అన్నంభట్టును ఇవతలకు తెండి!

A Story By Doctor Polepeddi Radhskrishna Murthy - Sakshi

సాహిత్య మరమరాలు

తర్కసంగ్రహం అనే గ్రంథాన్ని  సంస్కృతంలో రచించిన ‘మహామహోపాధ్యాయ’ అన్నంభట్టు క్రీ.శ. 17వ శతాబ్దం ఉత్తరార్థంలో జీవించాడు. ఆయన గొప్ప శాస్త్రకారుడు మాత్రమే కాదు, ఆచారపరుడు కూడా! ఆయన ఆ గ్రంథం మొత్తాన్నీ మడి కట్టుకొనే రచించాడు. ఒకరోజున గ్రంథరచన పూర్తి ఐంది. కవి వివరాలను తెలిపే ముగింపు శ్లోకాన్ని వ్రాయవలసి ఉన్నది. ఆయనకు ‘విదుషాన్నంభట్టేన’– పండితుడైన అన్నంభట్టుచే రచించబడిన అనే ఆలోచన వచ్చింది. బాగానే ఉన్నది కానీ అది అనుష్టుప్పు శ్లోకం కనుక, ప్రతి పాదంలోనూ ఎనిమిది అక్షరాలు ఉండాలి. అన్నంభట్టు వ్రాయాలనుకొన్న పాదంలో ఏడు అక్షరాలు మాత్రమే ఉన్నై. ఆ ఎనిమిదవ అక్షరం కోసం నానా తంటాలు పడుతున్నాడు.

అంతటి మహాకవికి కూడా గంటలు గడుస్తున్నై కానీ సరియైన రీతి దొరకటం లేదు. ఇంట్లో ఆ పని మీద, ఈ పని మీద అటుగా వచ్చి వెళుతున్న అతని భార్య ఈ పరిస్థితిని చూసింది. ‘సంగతేమిటండీ?’ అని అడిగింది. చెప్పాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ‘దీని కింత ఆలోచన ఎందుకండి? ఆ వైపున ఉన్న అన్నంభట్టును ఈ వైపునకు తీసుకొనిరండి!’ అన్నది. అన్నంభట్టు చూశాడు. తను వ్రాయాలనుకొన్న ‘విదుషాన్నంభట్టేన’ ఇప్పుడు ‘అన్నంభట్టేన విదుషా’ ఐంది. ఎనిమిది అక్షరాలూ సరిపోయినై. భార్య వైపు కృతజ్ఞతగా చూశాడు.
- డాక్టర్‌ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top