చేనేతల బతుకమ్మ

 Special story to National Handloom Day from Shailaja Ramayyar - Sakshi

పరిచయం  శైలజారామయ్య

ఉద్యోగమే ఊపిరిగా పని చేసే వాళ్లు ఎలా ఉంటారంటే.. శైలజారామయ్యర్‌లాగ ఉంటారని చెప్పవచ్చు.  చేనేత పరిరక్షణ ఆమె ఉద్యోగధర్మం. ఆ బాధ్యతను  ఆఫీస్‌ వరకే పరిమితం చేయడంలేదామె. నెలలో ఇరవై రోజులు చేనేత చీరల్లోనే కనిపిస్తారు.  చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కనిపిస్తారు.  ఆమెను పలకరిస్తే చేనేతకారుల గురించే  మాట్లాడతారు. చేనేతలో మన దగ్గర ఉన్న వైవి«ధ్యాన్ని ఆశువుగా చెప్పుకొస్తారు. రేపు జాతీయ చేనేత  దినోత్సవం సందర్భంగా ఆమె పరిచయం.

శైలజారామయ్యర్‌.. పేరులో తమిళదనం కనిపిస్తుంది కానీ ఆమెలో మాత్రం అచ్చమైన తెలుగుదనం ఉట్టి పడుతుంది. ఆమె తెలుగును చక్కగా ఉచ్చరిస్తారు. తెలుగు నేల మీద పుట్టిన హస్తకళలను అంతరించి పోనివ్వకుండా పరిరక్షించడానికే తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్‌గా మచిలీపట్నం కలంకారీ కోసం ఇష్టంగా పనిచేశారు. తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్‌ డైరెక్టర్‌గా.. క్రాఫ్ట్స్‌మన్‌కి, వినియోగదారులకు మధ్య ఉన్న అవరోధాలను అధిగమించడానికి అనేక ప్రయోగాలు చేశారు. తయారీదారుల చేత తరచూ ఎగ్జిబిషన్‌లు పెట్టిస్తూ వారి చేనేతకు గుర్తింపు తెచ్చారు. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరి దృష్టి   హస్తకళల మీదకు మళ్లేటట్లు చేశారు. ఇప్పుడామె హ్యాండ్‌లూమ్‌ రంగాన్ని పరిపుష్టం చేయడానికి కృషి చేస్తున్నారు. ‘వృత్తి– ప్రవృత్తి ఒకటే అయినప్పుడు, చేస్తున్న పనిని చిత్తశుద్ధితో చేయాలనే తలంపు ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే’ అంటారామె. అంతేకాదు, ఐఏఎస్‌ అధికారిగా తనకు ఇష్టమైన రంగంలో పని చేసే అవకాశం రావడం తన అదృష్టమంటారు శైలజారామయ్యర్‌. 

ధర వెనుక శ్రమను చూడాలి
‘‘హ్యాండ్‌లూమ్‌ దుస్తుల పట్ల పెద్ద అపోహ ఉండిపోయింది మనలో చాలామందికి. చేనేత మగ్గాల మీద నేసే దుస్తులంటే జనతా చీరలు, ధోవతులు అనే అనిపిస్తుంది. ఆ భావనను పోగొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి చేనేత చాలా నైపుణ్యంతో కూడిన కళ. మేలైన ముడిసరుకుతో కళాత్మకంగా తయారు చేసిన వస్త్రం ధర కూడా ఎక్కువే ఉంటుంది. ధర వెనుక చేనేతకారుల శ్రమను చూడగలగాలి. ఎప్పుడైనా వినియోగం ఎక్కువగా ఉంటేనే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. వినియోగం తగ్గిన తర్వాత ఉత్పత్తి చేస్తే అవి అమ్ముడు కాక అలా ఉండిపోతాయి. మరి వారి ఉపాధి జరగాలి కదా! అందుకోసం ప్రభుత్వం జనతా చీరలు, ధోవతుల ఆర్డర్‌ ఇచ్చేది.చేనేతకారులకు ఉపాధి కల్పించడంతోపాటు ప్రభుత్వ ఖజానా మీద ఎక్కువ భారం పడకుండా ఉండటానికి తక్కువ ధరలో దొరికే జనతా చీరలు, ధోవతులనే ఆర్డర్‌ ఇవ్వడం జరిగేది. చేనేతకారుల చేత చాలా సంవత్సరాల పాటు వాటినే చేయించడంతో ఒక తరం నైపుణ్యమైన వస్త్రాన్ని నేయనేలేదు. ఇప్పుడు చేనేతరంగాన్ని ఆ పరిస్థితి నుంచి బయటకు తెస్తున్నాం. చేనేత దుస్తులంటే తక్కువ ధరకు దొరికేవి కాదు, టెక్స్‌టైల్‌ రంగంలోనే అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు. ఎన్ని సంస్కృతులైనా రావచ్చు, పోవచ్చు. కానీ ఒక కళ అంతరించి పోకూడదు. మనదైన కళను పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం, ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి.

మన తస్సర్‌
ఇన్నేళ్ల నా సర్వీస్‌లో  (శైలజారామయ్యర్‌ 1997 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌) అత్యంత సంతోషం కలిగించిన చేనేత మహదేవ్‌పూర్‌ సిల్క్‌ శారీ. అది తస్సర్‌ సిల్క్‌ వంటిదే. మన దగ్గర జయశంకర్‌ భూపాల పల్లి జిల్లాలో ఉంది మహదేవ్‌పూర్‌. అక్కడి చేనేత కారుల దగ్గరున్న నైపుణ్యం తెలిసిన తర్వాత దానికే మరికొన్ని మెరుగులు దిద్ది కళాత్మకమైన చీరను డిజైన్‌ చేయించడం నాకు చాలా తృప్తినిచ్చిన విషయం. చూడడానికి తస్సర్‌ చీరలాగానే ఉంటుంది. భాగల్‌పూర్‌ సిల్క్‌ అని కూడా అంటారు. వాటిని పోలిన నేత మన దగ్గరున్న సంగతే మనకు తెలియదింతవరకు. ఇదొక్కటే కాదు, మన దగ్గర అనేక రకాల ఫ్యాబ్రిక్‌ తయారవుతోంది, అనేక రకాల వస్త్రాన్ని నేస్తున్నారు. ఎక్కడ, ఎలాంటి వస్త్రం తయారవుతుందో తెలుసుకోవడమే అత్యంత కష్టమైన పని, వైవిధ్యతను గుర్తించిన తరువాత వాటిని పరిరక్షించుకోవడం రెండవ దశ, వాటిని వ్యాప్తి చేయడం మూడవ దశ.  తెలంగాణలో తయారవుతున్న చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించడంలో భాగంగానే బీబీ రసూల్, శ్రావణ్‌కుమార్, ప్రసాద్‌ బినప్ప వంటి మోడల్స్‌ను అంబాసిడర్‌లుగా నియమించాలనే నిర్ణయం తీసుకున్నాం. మన గొల్ల భామ వస్త్రంతో ఓవర్‌ కోట్‌ వేసుకుని బీబీ రసూల్‌ ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో సమావేశాలకు హాజరైనప్పుడు అక్కడికి వచ్చిన ఫ్యాషన్‌ డిజైనర్ల దృష్టి తప్పనిసరిగా ఆమె ధరించిన కోట్‌ మీద నిలుస్తుంది. ఇలాంటివే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. 

బతుకమ్మ చీరల కోసం
తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ వేడుకల సమయంలో తెల్ల రేషన్‌ కార్డున్న మహిళలకు చీరలిస్తోంది. ఆ చీరలు నేసే పనిని కూడా చేనేతకారులకే ఇప్పించాలంటే అసాధ్యం అనిపించింది. రాష్ట్రంలో 17, 573 చేనేత మగ్గాలున్నాయి. వాటిలో చీరలు నేసే మగ్గాలు సగానికి మించవు. అలాంటప్పుడు అంత పెద్ద ఆర్డర్‌ను పూర్తి చేయాలంటే మూడేళ్లు పడుతుంది. అందుకే పవర్‌లూమ్స్‌ మీద పనిచేస్తున్న సిరిసిల్ల నేతకారులకు కేటాయించాం. అవి కూడా నేత చీరలే, అయితే చేనేత కాదు. మరమగ్గాల మీద నేసిన నేత చీరలన్నమాట. 

కార్పొరేట్‌ గుప్పిట్లో చిక్కకుండా
అసలైన ప్రమాద ఘంటికలు ఏమిటంటే.. చేనేతకారుల కుటుంబాల నుంచి తర్వాతి తరాలు ఆ వృత్తికి దూరంగా వచ్చేయడం. చదువుకుని ఉద్యోగాలకు వెళ్లడాన్ని స్వాగతించాల్సిందే. కానీ చేనేత పనుల్లేక రోజువారీ కూలీలుగా ఇతర పనుల్లోకి మారిపోవడం చిన్న విషయం కాదు. ఒక వృత్తి, ఒక కళ అంతరించిపోతోందనడానికి ఇంతకంటే మరొక నిదర్శనం అక్కర్లేదు. మా ప్రయత్నాలతో అలాంటి స్థితి తప్పిందనే చెప్పాలి. కిరాయి ఆటోలు నడుపుకుని రోజు గడుపుకుంటున్న వాళ్లు తిరిగి మగ్గం మీద పని చేస్తున్నారు. కొత్త తరంలో చేనేత మీద ఆసక్తి ఉన్న వాళ్లు తిరిగి మగ్గానికి దగ్గరవుతున్నారు. వాళ్లను కార్పొరేట్‌ రంగం గుప్పిట్లో చిక్కుకోకుండా స్వతంత్రంగా నిలబడగలగడానికి ప్రోత్సాహకాలను ఇస్తున్నాం. 
వస్త్రాన్ని నేసిన చెయ్యి మగ్గాన్ని వదలకూడదు. ఆ కళ అంతరించి పోకూడదు. మగ్గం అన్నం పెడుతుందనే భరోసా కల్పిస్తే వారి చేతిలోని కళ పురివిప్పుతుంది. వారిలోని కళాత్మకత ఆవిష్కారమవుతుంది. కళను ఆవిష్కరించే అవకాశాలు ఆ చేతులకు దూరం కాకూడదనేదే ఈ ప్రయత్నం’’.

ఇప్పటి పిల్లలకు చెప్పే పని లేదు
‘‘మాది తమిళ కుటుంబమే. కానీ నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. నా మెట్టినిల్లు రాజకీయ కుటుంబం. తండ్రి వారసత్వంతో మావారు (డి. శ్రీధర్‌బాబు) రాజకీయాలను అందిపుచ్చుకున్నారు. ఒక కప్పు కింద ఒక పొలిటీషియన్, ఒక ఐఏఎస్‌ అధికారి చాలా సౌకర్యవంతంగా జీవించవచ్చు. నేను మా వారి రాజకీయ చర్చలు, నిర్ణయాలలో తలదూర్చను, ఆయన నా విధులు, నిర్ణయాలు, ఆచరణల గురించి ఏ మాత్రం మాట్లాడరు. భార్యాభర్తలుగా మేము ఒకరికొకరం. వ్యక్తులుగా మాత్రం ఎవరి ఆలోచనలు వారివే, ఎవరి భావజాలం వారిదే. నిర్ణయాలెప్పుడూ పరిస్థితులు, అవసరాలు, భావజాలాలకు అనుగుణంగా ఉంటాయి. ఒకరి వృత్తిపరమైన విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా ఉండగలిగితే ఆ ఇంటి వాతావరణం హాయిగా ఉంటుంది. మా వరకు మేము పాటిస్తున్న సూత్రమదే. మాకు ఇద్దరు పిల్లలు, అమ్మాయి ఆరవ తరగతి, అబ్బాయి మూడవ తరగతి. వాళ్ల మీద మా ఇద్దరిలో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ తరం పిల్లల కోసం ప్రపంచమే నట్టింట్లోకి వచ్చేసింది. ప్రతి విషయాన్నీ చాలా త్వరగా తెలుసుకోగలుగుతున్నారు. అమ్మానాన్నలిద్దరిలో తమకు నచ్చిన లక్షణాలను మాత్రమే తీసుకోగలిగిన నైపుణ్యం వారికి ఒకరు చెప్పకనే వచ్చేస్తోంది. పెద్దయ్యాక ఏ రంగంలో స్థిరపడతారనేది వాళ్ల ఇష్టానికి వదిలేయడమే మంచిది. పేరెంట్స్‌ పిల్లలకు గైడ్‌ చేయవచ్చు, అంతే తప్ప వాళ్ల తరఫున నిర్ణయాలు చేసేయాలనుకోకూడదు’’.
– శైలజారామయ్యర్, డైరెక్టర్,  తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌

ఎనభై రంగుల్లో చీరలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని తెల్లరేషన్‌ కార్డులు ఉన్న మహిళలకు బతుకమ్మ పండగ కానుకగా చీరలను బహూకరిస్తోంది. ఆ చీరల తయారీ ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు అప్పగించారు. రోజుకు లక్షా పది వేల చీరలు తయారవుతున్నాయి. నేతన్నలకు  చేతినిండా పని ఉండటంతో సిరిసిల్ల మురిసిపోతోంది. గతంలో వారానికి రెండు వేలు సంపాదించేవాళ్లకు ఇప్పుడు వారానికి మూడున్నర నుంచి నాలుగు వేలు వస్తోంది. సిరిసిల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా 80 రంగుల్లో చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తం 90 లక్షల చీరలకు గాను ఇప్పటికి 40 లక్షలు పూర్తయ్యాయి. 15 వేల పవర్‌లూమ్స్‌ పని చేస్తున్నాయి. సెప్టెంబరు నెలాఖరు లోపే మొత్తం చీరలు సిద్ధమవుతాయి. 
– వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ సిరిసిల్ల
– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top