కందకాల వల్లే పుష్కలంగా నీరు

Plenty of water in the trenches - Sakshi

మెదక్‌ జిల్లా శివంపేట్‌ మండలం రత్నాపూర్‌కు చెందిన పట్నూరి నింబాద్రిరావు గత వేసవిలో తన 9 ఎకరాల పొలంలో మామిడి, జామ, టేకు మొక్కలు నాటడానికి ముందు బోరు వేయించారు. నీరు పడింది. కానీ, నీరు చాలా తక్కువగా పోస్తోంది. భవిష్యత్తులో నీటి ఎద్దడి వస్తుందని భయపడిన దశలో  ‘సాక్షి’ ద్వారా కందకాల ద్వారా నీటి భద్రత సాధించవచ్చని నింబాద్రిరావు తెలుసుకున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074)లను సంప్రదించి.. వారి సలహా మేరకు కందకాలు తవ్వించారు. మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా గత మేలో కందకాలు తవ్వించారు.

కందకాలు తవ్విన వారంలోనే తొలి వర్షం పడి, కందకాలు నిండాయి. ఆ తర్వాత వర్షాలకు కందకాలు ఐదారు సార్లు నిండాయి. రెండు వర్షాల తర్వాత బోరు 70 అడుగుల్లోనే నీరు అందుబాటులోకి వచ్చేంతగా భూగర్భ జలాలు పెరిగాయి. బోరు ఒకటిన్నర ఇంచుల నీరు పోస్తోంది. ఇటీవల కాలంలో మా ప్రాంతంలో భూగర్భ జల మట్టం బాగా తగ్గిపోయింది. కొందరి బోర్లు నీటి కొరత వల్ల ఆగి ఆగి పోస్తున్నాయి. కానీ, మా బోరు నిరంతరాయంగా ఇంచున్నర నీరు పోస్తోంది. ఇదంతా కందకాల వల్ల భూమిలోకి వర్షం నీరు ఇంకడమే కారణమని తాను భావిస్తున్నానని నింబాద్రిరావు (95150 21387) తెలిపారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top