అది వాడి తలకు మించిన లెక్క. అందుకే అటూయిటూ ఆలోచించాడు. బుర్ర గోక్కున్నాడు. ఏమీ తట్టలేదు. చివరికి, వెనక్కి తిరిగి చూశాడు.
ముద్దొచ్చే వీడియో ఒకటి ఆన్‌లైన్లో తిరుగుతోంది. అది ఇలా సాగుతుంది. ఒక క్లాసులో ఒక బుజ్జిపిల్లాడు. ఏ ఒకటో తరగతో అయివుండవచ్చు. వాడిని వాళ్ల లెక్కల టీచర్ బ్లాక్‌బోర్డు దగ్గరికి పిలిచారు. 3+2=? అన్న సమస్య బోర్డు మీద రాసివుంది. బుజ్జిగాడు వెళ్లి చాక్‌పీసు చేతిలోకి తీసుకున్నాడు. కానీ అది వాడి తలకు మించిన లెక్క. అందుకే అటూయిటూ ఆలోచించాడు. బుర్ర గోక్కున్నాడు. ఏమీ తట్టలేదు. చివరికి, వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ముందు బెంచీలో వాడి స్నేహితుడు కావొచ్చు, కూర్చుని వున్నాడు.
విషయం అర్థమైంది. పైగా వాడికి జవాబు తెలుసు. వెంటనే ‘ఐదు’ అని తెలిసేలా, అరచేతిని ఎత్తిచూపించాడు. ఇక్కడే తిరకాసు జరిగింది. అది ఈ బుజ్జిగాడికి ఇంకోలా అర్థమైంది. వెంటనే తన చేతిని బోర్డు మీద పెట్టి, వేళ్ల వెంబడి ట్రేస్ చేస్తూ అరచేతి బొమ్మ చకచకా గీసేసి, చక్కగా వెళ్లి కూర్చున్నాడు. ఇక చిరునవ్వే మన వంతు. తప్పుల్ని కూడా పిల్లలు చాలా స్వీట్‌గా చేస్తారు. అందుకే వాటిని ఒక్కోసారి క్షమించేయొచ్చు. పిల్లల తప్పులనే కాదు, ఎవరి తప్పులైనా సరే మొత్తంగా క్షమించేయగలిగితే జీవితం ఇంకా స్వీట్‌గా ఉంటుంది.


