యువత.. దేశానికి భవిత

Special Story On Youth Skills Day In Mahabubnagar - Sakshi

వివధ రంగాల్లో దూసుకెళ్తున్న యువత 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణింపు 

యువత దేశానికి భవిత.. యువతతోనే దేశాభివృద్ధి.. అలాంటి యువత మారుతున్న కాలానుగుణంగా తమను తాము మలుచుకుంటున్నారు.. ముఖ్యంగా సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో దూసుకెళ్తున్నారు.. చదువుతోపాటు ఇతర రంగాల్లో రాణిస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.. యునైటెడ్‌ నేషన్స్‌వారు జనరల్‌ అసెంబ్లీలో 2014 నవంబర్‌లో ‘జూలై 15’ను వరల్డ్‌ యూత్‌ స్కిల్స్‌డేగా నిర్ణయించారు.. అప్పటి నుంచి ‘వరల్డ్‌ యూత్‌ స్కిల్స్‌డేగా నిర్వహిస్తున్నారు.. ఈ నేపథ్యంలో సోమవారం వరల్డ్‌ యూత్‌ స్కిల్స్‌డేను పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో విభిన్న రంగాల్లో రాణిస్తున్న పలువురు యువతపై ప్రత్యేక కథనం..  
– మహబూబ్‌నగర్‌ క్రీడలు 

అలంపూర్‌(మహబూబ్‌నగర్‌) : నాకు సినిమాటోగ్రాఫర్‌ కావాలని కోరిక ఉండేది. అవకాశాలు కలిసిరాలేదు. దీంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో మా మిత్రులందరం కలిసి సామాజిక స్పృహ కలిగే కథనాలతో షార్ట్‌ఫిల్మ్స్‌ తీయాలని నిర్ణయించుకున్నాం. నా చిరకాల కోరిక తీరడమే గాక సమాజానికి మేలు చేసిన వారమవుతామని భావించి.. షార్ట్‌ఫిల్మ్స్‌పై దృష్టిసారించాను. ఇప్పటి వరకు పది చిత్రాలకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేశాను. మా ప్రాంతంలో కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌ తీశాం. ప్రస్తుతం సూర్యచంద్ర అనే షార్ట్‌ఫిల్మ్స్‌ తీస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహిస్తే మరెన్నో షార్ట్‌ఫిల్మ్స్‌ తీస్తాం. 
– శ్యాంసుందర్, సినిమాటోగ్రాఫర్, శాంతినగర్‌ 


డ్రోన్‌ కెమెరాతో షార్ట్‌ఫిల్మ్‌ చిత్రీకరిస్తున్న శ్యాంసుందర్‌  

సామాజిక చైతన్యమే లక్ష్యం
2015లో ఇంటర్‌నేషన్‌ల్‌ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘చదువు’ షార్ట్‌ ఫిల్మ్‌కు రెండో ఉత్తమ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్‌పై 2016లో తీసిన స్వచ్ఛ భారత్‌ షార్ట్‌ఫిల్మ్‌కు ఉత్తమ లఘుచిత్రంగా ఎంపిక చేసి, ప్రశంస పత్రం అందజేశారు. అలాగే పోలీస్‌ అమరవీరుల దినోత్సవం రోజున ఆకలి షార్ట్‌ఫిల్మ్‌కు అవార్డు, నల్లగొండ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బ్యాల వివాహాల నిర్మూలన అనే అంశంపై తీసిన దేవకీ కల్యాణం షార్ట్‌ ఫిల్మ్‌కు ఉత్తమ చిత్రం అవార్డు, ప్రోత్సాహక నగదు అందజేశారు. అంతేకాకుండా కాచం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుడు కాంచం సత్యనారాయణగుప్తా నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో వండర్‌ బుక్‌ ఆఫ్‌ ఇంటర్‌నేషన్‌లో ఉత్తమ డైరెక్టర్‌ కేటగిరిలో స్థానం లభించింది. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం హీరో కార్తీకేయరెడ్డి, చంద్రబోస్‌తో సన్మానం పొందారు. యూట్యూబ్‌లో తన షార్ట్‌ఫిల్మ్స్‌కు 25 లక్షల వ్యూస్‌ ఉన్నట్లు లాలుయాదవ్‌ తెలిపారు.

మెమోరీ ట్రైనర్‌గా వంశీకృష్ణ
జడ్చర్ల టౌన్‌: పిల్లల్లో మేధాశక్తి పెరగడానికి వారి తల్లిదండ్రులు మేధావులు కానక్కరలేదంటున్నాడు జడ్చర్లకు చెందిన యువకుడు మెమోరీ ట్రైనర్‌ వంశీకృష్ణ. మెమోరీ శిక్షణలో ఇప్పటి వరకు 10 వేల మందికిపైగా నేరుగా శిక్షణ ఇచ్చిన ఘనత సాధించి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించేందుకు సాధన చేస్తున్నాడు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని నిరూపిస్తున్నాడు. చిన్నతనంలో ట్రిపుల్‌ ఎక్స్‌ ఇంగ్లిష్‌ టీవీ ఛానల్‌లో బాల మేధావులు చేసే అద్భుతాలను చూసి అబ్బురపడిపోయి తాను ప్రత్యేకంగా ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాడు. తండ్రి పాండురంగాచారి కొడుకు ఆసక్తిని గమనించి ప్రోత్సహించాడు. తల్లి పుష్పలత మరణించినా ఏమాత్రం ఆత్మస్తైర్యం కోల్పోకుండా మెమోరీ పెంచుకోవడంలో నిష్ణాతుడయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన జయసింహ వద్ద మెమోరీ పెంచుకోవడంపై శిక్షణ పొందాడు. అదేవిధంగా లా ఆఫ్‌ అటెన్షన్, న్యూరల్‌ లింగ్విస్టిక్‌ సైకాలజీ, స్పీడ్‌ మ్యాథమెటిక్స్‌లో డిప్లొమాలు పూర్తిచేశాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బెంగుళూరులో జరిగే జాతీయ మెమోరీ చాంపియన్‌షిప్‌కు జడ్జిగా ఎంపికై స్థానికుల ప్రశంసలు పొందుతున్నాడు.

టీవీలో చూసిన ప్రదర్శనలే.. 
సాధన, కృషి, పట్టుదల ఉంటే ఎంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తాను చిన్నతనంలో టీవీలో చూసిన ప్రదర్శనలే స్ఫూర్తిగా అమ్మానాన్నలు ప్రోత్సాహంతో మెమోరీ ట్రైనర్‌గా గుర్తింపు తెచ్చుకోగలుగుతున్నాను. గిన్నిస్‌బుక్‌లో బైనరీ నంబర్స్‌లో రికార్డు నమోదు చేసుకోవాలని ముందుకు సాగుతున్నాను. 
– వంశీకృష్ణ 

బాక్సింగ్‌లో రాణిస్తున్నమహేష్‌
ఊట్కూర్‌ (మక్తల్‌): జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ఊట్కూర్‌కు చెందిన యువకుడు రాణిస్తున్నాడు. మండల కేంద్రానికి చెందిన కృష్ణమీనన్, లింగమ్మ దంపతుల మూడో కుమారుడు మహేష్‌కుమార్‌కు చిన్నప్పటి నుంచి కరాటే, బాక్సింగ్‌ అంటే ఇష్టం. ఊట్కూర్‌లో పదో తరగతి వరకు చదివాడు. అనంతరం మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. అదే సమయంలో అరవిందో కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ పూర్తిచేశారు. అక్కడే ఉన్నత చదువులు చదువుతూ స్టార్‌ మౌతాయ్‌ అండ్‌ మా క్లబ్‌లో కరాటేతోపాటు బాక్సింగ్‌లో ఎంఎస్‌ జావిద్, ఎంఐ నవీద్‌ మాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలోనే 2019 జనవరిలో హైదరాబాద్‌లో నరేష్‌ సూర్య క్లాసిక్‌ ఫిట్‌నెస్‌ ఎక్స్‌పో జరిగిన పోటీల్లో 77 కిలోల విభాగంలో వెండి పతకం సాధించాడు. అలాగే జూలై 7, 2019లో ఢిల్లీలో మూడురోజులపాటు జరిగిన ఇండియన్‌ హెల్త్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ జాతీయ పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొన్నాడు. 


ఢిల్లీలో బాక్సింగ్‌ పోటీల్లో తలపడిన మహేష్‌

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు 
బైనరీ నంబర్స్‌ చెప్పడంలో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సాధించాడు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో ఇంపాక్ట్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన బైనరీ నంబర్స్‌ పోటీల్లో 5 నిమిషాల్లో 360 అక్షరాలు చెప్పి తన మెమోరీ సత్తాచాటాడు. ఈ క్రమంలోనే బైనరీ నంబర్లు చెప్పడంలో గిన్నిస్‌బుక్‌లో చోటు సాధించేందుకు సాధన చేస్తున్నాడు. ఇప్పటి వరకు వెయ్యి నంబర్లతో రికార్డు ఉండగా తాను 1,500 నంబర్లతో రికార్డు సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. అలాగే వచ్చే ఏడాది హైదరాబాద్‌లో జరగనున్న వరల్డ్‌ మెమోరీ చాంపియన్‌షిప్‌కు వంశీకృష్ణ అర్హత సాధించాడు. వరల్డ్‌ మెమోరీ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే చాంపియన్‌షిప్‌లో తన మెమోరీ పవర్‌ను చూయించేందుకు సిద్ధమవుతున్నాడు.

పర్వతారోహణలో గిరిజన బాలిక
బాలానగర్‌ (జడ్చర్ల): మండలంలోని గౌతాపూర్‌ గ్రామం నమ్యతండాకు చెందిన సబావత్‌ సునీత 14 ఏళ్ల వయస్సులోనే 2017 ఆగస్టు 15న ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సమయంలోనే పాఠశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మయ్య, పీఈటీ స్పందన ప్రోత్సాహంతో రాష్ట్ర క్రీడాధికారి రమేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన గిరిజన బాలికగా ఘనత సాధించింది. లక్ష్యాన్ని నిర్దేశించుకుని గురి తప్పకుండా సాధన చేస్తే విజయం తథ్యమని విద్యార్థ దశలోనే ఉన్న బాలిక మరోమారు చాటిచెప్పింది. సునీత తండ్రి సబావత్‌ సేవ్య, తల్లి శారదలది నిరుపేద కుటుంబం. ఎంతో కష్టపడి బిడ్డను చదివించిన వారు తమ కూతురు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిందనే వార్త తెలియగానే అమితానందం పొందారు. సుమారు ఐదు రోజులపాటు రోజుకు 120 మీటర్ల చొప్పున కోచ్‌ ప్లానింగ్‌తో అధిరోహించానని సునీత తెలిపారు. అప్పట్లో మంత్రి లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ భాగ్యమ్మ బాలికను సన్మానించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top