మంచే జరిగింది | Sakshi
Sakshi News home page

మంచే జరిగింది

Published Wed, Jan 2 2019 12:09 AM

Maharaja wore a golden crow - Sakshi

ఒకసారి పరీక్షిత్తు మహారాజు వేటకు వెళుతూ తాత భీమసేనుడు గతంలో జరాసంధుణ్ణి చంపి తెచ్చిన  బంగారు కిరీటాన్ని ధరించాడు. మణులు పొదిగిన ఆ కిరీటం ధరించగానే, ఆయనలో రజోగుణం ప్రవేశించింది.  వేటాడి వేటాడి అలిసిపోయిన పరీక్షిత్తు, దాహంతో చుట్టూ చూశాడు. నిశ్చలంగా తపస్సులో లీనమైన శమీక మహర్షి కనిపించాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదన్న కోపంతో ఒక చచ్చిన పాముని తెచ్చి, ఆయన మెడలో వేశాడు. శమీక మహర్షి కొడుకు శృంగి, జరిగినదాన్ని తెలుసుకుని, తపస్సు చేసుకుంటున్న తండ్రిని అవమానించాడన్న కోపంతో, ఆనాటికి ఏడవ రోజున తక్షకుడు అనే సర్పం విషంతో రాజు మరణించాలని శపించాడు. పరీక్షిత్తు మహారాజుకు జరిగినదేమీ తెలియదు.

రాజమందిరానికి రాగానే కిరీటం తీసి పక్కన పెట్టాడు. అప్పుడు ఆయనలో ఉన్న రజోగుణం తగ్గి, తాను చేసిన పనిని తలచుకొని పశ్చాత్తాపపడ్డాడు అయితే, దురదృష్టవశాత్తూ అప్పటికే జరగవలసిన అనర్థం అంతా జరిగిపోయింది. శమీక మహర్షి శిష్యులు వచ్చి అసలు విషయం తెలియజేశారు. మహారాజు ఉత్తమ సంస్కారం కలవాడు కనుక, తనకు మంచే జరిగిందనుకున్నాడు. మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు కనుక,  భగవచ్చింతనలో సమయాన్ని సద్వినియోగ పరుచుకోవాలనుకున్నాడు. చివరకు ఒక మహర్షి ద్వారా జ్ఞానం పొంది, వైకుంఠం చేరాడు. పరీక్షిత్తు అసుర గుణాలు కలిగినవారి వస్తువులను వాడటం వల్ల, వివేకాన్ని కోల్పోయాడు. అదే ఆయనకు శాపమైంది. 
– డి.వి.ఆర్‌.  

Advertisement
Advertisement