నెట్టింటికి రా చెల్లీ..!

Program for Literacy among women  - Sakshi

‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’... ఓ నలభై ఏళ్ల కిందటి ప్రభుత్వ నినాదమిది. ఆడవాళ్లలో అక్షరాస్యతను పెంచడానికి, కుటుంబాలకు మహిళలకు చదువు ఎంత అవసరమో తెలియచేయడానికి నాటి ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రచార ఉద్యమం ఇప్పుడు మళ్లీ ‘వెన్‌ యు ఎడ్యుకేట్‌ ఎ ఉమన్, యు ఎడ్యుకేట్‌ ఎ ఫ్యామిలీ’ అంటూ ఊళ్లలోకి వస్తోంది. అప్పట్లో పలకల మీద అక్షరాలు దిద్దించడానికి, ఇప్పుడు గ్రామీణ మహిళల డిజిటల్‌ లిటరసీ నేర్పించేందుకు!

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో జిల్లా కేంద్రానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది డోరియా. అంతా కలిపి రెండు వందల ఇళ్లుంటాయి. ఓ ఇంట్లోని అమ్మాయి పూజా షాహి. 22 ఏళ్లు. కొత్తగా మొగ్గ తొడుగుతున్న ఎంట్రప్రెన్యూర్‌. తన స్మార్ట్‌ ఫోన్‌ స్వైప్‌ చేసి గబగబా ‘డోరియా డిజైన్స్‌’ అనే వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసింది. ఊలుతో అల్లిన కంఠాభరణాలు, చెవి లోలకులు, గాజుల ఫొటోలను తన ఫేస్‌బుక్‌ ద్వారా అందులో పోస్ట్‌ చేసింది. గంటలోపే వాటి ధరలు, డెలివరీ వివరాలు అడుగుతూ రెస్పాన్స్‌ వచ్చింది!

పూనమ్‌ మిశ్రాది కూడా ఇలాంటి అనుభవమే. ఆమె డిజిటల్‌ లిటరసీలో శిక్షణ తీసుకోక ముందు తన ఉత్పత్తులను పెట్టెలో పెట్టుకుని పొరుగూళ్లకు వెళ్లి అమ్మేది. కొందరు అప్పుడే డబ్బు ఇచ్చేసేవాళ్లు. కొన్ని అప్పు బేరాలు. పూజా షాహిలాగానే పూనమ్‌ కూడా ఇప్పుడు ఇంటర్నెట్‌లో మార్కెట్‌ చేయడం నేర్చుకుంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, పేటిఎమ్‌ వంటివన్నీ సొంతంగా చేసుకుంటోంది.

యూట్యూబ్‌ వెలుగైంది!
డోరియాలో మహిళలు లేసులు, పూసలు, ఊలుతో రకరకాల వస్తువులు తయారు చేస్తారు. ప్రతి ఒక్కరికీ అల్లకం వచ్చి ఉంటుంది, ఉత్సాహం కొద్దీ ఎక్కువ ఉత్పత్తి చేస్తే వాటిని మార్కెట్‌ చేసుకోవడం గతంలో సాధ్యమయ్యేది కాదు. డిజిటల్‌ లిటరసీతో ఈ మహిళలు తమ మార్కెట్‌ను విస్తరించుకున్నారు.

కొత్త డిజైన్ల కోసం యూ ట్యూబ్‌లో పోస్ట్‌ అయిన వీడియోలు చూస్తున్నారు. చూసిన దానిని చూసినట్లు దించకుండా కొత్తరంగుల కాంబినేషన్‌తో తమ ప్రాంతాల్లో ఆడవాళ్లు ధరించే దుస్తులకు నప్పేటట్లు చేస్తున్నారు. వాటిని ఆన్‌లైన్‌లోనే మార్కెట్‌ చేస్తున్నారు. అరచేతిలోనే వ్యాపార ప్రపంచాన్ని చూస్తున్నారు.

ఇంటర్నెట్‌ సాథీ
ఆధునికత దిశగా పరుగులు తీస్తున్న రోజుల్లో గ్రామీణ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధన, సాధికారత సాధించడానికి బ్యాంకు లావాదేవీ కూడా నేర్చుకున్నారు. కానీ వాళ్లు ఒక అడుగు ముందుకేసేటప్పటికి టెక్నాలజీ పదడుగులు ముందుకు వెళ్లింది. ఈ అంతరాన్ని పూరిస్తోంది ఇంటర్నెట్‌ సాథీ ప్రోగ్రామ్‌. ఇప్పటికే ఇండియాలో ఇంటర్నెట్‌ వినియోగదారులు శరవేగంగా పెరిగిపోతున్నారు.

ఈ ప్రోగ్రామ్‌ ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా విస్తరించి కోటీ ఇరవై లక్షల మంది మహిళల లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటే ఇండియా ముఖచిత్రం మారిపోవచ్చు. ఇప్పుడు మనదేశంలో ఇంటర్నెట్‌ వాడే ప్రతి పదిమందిలో ఒకరు గ్రామీణ మహిళ. ఈ లక్ష్యం పూర్తయితే గ్రామాల్లో మహిళలే ప్రధాన టెక్‌ సావ్వీలవుతారు. పది నెలల కాలం, తొమ్మిది వేల గ్రామాలు, కోటీ ఇరవై లక్షల మంది మహిళలు లక్ష్యంగా ‘ఇంటర్నెట్‌ సాథీ’ అనే ఈ డిజిటల్‌ లిటరసీ ప్రోగ్రామ్‌ 2015లో మొదలై, దశలవారీగా కొనసాగుతోంది. గూగుల్, టాటా ట్రస్ట్‌ సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తున్నాయి.

– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top