వర్క్‌ ప్లేస్‌ / లైఫ్‌స్టయిల్‌ కౌన్సెలింగ్‌

Lifestyle Counseling  - Sakshi

ఒత్తిడితోనూ ఒళ్లునొప్పులు వస్తాయా?
నా వయసు 50 ఏళ్లు. ఇటీవల కొన్ని ఆర్థిక సమస్యలతో డబుల్‌షిఫ్ట్‌ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. నా పనిలో అకౌంట్స్‌ చాలా నిశితంగా చూడాలి. ఇది  చాలా ఒత్తిడితో కూడుకున్నది కూడా. ఇటీవల నాకు తీవ్రంగా ఒళ్లునొప్పులు, నడుము నొప్పి వస్తున్నాయి. ఇంటికెళ్లే ముందు నిస్సత్తువగా ఉంటోంది. ఇది ఒత్తిడి కారణంగానే అంటారా? మందులతో కాకుండా దయచేసి నా సమస్యకు సాధారణ పరిష్కారాలు చూపించండి. – వై. నిరంజన్‌రెడ్డి, నకిరేకల్‌
అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారు తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. మీలా డబుల్‌ షిఫ్ట్‌ పనిచేసేవారిలో ఎక్కువ అలసటతో పాటు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తి సంబంధ సమస్యలు సైతం రావచ్చు. మీలాంటి వారు అలసట, వృత్తి సంబంధ సమస్యలను నివారించడానికి ఈ సూచనలు పాటించడం మేలు.

♦  పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్‌ పొగ రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది
♦  చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. వ్యక్తులు అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు
♦    మీ ఉద్యోగంలో ఏదైనా సమస్యలు, మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన (టార్గెట్స్‌ రీచ్‌ కావాల్సిన) వృత్తిలో ఉంటే తీవ్రమైన అలసటకు లోను కావడం చాలా సాధారణం
♦   కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి
♦   కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్‌ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు
♦    రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి
♦  భోజన వేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగ్గొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే  రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు
♦  ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ–హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి.

కంప్యూటర్‌ ముందు అదే‘పని’గా...
నేను ఆఫీసుకు వచ్చి కంప్యూటర్‌ ముందు కూర్చున్నానంటే సాయంత్రం వరకూ లేవనే లేవను. మధ్య మధ్య ఫ్రెండ్‌ పిలిచినా నా పని పూర్తయ్యేవరకు నాకు మధ్యలో పని వదిలేసి వెళ్లాలనిపించదు. అంతంత సేపు కూర్చొనే ఉండటం మంచిది కాదని ఫ్రెండ్స్‌ అంటున్నారు. ఫ్రెండ్స్‌ మాటలతో నాలో ఆందోళన పెరుగుతోంది. ఇది వైద్యపరంగా వాస్తవమేనా? పరిష్కారాలేవైనా ఉంటే సూచించండి. – కె. సెల్వరాజ్, హైదరాబాద్‌

మీలా కూర్చొని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా ఒకే భంగిమలో కూర్చొని ఉండటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇలా  సుదీర్ఘకాలం పాటు కూర్చొనే ఉండటం అన్నది టైప్‌–2 డయాబెటిస్, ప్రాణాంతకమైన గుండెజబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లకూ కారణమవుతుంది.

కూర్చునే వృత్తుల్లో ఉన్నా లేదా ప్రయాణాలు చేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా సీట్లో చాలాసేపు కూర్చోవడం, లేదా టీవీని వదలకుండా చూస్తూ కూర్చోవడం, బైక్‌మీద ఎక్కువ ప్రయాణం వంటివి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. పొగతాగడం వంటి దురలవాటు ఎంత దుష్ప్రభావం చూపుతుందో, ఇలా కూర్చొనే ఉండటం అన్న అంశం కూడా అంతకంటే ఎక్కువ దుష్ప్రభావమే చూపుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించిన వాస్తవం. ప్రతివారు రోజూ కనీసం 30 – 45 నిమిషాల పాటు వాకింగ్‌ చేయడం అవసరం.

అదేపనిగా కూర్చోవడాన్ని బ్రేక్‌ చేయడం కోసం కొన్ని సూచనలు పాటించాలి. అవి...
♦  టీవీ / కంప్యూటర్‌ / ల్యాప్‌టాప్‌లను బెడ్‌రూమ్స్‌లో ఉపయోగించకండి
♦ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటికి పనిచెప్పే ఏదో పనిని ఎంచుకోండి
♦  ఎస్కలేటర్‌ వంటి సౌకర్యం ఉన్నా మెట్లెక్కండి nరోజూ కనీసం 30 నిమిషాలు నడవాలని నియమం పెట్టుకోండి
♦  మీ వర్క్‌ ప్లేస్‌తో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అటూ ఇటూ నడుస్తూ మాట్లాడండి
♦ మీ పనిలో కాసేపు కాఫీ లేదా టీ బ్రేక్‌ తీసుకోండి
 మీకు దగ్గరి కొలీగ్స్‌తో మాట్లాడాల్సి వస్తే మొబైల్‌ / మెయిల్‌ ఉపయోగించకండి. వారి వద్దకే నేరుగా వెళ్లి మాట్లాడండి.
♦ దేహానికి ఒకింత కదలికల కోసం నడక తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి
♦  టీవీ చూడటం కంటే మంచి హాబీని పెంపొందించుకోండి. ఈ టిప్స్‌ మీకు కొంతలో కొంత మేలు చేస్తాయి.

- డాక్టర్‌ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్, కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top