అలెగ్జాండర్‌ పుష్కిన్‌

Some Words About Alexander Pushkin, A Great Russian Writer - Sakshi

గ్రేట్‌ రైటర్‌

సంక్లిష్టమైన పుష్కిన్‌ కవిత్వాన్ని అనువదించడం చాలా కష్టమని చెబుతారు. అందువల్ల ఆయన అసలైన రచనా ప్రజ్ఞను రష్యనేతరులు అంచనా కట్టడం కష్టమైపోయింది. అయినప్పటికీ అందిన ఆ కొద్దిపాటి వెలుగే ఆయన్ని ప్రపంచ గొప్ప రచయితల్లో ఒకడిగా నిలబెట్టడానికి సరిపోయింది. కవి, నవలాకారుడు, నాటక రచయిత, కథకుడు అయిన అలెగ్జాండర్‌ పుష్కిన్‌(1799–1837) రష్యా కులీన వంశంలో జన్మించాడు. పదిహేనేళ్లకే మొదటి కవిత రాశాడు. పట్టభద్రుడయ్యే నాటికే రష్యా సాహిత్య ప్రపంచం ఆయన్ని అబ్బురంగా చూడటం మొదలుపెట్టింది. రష్యా ఆధునిక సాహిత్యానికి మార్గదర్శిగా నిలవబోయే పుష్కిన్‌ తన ‘ఓడ్‌ టు లిబెర్టీ’ కవిత చదివినందుకుగానూ మొదటి జార్‌ అలెగ్జాండర్‌ చేతిలో దేశ బహిష్కరణకు గురయ్యాడు.

గ్రీసులో ఆటోమాన్‌ పాలనను అంతం చేయడానికి స్థాపించబడిన రహస్య సంఘంలో పనిచేశాడు. దేశ బహిష్కరణ ఎత్తివేశాక కూడా ఆయన తన రాజవ్యతిరేక స్వభావాన్ని వీడలేదు. జార్‌ గూఢచారులు నిరంతరం ఆయన మీద ఓ కన్నేసి ఉండేవాళ్లు. ‘ద బ్రాంజ్‌ హార్స్‌మన్‌’ కవిత, ‘ద స్టోన్‌ గెస్ట్‌’ నాటకం, ‘బోరిస్‌ గొదునోవ్‌’ నాటకం, ‘యుజీన్‌ అనేగిన్‌’ నవల ఆయన ప్రసిద్ధ రచనల్లో కొన్ని. ఆ కాలపు అందగత్తెల్లో ఒకరిగా పేరొందిన నటాలియా గొంచరోవాను పెళ్లాడాడు పుష్కిన్‌. నలుగురు పిల్లలు కలిగారు. ఆమె మీద కన్నేసిన తోడల్లుడితో ద్వంద్వయుద్ధానికి సవాల్‌ విసిరిన పుష్కిన్‌ ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి, రెండ్రోజుల తర్వాత తన 37వ యేట అర్ధంతరంగా కన్నుమూశాడు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top