ఆటను మార్చగల యువకుడు!

ఆటను మార్చగల యువకుడు!


‘ఇండియాలో కూడా గూగుల్ స్థాయి కంపెనీ ఒకటి ప్రారంభం అయినా పెద్దగా ఆశ్చర్యపోవద్దు...’ అని అంటాడు అంకిత్ ఫదియా. సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌స్థాయి గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా అంకిత్ కామెంట్‌ను విని ఆశ్చర్యపోతారు. మనకంత దృశ్యం ఉందా? అని సందేహాన్ని వ్యక్తం చేస్తారు. అయితే అంకిత్ ఫదియా లాంటి ప్రతిభ ఉన్న వాళ్లకు తగిన ప్రోత్సాహం, కాలం కలిసొస్తే సెర్చింజన్‌గానో మరో విధంగా ఇంటర్నెట్ పనులకు ఉపయోగపడే సంస్థను  స్థాపించడం, దాన్ని ‘గూగుల్’ స్థాయికి తీసుకెళ్లడం పెద్ద విశేషం కాదు. ఎథికల్ హ్యాకర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకొని, హ్యాకింగ్ ట్రైనర్‌గా 27 యేళ్లకే 16 పుస్తకాలను రాసి, ఎమ్‌టీవీలో యూత్‌కు ఇంటర్నెట్ గురించి టిప్స్ అందించే కార్యక్రమానికి హోస్ట్‌గా పనిచేసిన ఘనత అంకిత్ ది!

 

పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే కొన్ని గిప్ట్స్ వారి జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి. వాటిని ఉపయోగించుకొనే తీరును బట్టి వాళ్ల జీవితాలు మలుపు తిరిగే అవకాశం ఉంది. అలా జీవితాలను మలుపుతిప్పగల సాధనం కంప్యూటర్. ఇప్పుడు కాదు దాదాపు 17 యేళ్ల కిందట అంకిత్‌కు పదేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు అతడికి కంప్యూటర్‌ను బహుమతిగా ఇచ్చారట!

 

కంప్యూటర్ కొద్ది సేపు ఆటగా అనిపించిందట. తర్వాత... ఈ పిల్లాడికి కంప్యూటర్ ఎలా పనిచేస్తోంది, ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ అవుతోంది అనే విషయం గురించి ఆలోచన మొదలైందట. దీంతో మొదలైంది ఇతడి పరిశోధన. అలా పరిచయం అయ్యింది నెట్‌వర్కింగ్. అటు నుంచి హ్యాకింగ్ ప్రమాదం.. దాన్ని అధిగమించేదే ఎథికల్ హ్యాకింగ్. కంప్యూటర్ పదేళ్ల వయసులో పరిచయం అయితే ఎథికల్ హ్యాకింగ్ గురించి 12 యేళ్ల వయసులో తెలుసుకొన్నాడట. 14 యేళ్ల వయసులో ఏకంగా ఎథికల్ హ్యాకింగ్ గురించి పుస్తకమే రాసేశాడు! కాపీ బుక్స్ రాసుకోవాల్సిన వయసులో ‘ఎథికల్‌హ్యాకింగ్ గైడ్’ పేరుతో పుస్తకం రాశాడు!  

 

ఆ పుస్తకం పబ్లిష్ అయ్యింది. పలు భాషల్లోకి అనువాదం అయ్యింది. తలపండిన నిపుణులు ఎంతోమంది ఉన్నా.. ఎథికల్ హ్యాకింగ్‌లో అప్పటికి పుస్తకాలు రాసే ఐడియా ఎవరికీ లేదో ఏమోకానీ అంకిత్ పుస్తకం బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. 14 యేళ్ల కుర్రాడు రాసిన పుస్తకంగా కాక ఎథికల్ హ్యాకింగ్ విషయంలో మంచి గైడ్‌గా గుర్తింపు తెచ్చుకొంది అది. అక్కడే నిపుణుడిగా అంకిత్ తొలి విజయం సాధించాడు.

 

పుస్తకంతో అపరిచితుడుగానే ఎంతోమందికి ఎథికల్ హ్యాకింగ్ ద్వారా అవగాహన కల్పించిన అంకిత్ తొలిసారి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ట్రైనర్‌గా మారడం ద్వారా మరో రకమైన గుర్తింపు సంపాదించుకొన్నాడు. అనేక రాష్ట్రాల పోలీస్‌డిపార్ట్‌మెంట్‌లకు ఎథికల్ హ్యాకింగ్ విషయంలో ట్రైనర్‌గా మారాడు. సైబర్ క్రైమ్‌కు పగ్గాలు వేయడంలో సహకరించే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. అప్పటికి అంకిత్ వయసు 16 సంవత్సరాలు.రెండేళ్లు అలాగడిపేసిన తర్వాత సొంతంగా ఎథికల్ హ్యాకింగ్‌ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను మొదలు పెట్టాడు. తనే ఒక బ్రాండ్‌గా మారాడు. ఇన్‌స్టిట్యూట్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సును ప్రారంభించి వివిధ శాఖల ద్వారా దాదాపు 25 వేల మందిని ఎథికల్‌హ్యాకింగ్ నిపుణులుగా తీర్చిదిద్దాడు.

 

ఈ విధంగా ట్రైనర్‌గా దూసుకుపోతున్న ఇతడిని ఎమ్‌టీవీ గుర్తించింది. యూత్‌కు ఎంతో ప్రియమైన ఇంటర్నెట్ గురించి కిటుకులను చెప్పే ప్రోగ్రామ్‌ను ప్రారంభించాలనుకొన్న ఆ ఛానల్ అంకిత్‌ను అందుకు తగిన వ్యక్తిగా భావించింది. అతడే హోస్ట్‌గా ‘ వాట్‌ద హ్యాక్’ అనే  కార్యక్రమం మొదలైంది. ఎమ్‌టీవీలో యాంకర్‌లు అంటే ఎంత గుర్తింపు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అవకాశం గొప్ప లాంచింగ్ ప్యాడ్. అంకిత్‌కు కూడా అది అలాగే ఉపయోగపడింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వరకూ ఇతడి పేరు వెళ్లింది. ఒకవైపు ఈ కెరీర్‌లను కొనసాగిస్తూ ఎథికల్ హ్యాకింగ్ గురించి పుస్తకాలు రాస్తూ వచ్చాడు. దీంతో ఇతడిని డబ్ల్యూఈఎఫ్ ‘గ్లోబర్ షేపర్’గా గుర్తించింది . అవార్డును ఇచ్చి సత్కరించింది.

 

ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన ఎథికల్ హ్యాకర్‌లలో అంకిత్ ఒకరు. ఎథికల్ హ్యాకింగ్ గురించి 16 పుస్తకాలను రాశాడు. దాదాపు 25 దేశాల్లో వివిధ సమావేశాల్లో ప్రసంగించాడు. అనేక అవార్డులను అందుకొన్నాడు. దాదాపు 25 వేల మందిని ఎథికల్ హ్యాకింగ్ రంగంలోనిపుణులుగా తీర్చిదిద్దాడు. అనేక కార్పొరేట్ కంపెనీలకు సలహాదారుగా ఉన్నాడు. ఉత్తమ ప్రసంగకర్తగా నిలిచాడు. ఇండియా టుడే వాళ్లు ఇతడిని ‘గేమ్ ఛేంజర్’గా గుర్తించారు. భారత ప్రభుత్వం కూడా పలు అవార్డులను ఇచ్చింది. మరి ఇప్పుడు, ఇతడి ప్రొఫైల్‌ను పరిశీలించాక... ‘ఇండియాలో గూగుల్ స్థాయి కంపెనీ ఒకటి ప్రారంభం అయినా పెద్దగా ఆశ్చర్యపోవద్దు...’అన్న ఇతడి మాటను మరోసారి ప్రస్తావించుకొంటే... ఎథికల్ హ్యాకింగ్‌లో ప్రపంచ స్థాయి వ్యక్తులు వస్తున్న మన దేశంలో ‘గూగుల్’ స్థాయి కంపెనీ స్థాపించగల సమర్థులూ ఉంటారనిపిస్తుంది!

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top