నడపబోయేది నారీమణులే

Special Story On Women Scientists - Sakshi

శాస్త్ర పరిశోధన రంగంలో మహిళలు రాణించలేరన్నది ఒకప్పటి పితృస్వామ్య సమాజంలో ఉన్న అభిప్రాయం. ఆ సమాజంలో కూడా అది మగవాళ్ల అభిప్రాయమే తప్ప సమాజమంతటి అభిప్రాయం కాదు. సమాజంలో సగభాగమైన మహిళల అభిప్రాయం ఎంత మాత్రమూ కాదు. దీనికి ‘అభిప్రాయం’ అనే  మాట వాడడం కూడా తప్పే! ఇది కేవలం వారి అపోహ మాత్రమే అంటున్నారు నేటి మహిళలు.

కావాలంటే ఒకసారి మా మహిళల విజయాలను సింహావలోకనం చేసుకోండి అని సవాల్‌ విసురుతున్నారు. ‘విమెన్‌ కాంట్‌ డూ సైన్స్‌’ అనే అపోహను తుడిచి పాతరేస్తూ ‘విమెన్‌ ఇన్‌ సైన్స్‌’ అని నినదిస్తున్నారు. నిదర్శనంగా ఓ ఎనిమిది మహిళా సైంటిస్టులను ఉదహరిస్తున్నారు.

డాక్టర్‌ గగన్‌ దీప్‌ కాంగ్‌ (57)

రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌ అందుకున్న తొలి భారతీయ మహిళ. బయాలజీని ఇష్టపడే గగన్‌ దీప్‌.. తమిళనాడు, వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తర్వాత పబ్లిక్‌ హెల్త్‌ రంగంలో పరిశోధనల మీద దృష్టి కేంద్రీకరించారు. అనంతరం క్లినికల్‌ రీసెర్చర్‌గా స్థిరపడ్డారు. చిన్న పిల్లల్లో డయేరియాను నివారించడానికి దోహదం చేసే రోటావైరస్‌ వ్యాక్సిన్‌ ఆమె ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఆమె ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌.

రోహిణీ గాడ్‌బోలే (67)

ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు గ్రహీత.  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సి)లోని హై ఎనర్జీ ఫిజిక్స్‌ విభాగంలో ఫిజిసిస్ట్‌. గత ముప్పై ఏళ్లుగా భౌతికశాస్త్రంలో పరిశోధనలు చేస్తున్నారు. న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీలో పార్టికల్‌ ఫిజిక్స్‌లో డాక్టరేట్‌ తీసుకుని 1979లో ఇండియాకు తిరిగి వచ్చారు. స్టాండర్డ్‌ మోడల్‌ ఆఫ్‌ పర్టికల్‌ ఫిజిక్స్‌లో 150కి పైగా పత్రాలను ప్రచురించారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్, ఇండియా (ఎన్‌ఎఎస్‌ఐ) ఫెలోషిప్‌ తో పాటు.., అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఆఫ్‌ ద డెవలపింగ్‌ వరల్డ్, ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీల్లో కూడా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. రోహిణి తన పరిశోధనలకే పరిమితం కాలేదు. మనదేశంలో శాస్త్ర పరిశోధన రంగంలో సేవలందించిన మహిళలందరి జీవిత విశేషాలతో ‘లీలావతీస్‌ డాటర్స్‌’ పేరుతో పుస్తకాన్ని తెచ్చారు.

సునీత సారవాగి (50)

ముంబయిలోని ఐఐటీ– బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌కి హెడ్డు.  గత రెండు దశాబ్దాలుగా డాటా మైనింగ్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌లో పరిశోధనలు చేస్తున్నారు.  ఒడిషాలోని బాలాసోర్‌కు చెందిన సునీత పంతొమ్మిది వందల ఎనభైలలో ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో చేరినప్పుడు ఆ కోర్సులో చేరిన వాళ్లలో అమ్మాయి ఆమె ఒక్కరే. ఆ తర్వాత ఆమె యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో పీహెచ్‌డీ చేసి కాలిఫోర్నియాలోని గూగుల్‌ హెడ్‌క్వార్టర్‌లో సైంటిస్ట్‌గా పరిశోధనలు చేశారు.

అదితి సేన్‌ దే (45)

2018లో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు అందుకున్నారు. భౌతిక శాస్ట్రంలో ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ ఆమె. అలహాబాద్‌లోని హరీష్‌ చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌. మాథమేటిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన అదితి క్వాంటమ్‌ ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో పరిశోధనలకు గాను ఆమె బహుమతినందుకున్నారు.

కాళికా బాలి (48)

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో కృత్రిమ మేధ అంశంలో, స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ టెక్నాలజీలో పరిశోధనలు చేస్తున్నారు. బాలి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ నుంచి ఫొనెటిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇదే అంశంలో ఆమె సెమినార్‌లలో పరిశోధన పత్రాలను సమర్పించారు. ఈ పరిశోధనలతోపాటు కాళికా బాలి ఆదివాసీల భాషల మీద కూడా పరిశోధనలు చేస్తూ, ఆయా భాషలకు హిందీ భాషకు మధ్య ఉన్న సమైక్యతాంశాలను కూడా అధ్యయనం చేస్తున్నారు.

దేవప్రియ చటోపాధ్యాయ (39)

కోల్‌కతాలోని ఐఐఎస్‌ఈఆర్‌లో ఎర్త్‌ అండ్‌ క్లైమేజ్‌ సైన్సెస్‌ విభాగంలో ప్రొఫెసర్‌. ప్రాచీన కాలం నాటి జీవావరణ సమతుల్యత, ప్రస్తుత ఆధునిక కాలంలో జీవవైవిధ్యత సమతుల్యతలో ఎదురవుతున్న సంక్లిష్టతల మీద ఆమె పరిశోధనలు చేస్తున్నారు. ఇందుకోసం ఆమె గుజరాత్‌ రాష్ట్రం, కచ్‌ ప్రాంతంలోని శిలాజాల సేకరణ అధ్యయనం మీద, మంచు శిఖరాలు కరిగి సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీర ప్రాంతాల్లోని మానవాళికి ఎదురయ్యే సమస్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు.

విదిత వైద్య, న్యూరో సైంటిస్ట్‌ (49)

ఆమె ముంబయిలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజ్, అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీలోనూ చదివారు. ఆక్స్‌ఫర్డ్‌లో పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చ్‌ చేశారు. విదిత తల్లి కూడా ఎండోక్రైనాలజీలో పరిశోధనలు చేశారు. విదిత మాలిక్యులార్‌ సైకియాట్రీలో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. మనిషిలోని భావోద్వేగాలు, మానసిక ఆరోగ్యం, డిప్రెషన్, యాంగ్జయిటీలు మానవ సంబంధాల మీద చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేశారామె. విదిత ప్రస్తుతం ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ లో బోధన రంగంలో ఉన్నారు. విదిత 2015లో మెడికల్‌ సైన్సెస్‌ విభాగంలో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు అందుకున్నారు.

నందిని హరినాథ్‌ (45)

ఇస్రోలో రాకెట్‌ సైంటిస్ట్‌. రెండు దశాబ్దాల ఉద్యోగ జీవితంలో ఆమె 14 స్పేస్‌ మిషన్స్‌ ప్రయోగాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌– మంగళ్‌యాన్‌ విజయాన్ని నడిపించిన మేధోబృందంలో కూడా డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌. ఈ ఏడాది నాసా– ఇస్రో సంయుక్తంగా నిర్వహించనున్న శాటిలైట్‌ వెంచర్‌ నిసార్‌ (ఎన్‌ఐఎస్‌ఏఆర్‌) ఆమె ఆధ్వర్యంలోనే జరగనుంది.
– మంజీర

►జాతి నిర్మాణంలో, దేశాన్ని శాస్త్రీయంగా ముందుకు నడిపించడంలో మహిళలు పెద్ద భూమికనే పోషించబోతున్నారని నీతి అయోగ్‌ తాజా నివేదిక అంచనా వేసింది. ‘సైన్స్‌ రంగంలో పట్టభద్రులవుతున్న వారిలో మూడవ వంతు మహిళలే. భారతీయ పరిశోధన సంస్థలు, యూనివర్సిటీలలో పరిశోధన, బోధనలలో కీలకమైన స్థానాలలో మున్ముంది మహిళల శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top