సగం కాదు సమం కావాలి

Shweta Shetty is the newly emerged National Womens Party chairperson in Delhi - Sakshi

పరిచయం శ్వేతాశెట్టి

అవకాశం, అధికారం..పురుషుడి చేతుల్లో ఉన్నాయి.స్త్రీకి దక్కవలసిన వాటిని కూడా పురుషుడు తన చేతుల్లోనే బిగించి పట్టుకున్నాడు. సగమిస్తాం, శాతాలిస్తాం అని దశాబ్దాలు గడిపేస్తున్నాడు. ఈ సగాలూ, శాతాలు కాదు..సమ విభజన జరగాల్సిందేనని ‘ఆల్‌ ఉమెన్‌ పార్టీ’సమ(ర)శంఖారావం పూరిస్తోంది.

‘‘భూమి లోపల గింజ నాటుతున్నాం. అది మొలకెత్తుతుంది. మహావృక్షమవుతుంది. మొలకెత్తే వరకు అక్కడ ఒక గింజ నాటి ఉన్న సంగతి కూడా బయటకు తెలియకపోవచ్చు. మనకు తెలియలేదంటే అర్థం భూమిలో బీజం లేదని కాదు, భూమిలో బీజం ఉన్న సంగతిని మనం గుర్తించలేదని మాత్రమే. మేము ఇప్పుడు మహిళలకు రాజ్యాధికార బీజాలు నాటుతున్నాం. అవి మొలకెత్తిన రోజున సమాజం గుర్తిస్తుంది. అలాగని మా ప్రయత్నం.. మేము బీజం వేశామని సమాజం గుర్తించడం కోసం కాదు, సమాజంలో మహిళలు సగభాగం ఉన్నారనే వాస్తవాన్ని సమాజం గ్రహించడం కోసం.

ఇంకా కచ్చితంగా చెప్పాలంటే సమాజంలో మహిళలు సగభాగం ఉన్నారనే వాస్తవాన్ని సమాజానికి గుర్తు చేయడం కోసమే ఈ రాజకీయ మహోద్యమానికి బీజం వేశాం. పాపులేషన్‌లో సగం ఉన్న మేము పార్లమెంట్‌లో పది శాతానికి పరిమితం కావడమేంటి! పార్లమెంట్‌లో కూడా సగభాగం మహిళలే ఉండాలి’’ అన్నారు డాక్టర్‌ శ్వేతాశెట్టి. ఢిల్లీలో ఇటీవలే కొత్తగా ఆవిర్భవించిన ‘నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీ’ అధ్యక్షురాలు ఆమె. 

దక్కన్‌ లీడర్‌
డాక్టర్‌ శ్వేతా శెట్టి హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. హైదరాబాద్‌లోని దక్కన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఎంబీబీఎస్‌ చదివారు. కొంతకాలం కర్మాన్‌ఘాట్‌లో ప్రాక్టీస్‌ చేశారు. గత ఏడాది డిసెంబర్‌ 18వ తేదీన న్యూఢిల్లీలో ‘నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీ’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ ఆఫ్‌ మదర్స్‌ అనే ట్యాగ్‌లైన్, ముకుళిత హస్తాలతో ఉన్న మహిళ లోగోతో ఆవిర్భవించిన ఆ మహిళల రాజకీయ పార్టీ ఒక్కసారిగా దేశమంతటినీ ఆకర్షించింది. మహిళల కోసం జాతీయస్థాయిలో ఒక రాజకీయ పార్టీని స్థాపించాల్సిన ఆవశ్యకత, అనివార్యతల గురించి సాక్షితో తన ఆలోచనలను  పంచుకున్నారు డాక్టర్‌ శ్వేతాశెట్టి. 

భిన్నత్వంలో ఏకత్వం
‘‘ఎన్నికలొచ్చిన ప్రతిసారీ వార్తాపత్రికలు, ఇతర ప్రసార సాధనాల్లో హడావుడి మొదలవుతుంది. పోటీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల జాబితాలను ప్రచురిస్తారు. పోటీలో నిలుచున్న మహిళలపై  ప్రత్యేక కథనాలుంటాయి. నాకు తెలిసినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ గమనిస్తూనే ఉన్నాను. అభ్యర్థుల జాబితాలో మహిళల సంఖ్య వేళ్ల మీద లెక్కకు మించేది కాదు. మరికొంచెం లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత మొదటి పంచవర్ష ప్రణాళికల నుంచి ప్రస్తుత ‘నీతి అయోగ్‌’ వరకు ప్రతిసారీ మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడుతున్నాయి ప్రభుత్వాలు. మహిళల స్వయం స్వావలంబన గురించి, సాధికారత గురించి కూడా మాట్లాడుతున్నాయి. అయితే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ గురించి మాత్రం మాట్లాడడం లేదు. ఒకసారి అటకెక్కిన మహిళా బిల్లును అటక దించే ప్రయత్నం ఏ ప్రభుత్వమూ చేయడం లేదు. బహుళ పార్టీ విధానం అమలులో ఉన్న మనదేశంలో రాజకీయ పార్టీల మధ్య భావసారూప్యతల కంటే భావ వైవిధ్యతలే ఎక్కువ.

అయితే మహిళా రిజర్వేషన్‌ బిల్లు దగ్గరకొచ్చేటప్పటికి అన్ని పార్టీలూ ఒకటే రకంగా స్పందిస్తున్నాయి. ఎన్నికలొచ్చే సరికి నాయకులు ‘మా పార్టీ అధికారంలోకి వస్తే అవి చేస్తాం... ఇవి చేస్తాం’ అని హామీలు గుప్పిస్తుంటారు. ఒక్క జాతీయ నాయకుడైనా ‘మా పార్టీ అధికారంలోకి వస్తే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం తెస్తాం’ అని వాగ్దానం చేయట్లేదు. అధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు– తర్వాత పొత్తులు కుదుర్చుకుని ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వాల్లోని పార్టీలు... అనేక అంశాల మీద విభేదించుకుంటూ, సర్దిచెప్పుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ బిల్లులు పాస్‌ చేసుకుంటున్నాయి. కానీ మహిళాబిల్లు కోసం ఒక్క మగ గొంతు కూడా పెగలట్లేదు. అందుకే మహిళల కోసం ఒక పార్టీ ఉండాల్సిన అవసరం ఉందని ఈ పార్టీని స్థాపించాం’’ అన్నారు నలభై రెండేళ్ల శ్వేత.

రాజ్యాంగం అలా చెప్పలేదు
‘‘మహిళల కోసం రిజర్వేషన్‌ అనగానే అందరికీ 33 శాతం గుర్తొస్తుంది. నిజానికి ఆ నిబంధన మహిళల స్థానాలను 33 శాతానికి పరిమితం చేయమని కాదు. లింగ వివక్షలేని సమాజ నిర్మాణం కోసం మహిళలకు సగభాగం ప్రాతినిధ్యం ఉండాలని చెప్పింది. పరిపాలన, నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం కనీసం 33 శాతానికి తగ్గకుండా ఉండాలని చెప్పింది. పురుషాధిక్య భావజాలంలో నడుస్తున్న రాజకీయ పార్టీలు ‘కనీసంగా 33 శాతం’ అనే నిబంధనను తమకు అనుకూలంగా ‘మహిళలకు 33 శాతం స్థానాలను కేటాయించడం’గా మలుచుకున్నాయి. రాజ్యాంగం కల్పించిన సమ భాగస్వామ్యం గురించి సమాజానికి తెలియచేయడం, చట్టసభలతోపాటు, పబ్లిక్, ప్రైవేట్‌ సెక్టార్లలో కూడా మహిళలకు సమ భాగస్వామ్య సాధనే మా నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీ లక్ష్యం’’ అన్నారు శ్వేత.

ఆల్‌ ఉమెన్‌ అసోసియేషన్‌
‘‘మహిళల కోసం రాజకీయ పార్టీ స్థాపన అనేది పదేళ్ల కిందట నాకు వచ్చిన ఆలోచన. 2012లో పార్టీని రిజిస్టర్‌ చేశాను. అప్పటికే నాకు నాలుగేళ్ల పాప ఉంది. ఆ తర్వాత రెండేళ్లకు బాబు పుట్టాడు. పిల్లల బాధ్యత కారణంగా కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ‘తెలంగాణ మహిళా సమితి’ పేరుతో ఎన్‌జివో ప్రారంభించాను. భావసారూప్యం కలిగిన మహిళలతో నా ఆలోచనను పంచుకున్నాను. వాళ్లందరూ మహిళాభ్యుదయం కోసం కృషి చేస్తున్న వాళ్లే. ‘ఐద్వా’లో చురుగ్గా ఉన్న మహిళలతో కలిసి కార్యాచరణ రూపకల్పన చేసుకున్నాను. ఇదంతా పూర్తయిన తర్వాత గత డిసెంబర్‌లో న్యూఢిల్లీలో జానకీ రాజారామ్‌తో కలిసి పార్టీని ప్రారంభించాను.

ఆ వెంటనే దక్షిణాది రాష్ట్రాలన్నింటితోపాటు ఉత్తరాదిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో ప్రాంతీయ విభాగాలు కూడా ప్రారంభమయ్యాయి. యూపీలో రుచికపూర్, ముంబయిలో భావనా జడేజా పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. దేశంలోని దాదాపుగా కొన్ని రాష్ట్రాల్లో పార్టీ లాంఛనంగా ప్రారంభం కాకపోయినప్పటికీ జమ్ముకాశ్మీర్, ఉత్తరప్రదేశ్‌ వంటి మరికొన్ని రాష్ట్రాల్లో కమిటీలు పనిచేస్తున్నాయి. మా పార్టీకి వెబ్‌సైట్, ఫేస్‌బుక్‌ పేజీ ఉన్నాయి. వీటిని నిర్వహించడానికి టెక్నికల్‌ టీమ్‌ పనిచేస్తోంది.

నామినేషన్‌లు వేశాం
ఎన్నికల్లో 283 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయడం, గెలిచి పార్లమెంట్‌లో అడుగు పెట్టడం మా పార్టీ లక్ష్యం. అందుకోసం ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్యలో సగం స్థానాలకు పోటీ చేస్తున్నాం. రాజస్థాన్‌లో పాతిక స్థానాలకు గాను పదమూడు స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా నామినేషన్‌లు వేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌లో 13 స్థానాలకు పోటీ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల పోటీలో కూడా మా అభ్యర్థులుంటారు. ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. ఇప్పుడు నాటిన బీజం మొలకెత్తి, చివుర్లు తొడిగి, చెట్టంత ఎదగడానికి సమయం పడుతుంది. నా పూర్తి సమయాన్ని పార్టీని విస్తరింప చేయడానికే కేటాయించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో నేను ఒక నియోజకవర్గానికి పరిమితమైతే లక్ష్యం నెరవేరడం కష్టం. అందుకే 2024 టార్గెట్‌గా పని చేస్తున్నాం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం మీద దృష్టి పెడతాం. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలోనూ దాదాపుగా రెండు వందల మంది కార్యకర్తలు రిజిస్టర్‌ అయి ఉన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కసరత్తు మొదలు పెడతాం.ఎన్నికల కమిషన్‌ గుర్తించిందిమా పార్టీకి ఎన్నికల కమిషన్‌ గుర్తింపు వచ్చింది. జాతీయ స్థాయిలో కామన్‌గా గ్యాస్‌ స్టవ్‌ గుర్తును కేటాయించింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్‌ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ మా అభ్యర్థులు ఈ గుర్తు మీద పోటీ చేస్తారు. ఆ మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ గుర్తును ఇతర ప్రాంతీయ పార్టీలకు కేటాయించి ఉండడంతో ఆ రాష్ట్రాల్లో మాకు గాజుల గుర్తు ఇచ్చారు. మహిళలకు రాజ్యాధికారం కోసం చేస్తున్న పోరాటంలో మాకు వంటింటి గుర్తును కేటాయించారని మగవాళ్లు ఎగతాళి చేయడానికి అవకాశం ఉంది. కానీ, అది రెండు బర్నర్‌లున్న గ్యాస్‌ స్టవ్‌. ఒక పనిని మహి మగవాడు ఇద్దరూ చేయగలగాలని చెప్పడానికి ప్రతీక ఆ చిహ్నం. ఎన్నికల కమిషన్‌ దగ్గర ఉన్న చిహ్నాల జాబితా నుంచి నాగలి, దీపం, తల్లీబిడ్డ, గ్యాస్‌స్టవ్‌ వంటి పదిహేను గుర్తులను ఎంపిక చేసుకున్నాం. అందులో మాకు గ్యాస్‌స్టవ్‌ని కేటాయించింది ఎన్నికల కమిషన్‌.

ఆధిక్యం కోసం కాదు 
భారత మాజీ రాష్ట్రపతి ఆర్‌. వెంకట్రామన్‌ గారి అమ్మాయి పద్మా వెంకట్రామన్‌ నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీలో సౌత్‌ జోన్‌ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వెస్ట్‌ జోన్‌ బాధ్యతలను క్రికెట్‌ క్రీడాకారుడు రవీంద్ర జడేజా సోదరి భావనా జడేజా చూస్తున్నారు. మా పార్టీలో రిటైర్‌ అయిన మహిళా ఐఏఎస్‌ అధికారులు, న్యాయవాదులు, ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో సేవలందించి రిటైర్‌ అయిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వారంతా స్థానిక నిర్వహణ బాధ్యతలకు అవసరమైన ఖర్చులు సొంతంగా పెట్టుకుంటున్నారు. దాంతో మా పార్టీకి నిధుల సమీకరణ బాధ లేదు. ఇప్పటి వరకు చేరిన వాళ్లంతా శాసననిర్మాణంలో మహిళల భాగస్వామ్యం, ఆవశ్యకతల గురించి సంపూర్ణ అవగాహన ఉన్న మహిళలే.

మేమంతా కలిసి ఇక నుంచి క్షేత్రస్థాయిలో మహిళల్ని చైతన్యవంతం చేయాలి. ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పనికి పూనుకుంటాం. మా పార్టీ సిద్ధాంతాలు మగవారిని కూడా ఆకట్టుకుంటున్నాయి. పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఇది మహిళాధిక్యతను ప్రదర్శించడానికి స్థాపించిన పార్టీ కాదు, మహిళలకు సమభాగస్వామ్యాన్ని కోరుతూ స్థాపించిన పార్టీ. కాబట్టి మగవాళ్లు ఉండకూడదనే నియమమేదీ లేదు. వాళ్లు కూడా సగభాగం ఉంటారు. అయితే మగవాళ్ల కోసం మహిళలు పోటీ చేసే స్థానాలను త్యాగం చేయడం వంటివి ఉండవు’’ అని ముగించారు శ్వేతాశెట్టి.
ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
ఫొటోలు : ఎస్‌.ఎస్‌.ఠాకూర్‌

మా ఎజెండా 
మేము అధికారంలోకి వస్తే... మొదటి ప్రాధాన్యం మహిళల చదువు, రెండవది మహిళలకు ఉద్యోగం, మూడు మహిళల క్షేమం, ఆ తర్వాత వ్యవసాయరంగం, రక్షణ రంగాలుంటాయి. ఓ యాభై ఏళ్ల కిందట మహిళలు చదువుకోవడానికి ఇంటి నాలుగ్గోడల మధ్యనే మౌనపోరాటం చేయాల్సి వచ్చింది. ముప్పై ఏళ్ల కిందట ఉద్యోగాలు చేయడానికి అనుమతి కోసం మెల్లగా గొంతు విప్పింది. ఇప్పుడు శాసన నిర్మాణంలో అడుగు పెట్టడానికి ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే చట్టసభల్లో ఉన్న వాళ్లలో ఎక్కువ మంది రాజకీయ కుటుంబాల నేపథ్యం ఉన్న వాళ్లే. ఫలానా వారమ్మాయి, ఫలానా వారింటి కోడలు, ఫలానా వ్యక్తి భార్య... ఈ గుర్తింపుతోనే వస్తున్నారు, వచ్చిన తర్వాత కూడా వాళ్లింటి మగవాళ్ల నిర్ణయాలను అమలు చేస్తూ కొనసాగుతున్నారు తప్ప స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం చేయడం లేదు.

మనదేశంలో ఒక ఇండిపెండెంట్‌ మహిళ రాజకీయ రంగంలో అడుగుపెట్టే పరిస్థితి లేదిప్పుడు. అరకొరగా ఉన్నప్పటికీ వాళ్లను కార్యకర్త స్థాయికి మించి నాయికగా ఎదగనివ్వడం లేదు. అందుకే మా పార్టీ అవసరం చాలా చాలా ఉందని నమ్ముతున్నాం. బేటీ బచావోలు, బేటీ పఢాలోలు ఉన్నప్పటికీ ఫిమేల్‌ ఫోటిసైడ్, ఉమెన్‌ ట్రాఫికింగ్, మహిళల మీద దాడులు తగ్గడం లేదు. వాటిని రూపుమాపగలిగింది మహిళలే. బాలికా విద్యం కోసం ఉద్యమించిన సావిత్రిబాయిఫూలే స్ఫూర్తితో మొదలు పెట్టిన ఉద్యమం మాది. ఇందులో మేము కూడా ఆమెలాగానే విజయవంతం అవుతాం. పొలిటికల్‌ ఎంపవర్‌మెంట్‌ మాత్రమే పరిపూర్ణమైన సాధికారత’’ అన్నారు శ్వేతాశెట్టి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top