రెండేళ్లుగా కరువున్నా నీటికొరత లేదు!

There is no water drought for two years - Sakshi

తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి ప్రాంతం రెండున్నరేళ్ల క్రితం తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నది. ఆ జిల్లా ఉదయంపులి గ్రామంలో సేంద్రియ రైతు కె.జయచంద్రన్‌కు చెందిన 200 ఎకరాల సర్టిఫైడ్‌ సేంద్రియ (బయోడైనమిక్‌) వ్యవసాయ క్షేత్రంలో అప్పట్లో తీవ్ర నీటికొరత ఏర్పడింది. ఆ దశలో గుంటూరుకు చెందిన తన మిత్రుడు, సేంద్రియ రైతు ప్రకాశ్‌రెడ్డి సలహా మేరకు.. జయచంద్రన్‌ తన ఉద్యాన తోటల మధ్యలో వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు.  అప్పుడు కందకాలు తవ్వటం వల్ల గత రెండు సంవత్సరాలుగా పెద్దగా వర్షాలు లేకపోయినా.. తోటల సాగుకు ఎటువంటి నీటి కొరతా లేకుండా సజావుగా దిగుబడులను అందుకోగలుగుతున్నానని జయచంద్రన్‌ ‘సాగుబడి’తో చెప్పారు.

200 వ్యవసాయ క్షేత్రంలో 5–6 ఎకరాలకు ఒక క్లస్టర్‌గా విభజించుకున్న జయచంద్రన్‌.. వేర్వేరు క్లస్టర్లలో ఉసిరి, మామిడి, కొబ్బరి, సపోట, బొప్పాయి, నిమ్మ, అరటి, మునగ తోటలను బయోడైనమిక్‌ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీటితోపాటు 5 నుంచి 25 సంవత్సరాల్లో కోతకు వచ్చే అనేక జాతుల కలప చెట్లను వేలాదిగా పెంచుతున్నారు. వీటికి బిందు సేద్యం ద్వారా నీరందిస్తున్నారు. క్లస్టర్ల మధ్యలో మట్టి కట్టల వెంట 9 అడుగుల వెడల్పు, 6–7 అడుగుల లోతున కందకాలు తవ్వించారు. కందకాలలో ప్రతి వంద మీటర్లకు ఒక చోట చెక్‌ వాల్స్‌ నిర్మించారు. స్వల్ప ఖర్చుతో నిర్మించిన కందకాల ద్వారా వాన నీరంతా భూమిలోకి ఇంకడం వల్ల 27 బోర్లు, 6 పెద్ద వ్యవసాయ బావుల్లో నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. గత రెండేళ్లుగా నీటి కొరత సమస్యే లేదని జయచంద్రన్‌(96772 20020) తెలిపారు.  సాక్షి, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం సంయుక్తంగా ‘చేను కిందే చెరువు’ పేరిట ఐదేళ్ల క్రితం నుంచి నిర్వహిస్తున్న ప్రచారోద్యమ స్ఫూర్తితోనే తన మిత్రుడు జయచంద్రన్‌కు కందకాల గురించి సూచించానని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top