బంగారు రేణువులను  ముద్దలు చేస్తుంది...

Makes golden particles pulverizing - Sakshi

సూక్ష్మ ప్రపంచం.. అదేనండీ... బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లతో కూడినది ఓ వింతల లోకం. అదెలా అనే ప్రశ్నకి క్వీన్స్‌ల్యాండ్‌ శాస్త్రవేత్తలు సమాధానం చెబుతున్నారు. బంగారు రేణువులను హరాయించుకుని ముద్దలుగా మార్చేసే సరికొత్త బ్యాక్టీరియాను వీరు గుర్తించారు మరి! అయితే ఏంటి? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మీ స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ల వైపు ఒక్కచూపు చూసేయండి. దాంట్లో ఉండే అతితక్కువ మోతాదు బంగారం, ఇతర విలువైన ఖనిజాల కోసం అనేక మంది రోగాలబారిన పడుతున్నారు. అంతేకాదు.. బంగారు గనుల్లో టన్నులకొద్దీ మట్టి తవ్వి తీస్తే వచ్చే బంగారం గ్రాముల్లోనే! ఈ కొత్త బ్యాక్టీరియా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందనుకోండి.

ఈ రెండు అంశాల్లోనూ గణనీయమైన మార్పు వస్తుంది. పాత,   పడేసిన సర్క్యూట్‌ బోర్డుల నుంచి ఇవే ఎంచక్కా సువర్ణాన్ని వెలికితీసి ఇస్తాయి. గనుల విషయంలోనూ అధిక లాభాలు పొందేందుకు అవకాశమేర్పడుతుంది. ఈ మధ్యే కనుక్కొన్న ఈ బ్యాక్టీరియా ప్రస్తుతానికి కొంచెం నెమ్మదిగానే పనిచేస్తోంది గానీ.. కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా వేగం పెంచడం కష్టం కాకపోవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. 2016 నాటి లెక్క ప్రకారం.. కంప్యూటర్లు, టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్లలో దాగి ఉన్న మొత్తం బంగారం విలువ లక్ష కోట్ల రూపాయల పైమాటే కావడం కొసమెరుపు! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top