మెగా డిజైనర్‌

mega designer susmitha - Sakshi

జీవితమంతా కుట్లు అల్లికలే. అలా కుట్టీ.. అల్లీ.. పేరిస్తేనే జీవితం అందంగా కనబడుతుంది. డైరెక్టర్‌ కథ అల్లుతాడు.. సినిమాటోగ్రాఫర్‌ కెమెరాతో కథను కూర్చుతాడు. రైటర్‌ సంభాషణతో ఎంబ్రాయిడరీ చేస్తాడు... ఎడిటర్‌ సైజ్‌కి కట్‌ చేస్తాడు. ఇవన్నీ రంగస్థలం మీదకు వచ్చే ముందు హీరోకి క్యారెక్టర్‌ అన్న దుస్తులు తొడుగుతారు. సుష్మిత... నాన్న చిరంజీవికి, తమ్ముడు చరణ్‌కి క్యారెక్టర్‌ అన్న దుస్తులు కుడుతుంది.

ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్‌ మీ నాన్నగారి (చిరంజీవి)కి, ఇప్పుడు తమ్ముడి (రామ్‌చరణ్‌)కి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేస్తున్నారు. మీ ఫీలింగ్‌?
సుష్మిత: ఫ్యాషన్‌ స్టైలింగ్‌లో స్పెషలైజేషన్‌ చేశా. మొదట్నుంచీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అంటే ఇష్టం. డాడీ ‘ఇంద్ర’ సినిమాలో ‘రాధే గోవిందా..’ సాంగ్‌కి స్టైలింగ్‌ చేశా. ఆ తర్వాత  ‘అందరివాడు’. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’కి ఫస్ట్‌ టైమ్‌ ఫుల్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేశా. అంతకుముందు సాంగ్స్‌పైనే దృష్టి పెట్టేదాన్ని. డాడీ తర్వాత తమ్ముడి సినిమా (‘రంగస్థలం)కి చేయడం చాలా మంచి అనుభవం.

‘రంగస్థలం’ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కాబట్టి సవాల్‌గా అనిపించిందా?
డాడీ ‘ఖైదీ నంబర్‌ 150’కి చరణ్‌తో కలసి సహ నిర్మాతగా చేశా. కానీ, చరణ్‌ హీరోగా ఉన్నప్పుడు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్‌ చేయడం ఇదే ఫస్ట్‌టైమ్‌. 1985 బ్యాక్‌డ్రాప్‌ మూవీ కాబట్టి నైన్టీన్‌ ఎయిటీస్‌ సినిమాలు చూశాను. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల యాస, కట్టూబొట్టు, వ్యవహార శైలి, సంప్రదాయాల గురించి అవగాహన ఉంది. అయినా బాగా రిసెర్చ్‌ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్‌ సుకుమార్‌గారు కూడా కొన్ని ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. దాంతో కొంచెం వర్క్‌ ఈజీ అయ్యింది.

సినిమాకి కావల్సిన ఫ్యాబ్రిక్‌ ఎక్కడ కొన్నారు?
 ఎయిటీస్‌లో వాడిన లుంగీలు, చొక్కాలు, ప్రింట్లు ఇప్పుడు లేవు. పెద్ద పెద్ద గళ్లు, డార్క్‌ కలర్స్‌ వాడేవాళ్లు. అప్పట్లో వాడిన కొన్ని కలర్స్‌ ఇప్పుడు లేవు. కొన్ని లుంగీలు, చొక్కాలు ప్రత్యేకంగా ప్రింట్‌ చేయించాం. తూర్పు గోదావరి జిల్లాలో షూట్‌ చేసినప్పుడు రాజమండ్రి లోకల్‌ మార్కెట్స్, పోలవరం మార్కెట్స్‌లో కొన్నాం. హైదరాబాద్‌లోనూ షాపింగ్‌ చేశాం.

ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరో ఎంతకాలం సినిమాలు చేసినా చూస్తారు. కూతురిగా మీ డాడీకి రెస్ట్‌ కావాలని మీకనిపించదా?
అస్సలు లేదు. ఎందుకంటే ఖాళీగా ఉంటే డాడీ అదోలా ఉంటారు. తమ్ముడు కూడా ఆ టైపే. డాడీ ఇంట్లో ఉండటంకన్నా షూటింగ్‌తో బిజీగా ఉండటమే బెటర్‌. పని చేసిన రోజున చాలా హ్యాపీగా ఉంటారు. అందుకే డాడీ అలా వర్క్‌ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.

జనరల్‌గా కొంతమంది డిజైనర్స్‌ అవసరానికి మించి డ్రెస్సులు కుట్టించేసి, నిర్మాతతో ఖర్చు పెట్టిస్తారట. ‘రంగస్థలం’లో సాదాసీదా బట్టలే కాబట్టి ఎక్కువ ఖర్చు అయ్యుండదేమో?
నేను ప్రొడ్యూసర్‌– ఫ్రెండ్లీ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ని. ముందు కొనేద్దాం. తర్వాత చూసుకుందాం అనుకోను. నేనేదో ఫుల్‌ పర్‌ఫెక్ట్‌ అని చెప్పడం లేదు కానీ, బాగా ప్లాన్‌ చేసి చాలా తక్కువ వేస్టేజ్‌ అయ్యేలా చూసుకుంటా. ఒకవేళ ఏమైనా మిగిలిపోతే అవి కూడా యాజ్‌ అయ్యేలా ట్రై చేస్తా. ఇన్‌డోర్‌ లొకేషన్‌ అనుకోండి.. ఆ రోజుకి ఏం కావాలో అదే రెడీ చేస్తా. అవుట్‌డోర్‌ అప్పుడు సేఫ్టీ కోసం రెండు మూడు డ్రెస్సులు ఎక్స్‌ట్రా ప్లాన్‌ చేస్తా. అంతే.

చిట్టిబాబు (రామ్‌చరణ్‌ పాత్ర పేరు) కోసం ఎన్ని లుంగీలు కొన్నారేంటి? సినిమా మొత్తం ఆ గెటప్‌లోనే కనిపిస్తారా?
రఫ్‌గా 35 నుంచి 40. చరణ్‌ విలేజ్‌ మాస్‌ కుర్రాడి క్యారెక్టర్‌ చేయడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. 85 పర్సెంట్‌ లుంగీ గెటప్‌లోనే కనిపిస్తాడు. చిట్టిబాబు లుక్‌ గురించి సుకుమార్‌గారు చెప్పినప్పుడే ఎగై్జట్‌ అయ్యాను. చాలా స్కెచ్‌ వర్క్‌ చేశాం. ఎందుకంటే చరణ్‌ను నేనెప్పుడూ అలా చూడలేదు. ఇంట్లో కూడా అలా ఉండడు.

ఇంతకీ చిట్టిబాబు అలియాస్‌ రామ్‌చరణ్‌కి లుంగీ కట్టుకోవడం వచ్చా?
వచ్చా అంటే.. యాక్టర్స్‌ ఎవరైనా కొత్త విషయాన్ని ఇట్టే నేర్చుకోగలరు. చరణ్‌ కూడా అలాగే నేర్చుకున్నాడు. లుంగీలు కట్టుకోవడం చరణ్‌కి ఈజీగానే అలవాటైపోయింది.

మధ్యలో లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నారు.. ‘ఖైదీ నంబర్‌ 150’తో రీ–ఎంట్రీ అయ్యారు. మళ్లీ ఎంటర్‌ కావడానికి రీజన్‌?
పిల్లలు పుట్టిన తర్వాత బ్రేక్‌ తీసుకున్నాను. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దయ్యారు. ‘ఖైదీ నంబర్‌ 150’కి ముంబయ్‌ నుంచి షబీనా ఖాన్‌ అని హై ప్రొఫైల్‌ డిజైనర్‌ వచ్చారు. మంచి డిజైన్స్‌ ఇచ్చారావిడ. ముంబై వాళ్లకు డాడీ ఇమేజ్‌ తెలియకపోవచ్చు. ఆయన స్టైల్‌ ఏంటో ‘గ్యాంగ్‌ లీడర్‌’లాంటి మూవీస్‌ చూసినవారికే తెలుస్తుంది. అందుకే ‘నువ్వెందుకు ట్రై చేయకూడదు అక్కా’ అన్నాడు చరణ్‌. ‘నా ఫ్యామిలీ పర్మిషన్‌ తీసుకోవాలి’ అన్నాను. దాంతో ‘నాన్నగారి కమ్‌ బ్యాక్‌ మూవీ. అక్క డిజైన్‌ చేస్తే బాగుంటుంది బావగారూ’ అని చరణ్‌ మా ఆయనతో మాట్లాడాడు. ఆయన ఒప్పుకున్నారు. ‘ఖైదీ నంబర్‌ 150’ జరుగుతున్నప్పుడు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ స్టార్ట్‌ అయింది. ఆ షోకు డిజైనింగ్‌ చేశాను. ఆ తర్వాత ‘రంగస్థలం’ స్టార్ట్‌ చేశా.

‘నా ఫ్యామిలీ పర్మిషన్‌ తీసుకోవాలి’ అని తమ్ముడితో అన్నానన్నారు. అంటే అత్తామామల పర్మిషనా? మీ బెటరాఫ్‌ పర్మిషనా?
మా ఆయన పర్మిషనే తీసుకోవాలనుకున్నాను. మా మావయ్య, అత్తయ్య ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. అమ్మాయిలకు పెళ్లైంది కదా అని ఇంట్లో కూర్చోకూడదు. ఏదో ఒక వ్యాపకం ఉండాలంటారు. ఇక్కడ మా నాన్నగారు ఎలానో అక్కడ మా అత్తమ్మవాళ్లు అలా.

చిరంజీవిగారి ‘సైరా’కి కూడా చేస్తున్నారు కదా.. అది వెరీ వెరీ చాలెంజింగ్‌ మూవీ?
అవునండి. ఈ సినిమాకి కాస్ట్యూమ్స్‌ వైజ్‌గా రిఫరెన్సెస్‌ ఉండవు. మూడు నెలలు రీసెర్చ్‌ వర్క్‌ చేశాం. బిగ్‌ క్రియేటివ్‌ టీమ్‌ కూడా ఉంది. చాలా వరకు రీ–క్రియేట్‌ చేస్తున్నాం. ఇప్పుడే ‘సైరా’ గురించి మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది.

ఇంత కష్టపడుతున్నారు. ‘సైరా’ నిర్మాత రామ్‌చరణ్‌ మీకు ఎంత చెక్‌ ఇస్తారు?
ఆ విషయం తమ్ముణ్ణే అడగండి (నవ్వుతూ). మా మధ్య మనీ టాపిక్‌ రాదు. డాడీ, తమ్ముడు కాబట్టి ఎక్కువ కేర్‌ తీసుకుంటాను. నా టార్గెట్‌ ఒకటే. స్క్రీన్‌ మీద వాళ్లు అందంగా కనిపించాలి. ఫ్యాన్స్‌ ఈలలు వేయాలి.

‘రంగస్థలం’ షూట్‌ రాజమండ్రిలో జరిగినప్పుడు ఎండలకు సమంత కళ్లు తిరిగి పడిపోయారు. మీకేమైనా ఇబ్బంది?
‘రంగస్థలం’ డిజైనింగ్‌ పరంగా చాలెంజింగ్‌ అనిపించలేదు కానీ, లొకేషన్‌లో యూనిట్‌ అంతా  చాలా కష్టపడ్డాం. రాజమండ్రిలో షూట్‌ చేసినప్పుడు మొబైల్‌ నెట్‌వర్క్‌ లేకపోవడం బెటర్‌ అయ్యింది. వర్క్‌ మీద కాన్సంట్రేట్‌ చేశాం (నవ్వుతూ). ఫోన్‌కాల్స్‌ లేవు. ఇక వాట్సాప్‌ సంగతి మర్చిపోయాం. ఏప్రిల్‌లో అక్కడ షూట్‌ చేశాం. విపరీతమైన ఎండలు. టఫ్‌ అనిపించింది. కొంతమంది సన్‌ స్ట్రోక్‌ బారిన పడ్డారు. లక్కీగా నాకేం కాలేదు.

కష్టం తెలియకుండా పెరిగారు.. ఇప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం మీకేంటి?
 ‘‘మీ టాలెంట్‌ని మీరు ప్రూవ్‌ చేసుకోవాలి. మేం కష్టపడింది మిమ్మల్ని కంఫర్టబుల్‌గా ఉంచడానికే. మీరు ఓన్‌ ఐడెంటిటీ తెచ్చుకోవాలి’’ అని డాడీ అంటుంటారు. అందుకే తమ్ముడు తన ఫీల్డ్‌లో, నేను నా ఫీల్డ్‌లో ప్రూవ్‌ చేసుకోవడానికి తపనపడుతున్నాం. మా లగ్జరీ లైఫ్‌ వెనకాల డాడీ పడిన కష్టం తెలుసు. నా పిల్లలకు ఆ కష్టం తెలియజెప్పాలనుకుంటున్నా. అప్పుడే జీవితం విలువ తెలుస్తుంది.

మీ చిన్నప్పటి విశేషాలు.. మీరు, మీ తమ్ముడు, చెల్లెలు శ్రీజ.. మీ ముగ్గురిలో ఎవరు అల్లరి చేసేవారు?
నేనే. వాళ్లిద్దరూ కొంచెం క్వైట్‌. శ్రీజ అంత పబ్లిక్‌ పర్సన్‌ కాదు. చరణ్, నేను చిన్నప్పుడు చాలా ఫైట్‌ చేసేవాళ్లం. మా ఇద్దరికీ అస్సలు పడేది కాదు. ఇంట్లో మా అల్లరి భరించలేక ఇద్దర్నీ వేరు వేరు హాస్టల్స్‌లో పెట్టాలని కూడా ఆలోచించారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కి ఫిల్మ్‌ ఇండస్ట్రీ షిఫ్ట్‌ అయినప్పుడు నేను టెన్త్‌ స్టాండర్డ్‌లో ఉన్నాను. అందుకని అక్కడే మా పెద్దమ్మ వాళ్ల ఇంట్లో ఉండి చదువుకున్నాను. తమ్ముణ్ణి హాస్టల్‌లో పెట్టారు. ఆ సెపరేషన్‌లో తమ్ముణ్ణి చాలా మిస్‌ అయ్యానన్న ఫీలింగ్‌ కలిగింది. తనకూ సేమ్‌ ఫీలింగ్‌. అప్పటినుంచి కొట్టుకోవడం మానేశాం. ఇప్పుడు మేం బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ అనేకన్నా.. బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అనొచ్చు.

ఇంట్లోకి కొత్త అమ్మాయి వచ్చిన తర్వాత బ్రదర్‌ అండ్‌ సిస్టర్స్‌ మధ్య ఏదో గ్యాప్‌ వచ్చిన ఫీలింగ్‌ కలగడం సహజం. ఉపాసన మీ ఇంటి కోడలయ్యాక మీకలాంటి ఫీలింగ్‌?
అస్సలు లేదు. ఉపాసన నాకు ముందు నుంచే బాగా తెలుసు. అందర్నీ కలుపుకుని వెళ్లే మనస్తత్వం తనది. ఎవరితో అయినా ఎక్కడైనా తను ఈజీగా మింగిల్‌ అయిపోతుంది. వెరీ లైవ్లీ పర్సన్‌. మా ఇంటికి ఓ కొత్తమ్మాయి వచ్చిన ఫీలింగ్‌ ఏమీ లేదు.

మీరు తనని వదినా అని పిలుస్తారా?
పెళ్లికి ముందే పరిచయం అన్నాను కదా. ఉపాసన అని పిలవడం అలవాటు. నన్ను సుష్మితా అని పిలిచేది. అలాగే కంటిన్యూ అవుతున్నాం.

మీకు వంట వచ్చా.. పిల్లల కోసం ఏమైనా కుక్‌ చేస్తారా?
పిల్లలకు స్వయంగా వండి పెడతాను. ఆ ఫీల్‌ను ఎంజాయ్‌ చేస్తే ఎవరికైనా ఫుల్‌ హ్యాపీగా ఉంటుంది. టైమ్‌ ఉన్నప్పుడల్లా కేక్‌లు, బిస్కెట్‌లు చేస్తాను. పిల్లలు కూడా చేసి పెట్టమని అడుగుతుంటారు. వంట చేయడానికి టైమ్‌ ఉంటుందా? అంటే.. ఉండకపోవచ్చు.. కానీ, టైమ్‌ తీసుకోవాలి.

ఇంతకీ మీ పెద్ద పాప సమారా, చిన్న పాప సంహితలో మీ డాడ్‌ ఫ్యాన్‌ ఎవరు? తమ్ముడు ఫ్యాన్‌ ఎవరు?
పెద్దపాప తాతగారి ఫ్యాన్‌. చిన్న పాప మావయ్య ఫ్యాన్‌. ఎప్పుడైనా ఇంట్లో ‘ధృవ, ఖైదీ నంబర్‌ 150 చూడాలనుకుంటే ఇద్దరికీ గొడవే. చిన్నపాప ‘ధృవ’ అంటుంది. పెద్దపాప ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా కావాలని పేచీ పెడుతుంది. పిల్లలిద్దరికీ కామన్‌గా ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ ఇష్టం.

మనవరాళ్లిద్దరిలో తాతను ఎవరు ఇమిటేట్‌ చేస్తారు?
మా చిన్న పాప డాడీని ఇమిటేట్‌ చేస్తుంది. ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాలో ‘అమ్మడు.. లెట్స్‌ డు కుమ్ముడు’ సాంగ్‌ ఉంది కదా. ఆ పాటకు డాడీ డ్యాన్స్‌ చేసినట్లే చేస్తుంది.

మార్క్స్‌ తక్కువగా వచ్చినప్పుడు మీ డాడీకి చెప్పకుండా దాచేసిన సందర్భాలేమైనా?
మా ఇద్దరికన్నా శ్రీజ స్టడీస్‌లో బెస్ట్‌. మార్కుల విషయంలో తనకు ఏ ప్రాబ్లమ్‌ లేదు. నాకు, తమ్ముడికి తక్కువ వచ్చేవి. అప్పుడు మేమిద్దరం ‘నువ్వు ఈ వారం ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూపించు. నేను నెక్ట్స్‌ వీక్‌ చూపిస్తా’ అని మాట్లాడుకునేవాళ్లం. అవన్నీ తలచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. మంచి జ్ఞాపకాలు.

ఫైనల్లీ.. ఇక్కడ గోల్డెన్‌ స్పూన్‌తో పెరిగిన మీకు ఎక్స్‌టెండెడ్‌ ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్స్‌ ఎలాఉంది?
మోస్ట్‌ కంఫర్టబుల్‌ ఫ్యామిలీ. మా అత్తమ్మకు గ్లామరస్‌ ఫీల్డ్‌ అంటే ఇష్టం. ‘నువ్వెందుకు స్క్రీన్‌పైకి వెళ్లకూడదు’ అంటారు? ‘‘అత్తమ్మా... చాలా లేట్‌ అయింది. ఇప్పుడు వెళితే బాగుండదు’’ అని సరదాగా అంటుంటాను. అమ్మ ఇంట్లో ఎలా ఉంటానో అత్తమ్మ ఇంట్లోనూ అలానే. ఐయామ్‌ వెరీ మచ్‌ బ్లెస్డ్‌.

– డి.జి. భవాని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top