
తుది దశకు చేరిన చెరువు అభివృద్ధి పనులు
సెప్టెంబరుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి
నాటి–నేటి ఫొటోలు విడుదల చేసిన హైడ్రా
అంబర్‌పేటలోని బతుకమ్మకుంట జీవం పోసుకుంది. ఒకప్పటిలా నీటితో కళకళలాడుతోంది. కబ్జా చెర వీడటంతో రూ.8 కోట్ల వ్యయంతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే సెపె్టంబర్ నాటికి బతుకమ్మకుంట పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని హైడ్రా ప్రకటించింది. ఈ చెరువుకు సంబంధించిన ‘నాడు–నేడు’ ఫొటోలను మంగళవారం విడుదల చేసింది. తొలుత చెత్త, మొక్కల్ని తొలగించిన అధికారులు చెరువులో పూడికతీత చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా... లోపల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి.
బతుకమ్మ కుంటను పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వాపరాలు అధ్యయనం చేశారు. 1962–63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నం.563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలు ఉండేదని అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ కేవలం 5.15 ఎకరాల భూమి మాత్రమే మిగిలినట్లు తేలింది. దీంతో కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా, ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చెరువు తవ్వకాలకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో స్థానికులు హైడ్రాకు సహకరించారు. ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మకుంటగా మారిందని, రెవెన్యూ రికార్డులూ అదే చెబుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపడుతూ అందులో స్వచ్ఛమైన నీళ్లు నిలిచేలా చేయడం ద్వారా పర్యావరణం పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానికులు ఈ ఏడాది బతుకమ్మకుంటలోనే బతుకమ్మ ఆడేలా చేయాలన్నదే తమ లక్ష్యమని హైడ్రా స్పష్టం చేసింది.