breaking news
water drops
-
కందకాల వల్లే పుష్కలంగా నీరు
మెదక్ జిల్లా శివంపేట్ మండలం రత్నాపూర్‌కు చెందిన పట్నూరి నింబాద్రిరావు గత వేసవిలో తన 9 ఎకరాల పొలంలో మామిడి, జామ, టేకు మొక్కలు నాటడానికి ముందు బోరు వేయించారు. నీరు పడింది. కానీ, నీరు చాలా తక్కువగా పోస్తోంది. భవిష్యత్తులో నీటి ఎద్దడి వస్తుందని భయపడిన దశలో ‘సాక్షి’ ద్వారా కందకాల ద్వారా నీటి భద్రత సాధించవచ్చని నింబాద్రిరావు తెలుసుకున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074)లను సంప్రదించి.. వారి సలహా మేరకు కందకాలు తవ్వించారు. మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా గత మేలో కందకాలు తవ్వించారు. కందకాలు తవ్విన వారంలోనే తొలి వర్షం పడి, కందకాలు నిండాయి. ఆ తర్వాత వర్షాలకు కందకాలు ఐదారు సార్లు నిండాయి. రెండు వర్షాల తర్వాత బోరు 70 అడుగుల్లోనే నీరు అందుబాటులోకి వచ్చేంతగా భూగర్భ జలాలు పెరిగాయి. బోరు ఒకటిన్నర ఇంచుల నీరు పోస్తోంది. ఇటీవల కాలంలో మా ప్రాంతంలో భూగర్భ జల మట్టం బాగా తగ్గిపోయింది. కొందరి బోర్లు నీటి కొరత వల్ల ఆగి ఆగి పోస్తున్నాయి. కానీ, మా బోరు నిరంతరాయంగా ఇంచున్నర నీరు పోస్తోంది. ఇదంతా కందకాల వల్ల భూమిలోకి వర్షం నీరు ఇంకడమే కారణమని తాను భావిస్తున్నానని నింబాద్రిరావు (95150 21387) తెలిపారు. -
నీటి కోసం కోతి తిప్పలు..
వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. జనానికే కాదు.. జంతుజాలానికీ గొంతులు ఎండుతున్నాయి. సోమవారం నర్సాపూర్ ఐబీ వద్ద తాగునీటి కోసం మర్కటాలు నానా తంటాలు పడ్డాయి. అక్కడున్న పైప్‌లైన్ నుంచి లీక్ అవుతున్న నీటి చుక్కలతో నోరు తడుపుకొనేందుకు క్యూ కట్టాయి. ఒకదాని తరువాత ఒకటి గొంతు తడుపుకొని వెళ్లిపోయాయి. - నర్సాపూర్ -
చెట్టు నుంచి నీటి చుక్కలు..జనం మొక్కులు
కుత్బుల్లాపూర్: సుచిత్రా ప్రధాన రహదారిలోని విమానపూర్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలోని భారీ మేడిచెట్టు కొమ్మలన్నింటినీ యజమాని ఇటీవల నరికేశారు. అయితే, అక్కడక్కడా ఉన్న మోడుల నుంచి నీటి చుక్కలు పడుతుండడాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. అక్కడే చిన్నపాటి గుడి ఉండటంతో అదంతా దేవుడి మహిమేనని ఆనోటా.. ఈనోటా.. ఆ ప్రాంతంలో వ్యాపించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకోవటం మొదలైంది. జనం మొక్కులు, పూజలు ప్రారంభించటంతో అక్కడి రహదారిపై రాకపోకలు స్తంభించాయి.