సమాజం మారాలి సర్‌

Professor Rohini Believes That Women Are More Likely To Advance In The Field Of Science - Sakshi

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలంటే వారిపట్ల సమాజపు ఆలోచనా ధోరణి, ప్రభుత్వ విధానాల్లోనూ మార్పులు అత్యవసరమని పద్మశ్రీ ఎం.రోహిణి గోడ్‌బోలే అంటారు. ‘‘సమాజంలో పైకి తెలియకుండానే మహిళలపట్ల ఒక రకమైన వివక్ష ఉంటుంది. కొన్ని పనులు మహిళలు చేయలేరని, కొన్నింటికి మాత్రమే వారు పరిమితం అని సమాజం భావిస్తుంటుంది.

ఈ ధోరణి మారాలి’’ అని ప్రొఫెసర్‌ రోహిణి అన్నారు. బుధవారం ఇండియన్‌ విమెన్‌ సైంటిస్ట్స్‌ అసోసియేషన్‌ (ఐడబ్ల్యూఎస్‌ఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)లో పద్నాలుగవ త్రైవార్షిక జాతీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ప్రొఫెసర్‌ రోహిణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు.

పిల్లల పెంపకం ఒక్క తల్లి బాధ్యతగా మాత్రమే కాకుండా.. తల్లిదండ్రులు / అత్తమామలూ చేయూత ఇవ్వడం ద్వారా మహిళలు శాస్త్ర రంగంలో మరింత ముందుకు ముందుకు వెళ్లే అవకాశం ఉందని ప్రొఫెసర్‌ రోహిణి అభిప్రాయపడ్డారు. ‘‘ప్రభుత్వ విధానాల్లోనూ మహిళల శక్తియుక్తులను వినియోగించుకునేందుకు తగినట్టుగా కొన్ని మార్పులు కూడా అవసరమే. దేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చదువుకుంటున్న, బోధిస్తున్న మహిళలు చాలామందే ఉన్నప్పటికీ... పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో, కంపెనీల్లోనూ ఉన్నతస్థానాల్లో ఉన్న వారు తక్కువే. భారత్‌లో సైన్స్‌ సబ్జెక్టులు చదువుతున్న మహిళలు కాలేజీస్థాయిలో 40 శాతం మంది ఉంటే, యూనివర్శిటీ స్థాయికి వచ్చేసరికి ఇది 30 శాతానికి, పీహెచ్‌డీ స్థాయిలో 20 –22 శాతానికి తగ్గిపోతోంది. శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వారి విషయానికి వస్తే ఇది మరీ తక్కువగా పదిశాతం మాత్రమే ఉంది’’ అని ప్రొఫెసర్‌ రోహిణి చెప్పారు.

ఒకటే కారణం కాదు
‘‘పెళ్లి, కుటుంబ బాధ్యతలు, ఇంట్లోని వృద్ధుల ఆలనపాలన వంటి విషయాల కోసం మహిళా శాస్త్రవేత్తలు తమ వృత్తిని వదిలేసుకుంటున్నారనే భావన కూడా సమాజంలో నెలకొని ఉంది. కానీ వీటితోపాటు చాలా ఇతర కారణాలూ ఉన్నాయని ఇటీవలి సర్వే ఒకటి స్పష్టం చేస్తోంది. మహిళలు స్వేచ్ఛగా పనిచేసేందుకు తగ్గ వాతావరణం సంస్థల్లో లేకపోవడం, మహిళల అవసరాలకు తగ్గ వెçసులుబాట్లు కల్పించలేని విధానాలు, చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు లేకపోవడమూ కారణమే’’ అని ప్రొఫెసర్‌ రోహిణి అంటారు.
ఎం.రోహిణి గోడ్‌బోలే సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ ఫిజిక్స్,
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్, బెంగళూరు

సైన్స్‌ను సమాజానికి చేరువ చేసేందుకు

పరిశోధనశాలల్లో ఎంత నిబద్ధతతో పరిశోధనలు చేసినా...శాస్త్ర విజ్ఞానాన్ని సమాజానికి చేరవేయకపోతే ప్రయోజనం లేదన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఇండియన్‌ విమెన్‌ సైంటిస్ట్‌ అసోసియేషన్‌ 1973 జూన్‌ 13న అప్పటి బాంబే ప్రస్తుత ముంబైలో రిజిస్టర్‌ అయిన ఈ సంస్థ అప్పటి నుంచి ఇప్పటివరకూ సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి శాస్త్రాన్ని చేరవేసే లక్ష్యంతో పలు కార్యకలాపాలు చేపట్టింది. వేర్వేరు శాస్త్ర రంగాలకు చెందిన 12 మంది వ్యవస్థాపక సభ్యుల ఏర్పాటుకు తొలి ఆలోచన చేయగా, రెండేళ్ల తరువాత ఐడబ్ల్యూఎస్‌ఏ సాకారమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐడబ్ల్యూఎస్‌ఏకు 11 శాఖలు ఉన్నాయి. మొత్తం రెండువేల మంది మహిళా శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్నారు. శాస్త్ర విజ్ఞానాన్ని సమాజానికి చేరువ చేయడం సంస్థ తొలి లక్ష్యమైతే... శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేసేందుకూ పలు కార్యకలాపాలు చేపడుతుంది.

మహిళా శాస్త్రవేత్తల విజయాలను ప్రోత్సహించడం, శాస్త్ర రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడం తద్వారా మహిళా సాధికారతకు సాయపడటం కూడా సంస్థ లక్ష్యాల్లో కొన్ని. ఈ లక్ష్యాల సాధన కోసం ఐడబ్ల్యూఎస్‌ఏ పలు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది. పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ముంబైలో ‘లెర్నింగ్‌ గార్డెన్‌’ పేరుతో పార్కును ఏర్పాటు చేయడం, ఏడాది కాలంలో సుమారు 17 వేల మంది పిల్లలు ఈ పార్కును సందర్శించడం ఐడబ్ల్యూఎస్‌ఏ సాధించిన ఒక ఘనత మాత్రమే. దీంతోపాటు మహిళా శాస్త్రవేత్తల కోసం ఒక వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్, పిల్లల కోసం డే కేర్‌ సెంటర్, నర్సరీ స్కూల్, ఆరోగ్య కేంద్రం, లైబ్రరీ రీడింగ్‌ రూమ్‌ వంటి వసతులూ కల్పిస్తోంది. స్కాలర్‌షిప్పులు, అవార్డులు సరేసరి!

ప్రతిభకు పోషణ

‘‘దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎదగాలని ఆకాంక్షిస్తోంది. ఇది నెరవేరాలంటే కాబోయే తల్లులకు తగిన పోషకాహారం అందించడం ఎంతో కీలకం’’ అని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.హేమలత తెలిపారు. ‘‘మహిళల్లో సుమారు 50 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతూంటే సుమారు 20 శాతం మందికి తగినన్ని పోషకాలు అందడం లేదు. అదే సమయంలో 40 శాతం మంది మహిళలు ఊబకాయలు’’ అని ఆమె వివరించారు.

గర్భధారణ సమయంలో మహిళలు వంద గ్రాముల బరువు పెరిగితే పుట్టబోయే బిడ్డ.. జనన సమయ బరువు 20 గ్రాముల వరకూ పెరుగుతుందని, అలాగే గర్భధారణ సమయంలోనూ, బిడ్డకు రెండేళ్లు వచ్చే వరకూ తగినంత మోతాదులో పోషకాలను పొందడం బిడ్డ ఎదుగుదలకు, భవిష్యత్తులో సాంక్రమిక వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఎంతో కీలకమని డాక్టర్‌ హేమలత వివరించారు. అంతేకాకుండా పిండం ఏర్పడ్డ తొలినాళ్లలో తల్లిద్వారా తగినన్ని పోషకాలు అందకపోతే ఆ ప్రభావం కాస్తా బిడ్డ జీవక్రియలతోపాటు, జ్ఞాపకశక్తి, మెదడు పనితీరులపై కూడా దుష్ప్రభావం పడుతుందని తెలిపారు.
డాక్టర్‌ ఆర్‌. హేమలత డైరెక్టర్‌ ఎన్‌.ఐ.ఎన్‌.

శశికళ సిన్హా

భారత రక్షణ రంగానికి కలికి తురాయి వంటి అడ్వాన్స్‌డ్‌ ఏరియా డిఫెన్స్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌. డీఆర్‌డీవో ఔట్‌స్టాండింగ్‌ సైంటిస్ట్‌

జ్యోత్స్న ధవన్‌

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ సీనియర్‌ శాస్త్రవేత్త. దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు బాటలు వేసిన దిగ్గజ శాస్త్రవేత్త సతీశ్‌ ధవన్‌ కుమార్తె కూడా!

మంజులా రెడ్డి

హైదరాబాద్‌లోని సీసీఎంబీ సీనియర్‌ శాస్త్రవేత్త. ఈ ఏటి ఇన్ఫోసిస్‌ అవార్డు గ్రహీత

సౌమ్య స్వామినాథన్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త.

►పరిశోధన ఉద్యోగం కాదు. జీవితాంతపు విధి నిర్వహణ. కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూనే ఉద్యోగ బాధ్యతల్ని సమర్థంగా చేపట్టడం ఈ రంగంలోని ఏ మహిళకైనా సవాలే. అసలే సమాజంలో పురుషాధిక్యత. అడుగడుగునా అననుకూలమైన పరిస్థితులు. సామర్థ్యం, ప్రతిభ ఉన్నప్పటికీ, వాటికి తగిన గుర్తింపు లభించడం ఓ గగన కుసుమం. అయితే ఇన్ని చిక్కుముళ్ల మధ్యలోనూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో తమదైన ముద్ర వేసిన మహిళామణులు ఎందరో..! వారిలో వీరు కొందరు.

►మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం అంత తప్పేమీ కాకపోవచ్చు. కాకపోతే మానవ మేధలో 50 శాతాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం లేదన్నది అందరూ గుర్తించాలి. వైవిధ్యత అన్నది అన్ని రంగాల్లోనూ మంచిదే. ఇంటిని అత్యంత సమర్థంగా నిర్వహించగలిగిన మహిళ పరిశోధన రంగంలోనూ పూర్తిస్థాయిలో పనిచేసి ఉంటే మానవ శాస్త్ర విజ్ఞానం మరింత పురోగమించి ఉండేదేమో.

►పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న ఆలోచన కేవలం వారి సాధికారత కోసం లేదా దయతో చేయాల్సిన పని కాదు. మెరుగైన సైన్స్‌ కోసమే ఇది జరగాలి.

►‘‘మహిళా శాస్త్రవేత్తగా గుర్తింపు వచ్చేందుకు, తగిన అవార్డులు లభించేందుకు ఆలస్యం జరుగుతోంది’’

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top