చెట్టుకు చొక్కా

People Hang Jackets On Trees For Poor And Homeless People - Sakshi

యువశక్తి

రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి వణికించేస్తోంది. పగలు నిడివి తగ్గిపోయింది. అంత మాత్రాన డ్యూటీ టైమ్‌ మారదు. ఆఫీస్‌లు వాటి టైమ్‌ వరకు అవి పనిచేస్తూనే ఉంటాయి. ఉద్యోగులు ఆ చలిలోనే చేతులను వెచ్చని ఉలెన్‌ జాకెట్‌లలో చొప్పించుకుని కనిపించిన ఆటోలు, క్యాబ్‌లలో ఇంటిదారి పడుతుంటారు. ఆటో ఎక్కిన వాళ్ల సంగతి సరే. ఆటో నడిపే వాళ్ల చలి మాటేమిటి?

ఒక ఆటో డ్రైవర్‌ చలి జాకెట్‌ కొనాలంటే అంత సులభమేమీ కాదు. ఆ డబ్బుతో ఒక నెల ఇంటి అద్దె గడిచిపోతుంది. పిల్లల స్కూలు ఖర్చులు గుర్తుకు వస్తుంటాయి. ఆటో డ్రైవర్‌ అనే కాదు, ఇళ్లలో పనులు చేసుకునే డొమెస్టిక్‌ వర్కర్ల పరిస్థితి కూడా అంతకంటే మెరుగ్గా ఏమీ ఉండదు. వణికించే చలిలో ఉదయాన్నే పనులకు పోవాలి. కప్పుకున్న రగ్గు వెంటరాదు, సంపన్నుల లాగ ఉలెన్‌ జాకెట్‌లు కొనడానికి చేతిలో డబ్బు ఉండదు. సరిగ్గా ఇలాంటి అవసరాలనే గుర్తించింది బెంగళూరు యువత.

తమ దగ్గర గత ఏడాది, అంతకు ముందు కొనుక్కున్న ఉలెన్‌ జాకెట్‌లు తీసుకు వచ్చి రోడ్డు పక్కన ఉన్న చెట్లకు తగిలించారు వాళ్లు! ఆ చొక్కాలు, జాకెట్‌ల మీద ‘మీకు వీటి అవసరం ఉంటే తీసుకోండి’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంచారు. ఆ దారిన వెళ్తున్న ఆటోవాలాలు, డొమెస్టిక్‌ వర్కర్లు, భవన నిర్మాణ రంగ కూలీలతో ఇతర పనులు చేసుకునే వాళ్లు ‘రాజరాజేశ్వరీ నగర్‌ రెసిడెంట్స్‌ ఫోరమ్‌ (ఆర్‌ఆర్‌ఎఫ్‌)’కి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని వాటిని తీసుకుని ధరిస్తున్నారు.

‘ఫ్రీ ఆన్‌ ట్రీ ’ మూవ్‌మెంట్‌
ఈ ఉద్యమం మొదలు కావడానికి స్ఫూర్తినిచ్చిన సంఘటన బల్గేరియా, హంగరీలేనని చెప్తారు ఆర్‌ఆర్‌ఎఫ్‌ వ్యవస్థాపకులు శ్రీకాంత్‌. బల్గేరియా, హంగరీ వంటి దేశాల్లో చెట్లకు చొక్కాలు తొడుగుతారు. పేదవాళ్లు, తలదాచుకోవడానికి ఇల్లు లేని వాళ్ల కోసమే ఇలా చేస్తారన్నమాట. మన దగ్గర రెండు ఉంటే ఒకదానిని అవసరమైన వారితో పంచుకోవడమే ఇందులో ఉన్న మానవత్వం. ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్‌లు చూసిన శ్రీకాంత్‌ తన ఫ్రెండ్స్‌తో వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి తన ఆలోచన చెప్పాడు.

‘ఫ్రీ ఆన్‌ ట్రీ’ మూవ్‌మెంట్‌ యువబృందం టర్కీ బల్గేరియా ఇచ్చిన స్ఫూర్తి

అతడు తనవంతుగా పద్నాలుగు స్వెటర్‌లను కొన్నాడు. శ్రీకాంత్‌ అన్నేసి స్వెటర్‌లు ఎందుకు కొంటున్నాడో తెలుసుకున్న దుకాణదారు వాటిని డిస్కౌంట్‌తో మూడు వేల ఐదు వందలకే ఇచ్చాడు. ఫ్రెండ్ప్‌ అందరూ తమ దగ్గర ఉన్న స్కార్ఫులు, స్వెటర్‌లు, జాకెట్‌లు, మంకీ క్యాప్‌లు, దుప్పట్లు, రగ్గులలో వాడడానికి పనికి వచ్చే వాటిని మొత్తం 350 వరకు తెచ్చారు. ఆ స్వెటర్‌లు, జాకెట్‌లను పార్కుల్లో చెట్లకు, రోడ్డు పక్కన ఉన్న చెట్లకు తగిలించి రెస్పాన్స్‌ కోసం చూశారు. అరగంటలోపే వారు ఆశించిన దానికంటే మంచి రెస్పాన్స్‌ కనిపించింది.

ఇది చూసిన తర్వాత బూట్లు కూడా చేర్చాలనే నిర్ణయానికి వచ్చిందీ టీమ్‌. చలికాలంలో వచ్చే అనేక అనారోగ్యాల నుంచి వాళ్లను కాపాడడం కోసమే ఇలా చేస్తున్నామని చెబుతున్నారు ఈ యువతీ యువకులు. చలికాలం పోయిన తర్వాత కూడా సర్వీస్‌ని ఆపకూడదని, పుస్తకాలు, పిల్లల ఆటవస్తువుల వంటి ఇతర వస్తువులను పంచాలని అనుకుంటున్నారట. అయితే ఒక్క హెచ్చరిక మాత్రం చేస్తున్నారు. ‘ఈ సర్వీస్‌ అవసరమైన వాళ్లకు మాత్రమే. కాబట్టి వీటిని తీసుకువెళ్లి వృధా చేయడమో లేక ఇతరత్రా వ్యాపకాలకు వినియోగించడం వంటివి చేయరాదు’ అని సున్నితంగానే చెబుతున్నారు.

– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top