తాటి బెల్లంతో ఆరోగ్యానికి ఎంతో మేలు | Thati Bellam Sales in hyderabad | Sakshi
Sakshi News home page

తాటి బెల్లంతో ఆరోగ్యానికి ఎంతో మేలు

Feb 13 2019 9:59 AM | Updated on Feb 13 2019 9:59 AM

Thati Bellam Sales in hyderabad - Sakshi

కుత్బుల్లాపూర్‌: మనిషికి తీపి ఎంత జిహ్వ చాపల్యం కలిగిస్తుందో అంతగా చెడు చేస్తుందంటారు. అలాంటి తీపి పదార్థాల్లో శరీరానికి అత్యంత మేలు కలిగించేది ‘తాటి బెల్లం’. సాధారణ చెరుకు బెల్లంతో పోలిస్తే తాటి బెల్లం చేసే మేలు అనంతం. బిజీబిజీ యాంత్రిక జీవనంలో ఆరోగ్య శైలిలో మార్పులు తప్పనిసరి.గత దశాబ్దకాలంగా ప్రతీఒక్కరి ఆహార శైలిలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పటి పాత కాలం నాటి ఆహార పద్ధతులను ఇప్పుడు ఆచరిస్తున్నారు. అందులో భాగంగా చెరుకు బెల్లానికి ప్రత్యామ్నాయంగా తాటి బెల్లానికి డిమాండ్‌ బాగా పెరిగింది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తాటిబెల్లం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.    

తాటిబుట్టల్లో పెట్టి..
తాటి బెల్లానికి పెరుగుతున్న డిమాండ్‌ రీత్యా ఇçప్పుడు నగరంలోని పలు ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన వ్యాపారులు పెద్ద సంఖ్యలో దీనిని విక్రయిస్తున్నారు. దేశంలోని తీర ప్రాంత రాష్ట్రాల్లో తాటిబెల్లం ఉత్పత్తి అధికంగా జరుగుతోంది. వీటిలో తమిళనాడు తాటిబెల్లం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ఈ క్రమంలో తుత్తుకూడి, తిరునల్వేరి, ఒడంకుడి, తిరుచందూర్, తిరువనలై తదితర ప్రాంతాలకు చెందిన తాటి బెల్లం తయారీ, అమ్మకందారులు నగరంలో విక్రయిస్తున్నారు. మౌలాలీ, సికింద్రాబాద్, మేడ్చల్, కొంపల్లి, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌.. ఇలా నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్డు పక్కన తాటిబుట్టల్లో అమ్ముతున్నారు.

తాటినీరా నుంచి తయారీ..
తాటిబెల్లం అత్యంత సహజసిద్ధంగా తయారు చేస్తామని విక్రయదారులు చెబుతున్నారు. తాటి చెట్లనుంచి సేకరించిన పులియని తాటి నీరాను బాగా వేడి చేయగా వచ్చేదే తాటి బెల్లమని, ఇందులో ఎలాంటి రంగు, ఇతర పదార్థాలను కలపమని తెలిపారు. తాటి బెల్లంతో పాటు మరో రకమైన ‘అల్లం బెల్లం’ ను కూడా తమిళ వ్యాపారులు విక్రయిస్తున్నారు. అయితే ఇందులో తాటి బెల్లం తయారీ సమయంలోనే అల్లం, ఇలాచీ, లవంగం, మిరియాలు వంటి పదార్థాలను కలిపి తయారు చేస్తారు. మామూలు తాటి బెల్లం కేజీ రూ.100 నుంచి రూ. 140 వరకు ఉండగా.. అల్లం బెల్లం కేజీ రూ.190 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. హైటెక్‌ సిటీ వంటి ఐటీ హబ్‌ల ప్రాంతంలో మాత్రం మామూలు తాటి బెల్లాన్నే రూ.240కు విక్రయిస్తున్నట్లు సమాచారం.  

రుగ్మతలు దూరం..
పులియని తాటి నీరాతో తయారు చేసే తాటి బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజ్‌ 76.86 శాతం, మాంసకృతులు 1.04, ఖనిజ లవణాలు 3.15 శాతం, ఇనుము సమృద్ధిగా ఉంటుంది. వంద లీటర్ల తాటి నీరా నుంచి దాదాపు 12 నుంచి 15 కిలోల తాటి బెల్లం ఉత్పత్తి అవుతుంది. రక్తహీనతకు చెక్‌ పెట్టడంతో పాటు శరీర పుష్టి, వీర్యవృద్ధి కలుగుతుంది. తక్కువ సోడియం ఎక్కువ పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలు దరిజేరకుండా ఉంచుతుంది.  

విక్రయాలు బాగానే ఉన్నాయి..
ఒకప్పుడు తాటి బెల్లాన్ని అంతగా ఇష్టపడే వారు కాదు. కాని ఇప్పుడు దీనికి మంచి గిరాకీ ఏర్పడింది. హైదరాబాద్‌ నగరంలో తాటి బెల్లం విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. అందుకే నేను మావాళ్లు మొత్తం 16 మంది మధురై నుంచి నగరానికి వచ్చి తాటిబెల్లం విక్రయిస్తున్నాం.– కుంభయ్య, తాటిబెల్లం వ్యాపారి, మధురై 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement