానున్నారు. ఒక లీటరు శానిటైజర్‌ బాటిల్‌ను రూ.100కు అందించే ఏర్పాటు చేస్తున్నారు. రాయారులోని మద్యం కర్మాగారాన్ని శానిటైజర్‌ తయారీకి, ప్యాక్‌ంగ్‌కి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఈ పనులను పూర్తి చేయాలని గ్రామపరిపాలన విభాగాన్ని కోరింది. గ్రామీణ మహిళలు ఓ అడుగు ముందుకేసి తక్కువ ఖర్చుతో మాస్కులు, శానిటైజర్లు తయారుచేసి విక్రయించనున్నారు. డిమాండ్‌కు తగినట్టు పనులు వేగవంతం అవుతున్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top