‘నువు పట్టుచీర కడితే...
ఓ పుత్తడిబొమ్మా...
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ!’
అల్టిమేట్ ఎక్స్‌ప్రెషన్!
వేటూరి పాటలోని ఈ చరణం...
ప్రతి స్త్రీమూర్తికీ... ఓ ప్రణామం!
అవునూ... పట్టుపురుగు జన్మొక్కటేనా...
ఇంకో ‘పురుగు’ జన్మ కూడా తరించాలే!
(సారీ బాయిస్... ఊరికే... సరదాకి...)
బాటమ్ లైన్ ఏంటంటే...
చీర ప్రాణం ‘కట్టు’లో ఉంటుందని!
అందుకే ఈవారం ‘ముస్తాబు’లో...
‘హౌ టు’ నుంచి ‘హవ్వీజిట్’ వరకు...
కట్టుబడి పాఠాలు.
భారతీయ మగువ ఆత్మ ఆరుగజాల చీర. పొడవులో అర గజం తగ్గినా ప్రపంచవస్త్రధారణలో ఎప్పుడూ పై మెట్టు మీదే ఉంటుంది చీర. పాశ్చాత్యులు సైతం సలామ్ చేసే చీర అంచులుగా, కుచ్చిళ్లుగా... ప్రతి కదలికలోనూ చూడచక్కని కళతో ఆకట్టుకుంటుంది. బంగారు తీగెలతో నేసినా, వెండి దారాలతో అల్లినా, నైలాన్‌తో నయనానందకరం చేసినా అమ్మాయి చీరకట్టు సరిగ్గా ఉంటేనే నూటికి నూరు మార్కులు పడతాయి. అందరూ చీరలు కట్టుకుంటారు. కాని కొందరి ‘కట్టు’కే ప్రశంసలు అందుతాయి. ఎందుకలా? ‘మాకూ మీలా కట్టడం నేర్పుతారా?’ అని అడిగి మరీ ‘చీరకట్టు’ను నేర్పించుకుంటారు కొందరు. ఆ‘కట్టు’కోవడంలో అంత గొప్పతనం ఏముంది? చీరకట్టుకు ప్రత్యేకమైన క్లాసులూ, టీచర్లూ ఉండటం చూస్తుంటే తెలుసుకోవాల్సిన తప్పనిసరి సబ్జెక్ట్ అనిపిస్తుంది. ముచ్చటగొలిపే చీరకట్టు విశేషాల పాఠ్యాంశమే ఇది.
చీరకట్టు గమనిక
కొంతమంది వెనకవైపు చీర పొర నేలకు తగులుతున్నట్టుగా, ముందువైపు కుచ్చిళ్లు పైకి ఉండేలా కడుతుంటారు. దీనివల్ల చీర అందం తగ్గిపోతుంది. అందుకని వెనక, ముందు చీర అంచులు కొద్దిగా ఫ్లోర్‌ని తగిలేలా కట్టుకోవాలి.
కాలి మడమలు కనిపించకుండా చీరకట్టు ఉండాలి.
గుర్తుంచుకోవలసినవి
పెట్టీకోట్ మరీ బిగుతుగా, మరీ లూజ్‌గా కాకుండా సౌకర్యవంతంగా ఉండేలా కట్టుకోవాలి.
పల్లూ భుజం మీదుగా తీసి, మోకాలు కిందవరకు వచ్చేలా సెట్ చేసుకోవాలి.
చీర ఫాల్ బయటకు కనిపించకూడదు.
నడిచేటప్పుడు కుచ్చులు అడ్డుపడకుండా సౌకర్యవంతంగా ఉండేలా సెట్ చేసుకోవాలి.
సింపుల్‌గా ఆలంకరణ

మొదటిసారి చీరకట్టుకుంటే సింథటిక్ మెటీరియల్ శారీని కట్టుకోవడం సులువు.
చీరకు సరిపోలే అందమైన జాకెట్టు ఉంటేనే అదనపు ఆకర్షణ.
చీరకు సరిపోలే లక్షణమైన శాండల్స్, చెప్పల్స్ వేసుకోవాలి. మ్యాచ్ అయ్యే చెప్పులు ధరించాలి. (హై హీల్స్ వేసేవారు చీర కట్టుకునేముందు తప్పనిసరిగా హీల్స్ వేసుకొని కట్టుకోవాలి. ముందే చీరకట్టుకొని హీల్స్ వేసుకుంటే చీర నిడివి పొట్టిగా అనిపిస్తుంది. బయటకు హీల్స్ కనిపించకుండా చీర అంచులు కిందవరకు ఉంటే బాగుంటుంది)
చీరకట్టు మీదకు ఎన్ని నగలైనా బాగుంటాయి కదా! అని ఎక్కువగా వేసుకుంటే ఎబ్బెట్టుగా ఉంటారు. ఎంత సింపుల్‌గా అలంకరణ అంత బాగుంటుంది.
చీర కట్టుకున్నప్పుడు చీరకు తగిన గాజులపై కూడా దృష్టిపెట్టాలి.
ఇతర డ్రెస్సులకు లేని అదనపు హంగులను చీరతో క్రియేట్ చేయవచ్చు. ఒక చేత్తో పల్లూను ముందుకు లేదా వెనక నుంచి పట్టుకోవడం. మెడ మీదుగా తీసుకొచ్చి పట్టుకోవచ్చు. ఏ తరహాగా కట్టినా చీర అందం రెట్టింపు అయ్యేలా వస్త్రధారణ ఉంటే మరీ మంచిది.
పట్టు చీర
పట్టు చీర కట్టుకునేటప్పుడు హిప్ దగ్గర ఉండే ఫస్ట్‌లైన్ పొరను కుడివైపు హిప్ దగ్గరకు తీసి, చిన్న చిన్నగా 3-4 నాలుగు కుచ్చులు పెట్టి, పిన్ పెట్టాలి. లేదా పెట్టీకోట్‌లోకి మడవాలి.
పట్టు చీరకు బార్డర్ వెడ ల్పుగా, పెద్దగా ఉంటుంది. అందుకని పల్లూ 8 ఫ్రిల్స్ పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు.
బొద్దుగా ఉన్నవారు పట్టుచీర కట్టుకుంటే ఇంకాస్త లావుగా కనిపిస్తారు. అలాంటప్పుడు హెయిర్ స్ట్రెయిట్‌నర్ పరికరాన్ని సాధారణ ఉష్ణొగ్రతలో పెట్టి, దాంతో అమర్చుకున్న పల్లూను, కుచ్చులను (కట్టుకున్న తర్వాత) ఐరన్ చేయాలి.
అలాగే భుజం మీద నుంచి ఛాతీ భాగంలోనూ ఐరన్ చేయాలి. దీని వల్ల చీరకట్టు నీటుగా కనిపిస్తుంది.
ఫిష్ కట్
వర్క్, నెటెడ్, షిఫాన్... ఏదైనా ఈవెనింగ్ పార్టీవేర్ శారీ అయితే చిన్న పిల్లల ఫ్యాన్సీ బ్యాంగిల్‌ను పల్లూకు వేసుకోవాలి. దీని వల్ల ఛాతీ భాగంలో చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చి, ఫిష్‌కట్ మోడల్‌గా చీర అందం రెట్టింపు అవుతుంది.
పల్లూ అమర్చుకునేటప్పుడు బార్డర్ పొరని కుడి నుంచి ఎడమవైపుకు తీసి, బ్లౌజ్‌కి అటాచ్ చేస్తూ పిన్ పెట్టాలి. దాని మీదుగా పల్లూ ఫ్రిల్స్ అమర్చుకుంటే రూపంలోనూ మార్పు కనిపిస్తుంది.
- నిర్వహణ: నిర్మలారెడ్డి