వేరు చెయ్యకు పేరయ్యా

Two Young Women Protest on Color Filter in Matrimonial Websites - Sakshi

లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌. నలుపూ తెలుపు చూసుకోదు ప్రేమ. పెళ్లిళ్ల సైట్‌లే.. నాట్‌ కైండ్‌! అన్నీ చూస్తాయి.అడుగులు.. అంగుళాలు..ఆస్తులు.. అంతస్థులు..చేస్తున్న ఉద్యోగం.. వస్తున్న జీతం..రంగు కూడా!
‘కూడా’ ఏంటి! రంగే మెయిన్‌.ఇద్దరమ్మాయిలకు ఇది నచ్చలేదు.రంగుతో వేరు చెయ్యొదన్నారు.రంగు ‘ఫిల్టర్‌’ను తీయించేశారు.

అబ్బాయికి అమ్మాయిని వెదకాలి. అమ్మాయికి అబ్బాయిని చూడాలి. వెదకడానికి, చూడ్డానికి తేడా ఉంది. ‘వెదకడం’ అంటే అబ్బాయికి అమ్మాయి దొరకడం లేదని! ‘చూడడం’ అంటే అబ్బాయిలు కాళ్లకు చేతులకు అడ్డం పడుతున్నారని! మరీ మునుపటిలా లేవు రోజులు. కొద్దిగా తారుమారయ్యాయి. వధువులు దొరకడం కష్టమైపోయింది. ఇంత కష్టమైపోయినా కూడా అబ్బాయిలు ఒక విషయంలో మాత్రం ‘ఎస్‌’ అందామా, ‘నో’ అందామా అని ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ ఆలోచన.. అమ్మాయి ఒంటి రంగు గురించి! వధువు తెల్లగా ఉండాలి. పెళ్లిచూపుల్లో అయినా అదే చూపు, ఆన్‌లైన్‌ పరిచయ వేదికల్లో అయినా అదే చూపు. మగవాళ్లలో రంగును చూసే అమ్మాయిలు ఉంటే ఉండొచ్చు. అది రెండో చాయిస్‌గానే ఉంటుంది. ఫస్ట్‌ చాయిస్‌ మాత్రం ‘అబ్బాయి మంచివాడైతే చాలు’ అనే.

పైకి ఎన్నిచెప్పినా పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి పెద్దవాళ్లందరి ‘ఔట్‌లుక్‌’ ఒకేలా ఉంటుంది. పిల్లల ‘ఫస్ట్‌ లుక్‌’ వేరుగా ఉంటుంది. పిల్లల్ని అలా వదిలేద్దాం. వాళ్లు చూసేది ఎలాగూ రంగును కాదు, వాళ్లు చేసుకునేదీ రంగును కాదు. పెద్దవాళ్లయితే మాత్రం కచ్చితంగా ఈడూజోడూ చూస్తారు. పిల్లకన్నా పిల్లవాడు రెండంగుళాలైనా ఎత్తుండేలా చూసుకుంటారు. ఎత్తు చూసే ముందే.. ఉద్యోగంలో ఎంత ఎత్తుకు ఎదగగలడో చూసుకుని ఉంటారు. ఆస్తులు ఉంటే మంచిదే. తోబుట్టువులు పెద్దగా లేకుంటే మరీ మంచిది. ఇన్ని ఉంటాయి. అన్నీ కుదిరితే అప్పుడు అబ్బాయి రంగును కూడా కుదురుతుందేమోనని చూస్తారు. అబ్బాయి వైపు వాళ్లయితే ముందుగా పిల్ల రంగును చూసుకుంటారు. తర్వాతే మిగతావన్నీ. అందుకే మ్యాట్రిమోనియల్‌ సైట్స్‌లో కూడా ‘ఒంటి ఛాయ’ కాలమ్‌ మస్ట్‌గా కనిపిస్తుంటుంది. పెళ్లి సైట్‌లకు ఫొటో, వివరాలు ఇచ్చేవారు.. ఫొటోలో ఎలా ఉన్నా, రంగును మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయాలి. తెలుపు అనీ, నలుపు అని, మరీ నలుపు కాదనీ, నలుపు కంటే కాస్త తక్కువని, చామన చాయ కంటే పిసరంత ఎక్కువనీ.. డీటెయిల్డ్‌గా ఇవ్వాలి. ‘షాదీ డాట్‌ కామ్‌’ ఇండియాలో పేరున్న పెద్ద పెళ్లిళ్ల పేరయ్య. ఆ సైట్‌లో రంగుకు ఏకంగా ఒక స్కిన్‌ కలర్‌ ఫిల్టరే ఉంటుంది. ఫెయిర్, వీటిష్, డార్క్‌. ముట్టుకుంటే కందిపోవడం ఫెయిర్‌. గోధుమ రంగులో ఉండటం వీటిష్‌. డార్క్‌ అంటే నలుపు. ఇప్పుడు ఈ ఫిల్టర్‌ని షాదీ డాట్‌ కామ్‌ తొలగించబోతోంది! పెద్ద విషయమే అనుకోవాలి. హీతల్, మేఘన్‌ అనే ఇద్దరు అమ్మాయిలు రంగును పెద్ద విషయం చెయ్యబట్టే షాదీ డాట్‌ కామ్‌ చిన్న విషయంగా కొట్టివేయలేకపోయింది.

హీతల్‌ సంతకాల ఉద్యమం స్క్రీన్‌షాట్‌
పెళ్లీడుకొచ్చిన పిల్లల ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’లో ఏ రంగూ లేని ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఇదే పిల్లలు పెళ్లిళ్ల సైట్‌కి వెళ్తే మాత్రం మొదట క్లిక్‌ కొట్టేది రంగునే. ఆ కేటగిరీలోకి వెళ్లి ఇక ఆ దారంటా అన్వేషణ మొదలు పెడతారు. మానవ స్వభావం. సైట్‌ల వాళ్లను కూడా తప్పు పట్టేందుకు లేదు. కస్టమర్‌కి కావలసింది ఇవ్వలేకపోతే కొన్నాళ్లకు సైటే లేకుండా పోతుంది. అయితే మేఘన్‌ నాగ్‌పాల్‌ అనే యువతి దీన్నొక తప్పు పట్టకూడని విషయంగా తీసుకోలేకపోయారు. షాదీ డాట్‌ కామ్‌ ఎగ్జిక్యూటివ్‌ దృష్టికి తీసుకెళ్లి సైట్‌లోని ఆ కలర్‌ ఫిల్టర్‌లను తొలగించమని కోరారు. ‘‘కానీ మేడమ్‌.. చాలామంది పేరెంట్స్‌ ముఖ్యంగా రంగు గురించే మమ్మల్ని అడుగుతుంటారు’’ అని సమాధానం వచ్చింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో చర్చకు పెట్టారు మేఘన్‌. నిజమే ఈ ‘వర్ణవివక్ష’ ఏమిటి అన్నట్లు అంతా ఆమెను సపోర్ట్‌ చేశారు. యు.ఎస్‌.లో ఉంటున్న హేతల్‌ లఖానీ అనే యువతి మాత్రం ఆ సపోర్ట్‌ని ఇంకొంచెం పై స్థాయికి తీసుకెళ్లారు. ఆన్‌లైన్‌లో పిటిషన్‌ తయారు చేసి సంతకాలు సేకరించారు. ‘ఛేంజ్‌ డాట్‌ ఒఆర్‌జి’లో ఆమె ఆ పిటిషన్‌ పెట్టిన పద్నాలుగు గంటల్లోనే 1500 మంది ఫర్‌గా సంతకాలు చేశారు! దానిని షాదీ డాట్‌ కామ్‌కి ఫార్వర్డ్‌ చేశారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూ తన సైట్‌లోని స్కిన్‌ కలర్‌ ఫిల్టర్‌ను తొలగించబోతోంది ఆ పెళ్లిచూపుల సంస్థ.

‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ (నల్లవారి ప్రాణాలూ ముఖ్యమే) ఉద్యమం విస్తృతం అవుతుండటంతో.. రంగుకు ప్రాధాన్యతనిచ్చే ధోరణులు అన్ని రంగాలలోనూ మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రసిద్ధ యు.ఎస్‌. కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఇటీవలే.. చర్మాన్ని తెల్లబరిచే సౌందర్యసాధనాల విక్రయాన్ని ఇండియాలో నిలిపివేయబోతున్నట్లు ప్రకటì ంచింది. తర్వాత షాదీ డాట్‌ కామ్‌. ఇప్పుడిక తాజాగా మన దేశవాళీ హిందుస్థాన్‌ లీవర్‌ సంస్థ కూడా తమ ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ బ్రాండ్‌ నేమ్‌ నుంచి ‘ఫెయిర్‌’ అనే మాటను తొలగిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫెయిర్, వైట్, లైట్‌ అనే మాటల్ని అందానికి ఏకపద ఆదర్శ నిర్వచనాలుగా వాడటం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. క్రమంగా మరికొన్ని. మరికొన్ని. మరికొన్ని.  ప్రశ్నించడం వల్లనే సాధ్యమౌతున్నవీ, సాధించుకుంటున్నవీ.. ఈ మార్పులన్నీ.                 

నాలో ఉండేవి ఉంటాయి. లేనివీ ఉంటాయి. ఉన్నవీ, లేనివీ నా రంగు చాటున ఉండిపోవడం ఏమిటి? తెలుపు రంగు నా లోపాలను కప్పిపుచ్చే పనైతే అంతకన్నా అసహ్యం ఇంకోటి ఉంటుందా?
– హీతల్‌ లఖానీ, డాలస్, యూఎస్‌

బాలీవుడ్‌ తారలు ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి మద్దతు ఇస్తూనే ఫెయిర్‌నెస్‌ క్రీములకు ప్రచారం ఇస్తున్నారు. దీని వల్ల ఉపయోగం ఏమిటి? తెలుపు ఘనమైనది అనే భావన ఎలా పోతుంది? ఎప్పటికి పోతుంది?– మేఘన్‌ నాగ్‌పాల్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top